Home News రిజర్వేషన్లకు సంఘ్ సంపూర్ణ మద్దతు.. అసమానతలు తొలగే వరకూ ఉండాలి..

రిజర్వేషన్లకు సంఘ్ సంపూర్ణ మద్దతు.. అసమానతలు తొలగే వరకూ ఉండాలి..

0
SHARE

దేశంలో రిజర్వేషన్ల కొనసాగింపు విషయంలో తమపై చేస్తున్న విష ప్రచారం మీద రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ హైదరాబాదులో స్పందించారు. రిజర్వేషన్ల విషయంలో ఆరెస్సెస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వాటిని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని, అసమానతలు తొలిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని తేల్చిచెప్పారు. స్వార్థం కోసమే సంఘ్ పై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. వివాదం లేపి, లబ్ధి పొందాలని చూస్తున్నారని, వివాదంతో తమకు సంబంధం లేదని మోహన్ భాగవత్ అన్నారు. హైదరాబాదు నాదర్‌గుల్‌లో విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్మించిన విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ఇంటర్నేషనల్ స్కూల్‌ని ప్రారంభించిన సందర్భంగా చేసిన ప్రసంగంలో రిజర్వేషన్లపై స్పందించారు.

“ఈ మధ్య కాలంలో బాగా సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో నా దృష్టికి వచ్చింది. అందులో ఏముందంటే… ‘సంఘ్ వారు బయటకు బాగా మాట్లాడతారు గానీ, అంతర్గతంగా వారు రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెబుతుంటారు… కానీ ఇదే విషయాన్ని బయటకు చెప్పలేరు’ అని ఉంది. ఇది పూర్తిగా అసత్యము, తప్పుడు ప్రచారం. రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరచినప్పటి నుంచీ రాజ్యాంగం అందిస్తున్న అన్ని రిజర్వేషన్లకూ సంఘ్ పూర్తి మద్దతు తెలియజేస్తోంది. సంఘ్ చెప్పేదేంటంటే… రిజర్వేషన్లు ఎవరెవరికి వర్తింపజేయబడ్డాయో వారికి అవసరమైనంత కాలమూ… సమాజంలో భేదభావాల వంటి సామాజిక కారణాలు ఉన్నంత కాలం అవి కొనసాగాలి. కానీ, ఆ వీడియోలో నేను సమావేశం పెట్టినట్టుగా దృశ్యాలున్నాయి. అసలు అలాంటి సమావేశం ఎప్పుడూ జరగనేలేదు. ఇలా జరగనివాటిని చూపించేలా టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉంది, సోషల్ మీడియా ఉంది… వీటి ద్వారా మంచి విషయాలూ వెళుతుంటాయి… చెడు అంశాలు వెళుతుంటాయి. ఇదంతా సోషల్ మీడియా స్వభావం కాదు… సోషల్ మీడియాను ఉపయోగించేవారి స్వభావం.” అని మోహన్ భాగవత్ అన్నారు.

పాఠశాల ప్రారంభోత్సవం నేపథ్యంలో మోహన్ జీ భాగవత్ విద్యా వ్యవస్థ మీద కీలక సూచనలు చేశారు. విద్య అన్నది ప్రపంచాన్ని తెలుసుకొనే మార్గం అని తేల్చి చెప్పారు. ఈ చదువుల్ని లోక కళ్యాణం కోసం ఉపయోగించాలని సూచించారు. 1952లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఒక చిన్న గదిలో ప్రారంభం అయిందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు నడుస్తున్నాయని వివరించారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి సేవలు అందిస్తోందని మోహన్ జీ అన్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభించినప్పటికీ దేశ భక్తి, విలువలతో కూడిన విద్యకు పెద్ద పీట వేయటం జరుగుతోందని స్పష్టం చేశారు. విదేశాలకు విహార యాత్రకు వెళ్లే ముందు, అయోధ్య వంటి పుణ్య స్థలాల్ని సందర్శిస్తే దేశభక్తి మరింత పెరుగుతుందని అన్నారు. స్వయంసేవకులు చివరి శ్వాస దాకా సమాజం కోసమే పనిచేస్తారని మోహన్ జీ అన్నారు. మనమంతా రాముని బాటలో నడవాలని ఆయన పిలుపు ఇచ్చారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సౌకర్యాలను సమాజహితం కోసం వాడుకోవాలని అన్నారు. ఇటీవల కాలంలో సంఘ్ మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వివరించారు.

ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పరమహంస పరివ్రాజకారాచర్య త్రిదండి చిన శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి విచ్చేశారు. చిన జీయర్ స్వామితో కలిసి డాక్టర్ మోహన్ జీ భాగవత్ పాఠశాల భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనుగ్రహ భాషణం చేసిన చిన జీయర్ స్వామి… దేశం సమస్యల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గదర్శనం చేశారని అన్నారు. భారత్‌ను విశ్వ గురు స్థానంలో నిలిపేందుకు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారని వివరించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, కేవలం ఒక భారతీయుడుగా తన వాదనలు వినిపిస్తున్నానని చిన జీయర్ స్వామి స్పష్టం చేశారు. విద్య అన్నది పొట్ట కూటి కోసం కానే కాదని, సమాజంలో సక్రమమైన పౌరుడిగా తయారు చేసుకొనేందుకు అని వివరించారు. అటువంటి విలువలతో కూడిన విద్యను శిశుమందిర్‌లు అందిస్తున్నాయని అన్నారు.

విద్యాభారతి విజ్ఞాన కేంద్ర పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, క్షేత్ర ప్రచారక్ సుధీర్, క్షేత్ర సహ ప్రచారక్ భరత్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి, ప్రాంత ఉపాధ్యక్షులు పసర్తి మల్లయ్య, కార్యదర్శి ముక్కాల సీతారాములు, సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, పాఠశాల అధ్యక్షులు తేలుకుంట్ల రమేష్ గుప్తా, కార్యదర్శి విష్ణు వర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞానకేంద్రం ఏర్పాటుకి భూమి, వస్తు రూపంలో తోడ్పాటు అందించిన దాతలను ఆత్మీయంగా సత్కరించారు. పిల్లల సాంస్క్రతిక కార్యక్రమాలు అలరించాయి.