Home Telugu విలువలు గల విద్యా బోధన కోసం విద్యాభారతి విజ్ఞాన కేంద్రం…

విలువలు గల విద్యా బోధన కోసం విద్యాభారతి విజ్ఞాన కేంద్రం…

0
SHARE

ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ ఛాలక్ పరమ పూజనీయ డాక్టర్ మోహన్ జీ భాగవత్ ఆదివారం నాడు హైదరాబాదులో పర్యటిస్తున్నారని విద్యా భారతి క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని నాదర్ గుల్‌లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని వివరాలు తెలియజేశారు. ఎందుకు సంబంధించి నాదర్ గుల్ ప్రాంగణంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. భారతదేశమంతటా విలువలు గల విద్యను అందించడంలో పేరుగాంచిన విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌కు అనుబంధంగా తెలంగాణలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం సేవలందిస్తోంది. ఈ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఇప్పటికే 175 పైగా శిశు మందిర్ పాఠశాలలు నడుస్తున్నాయి. 2019 లో సీబీఎస్ఈ సిలబస్‌తో బండ్లగూడ జాగీరులో స్విస్ పాఠశాలను ఏర్పాటు చేసి విజయవంతం చేసిన తర్వాత, నాదర్ గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు అయింది. ఈ విద్యా కేంద్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జి భగవత్ మరియు పరివ్రాజకాచార్యులు త్రిదండి చిన్న జీయర్ స్వామి కలిసి ప్రారంభోత్సవం చేస్తారని సుధాకర్ రెడ్డి వివరించారు. ఈ నెల 28వ తేదీ అంటే ఆదివారం ఉదయం 9:15 నిమిషాలకు ఈ ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు. పాఠశాల భవనం, కిచెన్ అండ్ డైనింగ్ హాల్ మరియు ఉపాధ్యాయుల వసతి గృహాలను ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 10. 30 నిమిషాలకు బహిరంగ సభ జరుగుతుంది. ఇందులో మోహన్ జీ భాగవత్, చిన్న జీయర్ స్వామి ప్రసంగిస్తారు. నాదర్ గుల్‌లో ఏర్పాటు అవుతున్న సీబీఎస్ఈ పాఠశాలలో ప్రస్తుతం నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు ఉంటుంది. తర్వాత కాలంలో పదో తరగతి, ప్లస్ టూకి విస్తరిస్తారు. రాబోయే కాలంలో బాలురు బాలికలకు విడివిడిగా హాస్టల్స్ నిర్మించే ఆలోచన చేస్తున్నారు. ఈ పాఠశాలకు బిమిడి పెద్ద పెంటారెడ్డి, యశోద దంపతులు 14 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు.

శ్రీ సరస్వతి విద్యాపీఠం ఇప్పటికే అటవీ ప్రాంతాలు సముద్రతీర ప్రాంతాల్లో ఉచిత పాఠశాలలు నిర్వహిస్తోంది. పట్టణాలు, నగరాల్లోని బీదలు నివసించే బస్తీలలో సంస్కార కేంద్రాలు నడుపుతోంది. వివిధ పట్టణాలు, ముఖ్య గ్రామాలలో తక్కువ ఫీజుతో ఇంగ్లీష్ మీడియంలో శిశుమందిర్ పేరుతో పాఠశాలలు నిర్వహిస్తోంది. కొన్నిచోట్ల గిరిజనుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలను నిర్వహించడం జరుగుతోంది. శ్రీ సరస్వతి విద్యాపీఠం అన్ని పాఠశాలల్లోనూ ప్రధాన సబ్జెక్టులతో పాటు విలువలు నేర్పించేందుకు ప్రత్యేకంగా సదాచారం అనే సబ్జెక్టుని బోధించడం జరుగుతుంది. దీని ద్వారా అసలైన భారతీయ చరిత్ర, విలువలు, సంస్కృతి పిల్లలకు నేర్పిస్తారు. ఇదే క్రమంలో ఇంటర్నేషనల్ విద్యాసంస్థల్ని క్రమంగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. మొదటగా 2019లో బండ్లగూడ జాగిర్‌లో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో స్విస్ విద్యాసంస్థను స్థాపించారు. అది పూర్తిగా విజయవంతమైన తర్వాత అదే బాటలో రెండో పాఠశాలకు శ్రీకారం చుట్టారు. 2015లోనే నాదర్ గుల్ దగ్గర భూమి పూజ జరిగిన ప్రాంగణంలో ఈ పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు.‌ పూర్తిస్థాయి ఇంగ్లీష్ మీడియంతో పాటు ఇంటర్నేషనల్ సంస్థల్లో బోధన అనుభవం కలిగిన అధ్యాపకులు, అత్యున్నత మౌలిక వసతులు, లేబరేటరీలతో ఈ పాఠశాలను తీర్చిదిద్దారు. దీని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లోని పిల్లలకు నాణ్యమైన చదువులు భారతీయ విలువలతో అందించడం జరుగుతుందని లింగం సుధాకర్ రెడ్డి వివరించారు. ఈ ప్రెస్ మీట్‌లో పాఠశాల అధ్యక్షులు తేలుకుంట రమేష్ గుప్తా కార్యదర్శి విష్ణు వర్ధన్ రాజు, సంఘ చాలక్ బర్ల సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.