Home Telugu Articles ముంబయి లో పౌరుల రక్షణ కోసం పోలీసు అధికారిణులు

ముంబయి లో పౌరుల రక్షణ కోసం పోలీసు అధికారిణులు

0
SHARE

ప్రకృతినే మాతృస్వరూపంగా భావించి పూజించే దేశం మనది. అలాంటి మనదేశంలో పాశ్చాత్య పోకడల ప్రభావం వల్ల నేడు మహిళలపై అనేక రకాల అక్రమాలు, అత్యాచారాలు జరుగు తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ క్షేమంగా తిరిగి వస్తుందో లేదో అని భయంతో ఇంటివాళ్లు ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. సరే దీనికి ఎవరు కారణం అన్న వాదవివాదాలను పక్కన పెడితే మహిళల రక్షణ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందన్నది వాస్తవం. ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని చర్యలు తీసుకున్నా రోజురోజుకు పరిస్థితి దిగజారుతుందే తప్ప మార్పు రావడం లేదు. దేశ ఆర్థిక రాజధానిగా పేర్కొనే ముంబాయిలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అయితే ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి అక్కడ కొన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ఇలాంటి హింసాత్మక పరిస్థితుల నుంచి అక్కడి స్త్రీలను రక్షించే శక్తి మహిళా పోలీసు అధికారులకే ఉందని అంటోంది ముంబయి పోలీస్‌ ఫోర్స్‌. అందుకే తాజాగా అక్కడ ఎనిమిది పోలీసు స్టేషన్లకు మహిళలను ఇన్‌ఛార్జిలుగా నియమించి చరిత్ర సష్టించింది.

ఇలా ఒక సిటీలో ఎనిమిది మంది పోలీసు అధికారిణులు ఇన్‌ఛార్జిలుగా బాధ్యతలు స్వీకరించడం దేశంలోనే ప్రప్రథమం కావడం విశేషం. ముంబయి పోలీస్‌ ఫోర్స్‌ తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ ఆనందిస్తున్నారు.

అందరి నుంచి సానుకూల స్పందన

ఇన్‌ఛార్జి పోస్ట్‌లో ఎంపికైన పోలీసు అధికారిణు లకు సంబంధించిన ఫోటోను ముంబయి పోలీస్‌ ట్విట్టర్‌ పేజీలో పోస్ట్‌ చేస్తూ.. ‘ఒక నగరంలో ఎనిమిది మంది పోలీసు అధికారిణులను ఇన్‌ఛార్జి కేడర్‌లో నిమించుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మీరంతా నగరంలోని చెడును పారదోలి.. మంచిని కాపాడుతూ.. ప్రతిఒక్కరి జీవితంలో సంతోషాన్ని తీసుకురావాలి.. ఆల్‌ ది బెస్ట్‌… అంటూ పోస్ట్‌  చేసింది. ఇలా ముంబయి పోలీసులు ఈ ఎనిమిది మంది మహిళా అధికారులకు సంబంధించిన పోస్ట్‌ను తమ ట్వట్టర్‌లో పెట్టగానే చాలా మంది దీని పై హర్షం వ్యక్తం చేవారు.

ఇది దేశ చరిత్రలోనే గర్వించదగ్గ సందర్భమని, మహిళా సాధికారతకు నిదర్శన మంటూ ఎంతో మంది సానుకూలంగా స్పందించారు. ఈ విధంగా ముంబయి పోలీసు శాక ఒకేసారి ఎనిమిది మంది మహిళా ఇన్‌ఛార్జిలను నియమించుకొని నగరరక్షణకు నడుం బిగించడమే కాకుండా.. ఈ విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని చెప్పుకోవచ్చు.

ఆ ఎనిమిది మంది ఎవరో తెలుసా!?

తాజాగా ముంబయి పోలీస్‌ ఫోర్స్‌ నియమించు కున్న ఎనిమిది మంది అధికారులు ఆ నగరంలోని వివిధ స్టేషన్లకు ఇన్‌ఛార్జిలుగా బాధ్యతలు చేపట్టారు.

అల్కలా మాండవే – ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌, రష్మీ జాదవ్‌ – కుఫే పరేడ్‌ పోలీస్‌ స్టేషన్‌, ముద్రలా లాడ్‌ – సియోన్‌ పోలీస్‌ స్టేషన్‌, లతా షిర్సత్‌ – సహర్‌ పోలీస్‌ స్టేషన్‌, జ్యోత్స్నా రాసమ్‌ – వన్రాయ్‌ పోలీస్‌ స్టేషన్‌, రోహిణి కాలే – పంత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌, విద్యా లక్ష్మి హైర్మత్‌ – ఆరే పోలీసు స్టేషన్‌, కల్పనా గడేకర్‌ – బీకేసీ పోలీస్‌ స్టేషన్‌. ఇలా వేర్వేరు పోలీస్‌ స్టేషన్లకు ఇన్‌ఛార్జిలుగా బాధ్యతలు చేపట్టిందీ మహిళా బృందం.

మహిళా పోలీసులు ఇన్‌ఛార్జిలుగా బాధ్యతలు చేపట్టడం వల్ల నగరంలోని మహిళల సమస్యలు తీరడమే కాకుండా.. అమ్మాయిలు, మహిళలు ఇంటా-బయటా సౌకర్యవంతంగా, నిర్భయంగా మెలిగే అవకాశం ఉంటుందని కుఫే పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన రష్మీ జాదవ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మిగతా రాష్ట్రాల వారు కూడా తీసుకుంటే పరిస్థితులను కొంతలో కొంతైనా అదుపు చేయవచ్చనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు.

–  లతా కమలం

(లోకహితం సౌజన్యం తో)