Home Hyderabad Mukti Sangram రజాకార్ల దాడిని ఎదుర్కోవడానికి ఆట్టర్గాలో అన్ని ఏర్పాట్లు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-52)

రజాకార్ల దాడిని ఎదుర్కోవడానికి ఆట్టర్గాలో అన్ని ఏర్పాట్లు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-52)

0
SHARE

కేసర్ జవల్‌గావ్ అనే గ్రామంపై దాదాపు వెయ్యిమంది రజాకార్లు దాడి చేయబోతున్నారని ఒకరోజు కబురు అందింది. యశ్వంత్‌రావ్ దళం సాయుధంగా ఆ గ్రామం వైపు బయలుదేరింది. అయితే అసలు రజాకార్ల దాడి జరుగలేదు. తిరిగి వస్తుండగా దారిలో పాండరి అనే గ్రామం వద్ద సాయ్‌గావ్ రజాకార్లు తటస్థపడ్డారు. వాళ్ళందరినీ పట్టుకొన్నారు.

ఆ రజాకార్లను శిక్షించిన పక్షంలో తమ గ్రామం తర్వాత మిగలదని వదిలేయవలసిందని గ్రామస్థులంతా ప్రాధేయపడ్డారు. దళం వదిలేయక తప్పలేదు. మంజీరా నది ప్రాంతం చేరగానే కొంతమంది రజాకార్లు ఒక ముసలి స్త్రీని, ఒక పిల్లవాణ్ణి బాధ పెడుతున్నారు. అటునుంచి వచ్చే దళాన్ని చూసి పరుగెత్తడం ప్రారంభించారు. యశ్వంతరావు వెంట తరిమి ఖాదర్ అనే ఒక రజాకర్‌ను పట్టుకోగలిగాడు. అతనికి దళం మరణశిక్ష విధించి, అమలు జరిపింది.

కొంతకాలం గడచిన తర్వాత ఖాదర్ చావుకు ప్రతీకారం తీసుకోవాలని భాల్కీ దేవణీలలోని పోలీసులు, రజాకార్లు బయలుదేరారు. ఈ కబురు ముందే దళానికి తెలిసిపోయింది. ఆట్టర్గా గ్రామంలో దళం పోలీసుల, రజాకార్ల దాడిని ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. పోలీసులు గ్రామం నుంచి రెండు మైళ్ళ దూరంలో ఉండగానే ఒక పస్తక్వామ్‌ను గూఢచారిగా పంపించాడు. ఈ లోగా దళ గూఢాచారి దళానికి పోలీసుల విషయం చెప్పాడు. పస్తక్వామ్‌ను గ్రామంలో నిర్భంధించి పోలీసులకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోగలిగారు.

పోలీసులు గ్రామం పొలిమేర్లలోకి వచ్చి దళం వాళ్ళను సవాలు చేశారు. దళం ‘జై శివాజీ’ అని నినాదాలు చేసింది. పోలీసులు కాల్పులు ప్రారంభించారు. దళం తమ వద్దనున్న చిన్న ఫిరంగి పేల్చింది. పోలీసులు దగ్గరగా ఉన్న చెట్టుకు ఫిరంగి గుండు తగిలి కూలగానే పోలీసులు అదిరిపోయారు. ఈ లోగా మరోసారి ఫిరంగి పేలింది. ఈ పేలుడు చూసి పోలీసులు కాలికి బుద్ధి చెప్పడం ప్రారంభించారు. అంతకు ముందే రజాకార్లు పారిపోయారు. ఈ విధంగా మొదటిసారి దళానికి ఆట్టర్గాలో గొప్ప విజయం లభించింది. ఈ విజయం చుట్టుప్రక్కల గ్రామాల్లో దళానికి మంచి గౌరవాన్ని సంపాదించి పెట్టింది.

ఒకరోజు కొంగలీ నుంచి కొందరు యువకులు యశ్వంతరావ్ దగ్గరకు వచ్చారు. కొంగలీ ప్రాంతం రావలసినదని ఆహ్వానించారు. యశ్వంత్‌రావు కొద్దిమందితో మండుటెండలో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కొంగలీ యువకులు స్వాగతం చెప్పి భోజనం ఏర్పాటు చేశారు. భోజనం మొదలు పెడుతుండగా ఒక వ్యక్తి గాబరాగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. బోలేగావ్‌పై రజాకార్లు దాడి చేశారని, దోపిడీ చేస్తున్నారని వెంటనే బయలుదేరి ఎదుర్కొంటే తప్ప లాభం లేదని అన్నాడు.

తింటున్న భోజనాన్ని వదిలేసి బయల్దేరిన వారికి దారిలో మేకర్ గ్రామం వైపు వెళుతున్న రజాకార్ల గుంపు కనపడింది. యశ్వంత రావు కాల్పులు సాగించాడు. అలా కాల్పులు సాగిస్తూ యశ్వంత్ బోలేగావ్ సమీపానికి చేరుకున్నాడు. బోలేగావ్ యువకులు నీళ్ళు ఇచ్చి మందుగుండు సామాగ్రి సరఫరా చేశారు. అటువైపు మేకర్ నుంచి వచ్చిన రజాకార్ల దళంతోబాటు వందకుపైగా రజాకార్లు ఉన్నారు. ఇటువైపు కొంతమంది సహాయంతో యశ్వంతరావు కాల్పులు కొనసాగిస్తున్నాడు. స్వభావరీత్యా యశ్వంత్ ముందుకు దూసుకుపోయాడు. ఫలితంగా అతని కాలులోంచి తుపాకి గుండు దూసుకుపోయింది.

Source: Vijaya Kranthi