Home News Supreme Court on Rafale

Supreme Court on Rafale

0
SHARE


రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఒప్పందం సజావుగా, నిర్ధారిత పద్దతి ప్రకారమే జరిగిందని సుప్రీం కోర్ట్ ఇవాళ స్పష్టం చేసింది. ప్రఃదాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ రాఫెల్ ఒప్పందంపై  తీర్పును వెలువరించింది. ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయని, కాబట్టి వెంటనే దానిని రద్దు చేయాలంటూ దాఖలైన మూడు ప్రజావ్యాజ్యాలను కూడా సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందం వల్ల నిజానికి దేశ ఖజానాకు ఎంతో డబ్బు ఆదా అయిందని, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అత్యవసరమని కూడా కోర్ట్ స్పష్టం చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల ధరకు సంబంధించి విచారణ చేయాలన్న పిటిషనర్ల వాదనను కూడా కోర్ట్ నిరాకరించింది. ఇది కోర్ట్ పరిధిలోని విషయం కాదని తేల్చి చెప్పింది. విచారణలో రఫెల్ యుద్ధ విమానాల ధరకు సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించిన బెంచ్, వైమానిక అధికారులను కోర్ట్ కు రప్పించి సమాచారం కూడా తీసుకుంది.

రాఫెల్ రాద్ధాంతం ఏమిటి?

ఫ్రాన్స్ నుండి అత్యాధునిక రాఫెల్ విమానాలు కొనుగోలు చేయాలని 2003లో అప్పటి యుపియే ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 129 విమానాలు కొనుగోలుచేయాలని భావించింది. దానికి సంబంధించి ఫ్రాన్స్ కంపెనీ దసాల్ట్ తో సంప్రదింపులు కూడా ప్రారంభించింది. అయితే రక్షణ కొనుగోళ్ళకు సంబంధించి సంప్రదింపులు ఆ కంపెనీలతో కాకుండా, సంబంధిత ప్రభుత్వంతో చేయాలన్న నిబంధనను అప్పటి యుపియే ప్రభుత్వం తుంగలో తొక్కింది. అలాగే కొనుగోళ్లలో కమిషన్ ల చెల్లింపులు ఉండరాదన్న నియమాన్ని కూడా గాలికి వదిలేసింది. ఎలాంటి విడిభాగాలు, ఆయుధాలు లేని ఉట్టి విమానం ఖరీదు గురించి దసాల్ట్ కంపెనితో చర్చలు జరిపింది. ఆ తరువాత 2007 నుంచి 2014 వరకు విమానాల కొనుగోళ్ల విషయాన్ని పట్టించుకోలేదు. మారుతున్న పరిస్థితుల్లో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అత్యవసరమని వైమానిక అధికారులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. దీనివల్ల వైమానిక దళంలో స్క్వాడ్రన్ ల సంఖ్య బాగా తగ్గిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం వైమానిక దళ అవసరాలను వెంటనే తీర్చేందుకు నిర్ణయించి ఫ్రాన్స్ ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపింది. ఇందులో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు స్వయంగా పాల్గొన్నారు. పూర్తి ఆయుధాలతోపాటు సిద్ధంగా ఉన్న 39 విమానాలను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. అలాగే విమానాల తయారీ భారత్ లో జరగాలన్న షరతుకు ఫ్రాన్స్ అంగీకరించింది కూడా.

కానీ ఈ ఒప్పందంలో అనేక లోపాలు ఉన్నాయని, ఒక విమానానికి ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధపడి మోదీ ప్రభుత్వం దేశానికి ఎంతో నష్టం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ హటాత్తుగా ఆరోపణలు ప్రారంభించింది. యుపియే హయాంలో ఒక విమానాన్ని 59 కోట్లకు కొనుగోలు చేయాలని ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ధరను 1,600 కోట్లకు మోదీ ప్రభుత్వం పెంచేసిందని, అలాగే రిలయన్స్ కంపెనీకి లాభం చేకూరే విధంగా ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించింది.

సుప్రీం కోర్ట్ తీర్పు పట్ల ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. యుద్ధ విమానాల కొనుగోలు విషయంపై అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నించినట్లు తేలిపోయిందని లోక్ సభలో కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం భద్రతా దళాల మనోధైర్యాన్ని కూడా దెబ్బతీయడానికి వెనుకాడని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సభకు వచ్చి దేశ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని రాజ్ నాధ్ డిమాండ్ చేశారు.