పూరీ దేవాలయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఆయన సతీమణి పట్ల పూజారులు అనుచితంగా వ్యవహరించారన్న మీడియా కధానాల్లో ఏమాత్రం నిజం లేదని తేలింది. అలాగే పూజారుల ప్రవర్తన గురించి ఆలయ అధికారులకు రాష్ట్రపతి తన అసంతృప్తిని వ్యక్తం చేశారన్నది కూడా నిజం కాదు. రాష్ట్రపతి కార్యలయం నుండి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని దేవాలయ ప్రధాన పూజారి స్పష్టం చేశారు.
కోవింద్ దంపతులు మూడు నెలల క్రితం పూరీ జగన్నాధ మందిరాన్ని దర్శించుకున్నారు. ఒరిస్సా పర్యటన పూర్తిచేసుకుని వాళ్ళు సజావుగా ఢిల్లీ చేరుకున్నారు కూడా. కానీ ఇటీవల వారి పర్యటన గురించి మీడియాలో కొన్ని కధనాలు ప్రత్యక్షమయ్యాయి. దేవాలయ సందర్శనకు వెళ్లినప్పుడు రాష్ట్రపతి కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్ పట్ల కొందరు పూజారులు అనుచితంగా ప్రవర్తించారని, కులపరమైన వివక్ష చూపారన్నది ఆ కధనాల సారాంశం. పూజారుల అనుచిత ప్రవర్తన గురించి రాష్ట్రపతి కార్యాలయం స్థానిక అధికారులకు ఫిర్యాదు కూడా చేసిందని ప్రచారం జరిగింది.
అయితే ఒక పత్రిక జరిపిన స్వతంత్ర విచారణలో రాష్ట్రపతి భవనం నుండి అలాంటి ఫిర్యాదు ఏది జిల్లా యంత్రాంగానికి అందనేలేదని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్రపతి మీడియా కార్యదర్శి వెల్లడించారు. రాష్ట్రపతి భవనం నుంచి ఎలాంటి ఫిర్యాదుగానీ, లేఖగానీ వెళ్లలేదని చెప్పారు. కేవలం కొద్దిమంది రక్షణ కవాచాన్ని దాటుకుని రాష్ట్రపతి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారని, వారిని అడ్డుకోవడం జరిగిందని ఆయన వివరించారు. దేవాలయ సీనియర్ పూజారి ఇప్సిత్ ప్రతీహారి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. జగన్నాధుని దర్శనం తరువాత సంస్కృత విద్యాపీఠ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కోవింద్ చిన్నప్పుడు దేవాలయాన్ని దర్శించుకున్న సంగతి గుర్తుచేసుకున్నారని ప్రతీహారి వెల్లడించారు.
ఒడిషలో ప్రచారమైన ఒక కధనమే ఈ వివాదానికి కారణమని తేలింది. ఆ కధనం ప్రకారం దైవ దర్శనానికి వెళ్ళిన రాష్ట్రపతి దంపతులకు గర్భగుడిలో పూజారులు దారి ఇవ్వకుండా, అడ్డంగా నిలబడ్డారు. ఆ సమయంలో వారు రాష్ట్రపతి దంపతులను తాకారని ఆరోపణ. అయితే ఈ కధనానికి మూలం ఎవరన్నది తేలలేదు. అలాగే రాష్ట్రపతి పర్యటనలో ఆయనతోపాటు ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ కధనాలను కొట్టిపారేశారు. దేవాలయంలో పూజారులు అనుచితంగా ప్రవర్తించినట్లు తన దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.