Home News కులాలకతీతంగా అందరూ ఏకం కావాలి – శ్రీ గరికపాటి నరసింహారావు

కులాలకతీతంగా అందరూ ఏకం కావాలి – శ్రీ గరికపాటి నరసింహారావు

0
SHARE

కులాలకతీతంగా అందరూ ఏకం కావాలని,అహంకారం,మమకారాలు వదలి తోటి ప్రజలతో సామరస్యంగా జీవించాలని, ఎక్కువ తక్కువ భేదాలు మరిచి సమరస భావం తో మెలగాలని సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోదించారు.

సామాజిక సమరసతా వేదిక, ఖమ్మం, ఆధ్వర్యంలో 30 అక్టోబర్ నాడు నగరం లోని పెవీలియన్ మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహించిన సమ్మేళనంలో శ్రీ గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గరికపాటి గారు మాట్లాడుతూ కార్తీక మాసాల్లో కులాల వారి భోజనాలు ఏర్పాటు చేయటం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించే చోట మనుషులను విడదీయడమే అవుతుందని, జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యతనిచ్చి, నేను, నాది అనే సంకుచితమైన భావాలను వీడాలని, కౌశిక మహర్షి కూడా మాంసం విక్రయించే ధర్మవ్యాధుని వద్ద ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్నాడని, లలితా సహస్ర నామాల్లో కూడా సమ భావన గురించి ప్రస్తావన వుందని, భగవద్గీత లో పేర్కొన్న “చాతుర్వర్ణమ్ మయా సృష్టమ్ “అను శ్లోకానికి తప్పుడు అర్థాలు తీయడం తగదని,గుణ కర్మలకు అనుగుణంగా వర్ణాలు ఏర్పడ్డాయని, ఆ తరువాత ఎవరికి వారు కులాలు ఎర్పరచుకుని తగవులుపెట్టుకుంటున్నరని వారు విమర్శించారు.

 

స్త్రీలకు  వేదాలను చదివే హక్కు వుందని, పురాణ కాలంలో కూడా ఎక్కడా వివక్షత లేదని, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను అందించిన వాల్మీకి, వ్యాసుడు బోయ, బేస్త వంశంలో జన్మించిన సంగతి మరువరాదని అలాగే యువరాజు పట్టాభిషేక వార్త, వనవాస వార్త ను ఏక కాలంలో విని కూడా తొణకక, బెణకక సమ దృష్టి కలిగిన శ్రీ రాముడు జన్మించిన భూమియిదని, ఈ దేశ సంస్కృతి, సంప్రదాయాలను రక్షించే బాధ్యతను స్వీకరించి, పాశ్చాత్య అలవాట్లు విడనాడాలని వారు అభిలషించారు.

మనమంతా హిందువులుగా వుంటూ దేశ, ధర్మాలను కాపాడుకొవాలని, శబరిమల పవిత్రత ను గుర్తించి నిర్ణయాలు తీసుకొవాలని, హిందువులపై మాత్రమే దాడులు జరుగుతున్న సంగతి గుర్తించి, హిందువులు బలంగా, ఐక్యంగా వుండి ధర్మ రక్షణకు నడుము కట్టాలని శ్రీ గరికపాటి నరసింహారావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 21మండలాల లోని  220గ్రామాల నుండి 3000 మహిళలు, 2000 పురుషులు మొత్తం 5వేల మంది వివిధ కులాలకి చెందిన ప్రజలు తరలివచ్చారు. భజన సంఘాలు, కోలాటం బృందాలు, కాటికాపారులు, గంగిరెద్దుల వారు, సన్నాయి వాద్యాల వారు సమ్మేళనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గౌరవ అతిథిగా పాల్గొన్న శ్రీ ఎక్కా చంద్రశేఖర్, ఆర్ ఎస్ ఎస్ దక్షిణ మధ్య భారత సేవా ప్రముఖ్, మాట్లాడుతూ అంటరానితనం, కులవివక్షత వల్ల వేలాది నిమ్నవర్గాల ప్రజలు మానసిక క్షోభకు గురవుతున్న సందర్భం లో కూడా మన హిందూ ధర్మాన్ని వదలకుండా భక్తి ప్రపతులతో మనుగడ సాగిస్తున్న సంఘటనలు కోకొల్లలుగా వున్నాయని సోదాహరనంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో సామజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డా వంశీ తిలక్‌, కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, టీటీడీ ప్రచార కార్యదర్శి రామకృష్ణారెడ్డి, వివిధ హిందూ సంఘాలకు చెందిన బాధ్యులు పిట్టల లక్ష్మీనారాయణ, మద్ది ప్రభాకర్‌రెడ్డి, వినోద్‌ లాహోటి, అల్లిక అంజయ్య, మేళ్లచెర్వు వెంకటేశ్వర్లు, నరేంద్రదత్‌  తదితరులు పాల్గొన్నారు.