Home Telugu Articles వాల్మీకి రామాయణం శంబుక వధ, రాముడు సీతాదేవి అడవిలో వదిలిపెట్టడం వంటి సంఘటల్లోని నిజానిజాలు

వాల్మీకి రామాయణం శంబుక వధ, రాముడు సీతాదేవి అడవిలో వదిలిపెట్టడం వంటి సంఘటల్లోని నిజానిజాలు

0
SHARE
సంపాదక వర్గ సూచన:

వాల్మీకి రామాయణం గురించి, శ్రీరాముడి గురించి ఇటీవల అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. వీటిన్నిటికి మూలమైన వాల్మీకి రామాయణంలో అసలు ఏమి ఉన్నదన్నది తెలుసుకోవాలి. అందుకు వాల్మీకి రామాయణాన్ని చదివి, అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తున్నప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని, తెలంగాణా విశ్వసంవాదక కేంద్ర సంపాదక బృందం భావిస్తోంది.

ఒకటి, శంబూక వధ, సీతను రాముడు అడవిలో వదిలిపెట్టడం వంటి సంఘటనలు ఉన్న ఉత్తర కాండం వాల్మీకి రామాయణంలో భాగమే కాదని, అది ప్రక్షిప్తమనే (కల్పితం)వాదన ఉన్నది. రెండు, ఈనాడు కుల వ్యవస్థగా ఘనీభవించిన వర్ణవ్యవస్థకు, త్రేతాయుగంలో వర్ణవ్యవస్థకు తేడా ఉన్నది. అప్పుడు ఒక వర్ణానికి చెందినవారు మరో వర్ణానికి మారే అవకాశం ఎక్కువగా ఉండేదని వాల్మీకి ఋషి కావడం ద్వారా తెలుస్తోంది. ఇప్పటి వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అప్పటి విషయాలను చర్చించడం, వాటిపై అభిప్రాయాలు ఏర్పరచుకోవడం సరైన పద్దతి కాదు. దానివల్ల అయోమయం కలుగుతుంది తప్ప ఎలాంటి స్పష్టత రాదు. కనుక ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కేవలం వాల్మీకి రామాయణంలో ఉన్న విషయాలను ప్రస్తావించడానికి ఒక రచయిత చేసిన ప్రయత్నంగానే ఈ వ్యాసాన్ని చదవాలి. రెండు భాగాల వ్యాసంలో

ఇది రెండవ భాగం.

***

మొదటి భాగం: వాల్మీకి రామాయణం ‘వాలి వధ’, ‘విభీషణుడి సహకారం’, ‘సీతా అగ్నిప్రవేశం’ లాంటి సంఘటనల్లోని నిజానిజాలు

అజ్ఞానం లేదా వక్రబుద్ధితో కొందరు రామాయణం పై చేస్తున్న నిందారోపణల్లో  వాలి వధ, విభీషణుడి సహకారం, రావణుడి గుండె కిందకు బాణము వేసాడన్న అపోహ, సీతా అగ్నిప్రవేశం వంటి ముఖ్యమైనవాటి గురించిన నిజానిజాలను గత వ్యాసంలో చూశాం. ఈ వ్యాసంలో శ్రీరాముడు సీతమ్మను అడవికి పంపడం, శంబుకావధ గురించి రామాయణం ఏమిచెపుతోందో ప్రామాణికంగా అతి క్లుప్తంగా పరిశీలిద్దాం.

5) సీతమ్మ వాల్మీకీ మహర్షి ఆశ్రమ ప్రవేశం :

సీతమ్మను శ్రీరాముడు అడవులలో వదిలేశాడు అని నిజం తెలియక కొందరు అమాయకులూ, వారితో పాటు  తెలిసినా కూడా కొందరు కుహనా మేధావులూ అంటారు. కానీ శ్రీ రాముడు సీతమ్మను వదిలేయలేదు. అడవులలో అంతకన్నా కాదు. శ్రీ రాముడు లక్ష్మణుడుతో తమసా నదీ తీరంలో ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపంలో రధంలో తీసుకువెళ్లి విడిచి పెట్టమని చెప్పాడు. అంటే శ్రీ రాముడు తన ప్రాణ సమానురాలైన సీతాదేవి మహర్షి ఆశ్రమంలో ఉండాలనుకున్నాడు. అంతేకానీ అడవులపాలు చేయాలనుకోలేదు. (ఉత్తరకాండ 45వ సర్గలో 16, 17, 18 శ్లోకములు).

మరి తన ప్రాణ సమానురాలైన భార్యను ఏకపత్నీ వ్రతుడైన శ్రీ రాముడు ఎందుకని ఆశ్రమం వద్ద విడిచి పెట్టమని పరమ దుఃఖంతో చెప్పవలసి వచ్చిందో తెలుసుకోవాలి –

శ్రీరాముడు తన సభలో ఆసీనుడై రాజ్యములో ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో సమగ్రముగా తెలుపమని సభలోని భద్రుడను వాడిని ప్రశ్నించగా, భద్రుడు రాముడికి అంజలి ఘటించి నమస్కరించి రాజ్యములోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తమ పాలనకు ఎంతగానో సంతుష్థులై భోగభాగ్యలతో ఉన్నారని తెలిపాడు. అప్పుడు రాముడు ఉన్నది ఉన్నట్టుగా తెలుపుము రాజుయొక్క గుణదోషాల గూర్చి ప్రజలు చర్చించుకొనుట సహజమే కదా నిర్భయముగా తెలుపమని తిరిగి ప్రశ్నించాడు..

ఇక్కడే చాలా మంది ఒక కులానికి చెందిన వ్యక్తి చేసిన వ్యాఖ్యగా చెప్పుకుంటారు.  అది కేవలం సినిమా ప్రభావం మాత్రమే, వాల్మీకి రామాయణంలో ఆ విధంగా లేదు.

అప్పుడు భద్రుడు నమస్కరించి “రాజ్యములో అన్నీ చోట్లా అందరునూ మీ గుణదోషముల గూర్చి ఈ విధముగా మాట్లాడుకుంతటున్నారు. శ్రీ రాముడు అద్భుతమయిన సేతువు నిర్మించాడు, ఎందరో రాక్షసులనూ దుర్జయుడైన రావణుడిని సంహరించాడు. కానీ యుద్ధమున గెలిచి తన రోషమును విడిచి పెట్టి సీతాదేవిని స్వీకరించి ఆమెను మరల భవనమునకు తీసుకు వచ్చాడు.’

అస్మాకమపి దారేషు సహనీయం భవిష్యతి | యధా హి కురుతే రాజా ప్రజాతమనువర్తతే || (ఉత్తరకాండ 43వ సర్గలో 19వ శ్లోకం)

తా: కొంత కాలము పరుల చెంతన రావణ అపహరణలో ఉన్న భార్యను రాముడు ఎందుకు ఏవగించుకోవడము లేదు? ఇక మనము కూడా మన భార్యల యందు ఇట్టి సహనమునే చూపవలసి వచ్చునేమో, రాజు యొక్క మార్గమునే ప్రజలు అనుసరిస్తారు కదా ” అని ఈ విధముగా అనుకుంటున్నారని భద్రుడు తెలిపాడు.

తరువాత ఉత్తరకాండ 45వ సర్గలో 11, 12, 13 శ్లోకాలలో శ్రీ రాముడు తన తమ్ములతో బాధతో పలికిన మాటలు చూస్తే “ సీతాదేవి గూర్చి పౌరులలో ప్రజలలో వ్యాపించుచున్న దుర్భర అపవాదము, నా పై వారిలో ఏర్పడిన ఏవగింపు నా హృదయాన్ని ఎంతగానో కలవరపరుస్తున్నది. అందువలన నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను. లోకములో ఎవరికైననూ అపకీర్తి వస్తే ఆ అపకీర్తి నిలిచి ఉన్నంత వరకూ వారు అధోలోకములలో పడిపోతారు, అటువంటి అపకీర్తిని దేవతలు కూడా నిందిస్తారు.” అని అంటాడు. అంటే రాజైన తనకు అపకీర్తి వలన వచ్చే అధోగతి వలన, తాను రాజైనందువల్ల రాజ్యం, ప్రజల పై ఆ ప్రభావము తప్పక పడి రాజ్య ప్రజలలో సుఖ సంతోషాలకు బదులు దుఃఖములు కలుగవచ్చునని భాధపడ్డాడు ప్రజలకు తండ్రి వంటి రాజైన శ్రీ రాముడు.

తరువాత మళ్ళీ  ఉత్తరకాండ 45వ సర్గలో , 14, 15 శ్లోకములలో* “నేను ఈ లోకాపవాదముల వలన కలుగు భాధతో సోదరులైన మీతో సహా నా ప్రాణములను కూడా త్యజించడానికి వెనుకాడను, ఇక సీతాదేవి విషయము చెప్పనేల? అందువలన అంతులేని శోకములో మునిగి ఉన్న నన్ను గమనించండి. నా దృష్టిలో రాజుగా ఉన్న నాకు ఈ మిగుల దుర్భరమైన లోకాపవాదమునకు మించిన దుఃఖమే ఉండదు” అని అంటాడు శ్రీ రాముడు.

రాముడు ఈ లోకాపవాదాల వల్ల  కలిగే భాధకు తన తమ్ముళ్ళనూ ఆఖరికి తన ప్రాణాలనయినా త్యజించాలని అనిపిస్తున్నదని, లోకాపవాదాలకు మించిన దుఃఖమే ఉండదని తెలుపుతూ, తాను రాజు కావడంచేత  లోకోపవాదాల వల్ల తమ్ముళ్లను కానీ ప్రాణాలను కానీ విడిచిపెట్టినట్లైతే అది రాజ్యానికి తీవ్ర నష్టం కాబట్టి అటువంటి లోకాపవాదం రాకుండా సీతను త్యజించడమే రాజుగా తన ధర్మమని భావించాడు.

ఇప్పుడు ఆ రాజ్యంలో ప్రజలు అనుకుంటున్న విధంగా వారికి సమస్య వస్తే తాను ధర్మం చెప్పవలసి ఉన్నప్పుడు  తన విషయంలో జరిగినది వారు గుర్తు చేస్తే తాను ధర్మం చెప్పినా అది ప్రజలు ఆమోదించరు.  దానికి కారణం లోకాపవాదు. కనుక ఆ లోకాపవాదానికి కారణంగా కనిపిస్తున్న సీతమ్మను ఒక రాజుగా త్యజించక తప్పదు.

ఇక్కడ అసలు విషయం ఇంకొకటి ఏమిటంటే రాముడి ధర్మ నిష్ఠను సీతమ్మ కూడా అర్ధం చేసుకుని ఆమోదించింది. అది ఉత్తరకాండలో 48వ సర్గలో 13, 14 , 15 శ్లోకములలో చూడవచ్చును. ఆ సందర్భంలో సీతాదేవి శ్రీరాముడికి చెప్పమని లక్ష్మణుడితో ఇలా చెప్పింది  “శ్రీరామా! లోకాపవాదముల వలన నీ పైన వచ్చిన అపనిందను నేనే తొలగించవలసియున్నది, దానికి నీవు నన్ను ఇక్కడ విడిచితివి. నిత్యము ప్రజలను నీ సోదరులవలె ఆత్మీయతతో చూసుకుంటూ ఉండడము నీకు పరమధర్మము. దీని వలన నీకు శాశ్వత కీర్తి లభించును. నీ ధర్మనిరతిని బట్టి ప్రజలు కూడా ధర్మపరాయణులే అవుతారు” అని. దీని వలన తెలిసేదేమిటంటే, విధి ప్రభావం వల్ల జరిగిన సంఘటనలు ఎలాగున్నాప్రతి ఒక్కరు తమ  ధర్మాన్ని ఆచరించవలసి ఉన్నది కనుక ఈ విధంగా రాముడు చేయడమే సబబు అని సీతాదేవి తెలిపింది.

శ్రీరాముడు సీతమ్మను ఆశ్రమవాసానికి పంపినా ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడా? లేదు కదా.. తాను రాజు. ఎందరినో పెళ్లి చేసుకోవచ్చును. అయినప్పటికీ తాను సీతా వియోగముతో జీవిత పర్యంతమూ దుఃఖించాడే కానీ వేరొక స్త్రీని కలలో కూడా ఎరుగని ఏకపత్నీవ్రతుడు. ఇందులో శ్రీరాముడు ధర్మానికి కట్టుబడి ఉండడం తప్ప మరేదిలేదు. ఈ విషయంలో సీతారాములు ఏకాభిప్రాయం కలిగి ఉంటే  కొందరికి మాత్రం అయోమయం ఎందుకు కలుగుతోంది ! వాళ్ళు అధర్మపరులు కాబట్టా? ధర్మం కొన్ని సార్లు కఠినంగానే కనిపిస్తుంది. కానీ అదే ధర్మం శాశ్వత కీర్తిని తీసుకువస్తుంది. అందుకే శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మం అని మారీచునివంటి రాక్షసుడు కూడా కీర్తించాడు (అరణ్యకాండ,37-13).

ఇక్కడ మనం గమనించవలసినది ఏమంటే పూర్వం కైకేయి తనను కోరిన వరాలను తీర్చవలసిన అగత్యం లేదని,  రాముడిని అడవికి వెళ్లవద్దని, అయోధ్యలోనే ఉండి రాజ్యం చేయమని తండ్రే స్వయంగా అంటాడు. తమ్ముడైన భరతుడూ అంటాడు. ఆఖరికి వరం అడిగిన కైకేయీ అంటుంది. మంత్రులూ ప్రజలందరూ అడుగుతారు వెళ్లవద్దు ఉండమని. కానీ తాను అలా వెళ్ళక ఉండిపోతే తన తండ్రికి ఇచ్చిన మాటను తప్పిన వాడిగా లోకాపవాదు రావచ్చునని ఒక క్షత్రియుడుగా ఆ లోకాపవాదు రాకుండగా చేయడానికి తనకు తానే అడవులకు వెళ్ళాడు. ఇప్పుడు ఈ సందర్భంలో ఆ లోకాపవాదు విధివశాత్తు సీతమ్మ విషయంలో కలిగే అవకాశం ఉన్నందువల్ల ఆమెను ఆశ్రమవాసానికి పంపక తప్పలేదు. రెండు సందర్భాల్లోనూ  రాముడు తన క్షత్రియ ధర్మానికే కట్టుబడి ఉన్నాదన్నది అసలు విషయం.

6) శంబూక వధ :

ఈ విషయంలో కుహానా మేధావులు హిందువులలో అంతః కలహాలు సృష్టించి ఒక వర్గం వారిని పక్కదారి పట్టించడానికి ఎంతో కాలంగా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంత మంది హిందువులు ఈ కుళ్ళు బుద్ధి కలిగిన కుహనా మేధావుల మాటలను, అవగాహన లేని కొందరు పెద్దల వ్యాఖ్యలను నమ్మినప్పటికీ, ఎందరో హిందువులు మన ధర్మంలోని విషయాలు కేవలం బాహ్యార్ధానికి మాత్రమే అందవని, సమగ్ర విశ్లేషణ లేనిదే అర్ధం కావని గ్రహించి ధర్మానికి  కట్టుబడి ఉన్నారనేది గ్రహించవలసిన విషయం.

శంబూక వధ గురించి ఉత్తరకాండ లో 74, 75, 76 వ సర్గలలో సమగ్ర వివరణ ఉంది. అది ఆ కాలములో అంటే త్రేతా యుగంలో యుగ ధర్మానుసారం ఎలా అన్వయమైంది, ఈ కలియుగంలో యుగ ధర్మము గురించి కూడా అందులోనే ఉన్న ప్రస్తావనను క్లుప్తంగా పరిశీలిద్దాం.

ఆనాటి యుగ ధర్మం ప్రకారం ఒక రాజు ధర్మ పరిపాలన చేస్తే ఆ రాజ్యంలో అకాల మరణాలు ఉండవు. ఒకవేళ సంభవిస్తే ఆ రాజ్యంలో ఎక్కడో అధర్మం జరిగిందని అర్ధం. శ్రీ రాముడు తన రాజ్యాన్ని  ధర్మ యుక్తంగా పరిపాలిస్తున్న సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు దుఃఖిస్తూ  అకాల మృత్యువుకి లోనైన తన కుమారుడి కళేబరం తీసుకు వచ్చి రామునికి చూపిస్తాడు.

ఓ శ్రీరామ నేనే పాపం చేశానో నా కుమారుడు ఇలా అకాల మృత్యువుకి లోనైనాడు, నా పాపంతో పాటు ఈ రాజ్యానికి రాజువైన నీ దోషము కూడా కారణము కావచ్చును, ఎందుకంటే ఇతర రాజ్యాలలో ఎటువంటి అకాల మరణాలు లేవు. నీ ఈ రాజ్యంలో నీ దృష్టికి రాకుండా ఎక్కడో అధర్మం జరిగి ఉండవచ్చు, కాబట్టి నీవు ఆ అధర్మాన్ని నిర్మూలిస్తే ఇది కేవలం అకాల మృత్యువు కనుక నా పుత్రుడు తిరిగి బ్రతుకుతాడు. నీవు ఈ పని చేయకపోతే  నేను, నా భార్య ఇక్కడే ప్రాణ త్యాగం చేస్తామని ఆ వృద్ధుడు విలపించాడు.

అప్పుడు నారద మహర్షి వచ్చి ఈ బాలుడికి అకాల మృత్యువు ఎలా వచ్చిందో చెప్పాడు –

“కృత యుగములో కేవలం బ్రాహ్మణులు మాత్రమే తపస్సులను ఆచరించడానికి యోగ్యులు, వారికి మాత్రమే ఉపదేశముండును. ఇతర మూడు వర్ణముల వారికి ఆ అర్హత ఉండదు.

త్రేతాయుగములో బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా తపశ్చర్యలకు యోగ్యులే అవడంతో వారి ఇరు వర్ణముల వారూ సమానులుగా ఉంటారు. ఈ యుగములో, ఇతర వర్ణముల వారికి తపస్సు చేయుటకు అనుమతి, ఉపదేశం ఉండదు.

ద్వాపర యుగములో బ్రాహ్మణ క్షత్రియులతో పాటు వైశ్యులకు కూడా అర్హత కలిగి వారు కూడా తాపసులు కావచ్చును..

భవిష్యచ్ఛూద్రయోన్యాం వై తపశ్చర్యా కలౌ యుగే | అధర్మః పరమో రాజన్ ద్వాపరే శూద్ర జన్మనః || (ఉత్తరకాండ 74వ సర్గ 27వ శ్లోకము)

అనగా ద్వాపర యుగము అంతకు ముందు యుగములలో యుగధర్మాలను అనుసరించి శూద్ర వర్ణం వారికి తపస్సు చేయుటకు అనుమతి లేకున్నది. కానీ కలియుగములో శూద్రులకు కూడా తపశ్చర్య ప్రవృత్తి ఏర్పడి అందరూ సమానులుగా ఉందురు.  కాబట్టి యుగ ధర్మమును ఆచరించి నీ రాజ్యము అంతటా సంచరించి ఎవరైనా అధర్మమును ఆచరిస్తూ ఉంటే వారిని ఒక రాజుగా సంహరించి ధర్మమును నిలబెట్టుము. తద్వారా అకాల మృత్యువు బారిన పడిన బాలుడు పునర్జీవుతుడు కాగలడు.” అని నారద మహర్షి పలికెను.

అది విన్న రాముడు తన రాజ్యమంతటా తిరుగుతూ శంబూకుని వద్దకు చేరెను. అక్కడ శంబూకుడు అధోముఖుడై తీవ్ర తపస్సును ఆచరించు చుండగా రాముడు వచ్చి ఆయనను ఈ విధంగా ప్రశ్నించెను. “ఓ వ్రత నిష్ఠాగరిష్ఠుడా నీవు ఎంత ధన్యుడవు. తపోవృద్ధుడా నీ జన్మ ఎట్టిది? నీ శక్తి సామర్ధ్యములు ధృడమైనవి. కావున కుతూహలముతో ఈ విధంగా అడుగుతున్నాను. నేను దశరధ కుమారుడైన శ్రీ రాముడిని. నీవు ఈ ఘోర తపస్సు ఏమి ఆశించి ఎందుకు చేయుచున్నావు? నీకు కావలసిన వరమేమి? స్వర్గ భోగములు కావలెనా, లేక వాటికి మించినవా తెలుపుము ” అని అడిగెను.

దానికి శంబూకుడు “శ్రీరామా నేను శూద్రుడను నా పేరు శంబూకుడు. ఈ శరీరముతోనే దివ్యత్వమును పొందగోరుచున్నాను. నేను దేవలోకమును జయింపదలచి ఇట్టి ఉగ్రతపస్సును పూనుకుంటిని, నా పలుకులు నిజము” అని తెలుపగా శ్రీరాముడు అతడిని వధించాడు. ఇక్కడ ముఖ్యంగా గ్రహించ వలసినవి కొన్ని ఉన్నాయి :

– > శంబూక వధ అన్యాయంగా జరిగింది, అతడు శూద్రుడు కాబట్టి రాముడు చంపాడు  అని ఈ కలియుగములో మనం చర్చలు చేసుకోడానికి వీలు కాదు. ఎందుకంటే ఆ యుగంలోని ధర్మము అది. ఆ యుగములో వారు అటువంటి ఉగ్రతపస్సు చేయడం చేత ధర్మానికి హాని కలుగుతుంది కనుక.

–  > ఇక్కడ శూద్రుడైన శంబూకుడు ఆ యుగ ధర్మముకి విరుద్ధముగా తపస్సు చేయడం వలన వధ జరిగినది కానీ కేవలం శూద్రుడు కావడం చేత కాదు.. రామ రాజ్యంలో ధర్మబద్ధంగా ఉన్న శూద్ర వర్ణం వారు అందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు అనే శ్లోకాలు రామాయణములో అనేకం ఉన్నాయి.

– > శ్రీ రాముడు  శంబూకుడుని వధించినది కేవలం ఒక వర్ణం వారి కోసమే కాదు లేక ఒక వర్ణం పైన కోపంతోనూ కాదు. తన రాజ్యంలో అన్నీ వర్ణాల వారు అకాల మృత్యువు బారిన పడకుండా చూసేందుకు.  శంబూకుడు అనే అధర్మము చేస్తున్న ఒక్క శూద్రుడుని వధించినది అనేక మంది పిల్లలను అకాల మృత్యువు కలుగకుండా తన ధర్మముతో కాపాడేందుకు. అలా కాపాడినవారిలో  శూద్ర వర్ణాకి చెందిన బాలురు కూడా ఉంటారు అనేది కూడా గ్రహించవలసిన విషయం.

-> ఏ జీవి శరీరంతో స్వర్గానికి వెళ్ళడం వీలు కాదు. అది ప్రకృతి నియమం. ఈ జన్మలో చేసిన తపస్సు, యజ్ఞం, లేక ఏ ఇతర సత్కార్యం వల్ల వచ్చిన పుణ్యంతో మరణానంతరం మాత్రమే స్వర్గానికి వెళ్లగలరు. ఈ ప్రకృతి నియతిని భంగం చేస్తూ శంబూకుడు తపస్సు చేయడం లోకవ్యవస్థకు హానికరం. అందుకే అకాల మరణం వంటి ఉత్పాతాలు.

– > శ్రీ రాముడు అన్నీ వర్ణాల వారిని సుఖశాంతులతో జీవించేలా చూసుకున్నాడు అనేది వాల్మీకి రామాయణంలో రామరాజ్య వర్ణనలో స్పష్టంగా చూడవచ్చును.  అధర్మవర్తనుడైన ఒక శూద్రుడుని వధించాడు. అధర్మవర్తనులైన  క్షత్రియులనూ సంహరించాడు. అంతకు ముందు పరశు రాముడు కూడా ఎందరో అధర్మపరులైన క్షత్రియులను సంహరించాడు. అలాగే రాముడి ఆదేశానుసారం శత్రుఘ్నుడు అధర్మము చేసిన గంధర్వుడిని సంహరించడం కూడా చూడవచ్చును. అదే రామాయణంలో ఒక బ్రాహ్మణుడైన రావణుడిని చంపడానికే రాముడు పుట్టాడు కదా!! అధర్మపరుడై, సాక్షాత్ బ్రహ్మ వంశముకి చెందిన రావణ బ్రహ్మను రాముడు సంహరించాడు. రావణుడు బ్రాహ్మణుడు కాదు అనుకోవడం కొందరి అయోమయమో లేక అమాయకత్వమో లేక ఉద్దేశపూర్వక వక్రపు ఆలోచనలో వారికే తెలియాలి మరి. !!

కాబట్టి శంబూక వధ శూద్రుడిని వధించడంగా కాకుండా అధర్మపరుడిని వధించడం అనీ, అధర్మపరులైతే ఒకసారి బ్రాహ్మణుడు, ఒకసారి శూద్రుడు, మరో సందర్భంలో క్షత్రియులను వధించడం జరిగిందని తెలుసుకోవాలి.  దాని వలన పదకొండు వేల సంవత్సరాల రామరాజ్యంలో అన్నీ వర్ణాల వారూ ఆనందముగా సుఖ సంతోషాలతో జీవించారు అనేది  ప్రామాణికమైన సత్యం.

ఇక్కడ రామాయణము ద్వారా మనము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే  భవిష్యచ్ఛూద్రయోన్యాం వై తపశ్చర్యా కలౌ యుగే అనగా కలియుగములో శూద్రులకు కూడా తపశ్చర్య ప్రవృత్తి ఏర్పడి అందరూ సమానులుగా ఉందురు.  కాబట్టి యుగాలలో వేరు వేరుగా ఉండే ధర్మాలు ఈ కుహనా మేధావులకు సరిగా తెలియక, లేదా తెలిసినప్పటికీ కుట్రతో కుళ్ళు బుద్ధితో  అందరికీ తెలియకుండా దాచి ఉంచి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి వారి స్వలాభాలు పొందుతూ పబ్బం గడుపుకుంటున్నారు.

లొసుగులు వెతికే వారికి మరో విషయం  చెప్పవలసి ఉంది –

 యుగ యాగానికీ మనుష్యుల శక్తి క్షీణిస్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అన్నియుగములలో అన్నీ వర్ణాల వారూ తమ తమ స్వకర్మలను ఆచరించే వారు, వారిలో హెచ్చుతగ్గులు లేవు. కృత యుగములో మనుష్యులకు ఎక్కువ శక్తి ఉండడము చేత బ్రాహ్మణుల తపస్సు మొత్తం సమాజానికి సరిపోయింది.  త్రేతా యుగములో మనుష్యుల శక్తి కొంత క్షీణించి క్షత్రియులు కూడా తపశ్చర్య చేయవలసి వచ్చినది. ద్వాపరయుగములో ఇంకొంత శక్తి క్షీణిస్తుంది కాబట్టి వైశ్యులు కూడా తపశ్చర్య  చేయవలసి వచ్చినది, కలియుగము వచ్చేసరికి మనుష్యుల శక్తి మరింత క్షీణించడము చేత అందరూ ధర్మము ద్వారా లోకములను కాపాడటము కొరకు తమకు చేతనైన తపశ్చర్య చేయవలసి ఉన్నది. దీని అర్ధము ఆ ముందు యుగాలలో మిగతా వారికి ఆ అర్హత లేదా అని కాదు, అవసరము లేదు అని. ఆ మాటకొస్తే కృతయుగంలో అందరూ బ్రాహ్మణులే అని శాస్త్రాలు చెపుతున్నాయి. ఆనాటి వ్యవస్థ వివిధ కర్మలు పనులను బట్టి నడిచే వ్యవస్థలేకానీ  అనేక ఉద్యోగములు ఉండే వ్యవస్థ కాదు. అలాంటప్పుడు వివిధ పనులకు ఆయా వర్ణములలో వారు మాత్రమే ఆయా పనులు లేదా కర్మలు చేయడం అనేది నియమం లేకపోతే ఆనాటి వ్యవస్థలలో జన జీవనము అచిర కాలములలోనే స్తంభించి పోయి ఉండేది..  కాబట్టి ఆ విధ్యుక్త ధర్మాన్ని బట్టి ఆచరణ నిర్ణయింపబడి ఉంది.  దానిపైనే సృష్టి, మానవ మనుగడ ఆధారపడి ఉన్నది.  అదే లేకుంటే ఈనాడు వాటి గురించి మాట్లాడుకోడానికి, చదవడానికి కూడా మనం ఈ విధంగా నాగరికత కలిగి ఉండే వాళ్ళం  కాదు. ప్రపంచానికి నాగరికత నేర్పిన సనాతన ధర్మము, సంస్కృతీ మనది.

యుగములు ఉన్నాయి అందులో ఆ యుగములో ఇలా జరిగింది అని ఎవరు మాట్లాడుతున్నా ఆయా యుగాలలో మనుష్యుల శక్తులను బట్టి ఆయా యుగలలో ఉండే వ్యవస్థలను బట్టి యుగ ధర్మాలు కూడా ఉంటాయని మనము తప్పక అంగీకరించవలసి ఉంటుంది. అంతెందుకు మన తాతతండ్రులకు ఉన్న దీర్ఘ ఆయుర్దాయము, ఆరోగ్యము, సుఖ సంతోషాలు మనకు ఈనాడు లేకుండా పోయాయని పురాణాలను ద్వేషించే వారితో సహా అందరూ ఒప్పుకుంటారు. ఇక గత యుగాలవారికి, మనకు ఉన్న తేడా చెప్పేదేముంది. యుగాలు యుగ ధర్మాలు ఉంటాయి అని అంగీకరించను అని నాస్తికుడైనా లేదా ఇతర నమ్మకానికి చెందిన వాడైనా అనుకున్నప్పుడు అసలు ఈ విషయముల గూర్చి ప్రస్తావించే అర్హత కూడా ఉండదు. వారి ప్రస్తావన అప్పుడు అర్ధరహితము అవుతుంది. ఇది కనీసపు ఇంగిత జ్ఞానము. ఈనాడు ఈ కుతర్కములు చేసేవారికి ఆలోచనా లోపమైనా ఉండాలి లేదా విషయ పరిజ్ఞానము లోపించి ఉండాలి . అదీ కాకపోతే  రామో విగ్రహవాన్ ధర్మః – మూర్తీభవించిన ధర్మం రాముడు. మీరు నన్ను వద్దనుకున్నా ధర్మముతో ఉండండి ధర్మములో జీవించండి నాకు అందరూ సమానులే మీకు నేనున్నాను అంటూ శ్రీ రామ రక్షను ప్రసాదిస్తున్నాడు.. తనను శరణు కోరినవారిని శరణాగతవత్సలుడైన రాముడు తప్పక తన రక్షణలో ఉంచుతాడు.

శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష
శ్రీరామ జయరామ జయజయ రామ
శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః

– మునిపల్లె జ్యోతీ స్వరూప్