Home News 14 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

14 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

0
SHARE

– ప్రశాంత్ పోల్

కలకత్తా, 14 ఆగస్ట్, గురువారం..

ఉదయం వీచే చల్లని గాలి మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. కానీ బెలిఘాటిలో మాత్రం అలాంటి స్థితి కనిపించడం లేదు. సర్వత్ర బురద నిండి ఉండడంతో దుర్గంధం ఆ ప్రదేశం అంతా వ్యాపించింది.

ఉదయం ప్రార్ధన సమావేశం, ఆ తరువాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం కోసం గాంధీజీ బయటకు వచ్చారు. పక్కనే సగం కూలిన, కాలిన ఇల్లు కొన్ని ఆయనకు కనిపిస్తున్నాయి. మొన్న జరిగిన అల్లర్లలో ముస్లిం గూండాలు హిందువుల ఇళ్లను తగలేబెట్టరని ఆయనతోపాటు ఉన్న కార్యకర్తలు చెప్పారు. ఆ మాటలు విన్న గాంధీజీ ముఖంలో విచారం కనిపించింది. ఆ ఇళ్ల వైపు చూస్తూ మెల్లగా ముందుకు కదిలారు. ఈ రోజు ఉదయ వ్యాహ్యాలిలో సుహ్రవర్దీ లేడు. ఎందుకంటే అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో హైదర్ మహల్ లో రాత్రి బస చేసేందుకు అతనికి ధైర్యం చాలలేదు. ఉదయం 11గం.లకు కలుస్తానని చల్లగా జారుకున్నాడు.

`గాంధీజీ పిలుపు మేరకు కలకత్తాలో హిందువులు, ముస్లిములు కలిసి ర్యాలీలు జరుపుతున్నారు. వీటివల్ల నిన్న రోజంతా ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా గడిచింది.’అని ఒక కార్యకర్త తెలియజేశారు.

——–

కరాచీ, ఉదయం 9 గం.లు….

పైకి సాధారణంగా కనపడినా అతి పెద్దదైన అసెంబ్లీ భవనంలో చాలా హడావిడిగా ఉంది. కొద్ది సేపట్లో అధికారికంగా పాకిస్థాన్ ఏర్పడనుంది.

శంఖాకృతిలో ఉన్న ఆ సభా భవనంలో అనేక రకాల వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వారంతా వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు. వారిలో పఠాన్ లు ఉన్నారు, ఆఫ్రిదీలు, వజీర్ లు, మహాసూద్ లు, పంజాబిలు, బలూచ్ లు, సింధిలు, బెంగాలీలు కూడా ఉన్నారు. వేల మైళ్ళ దూరం నుంచి వచ్చిన బెంగాలీలు మిగిలినవారికంటే భిన్నంగా కనిపిస్తున్నారు.

మౌంట్ బాటన్ తన నౌకాదళ అధికారి యూనిఫార్మ్ లో ఉన్నారు. మొదటి ఉపన్యాసం ఆయనదే. ఆయన ఉపన్యాసాన్ని వ్రాసిచ్చేవారి పేరు జాన్ క్రిస్టీ. ఒక్కొక్క పదాన్ని జాగ్రత్తగా ఉచ్చరిస్తూ మౌంట్ బాటన్ తాన ఉపన్యాసం ప్రారంబించారు.  “పాకిస్థాన్ ఏర్పాటు ఒక చారిత్రక ఘటన. ప్రతి చరిత్ర మంచులా క్రమంగా కరిగి చివరికి ఉధృతమైన నీటి ప్రవాహంగా మారుతుంది. మనం ఈ ప్రవాహంలో తేలియాడాలి. ఇక వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. కేవలం భవిష్యత్తు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి.’’

ఎలాంటి భావం లేని, గంభీరంగా ఉన్న జిన్నా వైపు చూస్తూ, మౌంట్ బాటన్ ఇలా కొనసాగించారు `ఈ సందర్భంగా నేను జిన్నాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మా ఇద్దరి మధ్య స్నేహం, ఆత్మీయత ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ సంబంధం ఇలాగే కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను.’

ఇవాళ జిన్నా పెద్దగా మాట్లాడేది ఏమి లేదు. తన సంక్షిప్త ఉపన్యాసం కోసం ఆయన లేచి నిలబడ్డారు. మెరుస్తున్న, ఖరీదైన శేర్వాణి ధరించి ఉన్నారు. ఒకే కంటికి పెట్టుకునే కళ్ళజోడు. “బ్రిటిష్ పాలన ఈ రోజుతో పరిసమాప్తి అవుతోంది. కానీ బ్రిటిష్ అధికారులతో మా సంబంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. 12వందల సంవత్సరాల పురాతనమైన ఇస్లాం పై ఒట్టువేసి చెపుతున్నాను, పాకిస్థాన్ లో ఇతర మతాల పట్ల ఎలాంటి వివక్ష ఉండదు. పొరుగు దేశం, ఇతర దేశాలతో మైత్రి సంబంధాలు ఏర్పరచుకునేందుకు పాకిస్థాన్ ఎప్పుడూ వెనుకాడదు.’’

ఈ సంక్షిప్త ప్రసంగం తరువాత జిన్నా పాకిస్థాన్ మొదటి గవర్నర్ జనరల్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలా పాకిస్థాన్ అనే కొత్త దేశం ప్రపంచ దేశాల జాబితాలో చేరింది.

కార్యక్రమం తరువాత ఊరేగింపు ప్రారంభమయింది…బాగా అలంకరించిన రోల్స్ రాయిస్ కారు బయలుదేరింది. ఊరేగింపు అసెంబ్లీ నుంచి గవర్నర్ భవనం, అంటే ప్రస్తుతం జిన్నా నివాస భవనం వరకు. ఇది మూడు మైళ్ళ దూరం. రోడ్డుకు రెండు వైపులా జనం నిలబడి ఉన్నారు. కారు వెనుక సీట్లో జిన్నా, మౌంట్ బాటన్ కూర్చున్నారు.  21 తుపాకుల గౌరవ వందనం తరువాత మెల్లగా ఊరేగింపు మొదలైంది.

కారు వెలుతున్నప్పుడు చుట్టూ ఉన్న జనంలోనుంచి ఎవరైనా తమపై బాంబు విసిరితేనో? అని జిన్నా, మౌంట్ బాటన్ లకు లోపల భయంగా ఉంది. ఎందుకంటే చుట్టూ చాలామంది జనం ఉన్నారు. వేలాదిమంది జిన్నాకు, పాకిస్థాన్ కు జయజయకారాలు పలుకుతున్నారు. పోలీసులు, సైనికులు రోడ్డుకు రెండువైపులా నిలబడి ఉన్నారు. 3 మైళ్ళ దూరం సాగిన ఈ ఊరేగింపు 45 నిముషాల్లో పూర్తైంది.

ఊరేగింపు గవర్నర్ హౌస్ దగ్గరకు చేరుకుంది. ఎప్పుడూ గంభీరంగా ఉండే జిన్నా చిన్నగా నవ్వుతూ ఎముకల గూడులాంటి తన చేతిని మౌంట్ బాటన్ మోకాలాపై ఉంచి `ఇంషాఅల్లా…మీకు ఏమి కాకుండా తీసుకురాగలిగాను..’అని అన్నారు.

మౌంట్ బాటన్ ఈ మాటలు అంటున్న జిన్నా వైపు చూస్తూ ఉండిపోయారు. `ఎవరు, ఎవరిని ప్రాణాలతో తెచ్చారు?’అని మనసులో అనుకున్నారు. `ఓరి మూర్ఖుడా! నా వల్లనే నువ్వు ఇప్పటిదాకా బతికున్నావు’….!

——-

శ్రీనగర్…ఉదయం 10గం.లు…

నగరంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్. (జి.పి.ఓ). పోస్టల్ అధికారులు పాకిస్థాన్ జెండాను కార్యలయం పైన ఎగరవేస్తున్నారు. అక్కడే నిలబడి ఉన్న ఇద్దరు స్వయంసేవకులు పోస్ట్ మాస్టర్ ను ఇలా అడిగారు “మీరు పాకిస్థాన్ జెండాను ఇక్కడ ఎలా ఎగరవేస్తారు …? రాజా హరిసింగ్ ఇంకా కాశ్మీర్ ను పాకిస్థాన్ లో విలీనం చేయలేదు కదా ..?’

వాళ్ళడిగిన ప్రశ్నకు ముస్లిం పోస్ట్ మాస్టర్ శాంతంగా సమాధానం చెప్పాడు “శ్రీనగర్ పోస్ట్ ఆఫీస్ ప్రస్తుతానికి సియాల్కోట్ సర్కిల్ లో ఉంది. సియాల్కోట్ పాకిస్థాన్ లో భాగం. కనుక పోస్ట్ ఆఫీసుపై పాకిస్థాన్ జెండా ఎగరవేసాం’’.

ఈ విషయాన్ని ఆ ఇద్దరు స్వయంసేవకులు జమ్ము కాశ్మీర్ ప్రాంత సంఘచాలక్ ప్రేమ్ నాధ్ డోగ్రాకు తెలియజేశారు. ఆయన వెంటనే ఆ విషయాన్ని రాజా హరిసింగ్ కార్యాలయంలోని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 10.30 గం.లకు స్వయంసేవకులను పోస్ట్ ఆఫీస్ కు పంపారు. వాళ్ళు వెళ్ళి పోస్ట్ మాస్టర్ కు నచ్చచెప్పారు. మరో అరగంటలో పాకిస్థాన్ జెండా పోస్ట ఆఫీస్ పై నుంచి తొలగించారు.

——

కరాచీ..మధ్యాహ్నం 2 గం.లు….

ఉదయం జరిగిన కార్యక్రమానికి ధరించిన ప్రత్యేక దుస్తులు మార్చుకున్న తరువాత మౌంట్ బాటన్, లేడి మౌంట్ బాటన్ లు డిల్లీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇద్దరు ప్రశాంతంగా ఉన్నారు. ఈ రోజు రాత్రి భారత ప్రభుత్వ కార్యక్రమంలో హాజరు అవుతారు. జిన్నా, ఆయన సోదరి ఫాతిమా గౌరవపూర్వకంగా మౌంట్ బాటన్ దంపతులకు వీడ్కోలు పలికారు.

ఇలా నూతనంగా ఏర్పడిన పాకిస్థాన్ కు మొదటి రాజకీయ అతిధి రూపంలో సత్కారం అందుకున్న మౌంట్ బాటన్ , లేడి మౌంట్ బాటన్ లు జిన్నాకు వీడ్కోలు చెప్పారు.

——

కలకత్తా విమానాశ్రయం…మధ్యాహ్నం 3గం.లు….

విభజిత బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్ కు గవర్నర్ గా నియుక్తులైన చక్రవర్తి రాజగోపాలచారి ఈ రోజు ప్రత్యేక విమానంలో ఇక్కడికి వస్తున్నారు. ఈ రోజు రాత్రే ఆయన ప్రమాణస్వీకారోత్సవం ఉంటుంది. విమానాశ్రయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వారిలో ఎలాంటి ఉత్సాహం కనిపించడం లేదు. ఎందుకంటే బెంగాల్ లో రాజాజీ పట్ల వ్యతిరేకత కొనసాగుతోంది. రాజాజిని బెంగాల్ గవర్నర్ గా నియమించడం పట్ల నిరసన తెలుపుతూ సుభాష్ చంద్ర బోస్ సోదరుడు, కాంగ్రెస్ సీనియర్ నేత శరత్ చంద్ర బోస్ ఇప్పటికే రాజీనామా సమర్పించారు.

అందువల్ల గవర్నర్ హౌస్ కు చెందిన అధికారులు, ఉద్యోగులు మాత్రమే రాజాజీని విమానాశ్రయం నుంచి ప్రత్యేకమైన కారులో గవర్నర్ హౌస్ కు తీసుకువెళ్లారు.

———

సింగపూర్…

సింగపూర్ లోని `ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ’, మలయ్ ఎయిర్ వేస్ తో కలిసి రేపటి ఉత్సవాన్ని నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది. త్రివర్ణపతాకం ఎగురవేసే సమయంలో మలయ్ ఎయిర్ వేస్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆజాద్ హింద్ ఫౌజ్ కు చెందిన సైనికులు, అధికారులు, ఝాన్సి రాణి రెజిమెంట్ కు చెందిన మహిళా సైనికులు ప్రయాణిస్తారు. వాళ్ళు ఆకాశం నుంచి త్రివర్ణపతాకంపై పుష్పవృష్టి కురిపిస్తారు.

కానీ ఆజాద్ హింద్ ఫౌజ్ పేరు వినపడగానే సింగపూర్ పౌర విమానయాన విభాగం ఈ ప్రత్యేక కార్యక్రమానికి అప్పటికే మంజూరు చేసిన అనుమతిని ఉపసంహరించుకుంది…! దానితో స్వతంత్ర వేడుకల నిర్వహణ కమిటీ విడిగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయింది.

——–

కరాచీ…సాయంత్రం 4గం.లు….

కరాచీలో ఒక పెద్ద భవంతి. సంఘ కార్యకర్త ఇల్లు అది. ఆ కుటుంబంలోని ఇద్దరు మహిళలు రాష్ట్ర సేవికా సమితి కార్యకర్తలు. ఆ భవనం పైన సేవికల సాంఘిక్ కార్యక్రమం ఏర్పాటైంది. కరాచీలోని హిందువులు అధికంగా ఉండే ప్రాంతాల నుంచి సేవికలు ఆ సాంఘిక్ లో పాల్గొనేందుకు వస్తున్నారు. ఉదయం జిన్నా, మౌంట్ బాటన్ ల ఊరేగింపు అనుకున్నదానికంటే ముందే పూర్తి అయింది. అందువల్ల దారిలో పెద్దగా రద్దీ లేదు. గురువారం అయినప్పటికి పాకిస్థాన్ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

ఆ భవనపు పై కప్పు పెద్దగా ఉంది. దాదాపు ఏడెనిమిది వందలమంది సేవికలు అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతమంది కూర్చునేందుకు స్థలం సరిపోవడం లేదు. కొందరు సేవికలు చివర నిలబడ్డారు. వాతావరణం గంభీరంగా ఉన్నప్పటికి, ఉత్సాహవంతంగా కూడా ఉంది. శాఖా కార్యక్రమం జరుగుతుంది. అందులో ధ్వజాన్ని ఎగరవేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచే ఒక పాట పాడతారు. ఆ తరువాత లక్ష్మీబాయి కేల్కర్ (మౌసీజీ) తన గంభీరమైన వాణితో నెమ్మదిగా ప్రతిజ్ఞ పలికిస్తారు. అదే దృఢత్వం, గంభీరత్వంతో సేవికలు కూడా ఆ ప్రతిజ్ఞను పలుకుతారు. ఈ ప్రతిజ్ఞ సంకల్ప శక్తిని పెంచుతుంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి కూడా కొంత సమయం కేటాయించారు. ఒక సేవిక ఇలా అడిగింది “పాకిస్థాన్ లో మా మానప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితిలో మేము ఏం చేయాలి? ఎలా ఉండాలి?’’

ధైర్యాన్ని కలిగించే స్వరంతో మౌసీజీ ఇలా సమాధానమిచ్చారు – “ఎప్పుడూ సాధ్యమైతే అప్పుడు హిందుస్తాన్ వచ్చేయండి. ఇక్కడ నుంచి క్షేమంగా హిందూస్థాన్ చేరడం ఎలాగన్నది ఆలోచించండి. ముంబై, తదితర ప్రదేశాలలో సంఘ మీ కోసం తగిన ఏర్పాట్లు చేసింది. కాబట్టి చింతించకండి. మనమంతా ఒకే కుటుంబం. ఈ కష్టకాలాన్ని కలిసి ఎదుర్కుందాం.’’

కార్యక్రమం చివరలో తన సంక్షిప్త ఉపన్యాసంలో మౌసీజీ “సోదరీమణులారా! ధైర్యాన్ని వహించండి. ధర్మశీలురు కండి. మీ మానప్రాణాలను కాపాడుకోండి. మన సంస్థ పట్ల విశ్వాసాన్ని ఉంచండి. ఇలాంటి కష్టకాలంలో కూడా మాతృభూమి సేవావ్రతాన్ని కొనసాగించండి. సంఘటిత శక్తి ద్వారా మనం ఈ కష్టాలను సులభంగా అధిగమిస్తాం.’’

మౌసీజీ చెప్పిన ఆ ధైర్య వచనాలతో సింధ్ ప్రాంతానికి చెందిన ఆ సేవికల్లో తప్పనిసరిగా ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి ఉంటాయి…!

——-

మరోసారి కరాచీ…

కరాచీలో జరిగిన కార్యక్రమంలో జిన్నా, మౌంట్ బాటన్ లకు జనం పలికిన జయజయకారాలు తప్ప పాకిస్థాన్ లో మరెక్కడా స్వతంత్ర దినోత్సవ ఉత్సాహం, వేడుక కనిపించలేదు. కేవలం పశ్చిమ పాకిస్థాన్ లోనే నెలవంక, నక్షత్రం కలిగిన ఆకుపచ్చని పాకిస్థాన్ జెండా అనేక ప్రదేశాల్లో ఎగురుతూ కనిపించింది. ఇక తూర్పు పాకిస్థాన్ లోనైతే ఈ జెండా దాదాపు ఎక్కడా కనిపించనేలేదు. రంజాన్ చివరి రోజులు కావడంతో అలా జరిగిఉండవచ్చును.

అయితే ఒకటిమాత్రం నిజం.  పాకిస్థాన్ ఏర్పడడంతో ముస్లిం దేశాలకు ప్రభావవంతమైన నాయకత్వాన్ని అందించే ఒక దేశం పుట్టిందని అందరూ భావిస్తున్నారు.

——–

కలకత్తా…బెలియాఘాట్…

గాంధీజీ సాయంత్రం ప్రార్ధనా సమావేశానికి సమయం అయింది. పరాయి పాలనలో ఉన్న భారత్ చివరి ప్రార్ధన సమావేశం అది. ఇప్పటి వరకు ఇలాంటి అనేక ప్రార్ధనా సమావేశాల్లో ఆయన అనేక విషయాలపై మాట్లాడారు.

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు గాంధీజీ ఏం మాట్లాడతారోనని అందరి మనస్సుల్లో కుతూహలంగా ఉంది…అందుకనే ప్రార్ధనా సమావేశాన్ని బెలియాఘాట్ ఒక పార్క్ లో ఏర్పాటు చేశారు.

ఎదురుగా ఉన్న 10 వేలమందిని ఉద్దేశించి గాంధీజీ తన సహజమైన నెమ్మది, శాంత స్వరంలో మాట్లాడటం మొదలుపెట్టారు – “కలకత్తాలో హిందూ, ముస్లిం వివాదాలకు , ఘర్షణలకు ముగింపు పలికినందుకు ముందుగా మీకు అభినందనలు తెలుపుతున్నాను. ఇది అందరికీ మంచిది. ఈ బంధుభావన ఎల్లప్పటికి ఇలాగే నిలిచి ఉంటుందని నేను ఆశిస్తాను.’’

“రేపు మనం బ్రిటిష్ బానిసత్వం నుంచి విముక్తి పొందుతాం. అయితే దానితోపాటు ఈ రోజు రాత్రే మన ఈ దేశం ముక్కలు అవుతుంది. అందువల్ల రేపటి రోజు ఒకవైపు మనకు ఆనందదాయకమైనది, మరోవైపు దుఃఖాన్ని తెచ్చిపెట్టేది కూడా. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన బాధ్యతలు పెరుగుతాయి. కలకత్తాలో బంధుభావన, వివేకం వెల్లివిరిస్తే ఈ మన దేశం ఒక పెద్ద ప్రమాదం నుంచి గట్టెక్కుతుంది. కానీ అలాకాకుండా జాతి, మత వైమనస్యాలు ఈ దేశాన్ని చుట్టుముడితే , ఇప్పుడిప్పుడే మనం సాధించుకున్న ఈ స్వాతంత్ర్యం ఎక్కువ కాలం నిలుస్తుందా ….?’’

“రేపటి స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను నేను ఆనందంగా జరుపుకోలేనని చెప్పడానికి చింతిస్తున్నాను. రేపు 24 గంటలు ఉపవాసం చేయాలని నా సహచరులకు కూడా చెపుతున్నాను. అలాగే ప్రార్ధన చేసి, చరఖా తిప్పమని చెపుతున్నాను. దీని వల్ల మన దేశం సురక్షితంగా ఉంటుంది.’’

——–

ఢిల్లీ….కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 6 గం.లు … జోరుగా వర్షం పడుతోంది…

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి పత్రికా ప్రకటన ప్రచురణ కోసం పంపుతున్నారు. ఆ ప్రకటనలో అధ్యక్షుడు జె.బి. కృపలానీ ఇలా వ్రాసారు – “ఈ రోజు మాకు ఎంతో విచారకరమైనది. మన ప్రియ మాతృభూమి ఖండితమవుతోంది. అయితే దీనిని తట్టుకుని మనం నూతన భారతాన్ని నిర్మించుకుందాం…!’’ ————————-

ఢిల్లీ, సాయంత్రం 6 గం.లు….

డా. రాజేంద్ర ప్రసాద్ బంగాళా. నెహ్రూ మినహా అతని క్యాబినెట్ లోని అధిక శాతం మంత్రులు అక్కడ ఉన్నారు. రక్షణ మంత్రి బల్దెవ్ సింగ్ పంజాబ్ పర్యటనలో ఉన్నారు. కాబట్టి ఆయన కాస్త ఆలస్యంగా వస్తారు.

ఆ బంగాళా దగ్గరలో భారత ఉజ్వల భవిష్యత్తు కోసం యజ్ఞం జరుగుతోంది.  వేదవిదులైన పండితుల ద్వారా యజ్ఞ నిర్వహణ జరుగుతోంది. గట్టిగా, స్పష్టంగా వేద మంత్రాలు చదువుతున్నారు. బయట చిరుజల్లు పడుతోంది. మొత్తానికి ప్రశాంత, పవిత్రమైన వాతావరణం నెలకొంది.

యజ్ఞం పూర్తయిన తరువాత ప్రసాదం స్వీకరించి మంత్రులంతా రాష్ట్ర కౌన్సిల్ భవనంలో ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళాలి.

———

ఢిల్లీ, రాత్రి 10 గం.లు….

బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది. రాష్ట్ర కౌన్సిల్ భవనంలో రాజ్యాంగ సభ సభ్యులు, మంత్రులు, సీనియర్ అధికారులు మెల్లమెల్లగా చేరుకుంటున్నారు. గుండ్రటి ఆకారంలో ఉన్న ఆ భవనం బయట వేలాది మంది వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వేచి చూస్తున్నారు.

సర్దార్ పటేల్, ఆజాద్, డా. రాజేంద్ర ప్రసాద్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, డా. అంబేద్కర్, బల్దెవ్ సింగ్, నెహ్రూ, రాజకుమారి అమృత్ కౌర్….ఇలా మంత్రులంతా వస్తున్నారు. వారిని చూసిన ప్రేక్షకులలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఏ మంత్రి వస్తే ఆయనకు జయజయకారాలతో జనం స్వాగతం పలుకుతున్నారు. `వందేమాతరం’, `మహాత్మా గాంధీ కీ జై’ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి.

సభ అధ్యక్ష స్థానంలో డా. రాజేంద్ర ప్రసాద్ కూర్చున్నారు. ఆయనకు కుడి వైపు కొద్దిగా క్రిందకు మౌంట్ బాటన్ తన సైనిక దుస్తులు ధరించి కూర్చున్నారు. నెహ్రూ కూడా తెల్లని వస్త్రాలు ధరించారు. కోటు, దానిపై జాకెట్, ఆ జాకెట్ పై ఒక గులాబీ…ఇలా నెహ్రూ బాగా తయారై వచ్చారు.

రాజేంద్ర ప్రసాద్ సభ కార్యక్రమాలను ప్రారంభించారు. స్వతంత్ర వీరులు, నాయకులకు స్మృత్యంజలి సమర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో కష్టాలు సహించిన, చివరికి ప్రాణ త్యాగం చేసిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. తన ఉపన్యాసం చివర్లో గాంధీజీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు రాజేంద్ర ప్రసాద్ – “మనందరి గురువు, మనకు మార్గాన్ని చూపిన దీపస్తంభం అయిన గాంధీజీ ఇప్పుడు మనకు చాలా దూరంగా శాంతిని నెలకొల్పే పనిలో నిమగ్నమై ఉన్నారు…!’’

ఆయన తరువాత మాట్లాడటానికి నెహ్రూ లేచి నిలుచున్నారు. ఆయన కోటు మీద పెట్టుకున్న గులాబీ పువ్వు అంతా రాత్రి సమయంలో కూడా అందరికి స్పష్టంగా కనిపిస్తోంది.

శాంతమైన, గంభీరమైన స్వరంతో నెహ్రూ మాట్లాడటం మొదలుపెట్టారు..“అనేక సంవత్సరాల క్రితం మనం విధితో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఈ రోజు ఆ ఒప్పందం పూర్తిగా కాకపోయినా, కొంతైనా పూర్తవుతోంది. సరిగ్గా రాత్రి 12 గం.లకు ప్రపంచమంతా దీర్ఘ నిద్రలో మునిగి ఉన్నప్పుడు భారత్ స్వాతంత్ర్యపు కొత్త యుగంలో…కొత్త జన్మలో అడుగుపెడుతుంది.’’ నెహ్రూ ఒకదాన్ని మించిన మరొక అధ్భుత పదాలతో తన ఉపన్యాసాన్ని సాగించారు. అలాంటి ఉపన్యాసం తయారు చేసుకునేందుకు ఆయన అనేక రోజులు కష్టపడ్డారు.

రాత్రి సరిగ్గా 12 గం.లకు ఆ సభ గృహంలో ఉన్న, గాంధీ టోపీ ధరించిన ఒక సభ్యుడు శంఖనాదం చేశారు. ఆ శంఖనాదంతో అక్కడ కూర్చున్నవారందరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒక కొత్త అధ్యాయం మొదలుకానున్నది ! ఒక కొత్త యుగం ప్రారంభమవుతోంది ! స్వర్గంలో ఉన్న అనేకమంది విప్లవ వీరుల ఆత్మలు ఈ అద్భుత దృశ్యం చూసిన తరువాత తృప్తి చెందుతాయి. శాంతిని పొందుతాయి….

భారత దేశం స్వతంత్రమయింది……

——–

ఢిల్లీ, అర్ధరాత్రి…..

జోరున వర్షం కురుస్తోంది. దరియాగంజ్ , మింట్ బ్రిడ్జ్ మొదలైన ప్రాంతాల్లో వర్షపు నీరు నిండుతోంది. అంతటి భారీ వర్షంలో కూడా ఈ – 42 కమలా నగర్ లోని చిన్న సంఘ కార్యాలయంలో కొంతమంది ప్రచారక్ లు, డిల్లీ లోని కొందరు ముఖ్యమైన సంఘ కార్యకర్తలు సమావేశమయ్యారు. వారి ముందు అనేక విషయాలు ఉన్నాయి. పంజాబ్, సింధ్ ల నుంచి అనేకమంది శరణార్ధులు వస్తున్నారు. వారికి వసతి, భోజనం ఏర్పాటు చేయాలి. రేపు జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో కొందరు ముస్లింలు గొడవ చేసే అవకాశం ఉందని సమాచారం అందింది. కాబట్టి అందుకు కూడా సిద్ధం కావాలి.

అనేకమంది స్వయంసేవకులు గత కొన్ని రోజులుగా నిద్రే పోలేదు… రాబోయే రోజుల్లో కూడా అనేక సమస్యలు వారు ఎదుర్కోవాలి.

—–

కలకత్తా, గవర్నర్ హౌస్. మధ్య రాత్రి ఒంటిగంట….

అక్కడ దూరంగా డిల్లీలో అధికార బదలాయింపు కార్యక్రమం పూర్తి అయింది, ఇక్కడ కలకత్తాలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయింది.

గవర్నర్ హౌస్ లో చక్రవర్తి రాజగోపాలచారి పదవి స్వీకార ప్రమణోత్సవం ప్రారంభం అవుతోంది. చాలా చిన్న కార్యక్రమం. పదవి నుంచి వైదొలగుతున్న ఫెడ్రిక్ బరోజ్ కొత్త గవర్నర్ రాజగోపాలచారికి అధికారం అప్పగిస్తారు. 10, 15 నిముషాల ఈ కార్యక్రమంలో మొదట రాజాజీ ఆంగ్లంలో ప్రమాణస్వీకారం చేశారు. అయితే ముఖ్యమంత్రి డా. ప్రఫుల్ల చంద్ర ఘోష్, ఇతర మంత్రులు బెంగాలీ భాషలో ప్రమాణం చేశారు.

కార్యక్రమాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. అది స్వాతంత్ర్యం పొందిన రాత్రి. అందుకని గవర్నర్ హౌస్ లో సాధారణ ప్రజానీకానికి కూడా ప్రవేశం కల్పించారు. అందుకనే అర్ధరాత్రి కూడా చాలామంది అక్కడకు వచ్చారు. `జైహింద్’, `వందేమాతరం’, `గాంధీజీ కీ జై’ మొదలైన నినాదాలతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. ఇప్పటి వరకు భారతీయులకు, ముఖ్యంగా విప్లవ వీరులకు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు సృష్టించిన ఈ గవర్నర్ హౌస్ లో `వందేమాతరం’ అంటూ నినాదాలు చేయడం ప్రజలకు ఎంతో ఉత్సాహంగా, కొత్తగా ఉంది.

గవర్నర్ గా రాజాజీ అధికారం చేపట్టిన వెంటనే అక్కడ గుమికూడిన జనం రెచ్చిపోయారు. గవర్నర్ హౌస్ లో ఉన్న విలువైన సామగ్రిని పట్టుకుపోయారు. అలా పట్టుకుపోతూ `మహాత్మా గాంధీ జిందాబాద్’ అంటూ నినాదాలు కూడా చేశారు….!

స్వతంత్ర భారతదేశంలో ఇంకా సూర్యోదయం కానేలేదు…కానీ స్వతంత్ర దేశపు మొదటి సార్వజనిక కార్యక్రమం అలా ముగిసింది…!

క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:

13 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
12 ఆగస్ట్, 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
11 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
10 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
9 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
8 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
7 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
6 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
5 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
4గస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?
1 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?

This article was first published in 2019