Home News ‘అక్షయ్‌’ పాత్ర! మరణించిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలన్న పిలుపునకు అనూహ్య స్పందన

‘అక్షయ్‌’ పాత్ర! మరణించిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలన్న పిలుపునకు అనూహ్య స్పందన

0
SHARE
  • సైనికులకు విరాళాలివ్వాలన్న బాలీవుడ్‌ నటుడు
  • నిమిషాల్లోనే రూ.6.5 కోట్లు వసూలు

దేశ భద్రత కోసం అసువులు బాసిన వీర జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. కొన్ని నిమిషాల్లోనే రూ.6.5 కోట్లు వసూలయ్యాయి.

అక్షయ్‌ కుమార్‌ సూచన మేరకు కేంద్ర హోంశాఖ.. www.bharatkeveer.gov.in అనే వెబ్‌సైట్‌ను ఇప్పటికే ప్రారంభించింది. దీని ద్వారా.. విధి నిర్వహణలో మరణించిన పారామిలటరీ జవాన్ల కుటుంబాలకు నేరుగా దాతలు డబ్బును ఇవ్వవచ్చు. సోమవారం ‘ఇండియా రైజింగ్‌’ పేరుతో నిర్వహించిన ప్రపంచ ఇన్వెస్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ఇందులో.. వీర జవాన్ల అంశాన్ని వ్యాపార దిగ్గజాల వద్ద ప్రస్తావించారు. సదరు వెబ్‌సైట్‌ విషయాన్ని గుర్తుచేశారు. ‘‘ఇక్కడికి విచ్చేసిన వారిలో అత్యున్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు. మీకు పుష్కలంగా పలుకుబడి, వనరులు ఉన్నాయి. మన జవాన్లను ఆదుకునేందుకు మీరు కాకుంటే ఎవరు ముందుకొస్తారు’’ అంటూ అక్షయ్‌ పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్‌లో.. 112 మంది మృత సైనికుల వివరాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకూ వారి కుటుంబాలకు అందిన సొమ్ము రూ.15 లక్షలకు మించలేదని స్పష్టమవుతోందని తెలిపారు. ‘‘ఈ జాబితాలోని అమరవీరులు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ఒక్కో కార్పొరేట్‌ సంస్థ కానీ సీఈవో కానీ కనీసం ఒక రాష్ట్రానికి చెందిన అమరవీరులను దత్తత చేసుకోవడానికి ముందుకొస్తే.. ఆ సైనికుల కుటుంబాలకు సరిపడా నిధులు వసూలవుతాయి. జాబితాలో మహారాష్ట్రకు సంబంధించిన అమరవీరులు మొత్తానికీ విరాళమిస్తానని నేను ముందుకొస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఆయన చేసిన వినతికి కార్పొరేట్‌ దిగ్గజాలు, సీఈవోలు చలించిపోయారు. ఈ కార్యక్రమ నిర్వాహక సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌.. జమ్మూకశ్మీర్‌లోని మృత వీరులందరికీ విరాళమిచ్చేందుకు ముందుకొచ్చింది. విక్కీ ఒబెరాయ్‌ ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇలా తలో రకంగా ముందుకొచ్చారు. ‘‘నిమిషాల్లోనే దాదాపు రూ.6.5 కోట్లను సేకరించగలిగాం. వెబ్‌సైట్‌లో 60% మందికి ఇది సరిపోతుంది’’ అని అక్షయ్‌ పేర్కొన్నారు.