Home Telugu Articles దేశ విభజన విషాద గాథ

దేశ విభజన విషాద గాథ

0
SHARE

– – హెచ్. వి. శేషాద్రి

1703-1762 కాలంలో `షా వహియుల్లా దెహ్లవి’ భారతలో వహాబీ ఉద్యమం ప్రారంభించి, ప్రపంచంలో ముస్లిములు వేరే ప్రత్యేక సముదాయమని, భారత ముస్లిములు అందులో భాగమని మతబోధ మొదలు పెట్టాడు. అతని కొడుకు `షా అబ్దుల్ అజీజ్’(1746-1822) భారత్ ను `దార్-ఉల్-హర్బ్’ అని ప్రకటించాడు.అతను 80,000 వహాబీ సైన్యాన్ని సృష్టించి, సిక్ఖులపై దాడి చేసాడు; సిక్ఖుల చేతిలో ఓడిపోయి,బ్రిటిషువారిపై దాడికి దిగారు. బ్రిటిషువారు అప్పటినుంచి వ్యూహాత్మకంగా ముస్లిములను లోబరుచుకుని, తమవైపు తిప్పుకోసాగారు. బ్రిటిషువారి విశ్వాసపాత్రుడైన `సర్ సయెద్ అహ్మద్ ఖాన్’ 1875లో అలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయo ప్రారంభించాడు.  అతను హిందువులను నమ్మించడానికి 1884లో, హిందువులు, ముస్లిములు, క్రిస్టియన్లు అందరూ హిందూదేశంలో భాగమని ప్రకటించాడు.అతనే 1888సంవత్సరానికల్లా, హిందువులు ముస్లిములు కలిసి బ్రతకలేరని,ఒకరు ఇంకొకరిపై విజయo సాధించాలని అన్నాడు.

1904లో బెంగాల్ విభజన, పధకం ప్రకారం ప్రారంభమై, 1905లో విభజన జరిగింది. సర్ హెన్రీ కాటన్ “భారత ఐక్యతను చెడగొట్టడమే విభజన ప్రధాన ఉద్దేశం” అన్నాడు. నవాబ్ సలీముల్లాఖాన్ కి  రూ.1లక్ష లంచంగా ఇచ్చారు, కాని నవాబు తమ్ముడు ఖ్వాజా అతికుల్లా, ముస్లిము సముదాయం విభజనకి వ్యతిరేకమని ప్రకటించాడు.

బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా `వందేమాతరం’ ఉద్యమం విస్తరించింది. 16అక్టోబర్ 1905 తేదీన, 50000 మంది ప్రజలు గంగానది తీరాన రక్షాబంధనం కార్యక్రమంలో పాల్గొన్నారు. లాల్-బాల్-పాల్ త్రిమూర్తులుగా ఉద్యమాన్ని నిర్వహించారు, రవీంద్రనాథ్ టాగోర్, ఇతర నాయకులు ముందు నడిచారు. `వందేమాతరం’ మంత్రమై దేశాన్ని ఉత్తేజపరిచింది, ప్రజల్ని మేల్కొలిపింది.

కులం-మతం ప్రభావం ప్రజల్లో తగ్గుతోందని గమనించి, మింటో-మోర్లీలు 1906లో `ప్రత్యేక నియోజకవర్గం ప్రణాళిక’ సిద్ధం చేసారు.

ముస్లిం లీగ్ స్థాపన

30 డిసెంబర్1906 తేదిన, ఆగాఖాన్ శాశ్వత అధ్యక్షతన, నవాబ్ సలీముల్లాఖాన్ నాయకత్వాన, `ముస్లిం లీగ్’ ప్రారంభమైంది. ఆగాఖాన్ షియా ఇమామ్ లలో, 48వ తరం వాడు. ముస్లిం లీగ్ ముఖ్యోద్దేశాలు:

అ. బ్రిటిషువారి పట్ల అమితమైన విశ్వాసం

ఆ. ముస్లిముల రాజకీయ హక్కుల పరిరక్షణ

ఇ. పై రెండు ఉద్దేశాలకి లోబడి, ఇతర వర్గాలతో సఖ్యత.

అయితే పై ఉద్దేశాలకి సంబంధం లేకుండా, `లాల్ ఇష్తెహార్’ కరపత్రం సభ్యులకి పంచబడింది. దానిలో “ముస్లిములారా మేలుకోండి, హిందువులతో కలిసి ఒకే స్కూల్లో చదవకండి, హిందువుల దుకాణాల్లో ఏమీ కొనకండి, హిందువుల చేతులతో తయారైన ఏ వస్తువు ముట్టుకోకండి, హిందువులనిపనిలో పెట్టుకోకండి, హిందువుల కింద పనిచేయకండి. మీరు జ్ఞ్యానం పొందితే, హిందువులను నరకానికి (జెహన్నుం)పంపవచ్చు. మీ సంపద దోచుకుని హిందువులు ధనవంతులయారు. మీరు వివేకవంతులైతే, హిందువులు తిండిలేక మాడి, త్వరలో ముస్లిములు అవుతారు”

నేటి బంగ్లాదేశ్ లోని కొమిల్లా ఊర్లో, 4మార్చ్ తేదీన, మతఘర్షణలు, బలాత్కారాలు, దోపిడీ మొదలయ్యాయి. లాల్-బాల్-పాల్ నేతృత్వంలోని వందేమాతరం ఉద్యమ విజయంతో, బ్రిటీషు ప్రభుత్వం వెనకడుగు వేసి, బెంగాల్ విభజన రద్దు చేయక తప్పలేదు. ముస్లింలీగ్ దిగ్బ్రమ చెందింది. ఆగాఖాన్ రికార్డు ప్రకారం,మహమ్మద్ అలీ జిన్నా అనే లాయరు `ప్రత్యేక నియోజకవర్గం ప్రణాళిక’ను వ్యతిరేకించాడు.

ఈ దశలో భారత స్వాతంత్ర్యోద్యమo ప్రపంచవ్యాప్తమవుతోంది. శ్యాంజీ కృష్ణవర్మ, లాలా హర్దయాళ్, రాశ్ బేహారి బోస్, వీర్ సావర్కర్, మేడం కామా, ఢిoగ్రా మొదలైన భారతీయ ఉద్యమ నాయకులు, భారత స్వేచ్చాస్ఫూర్తిని ప్రపంచమంతా వినిపించారు. 1910లో ఖుదీరాంబోస్ అనే 18సం. కుర్రవాడు, బ్రిటిష్ అధికారి కింగ్స్ ఫోర్డ్ మీద బాంబు విసిరాడు. అతని తెగువకి దేశం నివ్వెరపోయింది.

ముస్లిం వేర్పాటువాద ఖండన:

స్నేహితులు, కవులు, విప్లవకారులు బిస్మిల్- అష్ఫాక్ లను ఒకే రోజు వేర్వేరు జైళ్లలో ఉరితీశారు.  తిలక్ `గణపతి ఉత్సవ మండళ్ళు, శివాజీ జయంతి ఉత్సవాలు” ఏర్పాటుకు కాజీ సైఫుద్దీన్ మద్దతు పలికాడు. `టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక శివాజీ ముస్లిం వ్యతిరేకి అని ప్రకటించింది. ముల్లా-మౌల్వీల తీరుకు వ్యతిరేకంగా మరికొంతమంది ముస్లిములు ముందుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ముస్లిం-సంతుష్టీకరణ వైఖరి:

1888లోనే హిందువులు లేక ముస్లిములు వ్యతిరేకించే ఏ విధానాన్నికూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టదని అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ ప్రకటించాడు. కాంగ్రెస్ 1899నుంచే ముస్లిములకి ఉచిత టికెట్లు ఇచ్చేవారని స్వామీ శ్రద్ధానంద చెప్పారు.

1916లో జరిగిన లక్నో-ఒప్పందం ప్రకారం “ప్రత్యేక నియోజకవర్గం ప్రణాళిక”ను తిలక్ వంటి రాజకీయ ఉద్ధండులు కూడా సమర్థించారు.  అప్పటి జాతీయ నాయకులలో మదన్ మోహన్ మాలవీయ ఒక్కరే వ్యతిరేకించారు.

1919 `ఖిలాఫత్ ఉద్యమం’ టర్కీలో `కెమాల్ పాషా’ను తిరిగి ఖలిఫాను చేయడానికి ఇక్కడ భారత్ లో ఖిలాఫత్ ఉద్యమం మొదలైంది. ముస్లిం దేశాలలో ఉదారవాద సంస్కరణలు జరగాలని చెప్పిన`జమాలుద్దీన్ ఆఫ్ఘాని’కి కేమాల్ అనుచరుడు. ఈ సంగతి తెలియక, కాంగ్రెస్ పార్టీ `ఖిలాఫత్ ఉద్యమం’ లో చేరాలని, ముస్లింలీగ్ పట్టుబట్టింది. గాంధీగారు ఖిలాఫత్ కి మద్దతునిస్తూ `సహాయ నిరాకరణోద్యమాన్ని’ ప్రారంభించారు. తిలక్ లాంటి నాయకుడు కూడా దీనికి సహకరించారు.స్వామీ శ్రద్ధానంద జామామస్జిద్ నుంచి ప్రసంగించారు. ఆగాఖాన్, ఆమిర్ అలీ, కెమాల్ పాషాను కలిసినప్పుడు ఆయన “ఇస్లాం పరాజితులైన వారి మతం” అని, టర్కీని ఇస్లామిక్ మతరాజ్యంగా కాక,  `లౌకిక’ దేశంగా ప్రకటించారు!

మొదట్లో ముల్లాలు, మౌల్వీలు పెద్ద సంఖ్యలో గాంధీగారికి మద్దతిచ్చారు. ఇంత పెద్దసంఖ్యలో ముల్లాలు రాజకీయాల్లో చేరడంపై కొంచెం బెదిరిన జిన్నా, గాంధీగారి ఈ చర్యని వ్యతిరేకించడం ఆసక్తికరం.

ఖిలాఫత్ అనంతర పరిణామాలు

కేరళ మోప్లా ప్రాంతంలో, ముస్లింలు హిందువుల మీద పెద్దఎత్తున దాడులు, విధ్వంసం చేసారు. `సర్వెంట్స్ అఫ్ ఇండియా’ సంస్థ గణాంకాల ప్రకారం,1500మందిని ఊచకోత కోశారు, 20000మందిని మతమార్పిడి చేసారు, 1లక్షమంది ఇళ్ళనుంచి తరిమేయబడ్డారు. గర్భవతులు, ఆవులను కూడా వదిలిపెట్టలేదు. మగవాళ్ళను హత్యచేసి, ఆడవారిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. గాంధీగారిని `కాఫిర్’ అని ప్రకటించారు.

ఈ కాలం గురించి స్వామీ శ్రద్ధానంద ఇలా వ్రాసారు “జాతీయవాద ముస్లిములు కూడా `మోప్లా’కు మద్దతిచ్చారు.  గాంధీగారు `ముస్లిములు మత-పరాయణులు, ఇస్లాం మీద వారి అవగాహన ప్రకారం వారు ప్రవర్తించారు’ అన్నారు. `అనిబిసెంట్’ గాంధీగారిని తప్పుబట్టారు. తరువాత కాంగ్రెస్ ఖిలాఫత్ కి దూరంగా జరిగింది. అయితే మార్క్సిస్టు చరిత్రకారులు మాత్రం `మోప్లా’ని `జాతీయవాద’ ఉద్యమంగా పేర్కొనగా, కేరళ ప్రభుత్వం 1971లో వారిని `స్వాతంత్ర్య యోధులు’గా గుర్తించింది”.

ఒకప్పటి `స్వరాజ్ పార్టీ’ వ్యక్తి `సుహ్రావర్ది’ 1925లో ఇలా వ్రాసాడు – `ప్రతి సంవత్సరం ఇస్లాం వేలాదిమంది హిందువులని నామరూపాలు లేకుండా చేస్తుంది. హజ్ యాత్రకి మక్కా వెళ్ళినవారు స్వచ్చంగా తిరిగివచ్చి, అరేబియన్లలాగా జీవిస్తారు. వారికి మిగతా హిందువులకి చాలా వ్యత్యాసం అప్పుడు కనిపిస్తుంది’.

పునరాగమనం –`ఘర్ వాపసి’:

ఇస్లామిక్ మతమార్పిడులు అరికట్టలేకపోతే, హిందువుల మనుగడ ఉండదని స్వామీ శ్రద్ధానంద గ్రహించారు. 18000 ముస్లిములను 1923లో ఆయన హిందూమతంలోకి తిరిగి రప్పించారు. `తబ్లిగ్’ ఆచరించే ముస్లిములను కాంగ్రెస్ ప్రోత్సహిస్తూ, అదే సమయంలో`శుద్ధి ఉద్యమం’లోని హిందువులను నిషిద్ధంగా పరిగణించేదని ఆయన అర్ధం చేసుకున్నారు. అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి 1926లో స్వామీజీని హత్య చేసాడు. ఒకరిపై విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళే నేరస్థులని చెప్తూ, గాంధీగారు రషీద్ కి మద్దతు ప్రకటించి, `సోదరుడు’ అని సంబోధించి, కాంగ్రెస్ నాయకుడు లాయరు `అసఫ్ అలీ’కి ఈ కేసును వాదించమని అప్పచెప్పారు. భగత్ సింగ్ జీవితం కాపాడమనే అభ్యర్ధనకి గాంధీగారు సంతకం పెట్టడానికి నిరాకరించారని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, గురుగోవింద్ సింగ్ మొదలైన వారిని `దారితప్పిన దేశభక్తులు’ అన్న గాంధీగారు, రషీద్ ని `సోదరుడు’ అని పేర్కొన్నారు.

1924లో ప్రతి హిందూ పండుగ మీద దాడి జరిగింది; `యంగ్ ఇండియా’ పత్రికలో వ్రాస్తూ గాంధీగారు ఇలా అన్నారు – “నా అనుభవంలో, సాధారణంగా ముస్లింలు ‘రౌడీల’ లాగా ప్రవర్తిస్తారు, సాధారణ హిందువులు `పిరికివారు’. హిందువులు తమ పిరికితనానికి ముస్లిములను అనడం ఏమి న్యాయం? పిరికివాళ్ళున్న చోట రౌడీలు పుట్టుకొస్తారు.”

కోహాట్ లో హిందువుల ఊచకోత

NWFP ప్రాంతం- 5%మాత్రమే హిందూ జనాభా ఉన్న ‘కోహాట్’ అనే చిన్న ఊరులో 150మంది హిందువులను ఊచకోత కోశారు. మిగిలిన వారు కట్టుబట్టలతో 320కి.మీ దూరంలో ఉన్న రావల్పిండి పారిపోయారు. హిందూ-ముస్లిముల సఖ్యత సాధించలేక, గాంధీగారు 21 రోజులు నిరాహారదీక్ష చేసారు. మహదేవ్ దేశాయిగారు దీక్ష ఎందుకు అని అడగగా “హిందువులు నన్ను అపార్థం చేసుకోవచ్చు,  ముస్లిం గూండాలవల్ల హిందూ స్త్రీలు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. హిందువులని సహనంతో ఉండమని నేనెలా అనగలను? నా మాట ఎవరు వింటారు? అయినా నేను ఇప్పుడు కూడా మరణానికి సిద్ధపడండి కాని, ఎవరినీ చంపవద్దనే హిందువులకి చెపుతాను” అన్నారు.

1924 ఏప్రిల్ 18 న రవీంద్రనాథ్ టాగోర్, `టైమ్స్ ఆఫ్ ఇండియా’లో వ్రాసారు “ముస్లిములు వారి దేశభక్తిని ఒక దేశానికి పరిమితం చేసుకోలేరు.”

1924లో లాలా లాజపత్ రాయ్, సిఆర్ దాస్ కి లేఖ వ్రాస్తూ అన్నారు, “7కోట్ల భారతీయ ముస్లిములంటే కాదు భయం, కానీ 7కోట్లు+సాయుధులైన ఆఫ్ఘానిస్తాన్, మధ్య ఆసియా, అరేబియా, మెసొపొటేమియా, టర్కీ అన్నీ కలిపితే వారిని ఎదుర్కోలేము. హిందూ-ముస్లిం ఐక్యత మన కోరిక, ఆవశ్యకత. ముస్లిం నాయకులను నమ్మాలనే  ఉంది, కానీ ఖొరాన్, హాదిస్ ల ఆదేశాలను ఈ నాయకులు పాటిస్తారు.మీ మేధస్సు, వివేకం దీనికి పరిష్కారం చూపిస్తుందని ఆశిస్తున్నాను.”

పెరుగుతున్న కోరికలు/డిమాండ్లు: 4 నుంచి 14 అంశాలు; విభజన ప్రణాళిక

అ. ముంబై నుంచి సింద్ ని వేరు చేయడం

ఆ. NWFP, బలూచిస్తాన్ లను పూర్తి స్థాయి గవర్నర్ల-ప్రావిన్సులను చేయడం

ఇ.  పంజాబ్, బెంగాల్లలో అనుపాత (జనాభాకి అనుగుణంగా) ప్రాతినిధ్యం

ఈ. కేంద్ర శాసనసభలో 1/3 ముస్లిములు

ఉ.  + 14 ఇతర అంశాలు

1930లో కాంగ్రెస్ `పూర్ణ స్వరాజ్యం’ తీర్మానం చేసింది. అదే సంవత్సరం, ముస్లింలీగ్ అధ్యక్షుడిగా `ఇక్బాల్’ దేశవిభజన గురించి ఒత్తిడి తెచ్చాడు.

“ప్రత్యేక నియోజకవర్గం” అవార్డు- 1932-బ్రిటిష్ ప్రధాని `రామ్సే మెక్ డొనాల్డ్ ’

సిక్ఖులు, ముస్లిములు, క్రిస్టియన్లు, యూరోపియన్లు, అంగ్లోలు, అణగారిన వర్గాలకు, ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించారు. అయితే హిందువులు `అల్పసంఖ్యాకులు’గా ఉన్న ప్రదేశాల్లో హిందువులకి మాత్రం మైనారిటీ హక్కులు లేవు. దీనిని డా. అంబేద్కర్ సమర్ధించగా, హిందూ సమాజాన్ని రక్షించడానికి గాంధీగారు వ్యతిరేకించారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధికారికంగా ఏ వ్యాఖ్యానమూ చేయలేదు. కాంగ్రెస్ వైఖరికి కోపగించి, పండిత్ మాలవీయ, భాయి పరమానంద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. అయితే 1937లో అన్ని ప్రాదేశిక (Provincial) ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, లీగ్ ఓడిపోయింది.1934లో భారత్ కి తిరిగివచ్చిన జిన్నాపై ఈ ఎన్నికలు ఎంతో ప్రభావం చూపాయి, లీగ్ పూర్తిగా వేర్పాటువాదం మొదలుపెట్టింది.

`హిందూమహాసభ’ స్థాపించిన వీర్ సావర్కర్ 1937లో “భారత్ లో హిందూ-ముస్లిములు ఒకే దేశoలో పక్కపక్కనే నివసిస్తున్న భిన్న జాతులు. ఇవి రెండూ ఒకటే అనుకోవడానికి లేదు” అన్నారు.  ఇతర జాతీయవాద నాయకులు తెల్లబోయారు. హిందూ భారత్- ముస్లిం భారత్ అని రెండు ఉండడానికి వీల్లేదు. భారత్ ఒకటే, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్  అని వేరువేరుగా ఉండవు అని సావర్కర్ గట్టిగా నమ్మారు.

జాతీయ చిహ్నాలకు ముప్పు

1923 కాకినాడ కాంగ్రెస్ సమావేశంలోనే, `వందేమాతరo’ గేయాలాపనకి అధ్యక్షుడు మౌలానా మొహమ్మద్ అలీ అభ్యంతరం చెప్పినా, విష్ణు దిగంబర్ పాలుస్కర్ పాట ఆపలేదు. 1922లోనే `సారే జహాన్ సె అచ్చా’ గీతాన్ని కాంగ్రెస్ ప్రత్యామ్నాయ గీతంగా ఆమోదించింది.  1937కల్లా వందేమాతరం గేయం కుదించబడింది.

1931జాతీయపతాక కమిటీ – పటేల్, మౌలానా ఆజాద్, నెహ్రు, తారాసింగ్, కలేల్కర్, డా.హర్దికర్, డా.పట్టాభి సీతారామయ్యల `పతాక’ కమిటీ, మధ్యలో నీలంరంగు చక్రంతో కాషాయ జెండాను ఆమోదించింది. అయినా తరువాత త్రివర్ణ పతాకాన్ని ఎంచుకున్నారు.

1934లో భూషణ్ గారి `శివభవాని’ నిషేధించబడింది, ప్రసిద్ధ `రఘుపతి రాఘవ రాజారాం’ భజనలో `ఈశ్వర్ అల్లా తేరే నాం’ అని మార్చి పాడటం మొదలుపెట్టారు.

గోవధ నిరాటంకంగా కొనసాగింది. 1938లో జిన్నాకు లేఖ వ్రాస్తూ, ముస్లిముల హక్కులకు కాంగ్రెస్ ఏ విధమైన భంగం కలిగించదని నెహ్రూ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ రాజీనామా- లీగ్ ప్రవేశం

22డిసెంబర్ 1939- దేశనాయకులను మాటమాత్రం సంప్రదించకుండా, భారతదేశాన్ని రెండవ ప్రపంచయుద్ధంలో పాల్గొనేలా చేయడంపై నిరసనతో ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ రాజీనామా చేసింది. ముస్లింలీగ్ వెంటనే ఆ పదవులన్నిటినీ తమ మనుషులతో నింపేసింది. పెద్దసంఖ్యలోముస్లిములను అక్కడికి తరలించి, అస్సాం రాష్ట్రంలో ముస్లింలను అధికసంఖ్యాకులుగా చేసి, రాష్ట్ర జనాభా నిష్పత్తినే మార్చేసింది.

భారతదేశ విభజన చేసి, పాకిస్తాన్ ఏర్పరచాలని అప్పుడే ముస్లింలీగ్ వినతిపత్రం సమర్పించింది. ఈశాన్యం, తూర్పులో, ముస్లిము `రాష్ట్రాలు’ ఏర్పరచాలని కోరి, టైపింగ్ పొరపాటు దొర్లిందని చెప్పి, తరువాత పదాన్ని `రాష్ట్రం’ అని మార్పు చేసారు.

వీర్ సావర్కర్ పిలుపు- “సుశిక్షితులైన సైనికులుగా హిందువులు మారాలి. ప్రపంచమంతా కాగితపు తీర్మానాలు పరిచినా, స్వాతంత్ర్యం నీ దగ్గరకు నడిచిరాదు. భుజాల మీద తుపాకీలతో తీర్మానాలు చేస్తే, నువ్వు సాధిస్తావు.”

1942, క్రిప్స్ మిషన్ – హైదరాబాద్ `ముస్లిం రాజ్యం’లో కలుస్తుందని క్రిప్స్ హామీ ఇచ్చాడు. కాంగ్రెస్ `క్విట్ ఇండియా(భారత్ విడిచిపెట్టు) ఉద్యమానికి పిలుపు నిచ్చింది. జాతీయ విప్లవశక్తులు సరైన పద్ధతిలో నిర్వహించలేక ఉద్యమo నీరుగారిపోయింది. (JP)

బ్రిటిష్ – ముస్లింలీగ్- కమ్యూనిస్టుల బంధం:

మొదట్లో హిట్లర్-స్టాలిన్ ప్రపంచయుద్ధంలో కలిసినప్పుడు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ బ్రిటిషు-వ్యతిరేకతను సమర్థించారు, తరువాత 1941లో జర్మనీ రష్యామీద దాడి చేసినప్పుడు, రష్యా-బ్రిటన్ యుద్ధంలో ఒకే పక్షం అయిన తరువాత, భారత్ లో కమ్యూనిస్టులు-ముస్లింలీగ్ దగ్గరయ్యారు.

1944 – 19 రోజుల గాంధీ-జిన్నా చర్చలు

జిన్నాతో చర్చలు చేయవద్దని శ్యామప్రసాద్ ముఖర్జీ గాంధీగారిని కోరారు. ద్విజాతీయ (రెండు దేశాల) సిద్ధాంతాన్ని గాంధి వ్యతిరేకించారు. “మతం మారిన వర్గం, వారి తర్వాతి తరాల వారు, వారి పూర్వీకులను కాదని తాము వేరే జాతి అని చెప్పుకోవడం చరిత్రలో ఎక్కడా లేదు” అన్నారు. జిన్నాని `కైద్-ఎ-ఆజం’ అని గాంధి సంబోధిస్తే, జిన్నా `మిస్టర్ గాంధి’ అనేవాడు. జిన్నాతో చర్చలు జరిపి గాంధీగారు జిన్నాకి ఒక స్థాయిని కల్పించారు.

1945-46 ఎన్నికలు

లీగ్ పాకిస్తాన్ కోసం కోరిన 5 ప్రదేశాల్లో/రాష్ట్రాల్లో(provinces)- బలూచిస్తాన్, పంజాబ్, NWFP, సింద్, బెంగాల్ లలో – కేవలం సింద్ మరియు బెంగాల్ లు రెండు మాత్రమే లీగ్ గెలిచింది.

బలహీనపడుతున్నామనే అనుమానం రావడంతో ముస్లింలీగ్ 16ఆగస్ట్ 1946 తేదిన `ప్రత్యక్షచర్య’కు పిలుపునిచ్చింది.

                                                                                            …ఇంకా ఉంది.

(భారత విభజనకి దారితీసిన ఘటనల సంక్షిప్త చరిత్ర ఇది.  హెచ్. వి. శేషాద్రిగారి ఇంగ్లీషు గ్రంథం `Tragic Story of Partition’ ఆధారం. )