పంజాబ్‌లోని ¬షియార్‌పూర్ జిల్లాలో గల లాంబ్రీ గ్రామస్థులకు ఆక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)తో వంట చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకొన్న పనిగా అనిపించేది. అయితే ఆ అసాధ్యాన్ని కొంతమంది రైతులు సుసాధ్యం చేసి చూపించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో తక్కువ ఖర్చుతో లభించే గోబర్‌గ్యాస్‌నే వంటకు ఉపయో గిస్తున్నారు.
ఆవుపేడను ఉపయోగించి వంటగ్యాస్‌ను ఉత్పత్తిచేసి, ఇంటింటికి సరఫరా చేస్తూ ఆ గ్రామ రైతులు అధిక లాభాలు పొందుతున్నారు.
మొదట గ్రామస్థులంతా ఒక కమిటీగా ఏర్పడి బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు 2500 కిలోల ఆవుపేడను ఉపయోగించి గోబర్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఆవుపేడకు క్వింటాల్‌కు రూ. 8 చొప్పున రైతులకు చెల్లిస్తారు.
లాంబ్రీకి చెందిన జస్విందర్‌సింగ్ ఉన్నత చదువుల కోసం దక్షిణ కొరియా వెళ్లాడు. అక్కడ వ్యర్థాల నుండి ఉత్పత్తులను రాబట్టడం చూసి ఆశ్చర్యపోయాడు. అలాంటి ప్రయోగమే తన గ్రామంలో కూడా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయంలో కొంత పరిశోధన సైతం చేశాడు. ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత ఈ విషయాన్ని గ్రామస్థులతో పంచుకున్నాడు. వారు సానుకూలంగా స్పందించారు. ప్రణాళికలు సిద్ధం చేసి పంజాబ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌కు, పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వెళ్లి తన ప్రాజెక్టు గురించి వివరించాడు.
కేంద్ర ప్రభుత్వం నుండి 2 లక్షల ఆర్థిక సహాయం లభించింది. తన గ్రామంలోనే గోబర్‌గ్యాస్ ప్లాంట్ నిర్మించాడు. గ్రామ సొసైటీ ద్వారా ఇంటింటికి గ్యాస్ పొయ్యిలు, గ్యాస్ రీడింగ్ మీటర్లు సప్లై చేశాడు. ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎటువంటి అంతరాయం లేకుండా పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తారు.
పేడ సేకరించడానికి వెళ్లిన ట్రాక్టర్‌లో త్రాసు కూడా ఉంటుంది. దాంతో రైతు నిత్యం ఎన్ని కిలోల పేడ అమ్ముతున్నారో రికార్డు చేస్తారు. గ్యాస్ ఖర్చు పోను మిగతా డబ్బు అతని బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు.
అలా సేకరించిన ఆవుపేడను పులియబెట్టి, గ్యాస్ ఉత్పత్తిచేసి భూమి లోపలి నుండి వేసిన పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తారు. గ్యాస్ ఉత్పత్తి తర్వాత మిగిలిపోయిన పేడ ద్రవాన్ని సొసైటీ సభ్యుడుకైతే 5000 లీటర్లకు రూ.600 చొప్పున; సభ్యులు కాని వారికి 5000 లీటర్లు 800 చొప్పున అమ్ముతారు.
ఎల్పీజీ సిలిండర్‌కు నెలకు రూ. 800 నుండి 850 ఖర్చు అయితే; గోబర్ గ్యాస్ వల్ల నెలకు రూ.150-200 మాత్రమే ఖర్చు అవుతుంది.. అంతేకాకుండా ఇలా ఉత్పత్తి చేసిన గ్యాస్‌లో ఏమాత్రం కల్తీ ఉండదు. ఎంత గ్యాస్ ఉపయోగిస్తే అంతే రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
సొసైటీ ద్వారా గ్రామంలోని పాఠశాలకు మధ్యాహ్న భోజన తయారీకి అవసరమైన గ్యాస్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. లాంబ్రీలో విజయవంతమైన గోబర్‌గ్యాస్ పథకం చూసి.. ‘పంజాబ్ ఎనర్జీ డెవలప్‌మెంట్ అథారిటీ’ వారు ఇతర గ్రామాలకు సబ్సిడీ ఇచ్చి గోబర్‌గ్యాస్ ప్లాంట్‌లు నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
చన్నువాలా, బడ్నికలాన్ గ్రామ ప్రజలు గోబర్ గ్యాస్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తిచేసి, ఇతర గ్రామాల నుంచి మోటారు పంపుల ద్వారా తాగునీటిని సరఫరా చేసుకుంటున్నారు.
దాదాపు 300 మిలియన్ల పశుసంపద ఉన్న మనదేశంలో సుమారు మూడు మిలియన్ టన్నుల పేడ ఉత్పత్తి అవుతుంది. దీన్ని వృథా చేయకుండా తగిన విధంగా ఉపయోగిస్తే లాంబ్రీ గ్రామ ప్రజల వలె ఎవరైనా లాభాలు పొందొచ్చు. వీరిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి.
భారత ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల ‘ఆర్గానిక్ బయో- ఆగ్రో రీసోర్సెస్ ధన్’ (పేడ-ధనం) అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ముఖ్య ఉద్దేశం వ్యర్థాల నుండి ప్రత్యామ్నాయ ఆదాయం పొందడం.
– అనిల్. కె
(జాగృతి సౌజన్యం తో)