Home News అవును.. మన పూర్వీకుల శౌర్యగాథలతో భారతీయ చరిత్రను తిరగరాయాల్సిందే!

అవును.. మన పూర్వీకుల శౌర్యగాథలతో భారతీయ చరిత్రను తిరగరాయాల్సిందే!

0
SHARE

దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూపై ఎ.గోపన్న రాసిన పుస్తకాన్ని విడుదల చేసే కార్యక్రమంలో మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ పాల్గొన్నారు. ఢిల్లీలో ఈమధ్యనే జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్, మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్సారీ మాట్లాడుతూ- ‘కొనే్నళ్ళ క్రితం హెచ్.జి. వేల్స్ రాసిన ‘ది టైమ్ మెషీన్’ పుస్తకాన్ని ఉదహరిస్తూనే, గతాన్ని తెలుసుకునే వీలు ఈ పుస్తకం వల్ల కలిగేదని, ఆ పుస్తకం విజయవంతమైందని అన్నారు. ‘ఈ రోజు కొందరు చరిత్రను రాయడం కాదు, కనుగొంటున్నారని, గతంలోకి వెళ్లి చరిత్రను తిరగరాయాలనుకుంటున్నారని, ప్రపంచంలో అటువంటి ప్రయత్నం సఫలం కాలేద’ని కూడా ఆయన అన్నారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని, స్ఫూర్తి పొందవచ్చని, కాని దానిని మార్చలేమని, అటువంటి ప్రయత్నాలు ప్రపంచంలో ఎక్కడా సఫలం కాలేదని సెలవిచ్చారు. అన్సారీ మాటల నుంచి మనం అర్థం చేసుకోగలిగిందేమంటే- ‘భారతీయులది పరాజయ చరిత్ర’ అని తలమాసిన కొందరు చరిత్రకారులు రాస్తే, చీము, నెత్తురు లేకుండా దానికి గంగిరెద్దులా తలాడించాల్సిందే కాని వాస్తవాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయకూడదు అని.. అదే పరాజయ చరిత్రను నేటి తరం చదివి గతం దివాలాకోరు కాలఖండం అని సరిపెట్టుకోవాలని..’ పౌరుషం నశించి భావదాస్యంతో బతుకు బండి లాగించాలని భావించే కొందరు విదేశీ భావజాల మానసపుత్రులు ఉండే ఉండవచ్చు. కాని దేశానికి ఉప రాష్టప్రతిగా 10 ఏళ్ళు సేవలందించిన ఓ నాయకుడు చేయాల్సిన వ్యాఖ్యలు కావివి.

నిజానికి మనది విజయాలతో కూడిన చరిత్ర. మన పూర్వీకుల శౌర్యగాథలు వింటే జాతీయ స్వాభిమానం నిర్మాణమవుతుంది. క్రీ.పూ. 326 నుంచి మన దేశంపై విదేశీ దాడులు ప్రారంభమయ్యాయి. ప్రపంచ విజేత అని చెప్పుకున్న అలెగ్జాండర్ మన దేశంపై దండయాత్ర చేసిన మొదటి అంకంలోనే పురుషోత్తముని చేతిలో ఓటమి పాలయ్యాడు. అంతకుముందు ఆయన అప్ఘనిస్తాన్ వద్దకు చేరగానే అష్టక్ అనే చిన్న రాజు ఆయన్ను నెల రోజులపాటు నిలువరించాడు. పురుషోత్తముడితో భీకర యుద్ధం తర్వాత సంధి చేసుకున్నాడు. కచ్ అనే చిన్న రాజ్యంతో యుద్ధం జరిగింది. అలెగ్జాండర్ సైన్యం అలసిపోయింది. వేలాదిమంది సైనికులు మృతి చెందారు. భారత్‌లో అడుగుపెట్టకుండానే బాబిలోనియాలోనే మరణించాడాయన. అనేకమంది వ్యక్తిత్వ వికాస నిపుణులు అలెగ్జాండర్ పరాజయం పాలైన విధానాన్ని తమ ప్రసంగాల్లో వివరిస్తుంటారు.

భారతీయ ప్రజానీకాన్ని ‘అధిక సంఖ్యాకులు, అల్ప సంఖ్యాకులు’గా చీల్చాలని, అధిక సంఖ్యకులైన హిందువులలో తాము ఆది నుండీ ఈ దేశ వాసులమేనన్న స్వాభిమానాన్ని చంపేయాలని ఆంగ్లేయులు భావించారు. 1866 ఏప్రిల్ 6న లండన్ రాయల్ ఏసియాటిక్ సొసైటీ వారు జరిపిన చారిత్రక సమావేశంలో పాశ్చాత్య చరిత్రకారులంతా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఆర్య ద్రవిడ సిద్ధాంతం ప్రతిపాదించారు. ఆర్యులు ఇక్కడివారు కాదని మధ్య ఆసియా నుంచి వచ్చారన్నారు. వేదాలను జానపద గేయాలన్నారు. మాక్స్ ముల్లర్, జవహర్‌లాల్ నెహ్రూ, తిలక్ వంటి మేధావులు కూడా ఇదే భ్రమలో పడిపోయారు. మాక్స్ ముల్లర్ వైదిక వాజ్మయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాక ఈ వాదన తప్పని తేల్చాడు. ‘ఆర్య’ శబ్దం వైదిక వాజ్మయంలో అనేకచోట్ల ఉపయోగింపబడింది. రుగ్వేదంలో 36 సార్లు, అధర్వణ వేదంలో 25 సార్లు ఈ శబ్దం ప్రయోగింపబడింది. కాని ఇది జాతి వాచకం కాదు. శ్రేష్ఠత్వాన్ని, గౌరవ భావాన్ని వ్యక్తం చేసేదిగా మాత్రమే ఉపయోగించబడింది. కాని ఆంగ్లేయులు తమ దుష్ప్రచారం కొనసాగించారు. చివరికి ఈ వాదాన్ని మన చరిత్రలో చొప్పించారు. అలాగే ‘ద్రవిడ’ శబ్దాన్ని భారతీయ వాజ్మయంలో ఎక్కడా జాతి వాచకంగా ఉపయోగించలేదు. ఆంగ్లేయుల ‘విభజించు- పాలించు’ నీతిని మనం ఇంకా సమర్థించాలా? మనదైన చరిత్రను తెలుసుకోనక్కరలేదా? డాక్టర్ రఘువీర వంటి చరిత్రకారులు అనేక వాస్తవాలు వెలుగులోకి తెచ్చారు. భారతదేశం ఒక జాతిగా వికసించి స్థిరపడిన తరువాతనే చైనా, బాబిలోనియా, సుమేరియా, ఈజిప్టు వగైరా జాతులు రూపొందాయి. మన ఋషులు, మునులు ప్రపంచ పూర్వార్థ, పశ్చిమార్థాలలో సాంస్కృతిక విస్తరణ చేశారు. మన వారి శక్తిమంతమైన రాజకీయ సామ్రాజ్యం ఆగ్నేయాసియా దేశాల్లో 1400 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. అందులో ఒక శైలేంద్ర సామ్రాజ్యమే 700 ఏళ్లపాటు చైనీయుల విస్తరణ కాంక్షకు గండికొట్టింది. ఈ కాలంలో మనవారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరగలేదు కదా, వాళ్ళిప్పటికీ మన పట్ల కృతజ్ఞులుగానే ఉన్నారు. మన పూర్వీకులను, మేధావులను, పరిపాలకులను, వ్యాపారులను, శాస్తవ్రేత్తలను, కళాకారులను, స్థపతులను, తత్త్వవేత్తలను విశ్వమానవ సౌభ్రాత్ర సందేశంతో సుదూర తీరాలకు పయనింపజేసిన సజీవ భావన ‘కృణ్యంతో విశ్వమార్యమ్’- విశ్వాన్ని సుసంస్కార సంపన్నం చేద్దాం.

ప్రపంచంలో అత్యంత ప్రాచీన గ్రంథం వేదం. విశ్వమానవ వికాసమే ధ్యేయంగా ఏర్పడిన సంస్కృతికి వేదాలు నిలయాలు. ‘వసుధైక కుటుంబం’ అన్న భావన మనది. అందుకే మనం ఎవరిమీద దాడులు చేయలేదు. కాని గత 2,000 ఏళ్లలో మన దేశంపై అనేకమంది విదేశీయులు దాడి చేశారు. మన రాజులు పారిపోలేదు. సతత సంఘర్షణ చరిత్ర మనది. ఎప్పటికప్పుడు వీరోచితంగా ఎదుర్కొన్నారు. సెల్యూకస్‌ను చంద్రగుప్తుడు చాణక్యుని నేతృత్వంలో తరిమికొట్టాడు. డెమిట్రియస్‌ను 185 బిసిలో ఖారవేలుడు, పుష్యమిత్రుడు ఎదుర్కొన్నారు. శకులు, హూణులను విక్రమాదిత్యుడు తరిమికొట్టాడు. దాహిర్ రాజుపై మహమద్ బిన్ కాశిం దాడి చేసినపుడు కుటుంబమంతా ఖాసింను నిలువరించింది.

క్రీ.శ.1001లో గజనీని భోజుడు ఎదుర్కొన్న తరువాత 150 ఏళ్లపాటు ఎవరూ భారత్‌వైపు కనె్నత్తి చూడలేదు. 17వ శతాబ్దంలో శివాజీ పోరాట పటిమవల్ల 200 ఏళ్ళపాటు ఎవరూ భారత్ వైపు చూడలేదు. అస్సాంను బ్రిటీషు వాళ్ళు ఏనాడూ వశపరచుకోలేకపోయారు. ఇటువంటి వీరుల చరిత్ర నేటి పిల్లలకు తెలియాల్సిన అవసరం వుంది. గతం నాస్తి కాదు. అది అనుభవాల ఆస్తి. కొందరి స్వార్థం వల్ల మన సంఘర్షణాయుత చరిత్రలో తప్పులు దొర్లాయి. అందువల్ల నష్టపోయాం. పృథ్వీరాజ్ చౌహాన్‌కు వ్యతిరేకంగా ఘోరీకి- జయచంద్రుడు, శివాజీకి వ్యతిరేకంగా ఔరంగజేబుకు- రాజా జయసింగ్ సహకరించడం వంటి తప్పిదాల వల్ల చరిత్ర నుండి పాఠాలు నేర్వాల్సి వుంది. కాని దీనే్న మన (పరాజయ) చరిత్రగా చూపిస్తే జాతి నిర్మాణం కష్టసాధ్యమవుతుంది. లాండ్ స్టార్మ్ అనే చరిత్రకారుడు 3000 ఏళ్ల ప్రపంచ చరిత్రలో యాత్రికుల గురించి వ్రాశాడు. అందరి గమ్యమూ భారతదేశంగా ఉండేదని వ్రాశాడు. ఒకాకూర్ అన్న పేరుగల జపాన్ మేధావి ‘భారతదేశం మనకు సాంస్కృతికంగా తల్లివంటిది’ అన్నాడు. ఆర్నాల్డ్ టాయిన్‌బీ అనే బ్రిటీషు చరిత్రకారుడు భారత్ తమ జాతికి తల్లివంటిది అని, సంస్కృతం యూరపు భాషలకు తల్లి అన్నాడు. అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ మానవజాతికి భారత్ ఉయ్యాల అనీ, మానవ భాషకు పుట్టిల్లు అనీ అన్నాడు. అందుకే భారత్‌ను ‘జగన్మాత’ అన్నాడు అరవింద మహర్షి. భారతదేశపు ఉజ్వల చరిత్రను, విలువలను, సాంస్కృతిక పునాదులను ధ్వంసం చేయాలని జరిగిన ప్రయత్నాలన్నీ వమ్మయినాయి. ప్రపంచంలో 28 జాతులు నశించాయి. కాని వేల సంవత్సరాల భారతీయ సాంస్కృతిక ప్రవాహం అప్రతిహతంగా సాగిపోతున్నది. కారణం ఇక్కడి ప్రజల స్వభావం, నీతి, నిజాయితీ, ధర్మగుణం, వీరవ్రతం, సత్యనిష్ఠ వంటివి. చరిత్రలో ఇందుకు ఎన్నో సాక్ష్యాలున్నాయి. ఈ విలువలు మరుగునపడకుండా వాస్తవ చరిత్రను వెలికి తీయాల్సిందే! తిరగరాయాల్సిందే!

–తాడేపల్లి హనుమత్ ప్రసాద్

(ఆంధ్రభూమి సౌజన్యం తో)