Home News మైనారిటీ గుర్తింపు కోసం ఆరాటం

మైనారిటీ గుర్తింపు కోసం ఆరాటం

0
SHARE

లింగాయత్ లను ప్రత్యేక మత సమూహంగా గుర్తి౦చడం ద్వారా  కర్ణాటక ప్రభుత్వం మన వ్యవస్థలోని అతి పెద్ద లోపాన్ని మళ్ళీ ఎత్తి చూపినట్లయి౦ది. రాజకీయనాయకులు, అధికారగణపు కబంధహస్తాల నుండి తమ ధార్మిక సంస్థలను, స్థలాలను కాపాడుకోవటానికి హిందువులలో కొన్ని వర్గాలవారు తమను మైనారిటీ వర్గంగా గుర్తించాలని కోరుతున్నారు.  లింగాయత్ లను ప్రత్యేక మతవర్గంగా గుర్తించడం ద్వారా ప్రజల్లో తమ ప్రభుత్వంపట్ల ఉన్న అసంతృప్తిని తగ్గించుకోవడమేకాక  20 శాతం లింగాయత్ ఓట్లను చేజిక్కించుకుని  అధికారాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం తీసుకునేందుకు మే 15న శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు వేచిచూడాల్సిందే. ఎందుకంటే అప్పటివరకూ ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయి. ఇలాంటి విభజన చర్యలు కాంగ్రెస్ కి కొత్తేమీకాదు. హిందువులను కుల ప్రతిపదికన విడగొట్టడం, ముస్లిములను మతం ఆధారంగా ఏకం చేయడమనే వ్యూహాన్ని ఆ పార్టీ 1970 నుంచే కమ్యూనిస్టులతో కలిసి అమలు చేస్తోంది. అయితే  హిందూ సమాజంలోని కొన్ని వర్గాలు తాము హిందువులుగా కాకుండా అల్పసంఖ్యాకులుగా గుర్తింపడాలని ఎందుకు ఆరాటపడుతున్నారన్నది ప్రశ్న. మరోవైపు పాకిస్తాన్ లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. 1974 లో  అహ్మదియాలను ముస్లిమేతరులుగా ప్రకటిస్తూ  ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించింది. కానీ అప్పటి నుంచి తమను తిరిగి ముస్లిములుగానే గుర్తించాలంటూ అహ్మదియాలు ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ లో ముస్లిముల జీవితం మాత్రమే కాస్త సజావుగా సాగుతుంది. ముస్లిమేతరులు అక్కడ రెండవ శ్రేణి పౌరులుగానే కాలం వెళ్ళబుచ్చాల్సిందే.

 ‘నేను హిందువునని గర్విస్తున్నా’నని వివేకానందుడు 1893 లో చికాగొ ప్రపంచ సర్వమత సమ్మేళనంలో గర్జించాడు. కానీ శ్రీ రామకృష్ణ పరమహంస బోధలను ప్రచారం చేయడం కోసం ఆయన స్థాపించిన రామకృష్ణ మఠం 1980 లో తాము హిందువులమేకాదని, తమది రామకృష్ణ ఇజం అని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రామకృష్ణ మఠం అలాంటి అర్ధంలేని వాదన చేయడానికి కారణం ఏమిటి ?  హిందూసంస్థ అనే గుర్తింపు తమకు భారంగా పరిణమిస్తోందని భావించడమే. భారతదేశంలో మైనారిటీలకు లభించే ప్రత్యేక సదుపాయాలు పొందడం కోసం,  ముఖ్యంగా తమ విద్యా సంస్థలపై  ప్రభుత్వ పెత్తనం లేకుండా చేసుకునేందుకు మఠం అలా వ్యవహరించింది. కానీ మైనారిటీ గుర్తింపు పొందాలనుకున్న మఠం ప్రయత్నాలపై సుప్రీం కోర్ట్ నీళ్లుజల్లింది. 2 జూలై 1995న వెలువరించిన తీర్పులో వివేకానందుడుకానీ, రామకృష్ణపరమహంసగానీ ఎలాంటి ప్రత్యేక, హైందవేతర మతాన్ని ప్రారంభించలేదని స్పష్టంచేసింది.

మొట్టమొదటగా హిందూ ధర్మంలోంచి బైటికి వెళ్లింది బహుశా  సిక్ఖులు కావచ్చును. 19వ శతాబ్దం చివరి దశకంలో వాళ్ళు అలా వేరుపడ్డారు. వాళ్ళు హిందూత్వాన్ని వీడడం వెనుక ఈ సమాజాన్ని బలహీన పరచాలనుకున్న బ్రిటిష్ వాళ్ళ వ్యూహం ఉంది . బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపోయిన తరువాత ఆ విభజనవాదాన్ని సెక్యులరిస్టులు అంది పుచ్చుకున్నారు.ఈ పెడధోరణులు ఎంతవరకు వెళ్ళాయంటే హిందువులు తమ గుళ్లలో సమర్పించే కానుకలను ప్రభుత్వాలు నిస్సిగ్గుగా హస్తగతం చేసుకుంటున్నాయి. ఆ సొమ్ములో కొంత భాగాన్ని రాష్ట్ర ఖర్చులకు ఉపయోగిస్తే, మరికొంత హిందువులను మతం మార్చి వారి అస్తిత్వానికే ఎసరు పెట్టాలని చూస్తున్న మత వర్గాలకు, మసీదులు, చర్చిల కోసం ఖర్చు పెడుతున్నాయి.  ఈ దేశంలో  హైందవేతరులు తమ విద్యా సంస్థలను , ధార్మిక సంస్థలను, పవిత్ర స్థలాలను  తమకనుగుణంగా నిర్వహించుకుంటున్నప్పుడు అలా చేయడానికి హిందువులను ఎందుకు అనుమతించరు?

రాజ్యాంగ నిర్మాతలు అల్పసంఖ్యాకుల వ్యవహారాల్లో అధిక సంఖ్యాకుల జోక్యాన్ని నివారించేందుకు రాజ్యాంగంలో కొన్ని  అధికరణలను ప్రవేశపెట్టారు. కానీ మైనారిటీల పట్ల వివక్షను నివారించడానికి ఉద్దేశించిన ఆ అధికారణలే చివరికి అధికసంఖ్యాకులపట్ల ప్రభుత్వాలు వివక్ష చూపడానికి కారణమవుతున్నాయి. సరిగ్గా ఈ వివక్ష నుండి బయటపడటం కోసమే  లింగాయత్ లు అల్పసంఖ్యాకులుగా గుర్తింపును కోరుకుంటున్నారు.  హైందవేతరులుగా గుర్తింపు పొందడం  ద్వారా తమ మఠాలను, సంస్థలను ప్రభుత్వాధీనం నుండి తప్పించాలనుకుంటున్నారు. అయితే లింగాయత్ వర్గం లోని నాయకులు , వ్యక్తులు తమకు హైందవేతరులనే గుర్తింపునివ్వాలని అడుగుతున్నారే తప్ప , ఇది తమ ధార్మిక, సామాజిక సంస్థలను రక్షించుకోవడం కోసమేనని చెప్పడం లేదు. తమను హిందువుల కంటే `ప్రత్యేకంగా’ నిలబెట్టే ఆచారాలు, పద్దతులను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. లింగాయత్ మేధావిగా పేరుపొందిన  ఎస్ .ఏం.జాందార్ ఒక ఇంటర్వ్యూ లో “మమ్మల్ని హిందువులనకండి. అలాగని  మేము హిందూ వ్యతిరేకులమూ కాదు.  మేము ప్రత్యేకం, అంతే“ అని అన్నారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే ఒక ప్రధానమైన ప్రశ్న ఎదురవుతోంది. అసలు హిందువంటే ఎవరు? కులాన్ని ఆచరించేవాడా? లేక వ్యతిరేకించేవాడా ? వేదాన్ని బట్టి నడిచేవాడా ? ఇతిహాసాలను విశ్వసించేవాడా? విగ్రహారాధన చేసి దేవాలయాలకు వెళ్ళేవాడా? జంధ్య౦  వేసుకునేవాడా? లేదా వీటన్నిటిలో ఏ ఒక్కటైనా? ఏదీ కాదా?

హిందూత్వంలో కొన్ని వందల శాఖలున్నాయి. అన్నింటికీ తమ తమ ఆచారాలు,  పద్ధతులు ఉన్నాయి . కానీ ఈ  127 శాఖలవారూ మూడేళ్లకు ఒకసారి కలిసి కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే ముస్లిములలో కూడా చాలా శాఖలు (షియాలు , సన్నిలు,బరేల్వి, దేవబంది లు) ఉన్నాయి. క్రిస్టియన్లలో కూడా శాఖలున్నాయి . లింగాయత్ లకు  ఇచ్చినట్టే వీరందరికీ ప్రత్యేక గుర్తింపు ఇస్తూ పోతే దానికి అంతెక్కడ? ప్రజలను విడగొట్టి కొత్త మతాలను  సృష్టించడమేనా  ఒక లౌకిక ప్రభుత్వం చెయ్యవలసింది? అలా చెయ్యడానికేనా ప్రభుత్వం ఉన్నది?  చివరికి తేలాల్సింది ఒకటే ప్రశ్న- ‘అల్పసంఖ్యాకులకు ఉన్న హక్కులు అధిక సంఖ్యాకులకు కూడా ఎందుకు ఉండకూడదు?’.

– బల్బీర్ పుంజ్

(న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సౌజన్యంతో)