జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో పాక్ ఉగ్రవాది, లష్కరే తోయిబా (ఎల్‌టీఈ)కు చెందిన టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ఉన్నాడని పోలీసుల తెలిపారు. భద్రతా దళాలు, స్థానిక పౌరులపై దాడులు జరిపి ప్రాణాలను బలిగొన్న అబ్రార్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా అబ్రార్ తన ఏకే-47 రైఫిల్‌ను ఇంట్లో ఉంచానని తెలిపాడు.
ఈ క్రమంలో ఆయుధాన్ని రికవరీ చేసేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా.. ఇంట్లో దాక్కున్న మరో ఉగ్రవాది కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరుపడంతో అబ్రార్ సైతం కాల్పుల్లో మృతి చెందగా.. మరొకరిని విదేశీ ఉగ్రవాదిగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు.