Home News సంఘకార్యంలో భాగస్వాములయ్యేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు – డా. మన్మోహన్ జీ వైద్య

సంఘకార్యంలో భాగస్వాములయ్యేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు – డా. మన్మోహన్ జీ వైద్య

0
SHARE

గత సంవత్సరం ఒకటిన్నర లక్షలమంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యంలో చేరేందుకు ఆసక్తి చూపారు. వీరిలో ఎక్కువమంది యువత ఉన్నారని అఖిల భారతీయ ప్రచారప్రముఖ్ మన్మోహన్ వైద్య పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

మార్చ్ 9, 2018 రేషంబాగ్ లో ప్రారంభమయ్యే అఖిలభారతీయ ప్రతినిధి సభల గురించి ఆయన పత్రికలవారికి వివరించారు. భారతీయ సంస్కృతిపట్ల శ్రద్ద, సామాజిక రంగంలో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నవారు సంఘ కార్యంలో చేరాలనుకుంటున్నారని, ఇలాంటివారిలో ఐ టి మరియు ఇతర రంగాలకు చెందిన సుశిక్షితులైనవారు ఎక్కువగా ఉన్నారని ఆయన తెలియచేసారు. వీరిలో 50 శాతం మంది తమ సంస్కృతి గురించి తెలుసుకునేందుకు శ్రద్ధ చూపుతుంటే, 30 శాతం మంది ఏదైనా సమాజ కార్యంలో పాలు పంచుకోవాలనుకుంటున్నారు.

2007 శ్రీ గురూజీ జన్మశతాబ్దిని పురస్కరించుకుని సమాజంలోని భేదభావాలను తొలగించడానికి సంఘ ప్రారంభించిన సామాజిక సద్భావన సమావేశాలు క్రమంగా ఫలితాలను ఇస్తున్నాయని మన్మోహన్ జీ అన్నారు.

దేశం మొత్తం నుండి ఎన్నికైన ప్రతినిధులు, ఆహ్వానితులు 1500 మంది ప్రతినిధి సభలలో పాల్గొంటారు. ప్రతినిధులు రాగల మూడు సంవత్సరాల కోసం సర్ కార్యవాహ్ ను ఎన్నుకుంటారని ఆయన తెలియజేశారు.  సమాజ సేవ, ఆరోగ్యం, విద్య మొదలైన రంగాలలో సంఘ్ ద్వారా జరుగుతున్నా కార్యక్రమాల సమీక్షతోపాటు వాటిని మరింత ప్రభావవంతంగా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తారని ఆయన తెలియజేశారు.

సంఘ్ కార్యం పట్ల సమాజంలోని ఆలోచనాపరులు, మేధావులు, ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారని, వివిధ వర్గాలకు సంపర్క విభాగం (పౌరసంబంధ విభాగం) ద్వారా సంఘ కార్యపు వివరాలను చేరవేసే పని గురించి కూడా చర్చ జరుగుతుందని వెల్లడించారు.

సంఘ కార్యం నెమ్మదిగానైనా, క్రమంగా వృద్ధి చెందుతోందని, వ్యాపిస్తోందని మన్మోహన్ జీ అన్నారు. ఇటీవల మీరట్ లో జరిగిన రాష్ట్రొదయ కార్యక్రమాన్ని ఆయన ఉదహరించారు. ఈ కార్యక్రమంలో 1.75 లక్షల మంది స్వయంసేవకులు పూర్తి గణవేష్ లో పాల్గొన్నారని, అదే 20 ఏళ్లక్రితం జరిగిన ఇలాంటి సమ్మేళనానికి  20,000 మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు. ఇది 20ఏళ్ల కాలవ్యవధిలో సంఘ సాధించిన ప్రగతిని సూచిస్తుందని ఆయన అన్నారు. సమాజంలోని అన్నీ వర్గాల నుండి సంఘ కార్యం పట్ల ఆసక్తి, ప్రతిస్పందన పెరుగుతోందని అన్నారు.

సమావేశాల చివరి రోజున కొన్ని ప్రధానమైన విషయాలపై తీర్మానాలు ఆమోదిస్తారు.

పత్రికా సమావేశంలో సంఘ్ అఖిలభారత సహ ప్రచారప్రముఖ్ నరేంద్రకుమార్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. సమావేశాన్ని విదర్భ ప్రాంత ప్రచారప్రముఖ్ అనీల్ సాంబారే నిర్వహించారు.