బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై జరుగుతున్న దృష్టి సారించి దాడులను నిలువరించాలని బ్రిటన్‌కు చెందిన 155 హిందూ సంఘాలు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. హిందువులకు ముఖ్యమైన పండుగ అయిన దుర్గాపూజ సందర్భంగా బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా ఉన్న హిందూ సమాజంపై ఇటీవల జరిగిన హింస, దౌర్జన్యాలను బ్రిటన్ లో ఉంటున్న హిందువులైన మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించి మానవ హక్కులను కాపాడాలని కోరారు.
“బంగ్లాదేశ్‌లో మైనారీటిలుగా ఉన్న హిందువులపై అనాగరికంగా జరిగిన దాడులు కనికరం లేకుండా ఒక వారం పాటు కొనసాగాయి. 315 హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 1,500 హిందూ గృహాలు, వ్యాపార సముదాయాలను ధ్వంసం చేశారు. 23 మందికి పైగా హిందూ మహిళలు, బాలికలు అత్యాచారానికి గురయ్యారు. అనేక మంది హిందువులు హత్యకు గురయ్యారు. మరికొంత మంది తప్పిపోయినట్లు కూడా నివేదికలు ఉన్నాయి. రామకృష్ణ మిషన్, ఇస్కాన్ వంటి గ్లోబల్ హిందూ సంస్థల దేవాలయాలపై దుండగులు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం, పోలీసుల నుండి సరైన స్పందన లేకపోవడం విచారకరం. దీని వల్ల బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజం నిరాశా నిస్పృహలకు లోనవుతోంది.” అని హిందూ సంఘాలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు తమ విశ్వాసాన్ని పాటించినందుకు రోజువారీ అవమానాలకు గురవుతున్నారని, వారిపై ఇటువంటి హింసాత్మక దాడులు కొత్తేమీ కాదని… మతపరమైన హింస కారణంగా 1964 – 2013 మధ్య కాలంలో 11.3బిలియన్ల హిందువులు బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టారని ఢాకా ట్రిబ్యూన్ అనే పత్రికలో 20 నవంబర్ 2016 లో ఢాకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అబుల్ బర్కత్ తెలిపిన విషయాన్ని వారు గుర్తు చేశారు. దీని వల్ల 1947లో 30% ఉన్న హిందూ జనాభా 2011 నాటికి 8%కి తగ్గిందని వారు పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులు బ్రిటన్‌లో హిందువులమైన తమకు ఆందోళన కలిగిస్తున్నాయని… ఈ దాడులను ఖండించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్టు హిందూ సంఘాల వారు పేర్కొన్నారు. “ప్రపంచ వేదికపై మానవ హక్కులను రక్షించడంలో బ్రిటన్ ముందు వరుసలో ఉంటుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. బ్రిటన్ ప్రతి సంవత్సరం వందల మిలియన్ల పౌండ్‌లను బంగ్లాదేశ్‌కు సహాయంగా అందజేస్తూనే ఉంటుంది, బంగ్లాదేశ్ బ్రిటన్‌కు ఒక వాణిజ్య భాగస్వామి కూడా కాబట్టి, UN నిబంధనల ప్రకారం మైనారిటీల హక్కులు రక్షించడానికి, మానవ హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వం తమ నిబద్ధతను పునరుద్ఘాటించాలి” అని హిందూ సంఘాలు తమ పిటిషన్‌లో కోరారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసా సమస్యను లేవనెత్తడం, అందుకు సంబంధించి బంగ్లాదేశ్ ప్రభుత్వం నుండి సమాధానాలు కోరడం ఒత్తిడి చేయడం బ్రిటీష్ ప్రభుత్వ బాధ్యత అని తాము అభిప్రాయపడుతున్నట్టు వారు పేర్కొన్నారు.
ఈ హింసను తీవ్రంగా ఖండిస్తూ, బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందూ మైనారిటీలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకునేలా డిమాండ్ చేయాలని బ్రిటన్ ప్రధానిని వారు కోరారు. ఈ హింసకు కారణమైన వారికి వెంటనే పట్టుకుని వారిని శిక్షించే విధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే బాధితులకు పునరావాసం కల్పించి, హిందూ దేవాలయాలను పునరుద్ధరించి తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చేలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పై విషయాలను తక్షణం పరిగణలోకి తీసుకుంటారని, బ్రిటీష్ హిందూ సమాజం ఆందోళనలను తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.