Home Telugu Articles ఎమర్జన్సీ (1975-77) కారకులు క్షమార్హులు కానేకారు..

ఎమర్జన్సీ (1975-77) కారకులు క్షమార్హులు కానేకారు..

0
SHARE
ఆత్యయిక స్థితి అరాచకాలు

జూన్‌ నెల అనగానే మండుటెండలే కాదు… మన చరిత్రలో చెరగని ఓ పీడకల కూడా గుర్తుకొస్తుంది. అదే ఎమర్జన్సీ. 1975 జూన్‌ 25నాడు కాంగ్రెస్‌ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆత్యయిక స్థితి విధించి జవజీవాలు ఉట్టిపడే మన ప్రజాస్వామ్యం పీక నులిమి నియంతృత్వంగా మార్చేశారు. ఎమర్జన్సీ మన ప్రాథమిక హక్కులతోపాటు జీవించే హక్కునూ హరించేసింది. భారతీయులు ప్రజాస్వామ్య ఛత్రం కింద నిరంతరం స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఉండాలన్నా, మన రాజ్యాంగ విలువలను సంరక్షించుకోవాలన్నా, 1975-77 మధ్య ఎమర్జన్సీ కాలంలో సంభవించిన ఘోరాలను మరచిపోకూడదు, వాటికి కారకులైనవారిని క్షమించరాదు.

యోధుల పోరాటపటిమ

మొదట మనం మరవకూడని అంశాలు, సంస్థలు, వ్యక్తులను ఒకసారి మననం చేసుకుందాం. ఇందిరా గాంధీ నిరంకుశ ప్రభుత్వంపై ప్రాణాలకు తెగించి మరీ పోరాడి చివరకు 1977 మార్చిలో ప్రజాస్వామ్య రథాన్ని మళ్ళీ గాడిన పెట్టిన వందలాది రాజకీయ, సామాజిక నాయకులు, కార్యకర్తల త్యాగాలను ఎన్నటికీ విస్మరించకూడదు. వీరిలో జయప్రకాశ్‌ నారాయణ్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, చంద్రశేఖర్‌, జార్జి ఫెర్నాండెజ్‌, ఎల్‌కే అడ్వాణీ, చరణ్‌ సింగ్‌, మధు దండావతే, మొరార్జీ దేశాయ్‌, నానాజీ దేశ్‌ముఖ్‌, రామకృష్ణ హెగ్డే, సికందర్‌ బక్త్‌, నరేంద్ర మోదీ, హెచ్‌డీ దేవెగౌడ, లాలు ప్రసాద్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ తదితరుల త్యాగాలు చిరస్మరణీయాలు.

ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) పోషించిన బలీయ పాత్ర అసమానమైనది. అంతర్గత భద్రతా పరిరక్షణ చట్టం (మీసా) కింద మొత్తం 6,330 మంది రాజకీయ కార్యకర్తలు జైలుపాలయ్యారు. వారిలో 4,026 మంది  ఆరెస్సెస్‌, జన సంఘ్‌ (భారతీయ జనతాపార్టీ పూర్వ సంస్థ)లకు చెందినవారే. వీరిలో ఆరెస్సెస్‌ సర్‌సంఘ్‌ చాలక్‌ బాలాసాహెబ్‌ దేవరస్‌, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుత కేంద్రమంత్రులు అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌, ప్రకాశ్‌ జవడేకర్‌, అనంత్‌ కుమార్‌, రామ్‌విలాస్‌ పాసవాన్‌, సీనియర్‌ ఆరెస్సెస్‌ నాయకుడు దత్తాత్రేయ హోసబలేల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంకా అప్పటి పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ సుబ్రహ్మణ్యం స్వామి రెండుసార్లు గుట్టుగా దేశం విడిచివెళ్లి అమెరికా, బ్రిటన్‌లలో ఇందిరా గాంధీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ రోజుల్లో ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా ఉన్న నరేంద్ర మోదీ అజ్ఞాతవాసం నుంచి ఎమర్జన్సీపై పోరాడారు. ఆత్యయిక స్థితిని నిరసిస్తూ కరపత్రాలు, సాహిత్యం వెలువరించి పంపిణీ చేయడం, జైలులో ఉన్న నాయకుల కుటుంబాలను ఆదుకోవడం వంటి కార్యక్రమాలను నిర్వహించేవారు. ఆనాటి హెబియస్‌ కార్పస్‌ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఏకైక నిరసన గళం వినిపించిన న్యాయమూర్తి హెచ్‌ఆర్‌ ఖన్నాను ఈ దేశం ఎప్పటికీ మరువకూడదు. ‘చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప మరేవిధంగానూ ఏ ఒక్క పౌరుడి ప్రాణాలను, వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడ’దని 21వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. ఎమర్జన్సీ కాలంలో ఈ స్వేచ్ఛను సంరక్షించుకోవడానికి కోర్టుకు వెళ్లే హక్కు పౌరులకు ఉందా లేదా అన్నది పై కేసులో సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. ప్రజాస్వామ్య దేశానికి, నియంతృత్వ దేశానికి మధ్యగల తేడాను ఈ స్వేచ్ఛ నిర్వచిస్తోంది. ఎమర్జన్సీ రోజుల్లో పౌరులకు ఈ స్వేచ్ఛ ఉండదన్న ప్రభుత్వ దృక్పథాన్ని అటార్నీ జనరల్‌ నీరేన్‌ డే నొక్కి చెప్పారు. అలాగైతే ఎవరైనా పోలీసు అధికారి వ్యక్తిగత కక్షతో తనకు గిట్టని పౌరుణ్ని చంపితే, దానికి న్యాయపరమైన చర్యలేవీ ఉండవా అని జస్టిస్‌ ఖన్నా ప్రశ్నించగా, ‘ఉండవు’ అని నీరేన్‌ డే తెగేసి చెప్పారు. కోర్టు గదిలో ఉన్నవారంతా ఈ జవాబుకు నిశ్చేష్టులయ్యారు. ఈ తతంగాన్ని మిగిలిన న్యాయమూర్తులు నోరు మెదపకుండా చూస్తూ కూర్చున్నారని ఖన్నా తన ఆత్మకథలో వెల్లడించారు. వారిలో ప్రధాన న్యాయమూర్తి ఏఎన్‌ రే సహా న్యాయమూర్తులు ఎంహెచ్‌ బేగ్‌, వైవీ చంద్రచూడ్‌, పీఎన్‌ భగవతి ఉన్నారు. చివరకు వారంతా కూడబలుక్కొని ప్రభుత్వ దృక్పథాన్ని సమర్థించి పౌరుల ప్రాణ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించేశారు. జస్టిస్‌ ఖన్నా ఒక్కరే ఈ దృక్పథంతో విభేదించారు. ఇందిరాగాంధీ ఆ తరవాత ఖన్నా సీనియారిటీని పక్కనపెట్టి జస్టిస్‌ బేగ్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అయితేనేం… ప్రజాస్వామ్యాన్ని, మౌలిక హక్కులనూ ప్రేమించేవారందరికీ ఖన్నా ఆరాధనీయుడిగా నిలిచిపోయారు.

ఎమర్జన్సీ రోజుల్లో దౌష్ట్యానికి పాల్పడిన‌ నాయకులు, వ్యక్తులు చాలామందే ఉన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షంతవ్యులు కారు. ఈ జాబితాలో మొదటిస్థానంలో నిలిచే వ్యక్తి ఇందిరాగాంధీయే. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చి, సామూహిక జనన నిరోధ శస్త్రచికిత్సలను అనుమతించి, తన స్వార్థం కోసం రాజ్యాంగాన్ని, ఎన్నికల చట్టాలను అడ్డగోలుగా సవరించి, ఉన్నత న్యాయవ్యవస్థను బలహీనపరచడానికి 42వ రాజ్యాంగ సవరణ తెచ్చి, కార్యనిర్వాహక ఉత్తర్వులతోనే రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని రాష్ట్రపతికి కట్టబెట్టినందుకు- ఆమెను ఈ జాతి ఎన్నటికీ క్షమించలేదు. అలాగే ఇంజినీరింగ్‌ విద్యార్థి పి. రాజన్‌ను చిత్రహింసలు పెట్టి హతమార్చిన కేరళ పోలీసులు, లారెన్స్‌ ఫెర్నాండెజ్‌ను నెలల తరబడి హింసించి కూడా శిక్ష పడకుండా తప్పించుకున్న కర్ణాటక పోలీసులూ క్షంతవ్యులు కారు.

ఇందిర ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పత్రికలపై సెన్సార్‌ విధించి, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికను ప్రభుత్వ అధీనం చేయాలని చూసిన వీసీ శుక్లా పరమ ప్రజాస్వామ్య ద్రోహి. వార్తాపత్రికలపై దాడులు చేసి మూసివేయించే అధికారాన్ని జిల్లా మేజిస్ట్రేట్లకు కట్టబెట్టే చట్టాలు తెచ్చిన శాల్తీ ఆయన. చివరకు మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్‌ టాగోర్‌ల వ్యాఖ్యలు, సూక్తులను సైతం పత్రికలు ప్రచురించకూడదనేంతవరకు వెళ్లారాయన. అప్పట్లో బాలీవుడ్‌ గాయకుడు కిశోర్‌ కుమార్‌ ప్రభుత్వ వాణిజ్య ప్రచార గీతం పాడటానికి నిరాకరించడంతో ఆలిండియా రేడియోలో ఆయన పాటలు ప్రసారం కాకుండా చూసిన ఘనుడు శుక్లా!

జీవితాలతో చెలగాటం

ఎమర్జన్సీలో జైలుపాలైన రాజకీయ ఖైదీలను ఇందిరా గాంధీ కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారని విపరీత వ్యాఖ్యలు చేసిన జస్టిస్‌ బేగ్‌ న్యాయవ్యవస్థకు కళంకంగా నిలిచిపోయారు. ఎమర్జన్సీ వ్యతిరేకులను నిర్బంధంలో ఉంచడానికి జైలు గదులు సరిపోవడం లేదని తిహార్‌ జైలు సూపరింటెండెంటు చెప్పినప్పుడు, ఖైదీలను ఆస్బెస్టాస్‌ రేకుల గదుల్లోకి నెట్టి సలసలా మరిగించాలని, మరి కొందరిని మానసిక చికిత్సాలయాల్లో పడేయాలని సూచించిన దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యదర్శి నవీన్‌ చావ్లాను ఎప్పటికీ క్షమించకూడదు. హరియాణా ముఖ్యమంత్రిగా, రక్షణ మంత్రిగా పదవులు వెలగబెట్టిన బన్సీలాల్‌ దారుణాలు అన్నీ ఇన్నీ కావు. సామూహిక నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరాలను నిర్వహించిన ప్రబుద్ధుడు బన్సీ. ముస్లిముల గ్రామమైన ఉట్టావర్‌లో నడిపిన ఇలాంటి శిబిరంలో హాహాకారాలు చెలరేగాయి. ట్రక్కుల నుంచి దిగిన పోలీసులు ఆ గ్రామంలో 8 నుంచి 80 ఏళ్ల మధ్య వయసుగల ముస్లిం బాలురు, పురుషులను బలవంతంగా తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించారు. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు, పోలీసులు తలా ఇన్ని నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించాలని కోటా విధించారు. చాలాచోట్ల ఉపాధ్యాయులూ ఈ చికిత్సలు చేయించుకోవలసి వచ్చింది. అందుకు నిరాకరించినవారిని మీసా చట్టం కింద జైల్లో కుక్కేవారు. ఈ దారుణాలన్నింటినీ మనం మరచిపోతే మన ప్రజాతంత్ర జీవన విధానమే ప్రమాదంలో పడుతుంది.

ఏ. సూర్య ప్రకాష్
ప్రసార భారతి చైర్మన్

(ఈనాడు సౌజన్యం తో)

(ఈ వ్యాసం మొదట 25 జూన్ 2018 నాడు ప్రచురితమైంది)