Home News ఆర్ఎస్ఎస్ పేరుప్రతిష్టలు ఆశించదు : డా. మోహన్ భాగవత్

ఆర్ఎస్ఎస్ పేరుప్రతిష్టలు ఆశించదు : డా. మోహన్ భాగవత్

0
SHARE

“రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పేరుప్రతిష్టలు, ఆధిపత్యం కోసం పనిచేయదు. సమాజాన్ని పటిష్టపరచడం కోసం కృషి చేస్తుంది.’’ అని ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ‘భవిష్యత్తులో భారతం: ఆర్ ఎస్ ఎస్ దృష్టికోణం’ అనే అంశంపై జరుగుతున్న మూడురోజుల ఉపన్యాస కార్యక్రమంలో మొదటి రోజున ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు, వేరువేరు రాజకీయ పార్టీల నాయకులు కూడా హాజరయ్యారు.

ప్రముఖ ఆర్ధికవేత్త డా. బజరంగ్ లాల్ గుప్త (ఉత్తర క్షేత్ర సంఘచాలక్) ప్రారంభోపన్యాసంతో కార్యక్రమం మొదలైంది. “ఈ కార్యక్రమం ఇలా, ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారని చాలామంది సందేహపడుతున్నారు. జనజీవనంలో వివిధ రంగాలకు చెందినవారిని కలవడం సంఘ కార్యంలో ప్రధాన భాగం. అందుకోసం దేశం మొత్తంలో ఇలాంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటాం. అయితే ప్రత్యేకంగా ఆహ్వానించిన ప్రముఖులను ఉద్దేశించి సర్ సంఘచాలక్ మాట్లాడటం మాత్రం ఇదే మొదటిసారి’’ అని ఆయన అన్నారు.

“ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేశారనే ప్రశ్న ఎప్పుడైనా వస్తుంది. సర్ సంఘచాలక్ జీ కార్యక్రమాలు సంవత్సరం ముందే నిర్ణయమవుతాయి. వారాంతంలో ఇలాంటి కార్యక్రమం పెట్టుకోవాలని, అప్పుడు అందరికీ సౌకర్యంగా ఉంటుందని నేను కూడా అనుకున్నాను. కానీ సర్ సంఘచాలక్ జీ ఇతర పనుల దృష్ట్యా ఈ తేదీల్లోనే (17,18,19) నిర్వహించాలని నిర్ణయించారు’’ అని బజరంగ్ లాల్ జీ వివరించారు.

“ఆర్ఎస్ఎస్ పని, లక్ష్యాల గురించి తెలుసుకోవాలని ప్రజల్లో చాలా ఆసక్తి ఉంది. సంఘ కార్యం గురించి ప్రజల్లో ఉన్న సందేహాలను తీర్చడానికే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశాం. సంఘ పెద్దగా సర్ సంఘచాలక్ సంఘ కార్యాన్ని గురించి మొదటి రెండు రోజులూ వివరిస్తారు. ఆ తరువాత మూడవ రోజున ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానం చెపుతారు.” అని కార్యక్రమ సరళిని వెల్లడించారు.

సంఘ కార్యం ఎంత ప్రత్యేకమైనదంటే దానిని ఏ ఇతర సంస్థ పనితోనూ పోల్చి చూడలేమని డా. మోహన్ భగవత్ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. “నేను సంఘ కార్యాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని ఒప్పించడం నా ఉద్దేశ్యం, లక్ష్యం కావు. నేను చెప్పిన విషయాన్ని బట్టి మీరు మీ నిర్ణయం తీసుకోవచ్చును. మీ అభిప్రాయం ఏర్పరచుకోవచ్చును. నేను చెప్పిన విషయాలను మరింత లోతుగా పరిశీలించాలనుకుంటే సంఘానికి మరింత దగ్గరగా రావాల్సిఉంటుంది’’ అని ఆయన అన్నారు.

“సంఘ్ ని అర్ధం చేసుకోవాలంటే ఆ సంస్థను స్థాపించిన డా. కేశవ బలీరామ్ హెడ్గేవార్ నూ అర్ధం చేసుకోవాలి’’ అని చెప్పిన డా. మోహన్ భాగవత్ సంఘ స్థాపకుల జీవితం, ఆయన ఆలోచనలను వివరించారు. డా. హెడ్గేవార్ దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడం, చివరికి పటిష్టమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రజలను సమాయత్తం చేయాలని, వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దాలనే నిర్ణయానికి రావడం మొదలైన సంఘటనలను వివరించారు.

సంప్రదాయ విలువల గొప్పదనాన్ని తెలుసుకునే విధంగా సమాజాన్ని జాగృతం చేయాల్సిన అవసరం గురించి రవీంద్రనాథ్ ఠాగోర్, కమ్యూనిస్ట్ మేధావి ఏం ఎన్ రాయ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మొదలైనవారు చెప్పిన విషయాలను డా. భాగవత్ తన ఉపన్యాసంలో గుర్తుచేశారు. పటిష్టవంతమైన జాతిగా రూపొందడానికి వివిధ సిద్ధాంతాలకు, పంథాలకు చెందినవారంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని డా. హెడ్గేవార్ గుర్తించారని ఆయన అన్నారు. ‘సమాజంలో పరివర్తన తేవడానికి ప్రజలను సమాయత్తం చేయాలని ఆయన భావించారు. ఈ లక్ష్యంతోనే ఆయన 1925 విజయదశమి రోజున సంఘాన్ని స్థాపించారు’’ అని డా. భాగవత్ అన్నారు.

“ఆర్ఎస్ఎస్ కు ఒక కార్యపద్దతి ఉంది. వ్యక్తి నిర్మాణమే ఆర్ఎస్ఎస్ పని. ప్రతి బస్తీలో, కాలనీలో మంచి స్వయంసేవకులు ఉండాలి.’’ అని ఆయన అన్నారు.

“సంఘ్ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసమే పని చేస్తుందని, మరే పని చేయదని డా. హెడ్గేవార్ అన్నారు. మన దేశంలో భాష, మత, ఆహార, వేషం మొదలైన అన్నిటిలో ఎంతో భిన్నత్వం కనిపిస్తుంది. మరి ఇలాంటి భిన్నత్వం మధ్య ఏకత్వాన్ని సాధించడం ఎలా? ఈ హిందూస్థాన్ లో అందరినీ కలిపి ఉంచేదే సంప్రదాయ విలవలతో కూడిన వ్యవస్థ. అదే హిందుత్వం. భారతదేశ సమైక్యతకు మూలమైన ఈ వ్యవస్థను హిందుత్వం అనే మాట తప్ప మరొకటి సరిగా వర్ణించలేదు’’ అని డా. భాగవత్ అన్నారు.

“భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడమే ఆర్ఎస్ఎస్ కార్యపద్దతి. కలిసి జీవించడం ఎలాగో మన పూర్వీకులు మనకు చూపించారు. కానీ ఎప్పుడైతే మన విలువలను మరచిపోయామో అప్పుడు కష్టాలపాలయ్యాము. `దేశ్ కే పతన్ హమరే పతన్ సే హుఆ హై’’ అని ఆయన అన్నారు.

“ఆర్ఎస్ఎస్ నిరంకుశ, రహస్య సంస్థ అని కొందరు అనుకుంటారు. అధినేత ఏది నిర్ణయిస్తే అందరూ దానినే అనుసరిస్తారని భావిస్తారు. కానీ వాస్తవం వేరు. మీరు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థను చూడాలంటే ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకుంటే చాలు. నేను ఇలా చెపుతున్నాను కాబట్టి విశ్వసించాలని నిర్బంధం ఏమి లేదు. మీరే స్వయంగా పరిశీలించి నిర్ధారించుకోండి’’అని అన్నారు.

“ప్రశ్నించే హక్కు, తన ఆలోచనలను వ్యక్తం చేసే అవకాశం ప్రతి స్వయంసేవక్ కు ఉంటుంది. ప్రతినిధి సభ వరకు వివిధ స్థాయిల్లో స్వయంసేవకులు తమ అభిప్రాయాలను తెలిపే వీలు ఉంటుంది.’’

“సంఘ్ ఒక స్వయంసంచాలిత సంస్థ. అన్నీ కార్యకలాపాలకు కావలసిన నిదులను స్వయంగా సమీకరించుకుంటాము తప్ప ఏ ఇతర సంస్థ నుండి తీసుకోము. కాషాయ ధ్వజాన్ని గురువు గా భావించి స్వయంసేవకులు ప్రతి సంవత్సరం గురుదక్షిణ సమర్పిస్తారు. ఈ మొత్తమే వివిధ కార్యకలాపాలకు ఉపయోగిస్తాము’’ అని డా. భాగవత్ వివరించారు.

“వివిధ సేవా కార్యక్రమాలు కూడా స్వయంసేవకులు నిర్వహిస్తున్నారు. ఇవి చట్టబద్ధంగా జరుగుతాయి. వీటి కోసం నిధులు ఇతర సంస్థల నుండి కూడా తీసుకుంటారు.”

“సంఘ్ ఆధిపత్యం చెలాయించాలని అనుకోదు. సమాజాన్ని పటిష్టపరచడం ద్వారా దేశ ప్రగతిని సాధించడమే సంఘ లక్ష్యం. సామూహిక భావన సంఘ సిద్ధాంతానికి మూలం. స్వయంసేవకులు అనేక మంచి పనులు చేస్తుంటారు. కానీ మేము వారి పేర్లను ఎక్కడ ప్రకటించము. ప్రతి పౌరుడు దేశం కోసం నిస్వార్ధంగా  పనిచేయాలి. ఎందుకంటే అది అతని కర్తవ్యం.”

“సమాజంలో సకారాత్మకమైన మార్పు తెచ్చేందుకు స్వయంసేవక్ ను ప్రోత్సహించి, తగిన శిక్షణనివ్వడమే సంఘ లక్ష్యం.’’ అని ఆయన అన్నారు.

“ఆర్ఎస్ఎస్ లో మహిళల ప్రవేశం గురించి చెపుతూ రాష్ట్ర సేవిక సమితి మహిళల కోసం స్థాపించారని, అది సంఘ కార్యశైలిలోనే పనిచేస్తుందని, స్వయంసేవకులు నిర్వహించే సేవ కార్యక్రమాల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడించారు. “స్వయంసేవకులలో చాలామంది గృహస్థులే. వారి కుటుంబాలు సంఘ కార్యంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుల్లో, మెట్రో మ్యాన్ గా పేరుపొందిన ఇ శ్రీధరన్, మనీషా కోయిరాల, మాలిని అవస్తి, అను మాలిక్, అను కపూర్, మనోజ్ తివారీ, చేతన్ చౌహాన్, నవాజుద్దీన్ సిద్దికి, అమర్ సింగ్, స్వపన్ దాస్ గుప్తాలతో పాటు బిజెపి నేతలు రామ్ మాధవ్, రామ్ లాల్, సుబ్రమణ్య స్వామి, కేంద్ర మంత్రులు డా హర్షవర్ధన్, విజయ్ గోయల్, అల్ఫోంస్ కానంతనం మొదలైనవారు ఉన్నారు.

ఆర్ఎస్ఎస్ సౌజన్యం తో
అనువాదం: విశ్వసంవాద కేంద్ర, తెలంగాణ