Home Telugu Articles 12 ఆగస్ట్, 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

12 ఆగస్ట్, 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

0
SHARE

–ప్రశాంత్ పోల్

ఆ రోజు 12 ఆగస్ట్, పరమ ఏకాదశి. కలకత్తా దగ్గరలోని సోదేపూర్ ఆశ్రమంలో గాంధీగారితో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఆ రోజు ఏకాదశి ఉపవాసం, వారి కోసం పళ్ళు తెప్పించారు. అయితే అంతకుముందు రాత్రి బెంగాల్ నాయకుడు సుహ్రవర్దితో జరిగిన తన సమావేశం గురించి గాంధీగారు ఆలోచనలో పడ్డారు.

షాహీద్ సుహ్రవర్ది..
పేరులో `షాహీద్’ కి, బలిదానం -త్యాగానికి ఏ మాత్రం సంబంధం లేదు. నిజానికి ఇతను హంతకుడు. 1946 `ప్రత్యక్ష చర్య’ వెనకున్న దుర్మార్గుడు, 5౦౦౦ మంది హిందువులను పైశాచికంగా ఊచకోతకు గురిచేసినవాడు; రక్తసిక్తమైన చేతులున్నా, ఏమాత్రం బాధ, పశ్చాత్తాపo లేకుండా, ఒక సంవత్సరం తరువాత గాంధీగారిని కలవడానికి వచ్చాడు. నక్కజిత్తులలో ఆరితేరినవాడు, వ్యసనపరుడు, తిరుగుబోతు, అతి క్రూరుడు, ఛాందస ముస్లిం; అయినా ఆధునిక వస్త్రాలతో, విద్యావంతుడిగా, నాగరికంగా కనపడతాడు.

గాంధీగారి ప్రార్థనా సమావేశానికి ఇవాళ చాలామంది వచ్చారు. కొంతమంది విలేఖరులు కూడా ఉన్నారు. ప్రార్థనానంతరం, గాంధీగారు ఉపన్యసించారు.

“మరో రెండు రోజుల్లో, 15 ఆగస్ట్ నాడు, భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ రోజు `సంతాపదినం’గా జరపాలని కొందరు ముస్లిములు యోచిస్తున్నారని నేను వింటున్నాను. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా నా కోరిక. ఆ రోజు ఏ విధంగా సంబరాలు చేసుకోవాలో మనకు భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు, అందరూ ఈ ఒక్క విధంగానే జరుపుకోవాలి అని మేమూ అనట్లేదు. పాకిస్తాన్ లో హిందువులు ఏం చేయాలి అనేది ప్రశ్న? వారు పాకిస్తాన్ జెండాని గౌరవించాలని నా అభిప్రాయం”.

“ ఫ్రెంచ్ పోర్చుగీస్ కాలనీల్లో (గోవా, దమన్, దీవ్, పుదుచ్చేరి మొ.) భారతీయులు అదే రోజు స్వాతంత్ర్యాన్ని ప్రకటిoచదలుచుకుంటున్నట్లు నేను వింటున్నాను. నాకు ఇది చాలా అసంబద్ధంగా అనిపిస్తోంది. ప్రాంతీయత్వాన్ని రెచ్చగొట్టేదిగా ఇది చూడబడుతుంది. బ్రిటిషువారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు, ఫ్రెంచ్ పోర్చ్యుగీస్ కాదు. వారుకూడా ఎప్పుడో ఒకరోజు విముక్తులవుతారు, ఈలోపు వారు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకూడదు”.

“నిన్నరాత్రి షాహీద్ సుహ్రవర్ది నన్ను కలవడానికి వచ్చి, ఈ ప్రస్తుత కల్లోల వాతావరణంలో కలకత్తా నుంచి నన్ను వెళ్ళవద్దని కోరారు. ఇక్కడి పరిస్థితులు చక్కబడేదాకా ఉండమని అడిగారు”.

“ఒక షరతు మీద ఆయన విజ్ఞ్యప్తికి నేను ఒప్పుకుందామని నిర్ణయించుకున్నాను. మేమిద్దరం ఒకే వసతి గృహంలో పోలీస్ లేక సైన్యం రక్షణ లేకుండా, కల్లోలిత ప్రాంతంలో ఉంటాము. “సరిహద్దు కమిషన్’’ (బౌండరీ కమిషన్) తమ నివేదికను కొద్ది రోజుల్లో ప్రకటిస్తుంది. వారి ఆదేశాలను హిందువులు ముస్లిములు ఇద్దరూ పాటించాలి”

శ్రీనగర్..
కాశ్మీర్ మహారాజు తమ ప్రాధానమంత్రి రామచంద్ర కాక్ ను తొలగించారు. ఆయన 2సంవత్సరాల పదవీకాలం వివాదాస్పదంగా, కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూకి వ్యతిరేకంగా సాగింది.

అంతకుముందు కొన్నినెలల క్రితం 19-23 జూన్ 1947లో లార్డ్ మౌంట్.బాట్టెన్ కాశ్మీరు వచ్చారు. కాశ్మీరుని పాకిస్తాన్లో కలపమని కాశ్మీరు మహారాజుని కోరారు, మహారాజు వెంటనే ఆ ఆలోచనని తోసిపుచ్చారు. అపుడు ప్రధాని కాక్, కాశ్మీరును పాకిస్తాన్లో కలపలేకపోతే, భారతదేశoలో కూడా విలీనం చేయకుండా స్వతంత్రంగా ఉంచాలని మహారాజుకి సూచించాడు.

అప్పటికి కొద్దిరోజుల క్రితం గాంధీగారి కాశ్మీర్ యాత్రలో, ఆయన కాశ్మీరం భారత్ లో విలీనం చేయబడుతుందని ఖచ్చితంగా చెప్పిఉంటే, అక్కడికక్కడే అన్ని విషయాలు తేలిపోయి ఉండేవి. కాని గాంధీగారు భారత్-పాకిస్తాన్ల పట్ల తమ సమభావం, సమాన వైఖరితో కాశ్మీరు విలీనం విషయంలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయనేలేదు. నెహ్రు బలవంతం మీద, కేవలం ప్రధాని కాక్ గారిని తొలగించాలని మాత్రమే కోరారు.

గాంధీగారి సలహా మేరకు మహారాజా హరిసింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన తన బంధువు జనక్ సింగ్ ను ప్రధానిగా నియమించారు. పారిపోబోతున్న రామచంద్ర కాక్ ను పట్టి బంధించారు.

కాశ్మీరు రాజకీయాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

ఢిల్లీ..
వైద్యసేవా విభాగానికి డా. జీవరాజ్ మెహతా ని డైరెక్టర్ జనరల్(DG)గా నియమిస్తూ లేబర్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇదీ ఒకరకమైన చారిత్రక ఘట్టమనే చెప్పుకోవాలి. భారతీయ వైద్యసేవా అధికారులను తప్ప, ప్రభుత్వం బయట డాక్టర్లను అంతకుముందు ఎప్పుడూ అంత అత్యున్నత పదవిలో నియమించలేదు. డా. జీవరాజ్ మెహతా అంతక్రితం 20సంవత్సారాలు, గాంధీగారి వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసారు.

పుదుచ్చేరి..
అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వం రాజకీయ ఊరేగింపులు, సమావేశాలపై అన్ని రకాల నిషేధాలు ఎత్తేసి, బంధించబడిన ఖైదీలందరినీ విడుదల చేస్తామని ప్రకటించింది. ఫ్రెంచ్ గవర్నర్, ఇతర అధికారులు గాంధీగారిని లాంఛనంగా కలిసి ఆదేశాలు ప్రకటించారు. పుదుచ్చేరితో పాటు, ఈ ఆదేశాలు మాహె మరియ చందానగర్ కి కూడా వర్తిస్తాయి.

లాహోర్..
క్రితంరాత్రి నుంచి లాహోర్ నగరంలో మతఘర్షణల మంటలు చెలరేగాయి. రాడ్క్లిఫ్ సరిహద్దు కమిషన్ లాహోర్ పట్టణాన్ని భారతదేశంలో విలీనానికి సిఫార్సు చేసిందనే పుకార్లతో లాహోరు అట్టుడికిపోయినట్లయిoది. ఈ వార్తతో, `ముస్లిం నేషనల్ గార్డ్’ భయోత్పాతం సృష్టించి అల్లర్లు మొదలుపెట్టింది. ఈ వార్తలతో, సామాన్య ముస్లిములు కూడా చెలరేగిపోయారు. లాహోర్ నగరంలో ఎన్నో ప్రాంతాల్లో, సంఘ్ స్వయంసేవకులు, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి అల్లరి మూకలనుంచి ఎంతోమంది హిందువులు, సిక్ఖులను కాపాడారు. ముస్లిం నేషనల్ గార్డ్, హిందూ ప్రాంతంలో ఉన్న సంఘ్ కార్యాలయoపై కూడా దాడి చేస్తారనే నిఘా సంస్థ వార్త తెలిసి, స్వయంసేవకులు సంఘ్ కార్యాలయం చుట్టూ చేరి రాత్రంతా కాపలా కాశారు.

ఉదయం 10గంటలనుండి ముస్లిం మూకలు రెచ్చిపోయి హింసాత్మక సంఘటనలు ఉధృతం చేసారు. వారి వేషధారణ మూలంగా సిక్ఖులను గుర్తించడం సులభం కాబట్టి, వారు సులభంగా దొరికిపోయారు. 11గంటలకు ముస్లిం మూకలు డిప్యూటీగంజ్ అనే హిందూ-సిఖ్ ప్రాంతంలో, ఒక వృద్ధుడైన సిక్ఖుని, పట్టపగలు, పేగులు బయటకు లాగి, రోడ్డు మధ్యలో దారుణంగా చంపేశారు.

అమానుషత్వం లాహోర్లో అన్నివైపులా మారణహోమం చేసింది. మధ్యాహ్నం 3గంటలలోపు, అధికారిక మరణాల సంఖ్య 50 దాటింది, దానిలో ఎక్కువమంది హిందువులు-సిక్ఖులే. కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే హాస్పిటల్ చేరుకోగలిగారు, వారి గాయాలు ఎంత భయంకరమైనవంటే, వారిని కాపాడడానికి డాక్టర్లు, నర్సులు మృత్యువుతో పోరాడుతున్నారు. మధ్యాహ్నానికే గురుదాస్పూర్, లాయల్పూర్లలో కూడా ఘర్షణలు పాకిపోయి తీవ్రతరం అయాయి.

4గంటలకి, గవర్నర్ జెంకిన్స్ లాహోరు అమ్రితసర్ పోలీసులను నమ్మలేమని, లార్డ్ మౌంట్.బాట్టెన్ కి టెలిగ్రామ్ పంపించాడు. కారణం ముస్లిం నేషనల్ గార్డ్ పోలీసు యూనిఫాంలలో దారుణ హత్యలు చేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయింది. లాహోరే కాదు, పంజాబ్ మొత్తం మంటల్లో రగిలిపోతోంది, వారి ఆక్రందనలు వినేవారు ఎవరూ లేరు, ఢిల్లీలో ఉన్న పాలకులకి వారి గోడు చెవిన పడలేదు.

కలకత్తా – మధ్యాహ్నo 2గంటలు..
కలకత్తా రేవులో 2.5లక్షలమంది ముస్లిం నావికులు, కలకత్తా పట్టణాన్నిపాకిస్తాన్లో కలపకపోతే, నిరవధిక సమ్మె చేస్తామని బెదిరిస్తూ కరపత్రం వేసారు. 1690సం.లో కలకత్తా రేవు నిర్మించినప్పటినుంచీ, అది ఎప్పుడూ ముస్లింల నియంత్రణలోనే ఉంది. కాబట్టి, హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పశ్చిమ బెంగాల్ కి దాన్ని అప్పజెప్పడం సబబు కాదు.

కలకత్తా –సోదేపూర్ ఆశ్రమం, మధ్యాహ్నo 2 గంటలు..
గాంధీగారు మధ్యాహ్న సమయంలో కాసేపు విశ్రమిస్తున్నారు. `ప్రధానమంత్రి’ షాహీద్ సుహ్రవర్ది ప్రతినిధిగా వచ్చిన కలకత్తా పాత మేయర్ `ఉస్మాన్’కి గాంధీగారిని కలవడానికి వేచిచూడక తప్పలేదు. 3గంటలకి ఉస్మాన్ గాంధీగారిని కలిసి, సుహ్రవర్ది తరపున లేఖ ఇచ్చాడు. దాని సారాంశం, ఒకే వసతి గృహంలో ఉందామన్న గాంధీగారి ప్రతిపాదనకి సుహ్రవర్ది ఒప్పుకున్నాడు. చాలామంది సుహరావర్దిని నమ్మవద్దని గాంధీగారికి చెప్పారు, అయితే ఆధారం లేకుండా, ఎవరూ అనుమానితులు కారు అనేది గాంధీగారి అలవాటు. ఒకే కప్పుక్రింద సుహ్రవర్దితో ఉండడానికి గాంధీగారు సిద్ధమయారు.

కరాచీ – మధ్యాహ్నo 2 గంటలు..
త్వరలో మూతపడబోతున్న కాంగ్రెస్ కార్యాలయంలో, ఒక పత్రికా ప్రకటన తయారైంది; ఆ ప్రకటనని స్వయంగా కరాచీలో, అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి ఆచార్య జె.బి. కృపలానీ ఒక్కరూ కూచుని సరిచూసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ కార్యాలయంలో ఎవరికీ ఆచార్య కృపలానీగారిని కలవడం ఇష్టంలేదు. లియాకత్ ఆలీఖాన్ కాంగ్రెస్ మీదా, కృపలానీగారిమీదా చేసిన ఆరోపణలను ఖండిస్తున్న పత్రికా ప్రకటన అది.

“ప్రభుత్వానికి ఎదురుతిరగమని నేను సింద్ రాష్ట్రంలోని హిందువులను రెచ్చగొడుతున్నానని లియాకత్ ఆలీఖాన్ నాపై ఆరోపణ చేసాడు. ఈ ఆరోపణలన్నీ నేను ఖండిస్తున్నాను. `హస్ కే లియా హై పాకిస్తాన్, లడ్ కే లేంగే హిందూస్తాన్’ (నవ్వుతూ పాకిస్తాన్ తీసుకున్నాము, పోట్లాడి హిందూస్తాన్ ని చేజిక్కిoచుకుంటాము) అనే వారి నినాదానికి మాత్రమే నేను అడ్డుచెప్పాను. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హిందువులని, ముస్లిములనీ నేను కోరుతున్నాను. భారత సైన్యం సరిహద్దుల దగ్గరకి వస్తే, పాకిస్తాన్లోని హిందువులు ఎన్నో కష్టాలు చూస్తారు, అలాగే పాకిస్తాన్ సైన్యం సరిహద్దు మీదకి వస్తే, భారత ముస్లిములు సమస్యలు చూస్తారు. అఖండిత భారత్ గురించి కాంగ్రెస్ ఇంకా ఆశ పెట్టుకునే ఉంది, అయితే అది మాకు శాంతియుతంగా దక్కాలి”.

ఢిల్లీ గవర్నర్ భవనం…
లార్డ్ మౌంట్.బాట్టెన్ కళ్ళుమూసుకుని తన కార్యాలయంలో కూర్చుని ఉన్నాడు. ఆయన కనురెప్పలక్రింద భారతదేశంలో బ్రిటిషు సామ్రాజ్య చరిత్ర అంతా తిరుగుతోంది. అఖండ భారతదేశంలో, బ్రిటిషువారి మొట్టమొదటి రాజకీయ ప్రాతినిధ్యం ఆ రోజే స్థాపించబడింది. 12 ఆగస్ట్ 1765లో `అలహాబాద్ ఒప్పందం’ (అలహాబాద్ ట్రీటీ) సంతకం చేయబడింది. 1600వ సం.నుంచీ `ఈస్ట్ ఇండియా కంపెనీ’ ఈ విధంగానే నిర్వహించబడింది. అలహాబాద్ ఒప్పందం కంటే ముందు కూడా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇలాంటి ఎన్నో ఒప్పందాల మీద ఎందరితోనో సంతకాలు చేస్తూ వచ్చింది- ముఘల్ నవాబులు, మరాఠా రాజులు, నిజాం నవాబులు, ఇంకా మరెందరో. అయితే ఆ ఒప్పందాలన్నీవాణిజ్యపరమైనవి. బక్సర్ యుద్ధం తరువాత, మొదటిసారిగా బ్రిటిషువారు, తమ ప్రథమ రాజకీయ ఒప్పందం ముఘల్ రాజు `షా ఆలం (రెండు)’ తో 182 సంవత్సరాల క్రితం కుదుర్చుకున్నారు. అప్పటినుంచి గంగాప్రవాహంలో ఎంతో కాలం కొట్టుకుపోయింది. ఆ మధ్యలో `1857 తిరుగుబాటు’ కూడా జరిగింది. రాబోయే రెండు రోజులలో, బ్రిటిష్ సామ్రాజ్యం అధికార దండం భారతీయులకి అప్పగించబోతోంది.

ఆయన తన ఆలోచనల్లోంచి హటాత్తుగా మేలుకున్నాడు. గతంలోకి చూసే సమయమూ లేదు, సందర్భమూ కాదు. ప్రస్తుతంవైపు దృష్టి పెట్టాలి. ఇప్పుడు వెంటనే చేయాల్సిన పని ఒకటి ఉంది, అది అఖండ భారత సైన్యాన్ని రెండుగా విభజించడం. వాయుసేనలోని 10 స్క్వాడ్రన్లలో, 2 పాకిస్తాన్ కి, 8 భారతదేశానికి. అలాగే, సైన్యం మరియు నావికాదళాల విభజన కూడా, 2 యూనిట్లు భారత్ కి, 1 పాకిస్తాన్ కి.

అయితే, ఏప్రిల్1948 వరకూ కూడా, ఫీల్డ్ మార్షల్ క్లాడ్ ఆషిన్లేక్ రెండు దేశాల సైన్యదళాలకి, సర్వ సైన్యాధిపతిగా ఉంటారు. `జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్’ (ఉమ్మడి రక్షణా సమితి)కి లార్డ్ మౌంట్.బాట్టెన్ అధ్యక్షుడిగా కొనసాగుతారు.

లండన్..
లండన్ లోని భారతీయులు భారతదేశ స్వాతంత్ర్యాన్ని ఒక ఉత్సవంలా జరుపుకోవడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 15ఆగస్ట్ తేదిన, `ఇండియా హౌస్’ భవనంపై త్రివర్ణ పతాకం రెపరెపలాడబోతోంది. బ్రిటిష్ ప్రధానమంత్రి అట్లీ, ఆయన మంత్రివర్గ సహచరులు ఆ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు. భారత హైకమిషనర్ కృష్ణ మెనన్, కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అది 15ఆగస్ట్ రోజు, ఉదయం 11గంటలకి జరగబోతోంది. 

లండన్ మహానగరంలో అనేక ప్రదేశాల్లో, అనేకమంది గ్రూపులు, స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. భారతీయుల హోటళ్ళు, రెస్టారెంట్లు, త్రివర్ణాలతో అందంగా తీర్చిదిద్దబడతాయి. వెస్టెoడ్ భారతీయ విద్యార్థులు `స్వరాజ్ హౌస్’ లో సంబరాలు నిర్వహిస్తారు. `భారత కార్మికుల సంఘం’ జరపబోయే కార్యక్రమంలో, ప్రముఖ సామ్యవాద నాయకుడు, అచ్యుతరావు పట్వర్ధన్ ప్రసంగిస్తారు.

సింగపూర్ నార్త్రిడ్జ్ రోడ్ `రాయల్ టాకీస్’లో `ధరతి’ అనే సినిమా 14ఆగస్ట్ అర్ధరాత్రి 11:45కి ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. ఆ సినిమా అప్పటికే చాలా ప్రదేశాల్లో పెద్ద హిట్ అయింది, త్రిలోక్ కపూర్ మరియు ముంతాజ్ శాంతి ప్రధాన పాత్రధారులు.

హైదరీ మంజిల్, కలకత్తా బేలియా ఘాట్..
ఈ భవనంలోనే గాంధీగారు, సుహ్రవర్ది ఉంటారు. ఈ భవనం మొదట ఒక బ్రిటిషు వ్యాపారిది. పశ్చిమ భారతంలో షియా ముస్లిములలోని ఒక తెగ, దావూదీ బొహ్రా ముస్లింలు కలకత్తాలో కొన్ని ఆస్తులతోపాటు ఈ హైదరీ మంజిల్ భవనం కూడా 1923లో కొనుక్కున్నారు. బొహ్రా వ్యాపారి షేఖ్ ఆడమ్ కొనగా, తరువాత అతని కూతురు హుసైనిబాయి బెంగాలీకి చెందింది. అయితే ఇప్పుడది సుహరావర్ది అధీనంలో ఉంది.

బేలియా ఘాట్ మురికిగా ఉండే పేట, ఇక్కడ హిందువులు ముస్లిములు ఇద్దరూ ఉంటారు, అయితే ముస్లిం జనాభా ఆధిక్యత ఉంటుంది. కొంచo ఎడంగా ఉన్న ఈ భవనంలో పెద్ద పెద్ద ఎలుకలు నివాసం ఏర్పరుచుకున్నాయి. అయితే రేపటినుంచి ఇక్కడ గాంధీగారు, సుహరావర్ది ఉంటారు కాబట్టి ఈ భవనాన్ని శుభ్రం చేసి నివాసయోగ్యం చేస్తున్నారు.

ముంబై..
దాదర్ లోని ఒక `రాష్ట్ర సేవికా సమితి’ సభ్యురాలి నివాసంలో, రాత్రి 9:30కి, 35-40మంది కార్యకర్తలు ఒక సమావేశం నిర్వహిస్తున్నారు.

క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:

11 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
10 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
9 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
8 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
7 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
6 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
5 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
4గస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?
1 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

This article was first published in 2019