Home Interviews రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురౌతుంది

రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురౌతుంది

0
SHARE

అయోధ్య రామమందిర విషయంలో సుప్రీంకోర్టు తన విధులను విస్మరిస్తోందని, అలాగే ప్రభుత్వం మందిర నిర్మాణానికి పార్లమెంటులో బిల్లు పెడితే దానికి అందరూ మద్దతిస్తారని, వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురవుతుందని, అటువంటి స్థితిని ఏ పార్టీ కోరుకోదని విశ్వహిందూ పరిషద్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు అలోక్‌ కుమార్‌ అన్నారు. సుప్రీంకోర్టు తన విచారణలో రామమందిర నిర్మాణానికి తగిన ప్రాధాన్యం లేదనడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆర్గనైజర్‌ సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్‌, వార్తా సమన్వయకర్త డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌తో కలిసి నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిలో అలోక్‌కుమార్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి రామ మందిరాన్ని నిర్మించే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా ముందడుగు వేయాలని అలోక్‌ అన్నారు.

ముఖాముఖీ ముఖ్యాంశాలు:

విహెచ్‌పి ఆధ్వర్యంలో దిల్లీలోని రాంలీలా మైదానంలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. అప్పటి నుంచి రామజన్మ భూమి అంశం మళ్లీ ముందుకు వచ్చింది. ర్యాలీ నిర్వహణ ఉద్దేశం ఏమిటి? అది కూడా ఇప్పుడే ఎందుకు?
మీరు రెండు ప్రశ్నలు అడిగారు. అందులో ‘ఇప్పుడే ఎందుకు’ అనేది రెండవ ప్రశ్న. తొలుత మొదటి ప్రశ్నకు సమాధానం చెబుతాను. దేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మేము ర్యాలీలు నిర్వహించనున్నాము. వాటిల్లో ఒకటే దిల్లీలో జరిగినది. ఆ తరువాత లోక్‌సభ సభ్యులను కలిసి వారు, వారి పార్టీ రామజన్మభూమికి అనుకూలంగా వ్యవహరించాలని కోరుతున్నాము. ర్యాలీ ముఖ్య ఉద్దేశం రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా బిల్లు తీసుకురావడమే కాకుండా మిగిలిన పార్టీలు కూడా ఆ బిల్లుకు మద్దతు తెలిపేలా చూడడం. మాకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కూడా లభించింది. అందుకు ఉదాహరణగా దిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. రాంలీలా మైదానంలో జరిగిన వాటిలో ఇదే అతిపెద్దది. రాజ్‌ఘాట్‌, ఐటీఓల వరకు ర్యాలీ విస్తరించింది. రోడ్లు కూడా కార్యక్రమంలో భాగమయ్యాయి. రహదారిపై కూర్చున్న వారు ఎల్‌ఈడీ స్క్రీన్ల పైన కార్యక్రమాన్ని వీక్షించారు, లౌడ్‌ స్పీకర్ల ద్వారా ఉపన్యాసాలను విన్నారు.

ఇక ‘ఇప్పుడే ఎందుకు’ అనే విషయానికి వస్తే అందుకు హేతుబద్ధమైన సమాధానం ఉంది. ఎన్నికల ముందే ఎందుకు అనే మీ భావాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇది కేవలం యాదచ్ఛికం. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సారథ్యంలోని న్యాయపీఠం రామ జన్మభూమి విషయంలో విచారణను మొదలు పెట్టింది. కేసులో జోక్యం చేసుకునేందుకు వేసిన ముప్పైఒక్క దరఖాస్తులను వారు తిరస్కరించారు. వారు పత్రాల మార్పును కూడా పూర్తిచేశారు. దాంతో కేసును వారు కొలిక్కి తెస్తారనే నమ్మకం మాకు ఏర్పడింది. మంగళూరులో జరిగిన ధర్మసంసద్‌ సమావేశంలో కూడా ఈ విషయంపై చర్చ జరిగింది. కోర్టు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని సాధు సంతులు భావించారు. అప్పుడు మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే పార్టీలకు అల్లరు చేసేందుకు అవకాశం ఉండదు. అక్టోబరు 2, 2018 నాడు జస్టిస్‌ మిశ్రా పదవీ విరమణ పొందనున్నారు. అందుకే సాధువులు కూడా సెప్టెంబరు 2018వరకు ఎదురుచూశారు.

అదే సమయంలో అభిశంసన, కొందరు జడ్జిలు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టడం వంటివి చేశారు. చివరగా రామజన్మభూమి విషయం నిర్ణయం కాలేదు. మనం మోసపోయామని మాకు అనిపించింది. గత అరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మనం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము, ఒకవేళ కోర్టులు నిర్ణయించలేక పోతే ప్రభుత్వమే ప్రత్యామ్నాయంగా బిల్లు తెచ్చేలా కోరుదామని నిర్ణయించుకున్నాము. అలా అక్టోబరులో రామజన్మభూమి విషయం మొదలైంది. దీపక్‌ మిశ్రా తరువాత వచ్చిన జడ్జి రామజన్మభూమికి సంబంధించిన విజ్ఞప్తులు తమ ప్రాధాన్య అంశాల్లో లేవన్నారు. అలా ప్రభుత్వం ద్వారా మందిర నిర్మాణానికి బిల్లు తేవాలనే మా ఆలోచనకు పునాదులు పడ్డాయి.

దిల్లీలోనే కాక దేశంలోని 543 పార్లమెంటు నియో జకవర్గాల్లోనూ ర్యాలీలు జరుగుతాయా?
ఇప్పటికే కొన్ని జరిగాయి. మీడియా అయోధ్య ర్యాలీకి విస్తత ప్రచారాన్ని కల్పించింది. నాగపూర్‌లో జరిగిన ర్యాలీని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ పాల్గొని ప్రసంగించారు. ముంబైలో జరిగిన ర్యాలీలో ఎనభై వేల మంది భక్తులు పాల్గొన్నారు, నలభై నుంచి యాభై వేల మంది కుగ్రామాల నుంచి రామ మందిర నిర్మాణాన్ని కోరుతూ ర్యాలీల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా రామ మందిర ఉద్యమం తన ఉనికిని చాటుకుంది.

ఇప్పటి వరకు ఎన్ని ర్యాలీలు జరిగాయి?
మూడు వందల యాభైకి పైనే జరిగాయి. ఇంకా జరుగుతాయి.

మీరు ప్రతి పార్టీ వద్దకు వెళ్తున్నారా ?
రామ మందిర నిర్మాణానికి ఎన్డీఏయేతర పార్టీల మద్ధతును కూడబెట్టడానికి కూడా మేము ప్రయత్నిస్తు న్నాము. ఏ పార్టీ మదువైన హిందుత్వ విషయంలో అనుకూలంగా ఉన్నామని చెబుతుందో.. ఆ పార్టీ నాయకుడు తాను కూడా ఝంఝాన్ని ధరిస్తున్నాని చెబుతూ తన గోత్రాన్ని కూడా గుర్తు చేసుకొని, తీర్థ యాత్రలు చేస్తున్నారో, ఏ పార్టీ అయితే తన మ్యానిఫెస్టోలో ప్రతిజిల్లాలో గోమూత్ర శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తానని చెబుతుందో, అంతే కాకుండా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక మంత్రిత్వ శాఖను ప్రకటించిందో.. అటువంటి వారంతా నాకు తెలిసినంత వరకు రామ మందిర నిర్మాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే పొరపాటు చేయరు. వారు ఓటింగ్‌ను బహిష్కరిస్తారేమో గాని, వ్యతిరేకంగా ఓటు వేయరు. ‘ది హిందూ’, ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ లాంటి నకిలీ లౌకికవాద పత్రికలు, ఇతర ఛానల్స్‌ కూడా రామ మందిర నిర్మాణ డిమాండ్‌ను వ్యతిరేకించడం లేదు. ఒకవేళ బిల్లు వస్తే దానికి పూర్తి మద్ధతు లభించడమే కాకుండా ఎంతో తేలికగా పార్లమెంటులో పాస్‌ అవుతుంది కూడా. దేశంలో బిల్లుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి.

‘బిజెపికి అనుకూలంగా పార్టీల్లో చీలికలు తేవడానికే ఈ కార్యక్రమం’ అనే అభిప్రాయం ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాల్లోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం చట్టానికి అనుకూలంగా వ్యవహరించ గలదా?
ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చేమో కాని రామమందిర నిర్మాణానికి మాత్రం పూర్తి మద్ధతు లభిస్తుంది. మనం గమనిస్తే రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పార్టీ బిల్లుకు అనుకూలంగా తన స్వరాన్ని వినిపిస్తోంది. ఎవరు మాత్రం తమ ఓట్లను కోల్పోవాలని అనుకుంటారు! రామమందిర నిర్మాణానికి అనుకూలంగా ఉన్న ప్రతిపార్టీ ఎన్నికల్లో లాభపడుతుంది. వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురవుతుంది. నష్ట పోవాలా లాభపడాలా అనేది పార్టీల నిర్ణయానికే వదిలేద్దాం. శ్రీరాముడి వైపు నిలబడటం అంటే జాతీయవాదం వైపు, భారతీయతత్వం వైపు ఉండటమే.

అయోధ్య వివాదాన్ని చాలా పాత విషయమని చాలా మంది వాదిస్తారు. యువతలో దానికి పట్ల ఆసక్తి లేదంటున్నారు. ఆలయం అక్కడ ఉంది. ఏదో ఒక రోజు భవ్యమందిర ఏర్పాటవుతుంది. దాని కోసం నిరసనలు ఎందుకని అంటున్నారు?
సరే ! ఈ రోజు కాకపోతే రేపు. కాని ఆ రేపు ఎప్పుడు ? శ్రీరాముడు ఇరవై ఆరు సంవత్సరాల పాటు టెంటు కింద నివసించిన తరువాత మాకు ఈ విషయాన్ని సూచిస్తున్నారా ? వివాదం మొదలై అరవై ఎనిమిది సంవత్సరాలు అవుతోంది. ఆలయాన్ని కూల్చివేసి ఐదు వందల సంవత్సరాలు కావొస్తుంది. ఇంతవరకు ఎదురుచూసింది సరిపోలేదా ? హిందూ సమాజ సహనాన్ని ఎంత వరకు పరీక్షిస్తారు ?

మేము నిర్వహించిన బహిరంగ సభలకు వచ్చిన వారు యాభై శాతానికి పైగా నలభై ఏళ్ల లోపు వారే ఉన్నందుకు మాకు సంతోషంగా ఉంది. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే వారణాసిలో జరిగిన యువ కుంభ్‌ సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొన్నారు. ఆ సదస్సులో ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి అనుబంధ విద్యార్థులు, యువత కాకుండా మెడికల్‌ కళాశాలలు, ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులూ పాల్గొన్నారు. వారంతా ఎనిమిది నిమిషాల పాటు ‘ఎవరు మందిరం నిర్మిస్తే, వారికే ఓట్లు పడతాయి’ అంటూ నినదించారు. నాకు అర్థమైన విషయం ఏమిటంటే.. ఇది నిరసనల ద్వారా వ్యాపించినది కాదు. ప్రతి భారతీయుని జన్యువు, హదయంలో రామ మందిర నిర్మాణ కాంక్ష ఉంది.

నేను ఇటీవల రామకథ వినడానికి వెళ్లాను. అందులో శ్రీరాముని జననం గురించిన సంఘ టనను వివరించారు. అయితే ఆ మండపం వద్ద ఉన్న అందరూ నిజంగా శ్రీరాముడు జన్మించటాన్ని చూసినంతగా సంబరపడుతూ కనిపించారు. కాబట్టి రామమందిరం విషయంలో ప్రజల విశ్వాసాన్ని కొలవలేము. రాముడు మన హదయంలో ఉంటాడు. తన మందిర నిర్మాణం కోసం పోరాడే స్ఫూర్తినిస్తాడు. యువత కూడా అదే భావనలో ఉంది.

ఇప్పుడు మీరొక ప్రణాళికను రూపొందించుకొని 543 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తదుపరి కార్యక్రమాలు ఏమిటి?
రామమందిర నిర్మాణం కోసం అన్ని ప్రాంతాల్లో అనుష్టాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో ప్రయాగరాజ్‌లో ధర్మ సంసద్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చాము. రెండువేల కంటే ఎక్కువ మంది సాధుసంతులు ఈ కార్యక్ర మంలో పాల్గొంటారు. వారికి కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేసి భవిష్యత్‌ కార్యాచరణకై వారి మార్గదర్శనాన్ని పొందుతాము.

ప్రభుత్వం వెంటనే బిల్లు తీసుకురావాలని మీరు పట్టుబడుతున్నారా ?
అవును.

మీరు ప్రభుత్వంతో చర్చలు జరిపారా?
మేము కేంద్రమంత్రులతో పాటు అందరు ఎంపీలను కలుస్తున్నాము. కాని ఎవ్వరూ మమ్మల్ని ప్రశ్నించలేదు ‘ఇప్పుడే ఎందుకు’ అని.

ప్రధానమంత్రి, హోంమంత్రులతో ఈ విషయమై చర్చించారా?
మేము రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలిశాము. మంత్రి మండలిలోని ఇతర మంత్రులను కూడా కలిశాము.

ప్రభుత్వం మందిర నిర్మాణానికి బిల్లు తెస్తుందని భావిస్తున్నారా?
ఈ ప్రశ్నను మీరు నేరుగా ప్రభుత్వాన్ని అడగండి.

విహెచ్‌పికి నమ్మకం ఉందా?
మాకు నమ్మకం ఉంది. బిజెపి ప్రభుత్వం పాలంపూర్లో చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని కోరుతున్నాము. అందులో రెండు విషయాలను పార్టీ ప్రస్తావించింది. చట్టప్రకారం కోర్టు తీర్పు కోసం ఎదురుచూడటం. అందులోనే కోర్టు ద్వారా సరైన పరిష్కారం లభించదని పార్టీ పేర్కొంది. అది కూడా ఒకవేళ చట్టం ద్వారా రామమందిర నిర్మాణం సాధ్యపడకపోతే. కాబట్టి వారు ఏదైతే చెప్పారో అదే చేయమని కోరుతున్నాము. రథయాత్ర సందర్భంగా అద్వానీ గారు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. అంతకంటే ఎక్కువగా మేము ఏది కోరడంలేదు.

ప్రతిపక్షాల్లోని కొందరు కోర్టు విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిని సమాధానపరిచే ప్రయత్నం చేస్తున్నారా?
మేం చట్టపరిధిలోనే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. చట్టం వస్తే మార్గం సుగమం అవుతుంది. రామమందిర నిర్మాణం సాధ్య పడుతుంది. అంతేకాకుండా ఆ చట్టానికి ఎంత శక్తి ఉంటుందంటే ఎవరైనా వ్యతిరేకించాలంటే కూడా వెయ్యిసార్లు ఆలోచిస్తారు. సంతోషకరమైన విషయం ఏమిటంటే ఏ రాజకీయ పార్టీ కూడా హైదరాబాదుకు చెందిన మిత్రులు మినహా రామమందిర నిర్మాణానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.

మందిర నిర్మాణానికి విస్తతమైన మద్ధతు లభిస్తుందని మేము ఆశిస్తున్నాము. రామజన్మ భూమిలో మందిరాన్ని నిర్మించడానికి అనుమతిస్తే మేము స్వాగతిస్తాము. అంతేకాకుండా ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో వారికి తగిన స్థలాన్ని కేటాయించి మసీదు నిర్మించి వారి ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి మేము వ్యతిరేకం కాదు. అయోధ్యలో రామమందిరాన్నే నిర్మించనివ్వండి. ముస్లింలకు వారు కోరుకున్న చోట అద్భుతమై మసీదు కట్టివ్వండి. రామమందిర నిర్మాణం తరువాత హిందూ, ముస్లింలు మతసామరస్యంతో మెలుగుతారు.

రామమందిరం మత సామరస్యం పెంపొదిస్తుందని భావిస్తున్నారా?
అవును. మెజారిటీ ముస్లింలు రామమందిర నిర్మాణానికి అనుకూలంగా ఉన్నారు. ఫ్రంట్‌లైన్‌ అనే పత్రికలో ఏజీ నూరాని ఒక ప్రశ్నను లేవనెత్తారు. రేపటి రోజున ఒకవేళ కోర్టులు పాలించేది ఉంటే అక్కడ మసీదు నిర్మితమవ్వాలి. అందుకు ఏదైనా సాధ్యపడే మార్గం ఉందా? రాంలలా మందిరాన్ని తొలగించే శక్తి ఉందా? అది సాధ్యపడే విషయం కాదని ఆయన సూచించారు. చట్టపరమైన ఇబ్బందులు వెంటనే తొలగిపోవాలి. విచక్షణ గల ఏ వ్యక్తి అక్కడి నుంచి రామ మందిరాన్ని తొలగించాలన్ని అనుకోరు. కాబట్టి పరిస్థితులను అంగీకరించడమే ఉత్తమం. కాబట్టి మనమంతా శాంతి, సౌభ్రాతత్వం వైపు ముందడుగు వేద్దాం. అవధ్‌ (అయోధ్య) అనే ప్రాంతం లౌకికత్వానికి పెట్టింది పేరు. అక్కడి హిందూ ముస్లింలు కలిసినప్పుడు ఆదాబ్‌ అని ఒకరినొకరు పలకరించుకుంటారు. దాని అర్థం కూడా నమస్తే లాంటిదే. ఆ ప్రాంతం రెండు సంస్క తులకు ప్రయోగశాల లాంటిది. కాబట్టి మరోసారి ప్రపంచానికి శాంతి, సౌభ్రాతత్వాల సందేశం అక్కడి నుంచే ప్రారంభమయ్యేలా చేద్దాం. అయోధ్య అంటే ఎటువంటి యుద్ధం జరగని ప్రాంతం అని అర్థం. కాబట్టి మందిర నిర్మాణం జరగనివ్వండి. హిందూ, ముస్లింలకు మంచి సందేశాన్ని ఇవ్వండి.

సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా?
ప్రతి వాయిదాకి ముందు కోర్టులో విచారణ సవ్యంగా సాగుతుందనే మేము భావిస్తున్నాము. కాని మళ్లీ వాయిదా పడి నిరాశకు గురై తిరిగి వస్తున్నాము. రామజన్మభూమి మా ప్రాధాన్యం కాదని సుప్రీంకోర్టు అనడం బాధను కలిగించింది. వివాదంపై మార్చి 2019లోపు తీర్పు ఇవ్వాలని జిల్లా జడ్జికి ఆదేశాలను జారీ చేసింది. వందలాది ఫైల్స్‌, ఆధారాలు ఉన్నాయి. వాటిని కోర్టుకు వివరించినప్పుడు కోర్టు ఒక జాతీయాన్ని తెలిపింది ‘ఆకాశమే ఊడిపడినా తప్పక న్యాయం జరుగుతుంది’ అని. అలాంటప్పుడు రామ జన్మభూమిలాంటి ప్రధాన అంశంలో ఆ న్యాయాన్ని ఎందుకు చేయడంలేదు? అంతేకాకుండా తీర్పు వెలువడే వరకు జడ్జిలు బదిలీ కారని చెప్పారు. ప్రస్తుతం ఆ మాటలు చెప్పిన జడ్జి హైకోర్టుకు రానున్నారు. అయితే ఆయనే ఇప్పుడు కేసు ఎత్తివేతను అనుమతించొద్దని సుప్రీంకోర్టును కోరారు. అందుకు సుప్రీంకోర్టు ‘సమస్యను ఎలా పరిష్కరిస్తారు’ అని జడ్జిని వివరణ కోరింది. ఆకాశం ఊడిపడినా న్యాయం చేస్తామన్న వారే నేడు రామమందిర అంశం ప్రాధాన్యం కాదనడం ఏమిటి ? సుప్రీంకోర్టు తన విధులను విస్మరిస్తోంది.

ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. 2014లో మందిరం నిర్మిస్తామన్నవారు నేడు మాటను నిలబెట్టు కోవడం లేదని సాధు సంతులు అంటున్నారు?
మీ ప్రశ్నను నేను అంగీకరిస్తాను. వారు రామ మందిరాన్ని కచ్చితంగా నిర్మిస్తామన్నారు. మంది రాన్ని నిర్మించడానికి వారికి ఇంకా సమయం ఉంది. కాబట్టి మరికొన్ని నెలలు నేను ఎదురుచూస్తాను. వారు అందులో విజయాన్ని సాధించాలని కోరుకుంటాను.

Source:జాగృతి