చెదురు మదురు ఘటనలు మినహా కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఈవీఎం సమస్యలు, ఆందోళనలు చోటు చేసుకున్నప్పటికీ ఎన్నికల అధికారులు, భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దారు. సాయంత్రం 6గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
సాయంత్రం 5గంటల వరకూ 64.5 శాతం పోలింగ్ నమోదైంది. 6గంటల వరకు దాదాపు 70శాతానికి పైగా పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కర్ణాటక, దక్షిణ కన్నడ జిల్లాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది.
ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం కురిసినప్పటికీ శనివారం మళ్లీ వాతావరణం మామూలుగా మారిపోయింది. ఇవాళ సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా హుబ్లీ పోలింగ్ కేంద్రంలో కాసేపు పోలింగ్‌కు అంతరాయమేర్పడింది. వర్షం వల్ల ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చేందకు విముఖత చూపారు. ఇవాళ పోలింగ్ జరిగిన 222 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు మే 15న జరగనుంది.
(ఈనాడు సౌజన్యం తో)