అతనొక చాయ్‌వాలా… కాని అతని మనసు మాత్రం పాలవంటిది. అంతగా ధనికుడు కూడా కాదు.. కాని సమాజానికి తన వంతుగా ఏదో చేయాలని నిరంతరం తపిస్తుంటాడు. ‘పేదరికం కారణంగా నేను చదువుకు దూరమయ్యాను.. ఇక మీద నా చుట్టూ ఉండే నిరుపేద చిన్నారులు ఎవరూ ఆర్థిక సమస్యల వల్ల చదువుకు దూరం కావొద్దు’ అని ఆయన తరచూ అంటాడు. నడిపేది చిన్న టీ కొట్టే అయినప్పటికీ తనకొచ్చే నెలసరి ఆదాయంలో సగానికి పైగా పేద చిన్నారుల కోసం ఖర్చుపెడుతున్నాడు. ఆయనే ఒడిస్సాలోని కటక్‌కు చెందిన డి. ప్రకాశ్‌రావు.
ప్రకాశ్‌రావు తండ్రి రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం అనంతరం కటక్‌కి తిరిగి వచ్చారు. కుటుంబ పోషణ కోసం చిన్న కొట్టు పెట్టుకున్నారు. కాని అది సరిగా నడవలేదు. దాంతో ఇల్లు గడవడమే కష్టమైంది. ప్రకాశ్‌ను చదివించే స్థోమత కూడా ఆ కుటుంబానికి లేదు. ప్రకాశ్‌రావు చదువుకు దూరమయ్యాడు. ఇంట్లోనే ఉండేవాడు. తండ్రి కష్టాన్ని చూసి చలించిపోయేవాడు. ఇంట్లోవారు తనను చదివించలేరని గుర్తించాడు. కాని ఏమాత్రం మారం చేయలేదు. తన పోషణ కుటుంబానికి భారం కావొద్దనుకున్నాడు. అప్పటికి అతని వయసు ఏడేళ్ళు మాత్రమే. చిన్నతనంలోనే ఎంతో పెద్దవాడిలా ఆలోచించాడు. వెంటనే తండ్రి టీ కొట్టులో చేరిపోయాడు. నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ కొట్టు నిర్వహణలో సహకరించే వాడు. అలా ప్రకాశ్‌రావు బాల్యంలోనే చదువుకు దూరమై కుటుంబానికి మరింత దగ్గరయ్యాడు. కుటుంబ బాధ్యతలను చిన్న వయసులోనే భుజాలపై వేసుకున్నాడు. కాని ఆర్థిక సమస్యల వలనే తాను చదువుకు దూరమయ్యాననే బాధ మాత్రం ఆయనను ఎప్పటికీ వెంటాడుతూ ఉండేది.
ఐదు పదుల వయసు పైనపడే వరకు టీ కొట్టు నిర్వహణలోనే కాలం గడచిపోయింది. ఆదాయం కూడా పెరిగింది. తనకు చేతనైనంతలో నిరుపేద చిన్నారులకు ఏదైనా చేయాలనుకున్నాడు. మురికివాడల్లోని చిన్నారులను చదువుకు దగ్గర చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. మురికివాడల్లో చిన్నారులు భుజానికి సంచి వేసుకొని చెత్త ఏరుకుంటూ కనిపిస్తుంటారు. మరి అలాంటి వారిని చేరదీసి చదువు చెప్పిస్తే వారు బడికి వెళ్తారా ? అనే ప్రశ్న ప్రకాశ్‌రావును కదిలించింది. ఓసారి ఆ చిన్నారులను దగ్గరకు పిలిచి మీరు చదువుకుంటారా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తారా ? అని ప్రశ్నించాడు. అందుకు సమాధానం ఆయన ఊహించినట్లే వచ్చింది. వారి ఆర్థిక పరిస్థితులే వారిని చదువుకు దూరం చేస్తున్నాయనే విషయం స్పష్టం అయింది. ఎందుకంటే తానొచ్చింది కూడా ఆ మురికివాడల నుంచే అని ప్రకావ్‌రావు అనుకున్నాడు. అలా మొదలైంది ఆయన సేవా కార్యక్రమ ప్రయాణం.
అనుకున్నట్లుగానే మొదటి అడుగువేశాడు. ‘ఆశా ఆశ్వాసన్’ పేరిట పాఠశాలను ప్రారంభించాడు. నిరుపేద చిన్నారులను ఆ పాఠశాలకు వచ్చేలా కృషి చేశాడు. వారికి చిరు తిండ్లు పెడుతూ చిన్నగా పాఠశాలను అలవాటు చేశాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు బయట తిరిగి ఒక్కసారిగా కుదురుగా కూర్చోవడం వారికి సాధ్యపడదు. కాబట్టి చిన్నారులకు ఏదో ఒక ఆశ చూపి పాఠశాలకు రప్పించేవాడు. అలా మెల్లగా కొందరు చిన్నారులకు పాఠశాల వాతావరణం అలవడింది. రోజూ రావడం ప్రారంభించారు. 2000 సంవత్సరంలో ప్రారంభిం చిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 75 మంది విద్యార్థు లకు పైగా ప్రీ-స్కూల్ శిక్షణను పొందుతున్నారు. అంతా ఐదు నుంచి తొమ్మిది ఏళ్ల లోపు చిన్నారులే..!
అయితే ఆశా ఆశ్వాసన్‌లో చిన్నారులకు పాఠ్య పుస్తకాలలోని అంశాలను బోధించరు. కేవలం పాఠశాలలో చదువుకునేందుకు కావలసిన క్రమశిక్షణ.. ఓనమాలను మాత్రమే నేర్పుతారు. ఎందుకంటే పాఠశాలలో చేరిన తరువాత మిగిలిన విద్యార్థుల్లాగా ఈ చిన్నారులు ఇబ్బందులు పడొద్దని. ఇలా చేయడం ద్వారా వారు పాఠ్యపుస్తకాల్లోని అంశాలను తేలికగా నేర్చుకొని చదువు పట్ల మరింత ఆసక్తిని పెంచుకుంటారని ప్రకాశ్‌రావు ఆలోచన. అందుకే పాఠశాల విద్యకు ముందే ప్రాథమిక శిక్షణ పేరుతో ఇక్కడ క్రమశిక్షణ నేర్పిస్తారు. శిక్షణ పూర్తయిన అనంతరం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి విద్యా బుద్ధులు చెప్పిస్తారు. అంతేకాదు రాష్ట్ర, జాతీయస్థాయి పాఠశాలల ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేందుకు కావలసిన శిక్షణను కూడా ఈ పాఠశాలలో ఇప్పిస్తారు.
మురికివాడలు అంటున్నారు.. నిరుపేదలు అంటున్నారు.. అసలు వారికి ప్రాథమిక శిక్షణ.. చిరుతిండ్లతోనే సరిపెడుతున్నారనుకుంటే మనం పొరబడినట్లే. ఆశా ఆశ్వాసన్ పాఠశాల చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అందులో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారాన్ని సైతం అందిస్తారు. దీనికోసం ప్రకాశ్‌రావు తన ఆదాయంలో సగానికి పైగా ఖర్చుపెడుతున్నాడు. ప్రతిరోజూ విద్యార్థులకు భోజనం.. ఇతర వసతులను కల్పిస్తారు. ఇందుకు నెలకు 18వేల నుంచి 20వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. వ్యాపారం సరిగా జరగకపోయినా ఏదో విధంగా సొమ్మును కూడగట్టి.. విద్యార్థులకు పాఠశాలలో ఏ లోటు రాకుండా చూసుకుంటాడు. విద్యార్థులకు ఇంటి వాతావరణాన్ని కల్పిస్తూ శిక్షణ కార్యక్రమంలో నిమగ్నం చేస్తున్నాడు.
మరో విశేషం ఏంటంటే.. పెద్దగా చదువుకోక పోయినా ఒడియా.. తెలుగు.. తమిళం.. కన్నడ.. మళయాళం.. బెంగాళి.. హిందీ.. ఇంగ్లీషు భాషలపై ప్రకాశ్‌రావుకు పట్టుంది. అన్ని భాషల్లో ఎంతో అనర్గళంగా మాట్లాడతాడు కూడా. తన జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పించిందని అందులో భాగంగానే వివిధ భాషలను తాను నేర్చుకున్నానని ప్రకాశ్‌రావు చెబుతాడు..
ప్రకాశ్‌రావు చూడటానికి చాలా సాదాసీదాగా కనిపిస్తాడు. అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతాడు. ఆయనలో ఏ మాత్రం గర్వం కనిపించదు. విద్యార్థులకు కేవలం ప్రాథమిక శిక్షణను ఇవ్వటమే కాదు ప్రకాశ్‌రావు సేవా కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటాడు.
ప్రకాశ్‌రావు తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ ‘అప్పుడు నాకు 17 సంవత్సరాలు. నా శరీరం పక్షవాతానికి లోనైంది. ఇక తిరిగి లేవనేమో అనుకున్నాను. ఎవరో ఒకవ్యక్తి నాకు రక్తదానం చేసి నా ప్రాణాన్ని నిలిపాడు. నాకు స్ఫూర్తిగా నిలిచాడు. ఆయన స్ఫూర్తితోనే నేను సేవా కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటాను’ అంటాడు.
ప్రకాశ్‌రావు అవసరమైన వారికి తరచూ రక్తదానం చేస్తుంటాడు. తక్కువ సమయంలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా ప్రకాశ్‌రావుకి పేరుంది. ఓ పత్రిక కథనం ప్రకారం ఆసియా ఖండంలోనే అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా ప్రకాశ్‌రావు నిలిచాడు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని ఆయన ఒంట బట్టించుకున్నారు. సేవ చేసేందుకు కలిగే ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదులుకోడు.
ఓ సందర్భంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది సైతం ప్రకాశ్‌రావు పేరును ప్రస్తావించారంటే సమాజం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, సేవా తత్పరత ఎలాంటివో మనం అర్థం చేసుకోవచ్చు. నరేంద్ర మోది ఓసారి తన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రకాశ్‌రావు గురించి ప్రస్తావిస్తూ ‘ఓ చాయ్ అమ్ముకునే వ్యక్తి నిరుపేద చిన్నారుల జీవితాల నుంచి చీకట్లను తొలగించేందుకు కషి చేస్తున్నాడు’ అన్నారు.
కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలంటే కావలసింది డబ్బు కాదు.. చిత్తశుద్ధి అనే విషయం ప్రకాశ్‌రావును చూస్తే అర్థమవుతుంది. ప్రకాశ్‌రావు తన సేవా కార్యక్రమాలకు ఎక్కడా ప్రచారం కోరుకోలేదు. తన వల్ల ఆ నిరుపేద విద్యార్థులకు మేలు జరిగితే చాలనుకుంటాడు అంతే. ఆరు పదుల వయసు దాటినా ప్రకాశ్‌రావు తన సేవా భావాన్ని ఏనాడూ వీడలేదు.
ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతిఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడితే మనదేశం తప్పకుండా అభివృద్ధిలో దూసుకుపోతుంది…!
(జాగృతి సౌజన్యం తో )