Home Telugu Articles 15 ఆగస్ట్, 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

15 ఆగస్ట్, 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

0
SHARE

– ప్రశాంత్ పోల్

ఈ రాత్రి (14ఆగస్ట్) భారత్ లో అసలు ఎవరు నిద్ర పోలేదు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, మద్రాస్, బెంగళూరు, లక్నో, ఇండోర్, పాట్నా, వడోద్ర , నాగపూర్…. ఇలా ఎన్ని నగరాల పేర్లు తీసుకున్న దేశపు మారుమూల ప్రాంతాల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ఈ వాతావరణం చూస్తే నిన్న పాకిస్థాన్ లోని నిరుత్సాహపూరిత పరిస్థితులు మరోసారి గుర్తుకు వస్తాయి.

రాత్రంతా వీధుల్లో వేడుకల్లో మునిగితేలిన ప్రజానీకం మెల్లగా ఇళ్లకు చేరారు. ఉదయం వార్తా పత్రికల్లో ఏం వార్తలు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతీయులలో ఉరకలెత్తిన ఈ స్వతంత్ర వేడుకల ఉత్సాహాన్ని గురించి వార్తా పత్రికలు ఏం రాశాయి? ఆ రోజు పత్రికలు రోజు కంటే ఆలస్యంగా వచ్చాయి. ఎందుకంటే అన్ని పత్రికలు అర్ధరాత్రి రాజ్యాంగ సభలో జరిగిన కార్యక్రమం గురించి వార్తా ప్రచురించడంతో ఆలస్యం అయింది. ప్రతి పత్రిక ఎనిమిది కాలమ్ ల శీర్షిక ప్రచురించింది.

డిల్లీ నుంచి వచ్చే `హిందుస్తాన్ టైమ్స్’ శీర్షిక – India Independent : British rule Ends

కలకత్తా `స్టేట్స్ మన్’ శీర్షిక – Two Dominions are born

డిల్లీకి చెందిన `హిందూస్థాన్’ పత్రిక పెద్ద పెద్ద అక్షరాల్లో – `శతాబ్దియోంకి దాస్తా కే బాద్, భారత్ మే స్వతంత్రతా కీ మంగల్ ప్రభాత్’ అని వ్రాసింది.

ముంబైకి చెందిన `టైమ్స్ ఆఫ్ ఇండియా’ – Birth of India`s Freedom

కరాచీ నుంచి వచ్చే `డాన్’ పత్రిక శీర్షిక – Birth of Pakisthan – an Event in History

-0-0-0-0-

కలకత్తా నగరం కూడా రాత్రంతా మేలుకునే ఉంది. స్వాతంత్ర్యపు అనుభూతిని పూర్తిగా ఆస్వాదించాలని జనం అనుకున్నారు. కలకత్తా వాతావరణంలో ఒక వింత మార్పు కనిపించింది. హిందూ, ముస్లిం గొడవలు, ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తలు ఎక్కడా రాలేదు. రెండు, మూడు రోజుల క్రితం ఒకరి రక్తం మరొకరు కళ్ళచూడాలని ఉద్రేకపడి, ఘర్షణలకు దిగిన హిందూ, ముస్లిం వర్గాలు ఇప్పుడు అన్ని మరచిపోయి స్వతంత్ర్య సంబరాలు జరుపుకుంటున్నారు. నగరం మొత్తం హిందూ, ముస్లిం ఐక్యతా నినాదాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మార్పుకు సంబంధించి పూర్తి శ్రేయస్సు  బెలియఘాట్ హైదరి మహల్ లో మకాం వేసిన గాంధీజీకే దక్కుతుంది.

హైదరి మహల్ ఇప్పుడు కలకత్తా వాసులకు ఒక తీర్థ స్థలం అయింది. నిన్నటి నుంచి గుంపులు, గుంపులుగా జనం గాంధీజీని చూడటానికి వస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా అలాగే కొనసాగే అవకాశం ఉంది.

కానీ గాంధీజీకి ఈ రోజు కూడా మిగిలిన అన్ని రోజుల వంటిదే. ప్రతి రోజు మాదిరిగానే ఇవాళ కూడా ఆయన తెల్లవారుఝామున 3 గం.లకు నిద్ర లేచారు. రోజువారీ కార్యక్రమాల జాబితాలో మరుగు దొడ్లను శుభ్రపరచే కార్యక్రమం చేర్చారు. ఇవన్నీ పూర్తి చేసుకుని గాంధీజీ ఎప్పటిలాగానే ఉదయ వ్యాహ్యాళికి బయలుదేరారు. ఈ రోజు మొత్తం ఆయన ఉపవాసం ఉంటారు.


-0-0-0-0-

సింగపూర్…

భారత్ లో ఉదయం 8.30 అయితే సింగపూర్ లో 11 గం.లు అయింది. ఆర్చర్ రోడ్, వాటర్ లూ స్ట్రీట్, రంగూన్ రోడ్ వంటి ప్రదేశాల్లో భారతీయ సంతతికి చెందినవారు భారత స్వతంత్ర వేడుకల సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమాల్లో జాతీయ గీతం ఏది పాడాలనే సందేహం కలిగింది. అందుకనే ఒక పాటను భారత జాతీయ గీతంగా సింగపూర్ వాసులు పాడటం ప్రారంభించారు. అది –

సుధా, సుఖ్ చైన్ కీ బర్ఖాబర్ సే

భారత్ భాగ్ హై జాగా

పంజాబ్, అవధ్, గుజరాత్, మరాఠా

ద్రావిడ, ఉత్కళ, బంగా

చంచల్ సాగర్, వింధ్య హిమాలా

నీలా జమునా గంగా

తెరే నిత్ గుణ్ గాయే

తుఝ్ సే జీవన్ పాయే

సబ్ తాన్ పాయే ఆశా

సూరజ్ బన్ కర్ జగ్ పర్ చమ్కే

భారత్ భాగ్ హై జాగా ||

జయ హొ, జయ హొ, జయ హొ, జయ జయజయజయ హొ…!


-0-0-0-0-

కలకత్తా.. బెలియఘాట్ .

ఉదయం 9 గం.లు. భారత సమాచార ప్రసార శాఖకు చెందిన అధికారులు కొందరు పూర్తి సామగ్రితో గాంధీజీ ప్రతిస్పందనను రికార్డ్ చేయడానికి వఃచ్చారు. కానీ గాంధీజీ వారికి ఇలా స్పష్టం చేశారు – “నేను చెప్పేది ఏమి లేదు.’ అయినా అధికారులు  పట్టు వదలలేదు. `ఈ రోజున మీరు ఏమి మాట్లాడకపోతే బాగుండదు.’ గాంధీజీ మళ్ళీ స్పష్టంగా చెప్పారు -“నేను చెప్పదలుచుకున్న సందేశం ఏది లేదు. ఇలా చెప్పడం బాగుండకపోయినా అది నిజం.’’

కొద్దిసేపటి తరువాత బీబీసి ప్రతినిధి కూడా వచ్చాడు. వారి ప్రసారాలు ప్రపంచం మొత్తం వెళతాయి. అయినా గాంధీజీ వాళ్ళకు కూడా అదే సమాధానం చెప్పారు.


-0-0-0-0-

డిల్లీ. వారిస్ రీగల్ ప్యాలెస్ …

వైస్ రాయ్ ల నివాస స్థానం. అంటే రాజభవనం. ఇప్పుడు `గవర్నమెంట్ హౌస్’ అయిపోయింది. భారత మొదటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ ఈ రోజు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ గవర్నమెంట్ హౌస్ లోని దర్బార్ హాలును ఈ కార్యక్రమం కోసం చక్కగా అలంకరించారు. పగటి పూట అయినా పెద్ద పెద్ద విద్యుత్ దీపాలు వెలిగించారు.

సరిగా 9 గం.లకు అధికారిక కార్యక్రమం మొదలైంది. కొమ్ము బూరా ఊదడంతో కార్యక్రమం ప్రారంభమయింది. దాని తరువాత శంఖ నాదం కూడా వచ్చింది. గవర్నర్ హౌస్ లో మొట్టమొదటసారి కొమ్ము బూరా , శంఖ నాదాలు వినిపించాయి.

భారత్ మొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జయకిషన్ దాస్ కానియా ముందు మౌంట్ బాటన్ నిలుచున్నారు. ఆయన బైబిల్ పై చెయ్యి ఉంచి తన ప్రతిజ్ఞ చెప్పారు. హాలు మొత్తం మంత్రులు, రాజ్యాంగ సభ సభ్యులు, అధికారులతో నిండిపోయింది. కానీ అలాంటి సందర్భాల్లో హాజరయ్యే రాజులు, మహారాజులు అక్కడ కనిపించలేదు.


-0-0-0-0-

కలకత్తా, బెలిఘాట్ …

ఉదయం 8గం.లు అయింది. చరఖాపై నూలు వడుకుతూనే గాంధీజీ తన బ్రిటిష్ మిత్రురాలైన అగాథా హారిసన్ కు ఒక లేఖ చెప్పి వ్రాయించారు. ఆ లేఖలో ఆయన చమత్కారంగా ఇలా వ్రాసారు – “మీరు రాజాజీ ద్వారా పంపిన లేఖ అందింది. అయితే అది రాజాజీ స్వయంగా తీసుకురాలేకపోయారు. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఆయన గవర్నర్ హౌస్ కు, `ఆంగ్లేయుల ఇల్లు’ చూడటానికి సాధారణ ప్రజానీకం పెద్ద సంఖ్యలో వచ్చి ఉన్నారు..’’

ఆ తరువాత బెంగాల్ లో కొత్తగా మంత్రిత్వ బాధ్యతలు చేపట్టిన వారికి ఒక లేఖ చెప్పారు. ఆ లేఖలో ఆయన తనకు ఇష్టమైన ఆదర్శాలు సత్యం, అహింసలతో పాటు వినమ్రతను కూడా పాటించమని వ్రాసారు. అధికారం వల్ల కలిగే చెడు ఫలితాల గురించి ప్రస్తావిస్తూ ఇలా వ్రాసారు – “అధికారం భ్రష్టత్వం వైపు లాగకుండా జాగ్రత్త పడండి. పేదప్రజల సేవ చేయడానికే మీరు ఈ పదవి స్వీకరించారనే విషయం మరచిపోకండి.’’

కొద్ది సేపటి తరువాత, అంటే 10 గం.లకు బెంగాల్ గవర్నర్ గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన చక్రవర్తి రాజగోపాలచారి గాంధీజీని కలవడానికి వచ్చారు. స్వాతంత్ర్యం కోసం తపస్సు చేసిన ఇద్దరు తపస్వులు కలసినట్లుగా ఉంది.

గాంధీజీని కలవగానే రాజగోపాలచారి ఇలా అన్నారు – “బాపూ ! మీకు అభినందనలు…మీరు కలకత్తాలో ఏదో మాయ చేశారు…!” అందుకు గాంధీజీ చెప్పిన సమాధానం చాలా భిన్నంగా ఉంది. “కలకత్తాలో పరిస్థితి నా సంతృప్తికరంగా లేదు…అల్లర్లలో ఇళ్ళు కోల్పోయి ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు తిరిగివచ్చే వరకు పరిస్థితి సాధారణంగా ఉందని నాకు అనిపించదు.’’

గత రాత్రి జరిగిన కార్యక్రమ వివరాలు రాజాజీ చెప్పారు. గాంధీజీ ఉపవాసంలో ఉన్నారు కాబట్టి ఏ ఆహారం ఇద్దరు కలిసి తీసుకునే అవకాశం లేదు. ఒక గంటపాటు గాంధీజీతో మాట్లాడిన తరువాత రాజాజీ వెళిపోయారు.


-0-0-0-0-

ముంబై..దాదర్.. సావర్కర్ సదన్…

ఉదయం నుంచి తాత్యారావ్(వినాయక్ సావర్కర్) ఉదాసీనంగా ఉన్నారు. ఆహారం ఏది తీసుకోలేదు. మాతృభూమి ముక్కలైందనే విషయం ఆయన సహించలేకపోతున్నారు. దేశాన్ని `అత్యంత బలహీనుల చేతిలో పెడుతున్నాము’అని ఆయనకు అర్ధమయింది.

అయినా స్వాతంత్ర్యం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ స్వాతంత్ర్యం కోసమే ఆయన రెండుసార్లు కాలాపానీ కఠిన కారాగార శిక్షను అనుభవించారు. 15 సంవత్సరాల గృహనిర్బంధాన్ని సహించారు. విశాలమైన సముద్రాన్ని కూడా ఈదడానికి సిద్ధపడ్డారు.

దేశం ముక్కలైన స్వాతంత్ర్యం మాత్రం లభించింది.

ఉదయం 10 గం.లు అవుతోంది. హిందూ మహాసభ కార్యకర్తలు అనేకమంది తాత్యారావ్ ను కలవడానికి వచ్చారు. వారందరి సమక్షంలో విప్లవ వీరుడు వినాయక దామోదర సావర్కర్ రెండు జెండాలు ఎగురవేశారు. ఒకటి, అఖండ భారతావనికి ప్రతీక అయిన భగవాధ్వజం. రెండవది, భారత జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకం. రెండు ధ్వజాలకు పూలు సమర్పించారు. కొన్ని నిముషాలు మౌనంగా నిలబడ్డారు.


-0-0-0-0-

డిల్లీ, కౌన్సిల్ గోళాకార భవనం..

ఉదయం 10.30గం.లు కావస్తోంది. ఇక్కడ ఈ రోజు అధికారికంగా జాతీయ పతాకంగా ఎంపిక చేసిన అశోకుని ధర్మ చక్రం ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. వైస్ రీగల్ ప్యాలెస్ లో ప్రమాణస్వీకారం చేసే మంత్రులు, సీనియర్ అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మెల్లగా కౌన్సిల్ హాల్ కు వస్తున్నారు. కార్యక్రమం చిన్నది. ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి నెహ్రూ కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు.

చిన్న గుట్టపై ఉన్న ఈ కౌన్సిల్ భవనం చుట్టూ జనం గుమిగూడారు. వారంతా స్వతంత్ర భారత దేశ పౌరులు. బ్రిటిష్ పాలనాకాలంలో ఈ ప్రదేశంలో ప్రవేశించడానికి సాధారణ ప్రజలకు అనుమతి కూడా లేదు. కానీ ఇప్పుడు అలాంటి నిషేధాలు, నిర్బంధాలు ఏవి లేవు. అందుకనే కుతూహలం, ఆనందం, ఉత్సాహం కలగలిసిన భావంతో వేలాదిమంది ప్రజానీకం `వందేమాతరం’ అంటూ నినాదాలు చేస్తున్నారు. గాంధీజీ, నెహ్రూల జయజయకారాలు చేస్తున్నారు. ఆ ఉత్సాహం, ఆనందంలో ఏం చేయాలి, ఏం చేయకూడదని వారికి తెలియడం లేదు.

నెహ్రూ కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ఆయనతోపాటు ఆయన మంత్రిమండలి సభ్యులు కూడా వచ్చారు. ఎడ్విన్ లూటియన్, హెర్బర్ట్ బేకర్ లు నిర్మించిన ఆ కౌన్సిల్ హాల్ లో మొట్టమొదటసారిగా త్రివర్ణ పతాకం ఎగరనుంది. జాతీయ గీతం ఏమిటన్నది ఇంకా నిర్ణయించలేదు కాబట్టి అక్కడ ఉన్నవారంతా వందేమాతర నినాదం చేశారు. ఆ ధ్వనితో ఆకాశం నిండిపోయింది….


-0-0-0-0-

లాహోర్..డి ఏ వీ కాలేజ్..మధ్యాహ్నం 2గం.లు….

కాలేజీ పరిసరాల్లో, హాస్టల్ భవనంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా ఏర్పాటు చేసిన `పంజాబ్ సహాయతా సమితి’ శరణార్ధ శిబిరాలు ఉన్నాయి. లాహోర్ మెడికల్ కాలేజీలోని స్వయంసేవకులైన వైద్యులు, విధ్యార్థులు, కొందరు మహిళా డాక్టర్లు కలిసి 20 పడకల చిన్న వైద్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఇళ్ళువాకిళ్ళు, పొలాలు, సాధన సంపత్తి వదిలిపెట్టి వత్తిచేతులతో, కట్టుబట్టలతో దయనీయమైన స్థితిలో పశ్చిమ పంజాబ్ నుంచి హిందువులు, సిక్కులు ఇక్కడకు చేరుతున్నారు.

నిన్న రాత్రి హిందూస్థాన్ స్వాతంత్ర్య వేడుకల్లో మునిగి తేలుతుంటే, ఇక్కడ మాత్రం పరిస్థితులు భయానకంగా మారాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హిందువులు, సిక్కులు గుంపులు, గుంపులుగా ఈ శరణార్ధి శిబిరాలకు చేరుకుంటున్నారు. వారు ఎదుర్కొన్న కష్టాలు, అనుభవించిన అత్యాచారాలు వింటే ఎవరైనా చెలించిపోతారు. ఆగ్రహంతో ఊగిపోతారు. సిక్కుల ఇళ్ళల్లో మహిళలను ముస్లిం గూండాలు ఎత్తుకుపోయారు. కొద్దిమంది మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు బావుల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రతి రోజు మధ్యాహ్నం 1.30గం.లకు శిబిరం లో ఉన్న శరణార్ధుల కోసం కుల్వంత్ సింగ్ అనే ఒక స్వయంసేవక్ ఆహారం తీసుకువస్తాడు. ఈ భోజనం లాహోర్ లోనే ఉన్న భాటీ గెట్ అనే హిందువుల ప్రదేశంలో స్వయంసేవకులు స్వయంగా తయారుచేస్తారు. అయితే శిబిరంలో క్రమంగా సంఖ్య పెరుగుతుండడంతో భోజన తయారీ కూడా కష్టమైపోయింది.

మధ్యాహ్నం 2.30 గం.లు అవుతోంది. అయినా కుల్వంత్ సింగ్ భోజనం తీసుకుని రాలేదు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు దీన్ దయాళ్ అనే మరో స్వయంసేవక్ బయలుదేరాడు. దీన్ దయాళ్ ఒక భాగ్ (జిల్లా) కార్యవాహ. దారిలో అతనికి ఒక గుంపు కనిపించింది. అతను దగ్గరకు వెళ్ళి చూశాడు. రోడ్డు మీద రక్తపు మడుగులో కుల్వంత్ సింగ్ పడిఉన్నాడు. పక్కనే అతని మోటార్ సైకిల్ కూడా పడిపోయి ఉంది. భోజనం క్యారేజ్ లోని కూర నుంచి వచ్చిన రసం అతని రక్తంలో కలిసిపోయింది.

ఒకవైపు ఢిల్లీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు బెలియాఘాట్ లో గాంధీజీ బెంగాల్ మంత్రిమండలికి ఉత్తరం వ్రాయిస్తున్నారు. `ముస్లింలను సురక్షితంగా ఉంచండి…’ కానీ ఇక్కడ లాహోర్ లో శరణార్ధుల కోసం భోజనం తీసుకువస్తున్న స్వయంసేవక్ కుల్వంత్ సింగ్ ను ముస్లిం గూండాలు పట్టపగలు, నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశారు….!


-0-0-0-0-

ఢిల్లీ . ఇండియా గేట్ దగ్గర మైదానం…

ఇక్కడ కూడా త్రివర్ణ పతాకం ఎగరవేసే కార్యక్రమం ఏర్పాటైంది. వేలాదిమందితో మైదానం నిండిపోయింది. వర్షం మూలంగా అక్కడక్కడ బురదగా ఉంది. కానీ జనం ఇది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారిలో ఉత్సాహం, ఆనందం ఉరకలేస్తోంది.

సరిగ్గా 4.30 గం.లకు నెహ్రూ ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు. కొద్దిసేపటి క్రితమే వర్షం పడింది. దాని మూలంగా ఏర్పడిన ఇంద్రధనుస్సు త్రివర్ణ పతాకానికి మరిన్ని రంగులు అద్దుతుంది.  అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది.


-0-0-0-0-

కలకత్తా…బెలిఘాట్…సాయంత్రం 5.30 గం.లు…

ఈ రోజు సాయంత్రపు గాంధీజీ ప్రార్ధనా సమావేశం `రాష్ బాగాన్’ మైదానంలో ఏర్పాటయింది. ఎందుకంటే స్వతంత్ర భారతంలో ఇది మొదటి సాయంకాలపు ప్రార్ధనా సమావేశం కనుక అధిక సంఖ్యలో జనం హాజరవుతారని భావిస్తున్నారు.

కాలి నడకనే మైదానానికి వెళ్లాలని గాంధీజీ పట్టుబట్టారు. పైగా మైదానం దగ్గరలోనే ఉంది. సాధారణంగా అక్కడికి ఐదు నిముషాల్లో చేరుకోవచ్చును. కానీ ఈ రోజు మైదానంలో చాలామంది ప్రజలు గుమికూడారు. 30 వేలమంది పట్టే ఆ మైదానంలో ఇసక వేస్తే రాలనంత జనం వచ్చారు. అందుకనే మైదానంలో ఏర్పాటుచేసిన వేదిక పైకి వెళ్లడానికి గాంధీజీకి ఇవాళ 20 ని.లు పట్టింది.

ప్రార్ధన, చరఖా తిప్పడం తరువాత గాంధీజీ నెమ్మదిగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. “నేను నిన్న చెప్పిన విషయాన్నే ఇవాళ కూడా మళ్ళీ చెపుతున్నాను. కలకత్తాలోని హిందూ, ముస్లింలందరిని నేను అభినందిస్తున్నాను. మీరు అసాధ్యం అనుకున్న ఒక విషయాన్ని సుసాధ్యం చేశారు. ఇక ఇప్పుడు హిందువులు తమ దేవాలయాల్లోకి ముస్లింలను, ముస్లింలు తమ మసీదుల్లోకి హిందువులను అనుమతించాలి…అలా చేస్తే హిందూ, ముస్లిం ఐకమత్యం మరింత బలపడుతుంది….’’!

“అక్కడక్కడ ముస్లింలను ఇబ్బందిపెడుతున్నారనే వార్తలు నాకు వస్తున్నాయి. అయితే ఇక్కడ కలకత్తా, హౌరాల్లో ఒక్క ముస్లింకు కూడా ఇబ్బంది కలగకూడదు.’’

ఆ తరువాత గాంధీజీ నిన్న మధ్య రాత్రి రాజభవనంలో జనం చేసిన దోపిడిని ప్రస్తావించారు. “మనకు స్వాతంత్ర్యం వచ్చిందంటే అన్ని నిర్బంధాలు, నిబంధనలు కూడా తొలగిపోయాయని కొందరు అనుకుంటున్నారు. ఇష్టంవచ్చినట్లు వ్యవహరించవచ్చని అనుకుంటున్నారు. కానీ అది మంచిది కాదు. నిన్న రాత్రి రాజభవనంలో జరిగిన సంఘటనలు దురదృష్టకరమైనవి. మనం మన స్వాతంత్ర్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఉండాలనుకునే పాశ్చాత్యులతో మర్యాదగానే వ్యవహరించాలి.’’

ఈ ప్రార్ధనా సమావేశం తరువాత గాంధీజీ తన ఉపవాసాన్ని నిమ్మ రసం తీసుకోవడం ద్వారా పూర్తిచేశారు.


-0-0-0-0-

అనేక సంవత్సరాల అంధకారం పరిసమాప్తమై స్వాతంత్ర్యపు వెలుగులు దేశంలో నిండాయి. అనేక తరాల బానిసత్వం కారణంగా దుర్బలమైన భారతీయ మానసాన్ని సుదృఢం చేయడం చాలా కష్టమైన పని.

విభజన జరిగిపోయింది. కానీ పాకిస్థాన్ కంటే ఎక్కువ సంఖ్యలో ముస్లింలు భారత్ లో ఉన్నారు. పూర్తి జనాభా మార్పిడి జరగాలని డా. అంబేద్కర్ చేసిన సూచనను కాంగ్రెస్ పట్టించుకోలేదు. దేశంలోని అనేక ప్రాంతాల్లో మత కలహాలు జరుగుతూనే ఉన్నాయి. అవి మరింత వ్యాపించే ప్రమాదం కూడా ఉంది. ఇక శరణార్ధుల సమస్య ఉండనే ఉంది.

కాశ్మీర్ సమస్య, దేశపు మధ్యలో ఉన్న నిజాం సంస్థానపు సమస్య ఉన్నాయి. ఇవి హిందువులకు కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తున్నాయి. గోవా ఇప్పటికీ పోర్చుగీసువారి కబంధ హస్తాల్లోనే ఉంది. పాండిచ్చేరి, చందన్ గర్ లు ఇంకా హిందూస్థాన్ లో కలవలేదు. అక్కడ నెహ్రూ మొండి పట్టు కారణంగా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నాయకత్వంలోని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ను భారత్ కోల్పోయింది.

స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశపు ఈ ముఖ చిత్రాన్ని చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. ఈ భూభాగాలన్నీ లేకపోతే రక్షణ దృష్ట్యా, సామాజిక, ఆర్ధిక విషయాల దృష్ట్యా భారత్ చాలా బలహీన పడుతుంది. మన నేతలకు దూర దృష్టి లేకపోవడం, బలహీనతల కారణంగా దేశపు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంది.

స్వాతంత్ర్యం పొంది నూతన యుగంలో ప్రవేశిస్తున్న వేళలో ఈ ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. దృఢమైన, స్పష్టమైన దృష్టి కలిగిన నాయకత్వం లభిస్తేనే ఈ దేశపు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది….!



క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:

14 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
13 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
12 ఆగస్ట్, 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
11 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
10 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
9 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
8 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
7 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
6 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
5 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
4గస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?
1 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?