74 వ స్వాతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ ముఖ్య అతిథులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రస్తుతం స్వాతంత్ర సంగ్రామ ప్రేరణతో దేశం ముందుకు సాగుతోందన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో దేశం ముందడుగు వేయడానికి సిద్ధమైందన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా భారత్ స్వయంసమృద్ధి సాధించలేక పోయిందని, ఈ క్షణం నుంచి స్వయంసమృద్ధి కోసం బలమైన సంకల్పంతో ముందుకు వెళ్లాలని ప్రధాని అన్నారు. భారత్ అంటే కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు, ఉన్నత విలువలతో కూడిన జీవనమని, ప్రపంచ కల్యాణానికి మన వంతు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అనేది కేవలం నినాదం మాత్రమే కాదు, అందుకోసం ప్రజలందరూ సంకల్పించాలని, దేశ యువత ఆత్మవిశ్వాసంతో ఆత్మ నిర్భర్ భారత్ సాధించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు..
స్వదేశీ నినాదంతో ముందుకు సాగుతూ భారత్ లో తయారు చేసిన వస్తువులను ప్రపంచం మొత్తం ఆదరించే వస్తువులు తయారు చేయాలని ప్రధాని మోడీ అన్నారు. గతంలో భారత్ వస్తువులకి విశ్వవ్యాప్తంగా గౌరవం ఉండేదని మళ్లీ అలాంటి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలన్నారు. అందుకోసం విస్తారమైన సహజవనరులను ఉపయోగించాలని సూచించారు. 4 నెలల క్రితం పీపీఈ కిట్లు, n-95 మాస్క్ లు కొరత ఉండేదని, స్వయంసమృద్ధితో ప్రస్తుతం ఇతర దేశాలకి ఎగుమతి చేసే దిశగా భారత్ కృషి చేసిందన్నారు.
భారత దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేయడానికి ప్రయత్నించిన పొరుగు దేశాలకు భారత సైన్యం సరైన సమాధానం చెప్పయని మోడీ స్పష్టం చేశారు.
గత ఆర్థిక సంవత్సరంలో దేశానికి రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని, ఎఫ్ డీ ఐ వృద్ది 18 శాతం గా ఉందని మోడీ చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కూడా గ్లోబల్ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయన్నారు..
మేక్ ఇన్ ఇండియా తో పాటు మేక్ ఫర్ ది వరల్డ్ అనే మంత్రంతో దేశం ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఆత్మ నిర్మల్ భారత్ అంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించడమే కాదు భారతదేశ సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యాలను బలోపేతం చేయడమే అని స్పష్టం చేశారు.
స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో విద్య కు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఆ దిశగా ముందుకు సాగే విధంగా జాతీయ విధానాన్ని రూపొందించినట్లు మోడీ తెలిపారు.
దేశంలో తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ లు వివిధ దశల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తల నుంచి అనుమతులు వచ్చిన తరువాత పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ ను భారతీయులందరికీ అతి తక్కువ సమయంలో తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గతేడాది లడక్ ను దేశ భూభాగంగా మార్చడం ద్వారా ప్రజల డిమాండ్ ను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ప్రస్తుతం అభివృద్ధి దిశగా లడక్ ముందుకు సాగుతోందన్నారు.
|
|
|