Home Telugu Articles ప్రజాకవి, భక్తి ఉద్యమకారుడు, సమాజిక సంస్కర్త సంత్‌ కబీర్‌దాస్‌

ప్రజాకవి, భక్తి ఉద్యమకారుడు, సమాజిక సంస్కర్త సంత్‌ కబీర్‌దాస్‌

0
SHARE

భక్తి ఉద్యమకారుడుగా, సామాజిక సంస్కర్తగా, సమతా ఉద్యమకారునిగా ప్రజాకవిగా సంత్‌ కబీర్‌దాస్‌ పేరు పొందాడు. కాశీ కేంద్రంగా క్రీ.శ.1455-1518 మధ్య వారు జీవించారు. వారు జేష్ఠ పౌర్ణమి నాడు జన్మించారు. వారి జీవనానికి సంబంధించి అనేక వైరుధ్య కథనాలు వినపడు తున్నాయి. వారి జీవన కాలం విదేశీ ముస్లిం పాలకుల దౌర్జన్యం తీవ్రంగా ఉన్న సమయం. సమాజంలో దురాచారాలకూ కొదవలేదు. విదేశీ పాలకుల దుర్మార్గం ముందు సమాజం నిలబడలేని నిస్సహాయ స్థితిలో ఆ కాలంలో దేశం నలుమూలలా భక్తి ఉద్యమం ఉద్భవించింది. ఆ రోజుల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా భక్తి ఉద్యమాన్ని అందివ్వడంతో పాటు, ఆడంబరాలు, మూఢాచారాలు, పటాటోపాలకు దూరంగా సంస్కరణలను, సామాజిక సమతా ఫలాలను అందించిన మహాకవి సంత్‌ కబీర్‌దాస్‌.

సమతామూర్తి శ్రీరామానుజుల శిష్యుడు రామానందుడు. రామానందునికి ఉత్తర భారతంలో అనేక కులాల్లో అనేక మంది శిష్యులున్నారు. వారిలో కాశీకి చెందిన కబీర్‌దాస్‌, రవిదాస్‌ ప్రముఖులు. వీరిద్దరూ సమకాలీనులు.

తల్లి తండ్రులకు దూరమై అనాథగా ఉన్న శిశువును చేనేత వృత్తిలో ఉన్న ముస్లిం దంపతులు నీరు, నీమా పెంచి పెద్దచేశారు. కబీర్‌దాస్‌పై ముస్లిం, హిందూ సమాజాల రెండింటి ప్రభావం ఉంది. కబీర్‌ పెద్ద చదువులకు నోచుకోలేదు. చిన్ననాటి నుండే ఆయనలో ఆధ్యాత్మిక పిపాస పెంపొందింది. తెల్లవారు ఝామునే చీకట్లో గంగాస్నానం చేసి వస్తున్న రామానందుని కాళ్ళకు మెట్ల మధ్య కబీర్‌దాస్‌ దేహం తగిలింది. ‘రామ రామ’ రామానందుని నోటి నుండి వెలువడ్డ వాక్యాలే కబీర్‌దాస్‌కు ‘మంత్రోపదేశ’ మయింది.

కబీర్‌దాస్‌కు చిన్ననాటనే అనేక అద్భుతాలు కనబడ్డాయి. ఆకలిగా ఉన్న శిశు కబీర్‌కు ఆవులు స్వయంగా తమ పొదుగుల నుండి పాలను అందిచ్చేవట! తోటి బాలురకంటె భిన్నంగా కబీర్‌ జీవించాడు. చేనేత అతని కుటుంబ వృత్తి. ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. కబీర్‌ ఆనాటి హిందూ, ముస్లిం, సిఖ్‌ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాడు. ఎప్పుడూ సంపాదన కోసం తాపత్రయ పడలేదు.

కులము, మతము, హోదా, పాండిత్యాలకు అతీతంగా అందరికీ అందుబాటులోకి భగవంతుణ్ణి తీసుకురావడం కబీర్‌దాస్‌ ప్రధాన జీవన లక్ష్యం. ఆడంబరాలు, పూజా పద్ధతులు, పాండిత్యాలు వంటివాటికి దూరంగా భక్తి భావంతో భగవంతునికి సమర్పించుకోవడం ఏకైక మార్గంగా కబీర్‌దాస్‌ జీవించాడు. పురాణపురుషులైన హనుమంతుడు, వశిష్ఠుడు, చారిత్రిక పురుషులైన గోరఖ్‌నాధ్‌, మక్దూమ్‌ జహారియా వంటి మహాపురుషుల దర్శనం పొంది వారితో ఆధ్యాత్మిక చర్చలు చేసినవాడు. కబీర్‌దాస్‌ మానవతావాది, అహింసావాది, సామాజిక సంస్కర్త, నిరాడంబర జీవనం, అత్యంత పరిమిత కోరికలు, అపరిగ్రహత, భగవత్‌ సమర్పిత జీవనం – ఇలా అనేక విశేషాలు వారి జీవనంలో దర్శనమిస్తాయి.

కబీర్‌దాస్‌ రచించిన 225 గీతాలు, 250 సఖిలు (రెండు పంక్తుల పద్యాలు) సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘ఆదిగ్రంధసాహెబ్‌’ లో చేర్చబడ్డాయి. కబీర్‌దాస్‌ రచించిన అన్ని రచనలు కలిపి ‘బీజక్‌’ అనే గ్రంధరూపంగా సంకలనం అయ్యాయి. ‘కబీర్‌ గ్రంధావళి’, ‘కబీర్‌ వచనావళి’ పేరుతో 1930లో గ్రంథాలుగా వెలువడ్డాయి. కబీర్‌దాస్‌ చెప్పిన, ఎంపిక చేసిన 100 గేయాలను రవీంద్రుడు అనువాదం చేశారు. కబీర్‌దాస్‌ సాహిత్యం విదేశీ భాషల్లో సైతం అనువాదమయింది.

కబీర్‌దాస్‌ సాహిత్యం – 1. సఖి (దోహా) 2. సబద్‌ (పదాలు) రమైణిల రూపాలలో లభ్యమవు తాయి. వ్యంగ్యము, విసుర్లు, విమర్శలు వీరి సాహిత్యంలో అపారంగా లభిస్తాయి. వీరి సాహిత్యంలో రాజస్థానీ, పంజాబీ, ఉర్దూ, హిందీకి చెందిన బ్రజ, భోజపురి, ఖడీబోతీ, మాండలిక శబ్దాలు అన్నీ దర్శనమిస్తాయి. ప్రముఖ హిందీ సాహితీవేత్త హజారీ ప్రసాద్‌ ద్వివేది, సంత్‌ కబీర్‌దాస్‌ను ‘భాషాపర నియంత’ గా శ్లాఘించారు.

అంతిమకాలంలో కాశీలో తనువును చాలించాలని అందరూ కోరుకుంటుంటే, విలక్షణంగా అంతిమసమయంలో కబీర్‌దాస్‌ గోరఖ్‌పూర్‌కు దగ్గరలో ‘మేఘాహర్‌’ చేరాడు. ఒంటరిగా ఒక పూరిగుడిసెలోకి వెళ్ళాడు. బయట ముస్లిం, హిందూభక్తులు అంత్యక్రియలు తమ తమ మత పద్ధతుల్లో చేయాలని తగాదా పడుతున్నారు. లోనికి వెళ్ళి చూస్తే ఏముంది ? విచిత్రం! కబీర్‌దాస్‌ శరీరంపై ఉన్న గుడ్డను తీసి చూస్తే లోపల పార్ధివ శరీరమే లేదు. పూలు మాత్రం ఉన్నాయట. ముస్లింలు ఆ పూలలోని ఒక భాగంతో అక్కడే కబీర్‌దాస్‌కు సమాధి కట్టారు. మిగిలిన పూలతో వీర్‌సింగ్‌ నాయకత్వంలోని హిందువులు కాశీలో చేరామఠంలో సమాధిని ఏర్పరిచారు.

నేడు విశేషంగా ఉత్తర భారతంలో ‘కబీర్‌ పంథా’కు చెందిన ప్రజలు అనేకచోట్ల ఉన్నారు. కబీర్‌ దేవాలయాలు దర్శనమిస్తాయి. డా||అంబేద్కర్‌ తండ్రి రాంజీ సక్పాల్‌ ఇంట్లో కబీర్‌ పంథాకు చెందిన భజనలు, చర్చలు రోజూ జరుగుతుండేవి. భీమ్‌రావు మనస్సుపై సంస్కర్తగా కబీర్‌ ఆలోచనా ప్రవాహం తండ్రి ద్వారా సంక్రమించింది.

సంత్‌ కబీర్‌దాస్‌ రచనల్లోని కొన్ని దోహాలను మచ్చుకు తెలుసుకుందాం.

కబీర్‌ దోహాలు

జాతి న పూఛో సాధు కీ, పూఛి లీజియే జ్ఞాన |
మోల కరో తలవార్‌ కా, పడా రహన దో మ్యాన్‌ ||

సాధువుల కులం అడగవద్దు. వారినుండి జ్ఞానాన్ని పొందండి. కత్తికి గల పదును ముఖ్యం, ఒర ముఖ్యం కాదు.

భక్తి బీజ పలటై నహీఁ, జో జుగ ఆయ అనంత |
ఊంచ నీచ కర ఔతరే, హోత కా సంత ||

ఎన్ని జన్మలు ఎత్తినా భక్తి అనే బీజం ఎప్పటికీ మారదు. పెద్ద కులంలో జన్మించినా, తక్కువ కులంలో జన్మించినా సాధువు సాధువే!

హమ వాసీ వా దేశ కె, జహాఁ జాతి వరన కుల నాహి|
శబ్ద మిలావా హ్రై రహా, దేశ మిలావా నాహి ||

కులము, మతము, తెగ లాంటి వివక్షకు తావులేని భగవంతునికి చెందినవారం మేము. శరీరాలు వేరైనా ఒకే ప్రపంచంలో కలిసిపోతాం.

నారీ నరక న జానియె, సబ సంతన కీ ఖాన్‌ |
జామే హరిజన ఊపజె, సోయీ రతన కీ ఖాన్‌ ||

నరకానికి మార్గాలంటూ మహిళలను అవమానించతగదు. అనేకమంది సాధువులకు ఆమె జన్మనిచ్చింది. భగవత్‌ భక్తుడనే అమూల్య రత్నాలను మనకు అందించింది ఆ మాతృమూర్తే !

(ఆధ్యాత్మిక సాధకులు తమ సాధనకు మహిళలను నరకానికి మార్గంగా భావించేవారు. కాని సంత్‌కబీర్‌ మహిళలను సంతానాన్ని అందించే, రత్నాలవంటి సాధువులను అందించే మాతృమూర్తులుగా పేర్కొంటున్నారు.

కబీర్‌ కూతా రామ్‌కా, ముతియా మేరా నావూఁ |
గలే రామ్‌ కీ జేవరీ, జిత ఖైఛై తిత జావూఁ ||

కబీర్‌ అంటున్నాడు – నేను రాముని కుక్కను. నా పేరు ముటియా. రాముని చేతిలోని తాడు నా మెడకు బిగించి ఉంది. ఆ తాడును ఎటువైపు తీసుకుపోతే నేను అదేవైపు లాగబడతాను.

సాఁయీ ఇతనా దీజియే, జామే కుటుమ సమాయ |
మైఁ భీ భూఖా నా రహూఁ, సాధు నా భూఖా జాయ||

ఓ భగవంతుడా ! నా కుటుంబానికి అవసరమైనంత నాకివ్వు. నా యింటికి వచ్చిన సాధువులు, నా కుటుంబ సభ్యులం ఆకలితో లేకుండునట్లు అనుగ్రహించు.

కాల కరై సొ ఆజ్‌ కర, ఆజ్‌ కరే సొ అబ్బ |
పల మే పరలయ హోయగీ, బహురి కరేగా కబ్బ ||

రేపు చేయాలనుకున్న పనిని నేడే చేయి. రేపు చేద్దాం అనుకున్న దాన్ని రాత్రే చేయి. ఒక నిమిషం కూడా ఆలస్యం చేయవద్దు. రేపు మనది కాదు.

– కె.శ్యాంప్రసాద్‌,
సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్‌,  9440901360

(జాగృతి సౌజన్యం తో)