- 2.09 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు
- బ్యాంకు ఖాతాల స్థంభన
- డైరెక్టర్లపై చర్యలు
- నల్లధనం వెలికితీతకు గట్టి చర్యలు
కేంద్రప్రభుత్వం డొల్ల కంపెనీలపై ఉక్కు పాదం మోపింది. సుమారు 2.09 లక్షల కంపెనీల పేర్ల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించింది. ఆయా కంపెనీ డైరెక్టర్లపై చర్యలకు శ్రీకారం చుట్టింది. నియంత్రణా సంస్థ నిబంధనలను పాటించనందువల్ల రిజిష్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) వద్ద కంపెనీల పేర్ల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం నిలిపివేసినట్లు మంగళవారం నాడు తెలియజేసింది. దీంతో పాటు ఆయా కంపెనీల బ్యాంకు లావాదేవీలను కూడా స్తంభింపజేసినట్లు వెల్లడించింది.
డొల్ల కంపెనీల్లోకి పన్ను ఎగ్గొట్టిన సొమ్ముతో పాటు అక్రమంగా సంపాదించిన నల్లధనం వరదలా వచ్చి పడుతోంది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అంటే 2014 నుంచి నల్లధనంపై అడ్డుకట్ట వేయడానికి గట్టి చర్యలు తీసుకుంటోంది. పన్ను ఎగ్గొట్టిన సొమ్ము డొల్ల కంపెనీల పేర్లతో చలామణి అవుతోందని భావించి ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా రెండు లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కంపెనీల డైరెక్టర్ల బ్యాంకు ఖాతాలు నిర్వహించడానికి వీల్లేకుండా చర్యలు తీసుకుంది. చట్టబద్దంగా ఈ కంపెనీలను రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే బ్యాంకు ఖాతాలు పునరుద్దరించడానికి వీలవుతుందని స్పష్టం చేసింది.
రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీల వద్ద 2,09,032 కంపెనీల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం సెక్షన్ 248 (5) చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం రద్దు చేసిన కంపెనీల డైరెక్టర్లు ఇక నుంచి మాజీ డైరెక్టర్లు లేదా మాజీ అథరైర్జ్ సిగ్నేటరీ అవుతారని వివరించింది.
కంపెనీ చట్టం సెక్షన్ 248ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అమలు చేస్తుంది. కాగా రిజిస్టార్ ఆఫ్ కంపెనీల వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న కంపెనీలను వివిధ కారణాల వలన రద్దు చేసే అధికారం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఉంది. దీంతో పాటు దీర్ఘకాలంగా లావాదేవీలు నిర్వహించిన కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం కూడా కార్పొరేట్ మంత్రిత్వశాఖ కలిగి ఉంటోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ రద్దైన 2.09 కంపెనీల డైరెక్టర్లు లేదా అధరైర్డ్ సిగ్నెటరీలు, బ్యాంకు ఖాతాలు నిర్వహించడానికి ఇక నుంచి అనర్హులు. రద్దైన డొల్ల కంపెనీలు చట్టబద్దంగా రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు ఈ ఖాతాలు అలానే ఉంటాయి. కంపెనీ పేరు చట్టబద్దంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ప్రభుత్వం బ్యాంకు ఖాతా స్థాయిని ‘స్ట్రకాఫ్ నుంచి యాక్టివ్’ మోడ్‌లోకి మారుతుంది. రద్దైన కంపెనీల బ్యాంకుల లావాదేవీలు జరగ్గకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఆయా కంపెనీల బ్యాంకు లావాదేవీలు జరగ్గకుండా చర్యలు కూడా తీసుకుంటుందని ప్రభుత్వ ప్రకటనలో వివరించింది. డిపార్టుమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ ద్వారా బ్యాంకులను, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ పేర్లను రద్దు చేసిన బ్యాంకు ఖాతాల లావాదేవీలను తక్షణమే నిలిపివేయాలని సూచించింది. ఇలాంటి కంపెనీలతో జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా బ్యాంకులకు సలహా ఇచ్చింది.ఒక వేళ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ వద్ద కంపెనీ యాక్టివ్ స్టాటస్ ఉండి… వాస్తవానికి వార్షిక ఆర్థిక ఫలితాలు లేదా వార్షిక రిటర్న్‌తో పాటు ఇతర అంశాలను ఫైల్ చేయకపోతే, కూడా వీటిని కూడా అనుమానిత ఖాతాల కింద పరిగణిస్తారు. కంపెనీ చట్టబద్దంగా ఉన్న నిబంధనలను పాటించడం లేదని భావించాల్సి ఉంటుందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
(ఆంధ్రప్రభ సౌజన్యం తో)