Home Ayodhya రామజన్మభూమిలో రామమందిర నిర్మాణమే భారతీయుల ఆకాంక్ష

రామజన్మభూమిలో రామమందిర నిర్మాణమే భారతీయుల ఆకాంక్ష

0
SHARE

సనాతనము అంటే శాశ్వతము. ఆది చివర లేనిదే సనాతనము. సనాతన ధర్మాన్ని ఆచరించే వాండ్లే హిందువులు. సనాతనమైన వేదాలను అనుసరించి జీవించేవాండ్లు హిందువులు. వీరు వేదాలననుసరించుట, విగ్రహారాధన చేయుట, పునర్జన్మను నమ్ముట వీరి జీవన విధానము. హిందువులు దేవునికొఱకు ఏ పనిచేయరు. దేవుండ్లను ఏ కోరికలు కోరరు. వారు కోరే ప్రధాన కోరిక ఒకే ఒక్కటి అది సృష్టితో ఆవిష్కరించిన ప్రతి దానిని సురక్షితంగా కాపాడమనేది. అందుకే హిందువులు చేసే ప్రతి పండుగ, ఉత్సవము, వేడుకలలో ప్రకృతిని ఆరాధిస్తారు. భగవంతుడిని వివిధ రూపాలలో పేర్లతో ఆరాధిస్తారు. పూజిస్తారు. భగవంతుడికి ఆచారంపేరుతో అనేక రకాలైన వృక్షపత్రాలను గణేషుడికి సమర్పిస్తారు. బతుకమ్మ పేరుతో అనేక రకాలైన పుష్పాలతో గౌరీదేవిని పూజిస్తారు. ఇదే ప్రకృతి ఆరాధన. హిందూ దేవీదేవతలకు అనేక రకాలైన పక్షులు, వన్యప్రాణులు, క్రూర జంతువులు, జలచరాలు, ఉభయచరాలు వాహనాలుగాను, అనేక వృక్షాలను ఆయుధాలుగాను ధరిస్తారు. అంటే సంపూర్ణ ప్రకృతినే దేవిదేవుండ్లుగా భావించి ఆరాధించడమే ప్రకృతిని కాపాడుట హిందువుల జీవన విధానము. దీనినే జీవ వైవిధ్యం అంటారు.

సృష్టికి, ప్రకృతికి వినాశనం కలిగే చర్య చేయకుండా వుండుటకే పాప, పుణ్యకర్మలను ఆవిష్కరించి పాపాలను చేయకుండా పుణ్యకర్మలను చేయుట ఆచారాలు, నియమాలు, పద్ధతుల నేర్పాటు చేసుకుని అనుసరిస్తుంటారు. ఏదేని కొన్ని అనాచార పద్ధతులు ఆచారాలుగా ప్రవేశింపబడితే వాటిని గుర్తించినవారు తరువాతి తరాలవారు వాటిని నిషేధించారు. నిషేధిస్తూనే వస్తున్నారు. నిషేధింపబడుతున్నవన్ని మానవత్వానికి హానికలిగించేవి మాత్రమే తప్ప సమానత్వం పేరుతో సృష్టికిగాని, మానవత్వానికిగాని అపహాస్యం చేసేవిగాని, సమాజంలో వికృతిని కలిగించేవి కావనేది గుర్తించాలి.

ఇరువై నాలుగవ త్రేతాయుగంలో సూర్యవంశపు రాజులనబడేవారు యుగాంతం వరకు వేలసంఖ్యలో రాజ్యపరిపాలన చేశారు. వారందరు ధర్మబద్ధమైన పాలన చేసినవారే! కాని వారిలో కొందరు వారి వారి పాలనా సమయంలో నూతన సంస్కారాలను తెచ్చినందువల్ల వారిని ఈనాటికి కూడా ఆదర్శవంతులుగా చెప్పుకుంటున్నాము. ఇక్ష్వాకుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, దశరథుడు, శ్రీరాముడు వీరందరు ఈనాటికి ప్రజల మనస్సులలో మెదలాడుతున్నవారు. అందులో శ్రీరాముడు ముఖ్యుడు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. బ్రహ్మఋషి విశ్వామిత్రుడు గుర్తించిన వీరుడు, ఏకపత్నీవ్రతుడు. సవతి తల్లి కైకేయికి ప్రియపుత్రుడు.

తమ్ముళ్ళకు ఆదర్శవంతుడు. ప్రజలను రంజింపచేసే పరిపాలనను చేసిన మహారాజు, చార్వాకుడైన జాబాలిని మెప్పించిన ధార్మికుడు, అశ్వమేధ యాగంలో యజ్ఞక్రతువులో అశ్వాన్ని బలిచ్చే ఆచారాన్ని నిషేధించిన మూగజీవుల ప్రేమికుడు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని అంతమొందించకుండా స్వర్ణ అశ్వాన్ని యజ్ఞ బలిగా కొనసాగించినాడు. తన వ్యక్తిగత జీవనం ప్రజలకు తలవంపులు తెచ్చేదికాకుండా గౌరవాన్ని ప్రతిబింబించేదిగా మార్చుకొనే జీవితాన్ని అందించిన త్యాగశీలి. ఆదర్శాలకు మహావనం శ్రీరాముడు. అందుకే ఈనాటి ప్రజలు కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటారు. బ్రిటన్‌వారిని ఈ దేశం నుండి వెళ్ళగొట్టి రామరాజ్యాన్ని స్థాపించుకొందాం అనేదే ఎమ్.కె.గాంధీ కలలుగన్న రాజ్యం.

ఇండోనేషియా మతపరంగా ఇస్లాం దేశం. ప్రపంచంలోని ఇస్లాం దేశాలలో అధిక జనాభా గల దేశం. కాని ఇక్కడి ప్రజల పూర్వీకులు శ్రీరాముడి సంస్కృతి సాంప్రదాయాలు ఆచరిస్తూ అనుసరించెడివారు. వారి పూర్వీకుల నుంచి అంది పుచ్చుకొన్న శ్రీరాముడి జీవిత విశేషాలు, ఆదర్శాలు ఈనాటికి కూడా పాఠ్యాంశాల ద్వారా వారి పిల్లలకు అందిస్తున్నారు. వారి పిల్లల పేర్లు కూడా రామాయణంలోని పేర్లకే అధిక ప్రాధాన్యతనిస్తూ పెట్టుచున్నారు. ఈ విషయాన్ని భారత ప్రజలు గుర్తించాలి. అందులో అధిక సంఖ్యాకులైన హిందువులు గుర్తించాలి.

రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రాముడి ఆలయాన్ని రాముని కుమారులు నిర్మింపజేసినారు. క్రీస్తుశకం ఏడువందల పన్నెండులో మొదటిసారి ఇస్లాంలు మ్లేచ్చులు భారతదేశంపై విజయం సాధించారు. ఆనాటి నుండి అనేక పర్యాయాలు రామమందిరాన్ని ధ్వంసం చేస్తున్నప్పటికి హిందువులు అలుపెరుగకుండా నిర్మాణం చేస్తూ వస్తున్నారు. 1526లో మొగలు వంశస్తుడైన బాబర్ విజయం సాధించి మీర్‌బాకీ అనే వ్యక్తిని తన ప్రతినిధిగా నియమించినాడు. బాబరుకు కృతజ్ఞతా పూర్వకంగా రామజన్మభూమి అయోధ్యలో రామాలయాన్ని ధ్వంసం చేసి బాబర్ పేరుతో అక్కడ మసీదును నిర్మాణం చేసినాడు. అప్పటి నుండి హిందూ సాధుసంతులు, ప్రజలు నిరంతరంగా పోరాటం చేస్తూనే వస్తున్నారు. బలిదానాలు అవుతూనే వున్నారు.

రామజన్మభూమి వివాదం దశాబ్దాలుగా న్యాయస్థానాలలో కొనసాగుతూనే ఉన్నది. విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్‌లు నిరంతరాయంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. 1980లో ఆవిష్కరించబడిన భారతీయ జనతాపార్టీ వారి మెనిపేస్టోలో అయోధ్యలోని రామమందిరాన్ని నిర్మిస్తామని వారి మ్యానిపేస్టోలో కొనసాగుతూనే ఉన్నది. విహెచ్‌పి, ఆర్.ఎస్.ఎస్., బీజేపీలు అనేకమంది సాధుసంతుల ఆశీర్వాదాలతో యోజనతో హిందూ సమాజాన్ని సంఘటన చేసి కరసేవ పేరుతో రామభక్తులందరు సరయూనదిలో స్నానంచేసి అందులోని పిడికెడు మట్టి తెచ్చి రామజన్మభూమిలోని మందిరం ప్రాంగణంలో వేయాలనే తలంపుతో 1990లో దేశవ్యాప్తంగా లక్షలమంది రామభక్తులు అయోధ్యకు తరలివెళ్లినారు.

ఆనాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయంసింగ్ యాదవ్ అయోధ్యలోనికి రానీయకపోవడమే కాకుండా అనేకమంది ప్రాణ త్యాగాలకు కారకుడైనాడు. వేలమంది రామభక్తులను జైళ్ళలోని నిర్బంధింపజేసి వారిలో కసిపెంచినాడు. ఆనాటి కసి కారణంగా 1992 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కళ్యాణ్‌సింగ్ బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో డిసెంబర్ 6న రామజన్మభూమిపై ఉన్న బాబర్ కలంకం తొలగించబడినది. దాని కారణంగా కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వం త్యాగం చేయవలసి వచ్చింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అయోధ్యలోని రామజన్మభూమిలో రామమందిర నిర్మాణం జరుగుతుందని దేశ ప్రజలందరు కలలు గన్నారు. కానీ కిచిడీ ప్రభుత్వం కారణంగా వాజ్‌పేయి ఏమి చేయలేకపోయినారు. రాజకీయ లబ్ధికై ప్రతిపక్షాలు ప్రశ్నించే తీరును గమనిస్తున్న సామాన్య ప్రజలు కూడా బీజేపీని రామమందిరం ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ మ్యానిపేస్టోలో మాత్రం రామజన్మభూమి కొనసాగుతూనే ఉన్నది. రామమందిరం ఎందుకు నిర్మించుట లేదు, ఎప్పుడు నిర్మిస్తారు, ఏ తేదీలో ప్రారంభిస్తారు? అంటూ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, వివిధ రాజకీయపార్టీల నాయకులు నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారికి రామమందిర నిర్మాణంపై శ్రద్ధ వున్నదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పగలరా? లేదా వారి మ్యానిపేస్టోలో పెట్టగలరా?

నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న ప్రభుత్వానికి లోకసభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికి రాజ్యసభలో మెజారిటీ లేదు. అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న కేసు తీర్పు వెలువడకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టితే చట్టసభలే న్యాయస్థానాలను అగౌరవపరుస్తున్నట్లయితది. పురావస్తు శాఖ అత్యాధునిక పరిజ్ఞానంలో రామజన్మభూమి అంతర్భాగంలో హిందూ దేవాలయం అవశేషాలున్నట్లు కనుగొన్నది. దానిని అత్యున్నత న్యాయస్థానం ముందర పెట్టటం జరిగింది. న్యాయస్థాన తీర్పు హిందువులకు అనుకూలంగానే వస్తుందనేది దేశ ప్రజల , విహెచ్‌పి, ఆర్.ఎస్.ఎస్., బీజేపీల ప్రగాఢ విశ్వాసం.

అత్యున్నత న్యాయస్థానం తీర్పు హిందువులకు వ్యతిరేకంగా వస్తే మాత్రం పార్లమెంట్ ఉభయసభలలో చట్టం తేవలసి ఉంటుంది. బీజేపీ మ్యానిపేస్టోలో మొదటి నుంచి ఇప్పటికీ కూడా రామజన్మభూమిలో రామమందిర నిర్మాణం ఉన్నది. కాబట్టి బీజేపీ మాత్రమే రామజన్మభూమిలో భవ్యమైన రామమందిర నిర్మాణం కడుతుందని దేశ ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకని రాజ్యసభలో బీజేపీ బలం పెరగటానికై జరుగబోయే ఐదు రాష్ట్రాలలో అత్యధిక మెజార్టీతో బీజేపీనే గెలిపించి తీరవలసిన బాధ్యత ఆయా రాష్ర్ట ప్రజలపైననే ఉన్నది.

రాముడే హిందువులకు ఆధారం, ఆదర్శం. కాబట్టి అయోధ్యలోని రామజన్మభూమిలో భవ్యమైన రామమందిర నిర్మాణం హిందువుల హక్కు, బాధ్యత. దీనిని ఏ శక్తి ఆపలేదు. దీనిపై ఇస్లాంలు వ్యతిరేకిస్తే వారి సంకుచిత భావననే బయటపడుతుంది. దీనిని ప్రపంచంలోని ఏ ఒక్కరు హర్షించరు. ఐదువందల సంవత్సరాల నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న రామజన్మభూమి వివాదం ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారధ్యంలో పరిష్కారం కావడానికి దేశ ప్రజల మద్దతు లభిస్తుందని, హిందువుల కల సాకారమై భవ్యమైన రామమందిరం పునఃనిర్మాణం జరుగుతుందని కోట్లమంది హిందువుల విశ్వాసం.

-బలుసా జగతయ్య

గమనిక: ఈ వ్యాసం పూర్తిగా రచయిత అభిప్రాయం

Source: Vijaya Kranti