Home Hyderabad Mukti Sangram రక్షణ దళాన్ని ఆయత్తం చేసిన రామిరెడ్డి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-19)

రక్షణ దళాన్ని ఆయత్తం చేసిన రామిరెడ్డి (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-19)

0
SHARE

మాఘమాసం (ఫిబ్రవరి) ఆకురాలు కాలం సమీపిస్తున్న రోజులు. చలిగా ఉన్న రాత్రులు. మూడు గంటలు కావొస్తున్నది. రేణుకుంట తూర్పుదిశలో కొండపై వడ్డరి వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు. తమ గ్రామంలో నిర్మించనున్న గాంధీ మందిరానికి అవసరమైన రాతిని తొలుస్తున్న ఒక వడ్డరి దూరంగా రేగుతున్న దుమ్మును చూశాడు. అకస్మాత్తుగా కొండదూకి గ్రామంవైపు పరుగెత్తుకొచ్చాడు. పటేల్ రామిరెడ్డికి తాను చూసిన దృశ్యం గురించి వివరించి చెబుతూ “పటేల్ దొరా! ఇది పగవాళ్ళ రాత్రి. మేల్కొని ఉండాలి” అని హెచ్చరించాడు.

వడ్డరి అతను అందచేసిన వార్త విని రామిరెడ్డి తన గ్రామ రక్షణ దళాన్ని ఆయత్తం చేశాడు. దళంతోపాటు తుపాకులు పుచ్చుకుని గ్రామం వెలుపల ఉన్న “ఇసుగవాగు” దగ్గరికి వచ్చి పొంచి చూశాడు. రాజాపేట నుండి వచ్చిన ట్రక్కులు రేణుకుంటకు రెండు ఫర్లాంగుల దూరంలో ఆగిపోయాయి. శత్రు ముఠా రెండు దళాలుగా విడిపోయి రేణుకుంటను చుట్టుముట్టుతున్నాయి. ఈలోగా రామిరెడ్డి దళంలో నుండి ఒకతను కాల్పులు జరిపాడు. అయినా ఎదుటిపక్షం నుండి కాల్పులు జరగలేదు. రామిరెడ్డి తన దళాన్ని వెనక్కి నడిపించి గ్రామంలో తన మేడపైకి ఎక్కి చురుగ్గా శత్రువుని ఎదుర్కోవటానికి ఏర్పాటు సాగించారు.

ఈ లోగా గ్రామస్థులందరూ తుపాకి కాల్పులు విని మేల్కొన్నారు. కొన్ని కుటుంబాలు వచ్చి రామిరెడ్డి భవంతిలో తలదాచుకున్నాయి. పైన ఉన్న రామిరెడ్డి తన దళం సహాయంతో తుపాకి కాల్పులు సాగించారు. ఉదయం ఆరుగంటల నుండి పదివరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. రజాకార్ల దళం నిజాం సైనికుల సహాయంతో మరింత దగ్గరిగా భవంతిని చుట్టుముట్టుతున్నది. వాళ్ళ లక్ష్యం మొదట రామిరెడ్డిని అంతం చేయాలని. ఆ తర్వాత గ్రామస్థులందరూ సునాయసంగా లొంగిపోతారని భావించారు. రెండువైపుల నుండి కాల్పులు కొనసాగుతున్నాయి. శత్రుదళం తప్పించుకుంటూ భవంతి గోడ దగ్గరిగా వచ్చి చేరింది. రామిరెడ్డి వెంటనే చేతిబాంబులు విసిరి మొత్తం దళాన్ని తుదముట్టించాడు.

బాంబు ప్రేలుడుకు భవనం గోడ పగిలింది. రామిరెడ్డి చేతికి గాయం తగిలింది. అయినా గాయానికి కట్టు వేసుకొని తుపాకి కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. అనుకోకుండా ఎదురు కాల్పులు ఆగిపోయాయి. ఉదయం పదిగంటలు దాటిన తర్వాత అకస్మాత్తుగా ఈ స్థబ్దత నెలకొంది. రెండువైపుల నుండి కాల్పులు నిలిచి పోయాయి. నిశ్శబ్దంగా ఇలాగే ఒక గంట కొనసాగింది. దాదాపు పదకొండు గంటల ప్రాంతంలో రామిరెడ్డి భవంతిపై కాస్త అలికిడి కలిగింది.

శత్రుముఠా నుండి ఎలాంటి అలజడి వినిపించడంలేదు. అసలు ఆ ముఠా వెనక్కి పోయిందేమో చూడాలని రామిరెడ్డి పైన ఉన్న పిట్టగోడను ఆనుకొని తలను పైకి లేపి దృష్టి సారించాడు. హఠాత్తుగా వెనకాల నుండి పేలిన తుపాకీ తూటా రామిరెడ్డి తలలోనుండి దూసుకుపోయింది. వెంటనే రామిరెడ్డి  క్రిందికి పడిపోయాడు. తన ప్రతిన ననుసరించి కొన ఊపిరి దాకా రామిరెడ్డి తన గ్రామరక్షణకోసం పోరాడి అమరవీరుడిగా ప్రాణాలు వదిలాడు. అసలు జరిగిందేమిటంటే, రామిరెడ్డి  భవనం వెనకాల డ్బుభైగజాల దూరంలో ఒక పాతగదిని ఆనుకొని ఉన్న ఒక ఇంటి పెరట్లో చింతచెట్టు ఉంది. స్థబ్దత వ్యాపించిన ఆ ఒక గంట వ్యవధిలో నిజాం సైనికుడు ఒకడు దొంగచాటుగా వచ్చి ఆ చింతచెట్టుపై కూచున్నాడు. రామిరెడ్డి  తలపైకి ఎత్తగానే వాడు సరిగ్గా గురిచూసి కాల్పులు జరిపాడు.

రామిరెడ్డి మరణించగానే మిగతా దళం సభ్యులు హడలెత్తిపోయారు. తిరిగి కాల్పులు కొనసాగించలేకపోయారు. ఈలోగా ముస్లిం ముఠా భవనాన్ని చుట్టుముట్టి లోపలికి చొచ్చుకొని వచ్చింది. క్రింది గదిలో వందమందికి పైగా గ్రామస్థులు గడియ బిగించుకొని తలదాచుకొని ఉన్నారు. వాళ్ళను బైటకులాగాలనే ఉద్దేశ్యంతో నిప్పుపెట్టారు. పొగ వ్యాపించింది. పై అంతస్తు గదిలో ఉన్న వాళ్ళను క్రిందకు దిగలాగాలనే ఉద్దేశ్యంతో సిపాయిలు ఒకరి భుజంపైకి మరొకరు ఎక్కి చూశారు. పైన 20 మంది సాయుధులైన దళ సభ్యులు ఉన్నారు. వాళ్ళను క్రిందికి దిగి రమ్మని నిజాం సైనిక ముఠా బెదిరించింది. రామిరెడ్డి చనిపోయారు.

ఇక మమ్మల్ని ఎందుకు బాధపెడతారు? అని పైవాళ్ళు అడిగారు. అయినా ఆ ముఠా ఊరుకోకుండా పోలీసు పటేల్ గుమాస్తా బొల్లా రామిరెడ్డిని పట్టి తెప్పించి మీదివాళ్ళకు హామీ ఇప్పించింది. నిచ్చెన వేయించి అందరినీ క్రిందికి దిగి రమ్మన్నాడు. దిగి వచ్చిన దళ సభ్యులందరినీ వరుసగా తాళ్ళతో కట్టివేయించి బయటికి లాక్కొచ్చారు. పోలీసు కానిస్టేబుల్ ఆ దళంలో ఉన్న ఒక వ్యక్తిని గుర్తుపట్టి “ఇతను ముస్లిం. పేరు యాకూబ్ ఆలీ” అని చెప్పాడు. అయితే ముస్లిం అధికారులు నమ్మలేదు. యాకూబ్‌ను కల్మా చదువమన్నారు. తర్వాత ధైర్యం తెచ్చుకొని కల్మా చదివాడు. ముస్లిం అనే నమ్మకం కుదిరాక యాకూబ్‌ను వదిలివేశారు. మిగతా హిందూ సభ్యులందరినీ వరుసగా నిల్చోబెట్టి స్టెన్‌గన్‌తో కాల్చివేశారు.

చనిపోయిన వాళ్ళలో రామిరెడ్డి పెద్దకొడుకు రంగారెడ్డి, బొల్లా రామిరెడ్డి తమ్ముడు యాదవరెడ్డి కూడా ఉన్నారు. హత్యకాబడిన మిగతా వ్యక్తుల్లో పగడాల సత్తయ్య, వేచల్ల పుల్లారెడ్డి, యేమెల్ల నర్సింహారెడ్డి, చాకలి యాదగిరి, మంగలి రాజయ్య, బురుగు చందారెడ్డి, బురుగు వెంకట రెడ్డి తదితరులు ఉన్నారు. ఆ తర్వాత నిజాం బలగం క్రింది గదిలో గ్రామస్థులందరినీ బయటకు లాగి ముసలివాళ్ళను వదిలివేశారు. డ్బుభైమంది యువకులను బంధించి ఖైదీలుగా వెంటబెట్టుకున్నారు. మొదట్లో ఎవరినీ చంపమని హామీ ఇచ్చి యాకూబ్‌ను మిగతా దళ సభ్యుల పేర్లు చెప్పమన్నారు.

యాకూబ్ నిజమని నమ్మి ఇద్దరి పేర్లు చెప్పాడు. ఆ ఇద్దరిని బయటకు లాగి అక్కడే కాల్చివేశారు. యాకూబ్ తన కళ్ళ ముందు జరిగిన ఘోరకృత్యాన్ని చూసి వణికిపోయాడు. ఆ తర్వాత వేరెవ్వరి పేరు అతను చెప్పలేదు. నిజాం పోలీసులు, రజాకార్ల ముఠా అక్కడ పడిఉన్న 25 శవాలను రెండు ఎడ్లబళ్ళలో వేయించి గ్రామస్థులతో ఆ బళ్ళను లాగించారు. ఇసుకవాగు దగ్గరికి వచ్చిన తరువాత అక్కడే ఆ రెండు బళ్ళపై చెత్తా చెదారం వేసి మంటబెట్టారు. సగం కాలీకాలని శవాలు ఆనవాలు లేకుండా మసిబారిపోయాయి.

(విజయక్రాంతి సౌవ్జన్యం తో )