ఇటు తొండచీర్ కేంద్రంగా ఉన్న రైతుదళం బాగా బలపడింది. అనేకమంది యువకులు వచ్చి దళంలో చేరారు. కన్నయ్య మదనూర్లో పడిఉన్న ఆయుధాలను తీసుకురావాలని సూచించాడు. కన్నయ్య దళంలో ఒక విలక్షణమైన వ్యక్తి. బక్కపలచగా ఉండి గట్టిగా గాలి వీస్తే పడిపోయే మనిషి. అయినా ఎంతో చురుకుగా, ధైర్యంగా దూసుకుపోయి పనిచేసేవాడు. దళం ఆ సూచనను అంగీకరించింది. కొన్ని గుర్రాలను, ఒంటెలను తీసుకొని దళ నాయకులు మదనూర్ వెళ్ళారు. దత్తగీర్, చన్వీర్లు మామూలుగా తలలపై సంచులు వేసుకొని మరమరాలు అమ్ముకుంటూ అమాయకుల్లా గ్రామంలో అడుగుపెట్టారు.
బజార్లు తిరుగుతూ ఒక బట్టల దుకాణం లోకి బట్టలుకొనే నెపంతో వెళ్ళారు. ఆ కొట్టు ఇదివరకు కన్నయ్యదే. అది ఇప్పుడు భూమన్నది. భూమన్న ఇది వరకు కన్నయ్యకు గుమాస్తా. ఇతడు ఆర్యసమాజ్‌లో ఒక మంచి కార్యకర్త. కన్నయ్య ఉద్గీర్‌కు వెళ్ళిన తర్వాత ఆర్య సమాజ్ కార్యాలన్నీ ఇతనే స్వీకరించాడు. ఇప్పుడతను ఆర్య సమాజ్‌కు కార్యదర్శి కూడా. వీలు చూసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళతో తన ఉద్దేశ్యం చెప్పాడు. దత్తగీర్, చన్వీర్లు బట్టలు కొనుక్కుని వెళ్ళిపోయారు. అర్ధరాత్రి 2 గంటలప్పుడు, కన్నయ్య ఇంటి వెనక దారినుండి ఆయుధాలు తీసుకెళ్ళారు.
వాటిలో బన్సీరాజ్ కార్ఖానాలో చేసిన తుపాకులు, 70, 75 బల్లాలు, ఒక చిన్న ఫిరంగి, మందు సామాగ్రి కూడా ఉన్నాయి. వీటన్నింటినీ గుర్రాలపై, ఒంటెలపై వేసుకొని తొండచీర్ చేరారు. తొండచీర్ మధనూర్కు 40 మైళ్ళ దూరం. ఇదంతా రాత్రే జరిగింది. యశ్వంతరావ్ పోయాడనే విషాద వార్త విని, వ్యధిత హృదయాలతో అందరూ ఆట్టర్గాకు చేరారు. వాళ్ళంతా యశ్వంతరావును చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. నివృతిరావు కొద్ది రోజులు ఆగమని వెనక్కి తీశాడు. యశ్వంతరావ్ చికిత్స పొందుతున్నాడు.
ఆరోగ్యం సరికాగానే చేయవలసిన పని చేసి చూపిద్దాం. 50 రోజుల తర్వాత ఆరోగ్యం చేకూరిన యశ్వంతరావు ఆట్టార్గా చేరుకున్నారు. పాత మిత్రులందరూ ఆనందంతో ఒకరి నొకరు గాఢాలింగనం చేసుకున్నారు. అసలు యశ్వంతరావ్ చనిపోయాడనే భావించారందరూ. అట్టి సేనాపతి సజీవంగా ఉన్నాడనే వార్త వాళ్ళకు అవధుల్లేని ఆనందం కలిగించింది. ఆయన నేతృత్వంలో ఆయుధాలు ధరించేందుకోసం ఎంతో ఆత్రుతతో ఉన్నారు. స్థానిక ప్రజలపై జరిగిన అత్యాచారాలకు బదులు తీర్చుకోవాలని వారి దృఢ వాంఛ. అందుకై వారు యశ్వంత్రావ్ ఆజ్ఞకోసం ఆగి ఉన్నారు.
దారిలో అడ్డంకులు
ఆ అడవిలో రైతుదళాల భావి కార్యక్రమం గురించి చర్చలు జరిగాయి. అప్పటికే పోలీసుల వద్ద, రజాకార్ల వద్ద ఆధునికమైన ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళను భర్మార్లతో ఎదర్కోవడం రోజురోజుకి కష్టతరమై పోయింది. అందువల్ల షోలాపూర్ వెళ్ళి ఆధునికమైన ఆయుధాలు సంపాదించాలని దళం బయలు దేరింది. రాత్రిపూట ప్రయాణం చేస్తూ దినమంతా గ్రామాల ప్రక్కనున్న అడవులలో విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. పోలీసుల, రజాకార్ల కాపలానుంచి తప్పించుకొనేవారు. ప్రయాణంలో దళం మొదటిసారిగా ‘శేలగీ’ అనే గ్రామం దగ్గర విడిది చేసింది. ‘శేలగీ’ గ్రామాధికారిణి త్రివేణీబాయి దళానికి విందు చేసింది. దళం వాళ్ళు ఆకలితో ఉన్నారు. మొదటిముద్ద నోట్లోకి వెళ్ళిందో లేదో ప్రమాదకరమైన వార్త వచ్చి వాలింది.
‘సహజనీ’ అనే ప్రాంతం నుంచీ యాభైమంది పోలీసులు దళాన్ని పట్టుకోవటానికి వస్తున్నారని దళం ఆచూకి తెలియచేసింది. నలుగురు హిందువులే అనే సంగతి కూడా తెలిసింది. భోజనం వదిలి దళం వెంటనే గ్రామం బయటికి చేరింది. అనుకూలమైన చోట మాటుకాచి కూర్చున్నారు. పోలీసులు కాల్పులు ప్రారంభించారు. పోలీసు రైఫిళ్ళు దళం వాళ్ళ భర్మోర్ తుపాకుల కాల్పులు మూడుగంటలపాటు కొనసాగాయి. చివరికి ఒక పోలీసు చేయికి గాయమైంది. ఇది చూచి కొందరు పోలీసులు పరుగెత్తడం ప్రారంభించారు. అప్పుడు దళం వెంటనే తరిమికొట్టింది. తిరిగి వస్తుండగా దారిలో ఒక రజాకర్ దొరికాడు. అతని దగ్గర తుపాకీ మందుగుండు సామాగ్రి లాక్కొని కొట్టి పంపించారు. దళం చేసిన సాహసకార్యాన్ని శేలగీ గ్రామస్థులు అభినందించారు. ఆ తర్వాత దళం సభ్యులు భోజనం చేశారు.
ఆ రోజు సాయంత్రం దళం వారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అకస్మాత్తుగా బయటనుంచి తుపాకి పేలింది. ఆ రోజే తిరిగి మరోదాడి జరుగుతుందని దళం ఊహించలేదు. అంతకు పూర్వం పోలీసులకు ఆచూకీ ఇచ్చిన నలుగురు హిందువులే మళ్ళీ పోలీసులను, రజాకార్లను తీసుకువచ్చారు. రాజభక్తులమని నిరూపించుకున్నారు. ముఖ్యంగా భీమ్రావ్ అనే వ్యక్తి మానిక్రావ్మూలేతో ఇంతకు పూర్వమే ఉన్న భూమి తగాదా నెపంతో రజాకార్లను తీసుకువచ్చాడు. అయితే భీమ్రావ్ ఆటలు కొనసాగలేదు. ఆధునిక ఆయుధాలున్న పోలీసులు, రజాకార్లు కళ్యాణీ, మాలేగావ్ ప్రాంతాల నుంచి వచ్చి దాడిచేశారు. దళం చెక్కుచెదరని ధైర్యంతో తమ దగ్గర ఉన్న తుపాకులతోనే ప్రతిఘటించారు.
ఆ మసకచీకటిలోనే యశ్వంతరావ్ గురిచూసి కాల్చి ఒక పోలీసును పరలోకం పంపించాడు. ఇది చూసి పోలీసులు, రజాకార్లు ప్రాణ భయంతో పారిపోయారు. ఆనాటి వరకు పోలీసుల, రజాకార్ల చేతుల్లో అవమానాలు పొందుతూ వచ్చారు హిందువులు. దళం చూపిన ప్రతిఘటన వాళ్ళలో ఆత్మ విశ్వాసాన్ని ఎన్నో రెట్లు పెంచింది. అటువైపు నిజాం బంటులకు దళం పేరు వినగానే ముచ్చెమటలు పోసేవి. ఆ తర్వాత శేలగీ గ్రామ ప్రజలు దళాన్ని కొన్నిరోజులు అక్కడే ఉండమని కోరారు. ఈ లోగా గ్రామంపై రజాకార్లు తిరిగి దాడిచేయవచ్చుననే అనుమానం కలిగింది. అందువల్ల రైతుదళం గ్రామం ప్రక్కనే ఉన్న అడవిలో ఆరురోజులపాటు విడిది చేసింది. చివరికి తమ షోలాపూర్ ప్రయాణం కొనసాగించాలని గ్రామ ప్రజల నుండి సెలవు తీసుకుని బయలుదేరింది.
గ్రామాధికారిణి త్రివేణీబాయి స్వయంగా దళానికి ఏడువేల వెండి నాణాలు విరాళంగా ఇచ్చింది. ఆ సమయంలో దళంకోసం ఆయుధాలు కొనే నిమిత్తం ఆ డబ్బు సద్వినియోగమవుతుందని ఆవిడ విశ్వాసం వెలిబుచ్చింది. శేలగీ నుంచి మరుసటి రోజు ఉదయం జవల్గావ్ చేరుకున్నారు. మడ్జా వెళ్ళిన తర్వాత సరిహద్దువైపు వెళ్ళేదారి తెలియలేదు. ఆ భయపూరితమైన రోజుల్లో ఎవరూ కూడా ముందుకు వచ్చి దారి చూపించడానికి సిద్ధపడలేదు. అందువల్ల దళం తెగించి ముందుకు వెళ్ళిపోయింది. కొనాలిబసి చేరుకున్నారు. ఆకలి అందరినీ విపరీతంగా దహించి వేస్తోంది.
నడవడం సాధ్యం కాలేదు. ఆ బస్తీలోనే బిచ్చం ఎత్తుకొని ఆకలి తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పటేల్ మానిక్‌రావు ఇంటికి వెళ్ళి చేయి చాచారు. అతను వీళ్ళను ఇంటిలోకి రమ్మని వివరాలు అడిగాడు. ఆ పటేల్ అత్తవారి ఊరునుండి తాము వచ్చామని చెప్పారు. పటేల్ కొంచెం బెదిరిపోయి ఇలా అన్నాడు. ‘మీరంతా దోపిడీ దొంగలు. వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, లేకపోతే పోలీసుల్ని, రజాకార్లని పిలిపించవలసి ఉంటుంది. మీరు మా ఇంటికి వచ్చారని తెలిస్తే రజాకార్లు నన్ను బ్రతకనివ్వరు. నా ఉద్యోగం ఊడిపోతుంది. నా వ్యాపారం నాశనమవుతుంది. వెంటనే వెళ్ళిపోండి.’
గత్యంతరం లేక దళమంతా ఎలాగో హందరాల్ గ్రామం చేరుకుంది. అక్కడ అప్పారావు పటేల్ బంధువైన ఒక రైతు భోజన వసతి ఏర్పాట్లు చేశాడు. తర్వాత ముందుకు వెళ్ళే మార్గం చూపించమంటే ఎవరూ సిద్ధపడలేదు. ఒకరోజు హందరాల్ నుంచి రజాకార్ల దళం గుంజేటి అనే గ్రామం చేరుకుంది. తామంతా బాల్కీనుంచి వస్తున్నామని షోలాపూర్ సరిహద్దుపై దాడి చేయమని కార్యదర్శి ఆదేశించారని, వెంటనే బయలుదేరి రమ్మనమని చెప్పాడు. గుంజేటి రజాకార్లు నిజమేనని నమ్మి పెద్ద దళంతో హిస్సర్గా చేరుకున్నారు. ఆ ప్రాంతం ఇండియన్ యూనియన్ అంతర్భాగం. అందువల్ల గుంజేటి రజాకార్లు పై దళానికి అక్కడే వీడ్కోలు చెప్పి ముందుకు పంపించారు. ఇంతకూ ఈ రజాకార్ల దళమనే పేరుతో షోలాపూర్‌లో ప్రవేశించిన దళం అసలు హందరాల్లో చిక్కుబడిపోయిన రైతుదళమే. షోలాపూర్‌లో బొంబాయి పోలీసులు మొదట వారిని రజాకార్లని నమ్మి అరెస్టు చేసి రెండురోజులు లాకప్‌లో ఉంచారు. ఆ తర్వాత వాస్తవం తెలుసుకొని వదలివేశారు.
హందరాల్లో ఘర్షణ
ఎనిమిది రోజులపాటు ఉన్న తర్వాత దళం తిరిగి వెనక్కి బయలుదేరింది. అక్కడే స్టేట్ కాంగ్రెస్ దళానికి సహాయపడింది. ఒక స్టెన్‌గన్, బెన్గన్, ఒక 303, ఒక బారంబారీ, రెండు పిస్తోళ్ళు, ఐదువందల డైనమేట్లు, నాలుగువందల బుల్లెట్లు, చేతి బాంబులు మొదలైనవి తీసుకొని వచ్చారు. రాత్రిపూట ప్రయాణం చేస్తూ తిరిగి హందరాల్లోని ఆ రైతు ఇంటికి చేరుకున్నారు.