‘దేశమును ప్రేమించుమన్నా..
దేశమంటే మట్టికాదోయ్..’
– అనే గురజాడ వారి గేయం అంటే వామపక్షాల వారికి చెప్పలేనంత అభిమానం. గురజాడ వారు భగవద్గీతను ప్రశంసించినా, రాజభక్తిని కలిగి ఉన్నా- ‘కామ్రేడ్ల’కు అభ్యంతరం లేదు. అయితే- అదే దేశభక్తిని చాటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) వారి ‘నమస్తే సదావత్సలే మాతృభూమి’ అనే ప్రార్థనా వాక్యం వింటే కమ్యూనిస్టులకు తీవ్రమైన ఆగ్రహం కలుగుతుంది. ‘భారతీయత’ అన్న మాట అన్నా వారికి ఎందుకు ఏవగింపు? దీనికి కారణం ఏమిటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందూమతాన్ని మాత్రమే అభిమానిస్తుందని వారి అభిప్రాయం. అది పొరపాటు. మహమ్మదీయులకు వారి మతంపై అభిమానం ఉండవచ్చు. క్రైస్తవులకు వారి మతంపై మమకారం ఉండవచ్చు. మత ప్రచారం చేస్తూ, క్రీస్తు తప్ప ఎవరూ మానవులను ఉద్ధరించలేరని క్రైస్తవులు ప్రచారం చేసుకోవచ్చు.
అన్యమత ప్రచారం గురించి లౌకికవాదులమని చెప్పుకునే వామపక్ష నేతలు అసలు ప్రస్తావించరు. హిందూ దేశం అంతా హైందవంగా అయిపోతుందని, అలా ఎన్నటికీ జరగడానికి వీలులేదన్నది వారి వాదన. ఈ దేశంలో నివసించే వారంతా భారతీయులే అని సంఘ్ చెబుతుంది. అది దోషమా? మతాలు వేరుకావచ్చు, భాషలు వేరుకావచ్చు. కాని ఇక్కడ నివసించే వారంతా భారతీయులే. ఈ దేశం కేవలం హిందువులకే చెందినదని అనుకోకూడదు. దేశీయులందరూ సంఘ్‌ను గౌరవిస్తే తప్పు ఏమిటి? .
నాలుగేళ్లక్రితం నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుండి దేశమంతా ‘కాషారుూకరణ’ జరుగుతోందని, ఇక దానికి అడ్డుకట్టవేసి మోదీని గద్దె దింపాలని ప్రతిపక్షాలు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. మోదీ పాలన ప్రారంభమైన తరువాత అత్యాచారాలు పెరిగిపోయాయా? దళితులపై దాడులు ఎక్కువయినాయా? అవి గతంలో లేవా? జాతీయ గీతమైన ‘జనగణమన’ను తాము ఆలపించేది లేదని కొందరు ముస్లిం మత పెద్దలు అంటున్నారు. అలాంటి వారిని వామపక్షాలవారు ఎందుకు ప్రశ్నించరు? భరతమాత అనే పదం ఉచ్ఛరించకూడదా? ఒక వ్యక్తి చెట్టును పూజిస్తాడు, రాయిని పూజిస్తాడు, పుట్టను పూజిస్తాడు. అందువలన ఇతరులకు ఏం నష్టం కల్గింది? అలాటి వారిని ఎందుకు అపహాస్యం చేస్తారు? భావప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో ఇతరుల భావాలపై దాడిచేసే హక్కు వీరికి ఎవరిచ్చారు?
ఎవరి మతం వారిది. ఎవరి ఆలోచనలు వారివి. వాటిని హేళన చేయకూడదు. ముహూర్తం, జ్యోతిషం మూఢ నమ్మకాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. అలా ప్రచారం చేసే వారికి ఎందుకింత బాధ? కాటన్ దొర గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి డెల్టాను సస్యశ్యామలం చేశాడు. కృతజ్ఞతాపూర్వకంగా ఆనాడు కొందరు కోనసీమ బ్రాహ్మణులు ఆతనిని నిత్యం తలచుకునే వారట! నేటికీ కాటన్ విగ్రహాలు ఏర్పాటుచేసి గౌరవిస్తున్నారు. డయ్యర్ అనే బ్రిటిష్ అధికారి ‘జలియన్‌వాలా బాగ్’లో అనేక మందిని కాల్చి చంపించాడు. మనం అతనిని ఇప్పటికీ నిందిస్తూనే ఉన్నాం. కనుక మంచిని మంచిగాను, చెడును చెడుగాను చెప్పేదే భారతీయత. ఇటీవల అనేక మంది వివిధ విషయాలలో ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ప్రతిజ్ఞ అనేది హృదయ పూర్వకంగా చేయాలి. అనగా చేయి హృదయంపైన వేసుకుని చేయాలి. కాని అలాచేయడం లేదు. చేయిచాపి చేస్తున్నారు. అనగా ఈ ప్రతిజ్ఞను గాలికి వదిలేస్తున్నానని సూచిస్తుంది. కనుక హృదయంపై చేయి వేసుకుని చేస్తే అది ఆరెస్సెస్ తరహా అయిపోతుందని భయపడిపోయి అలా చేస్తున్నారు. హృదయంపై చేయివేసుకుని ప్రతిజ్ఞచేయడం మంచిది.
ఈ దేశాన్ని మత ప్రాతిపదికపై విడదీయడానికి భారతీయులు ఎన్నడూ అంగీకరించలేదు. దేశంలో వివిధవర్గాల వారు కలసి మెలసి ఉండాలనేది విశ్వాసం. దేశ విభజన జరగకుండా ఉండేలా పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన జిన్నాను దేశాధ్యక్షుడిగా చేస్తామని గాంధీజీ అలనాడు ప్రకటించారు. అయినా జిన్నా అందుకు అంగీకరించలేదు. భారతీయుల ఐక్యతయే సంఘ్ ప్రధానాశయం. స్వాతంత్య్రానికి పూర్వమే మహారాష్ట్ర నుండి అనేక మంది ప్రముఖ ఆరెస్సెస్ కార్యకర్తలు వివిధ రాష్ట్రాలకు వెళ్లి ప్రధాన నగరాలలో సంఘ్ శాఖలు ఏర్పాటుచేసి, నిత్యం సాయంత్రం వేళ సమావేశాలు జరిపేవారు. ఆనాడు రాజమహేంద్రవరంలో కూడా ఒక శాఖ ఉండేది. గాంధీజీ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు ముడిపెట్టడం వల్ల దేశవ్యాప్తంగా ఆరెస్సెస్ సమావేశాలకు ఆటంకం ఏర్పడింది. ఆనాటినుండి వివిధ ప్రదేశాలలో సంఘ్ కార్యకలాపాలు కొన్నాళ్లు నిలిచిపోయాయి. నేటికీ సంఘ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల సమయాలలో ఎనలేని సేవ చేస్తున్నారు. రాజకీయ కోణంలో ఆరెస్సెస్‌పై నిందలు వేయడం మంచిది కాదు.
-వేదుల సత్యనారాయణ 96183 96071
(ఆంధ్రభూమి సౌజన్యం తో)
(ఈ వ్యాసం మొదట 26 జూలై, 2018 నాడు ప్రచురితమైంది)