Home News ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చిల్లో జరుగుతునే ఉన్నాయి: పోప్ ఫ్రాన్సిస్

ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చిల్లో జరుగుతునే ఉన్నాయి: పోప్ ఫ్రాన్సిస్

0
SHARE

ప్రపంచవ్యాప్తంగా చర్చి వ్యవస్థలో క్రైస్తవ నన్ లపై అక్కడి బిషప్లు మరియు ఫాదర్లు సాగిస్తున్న లైంగిక అత్యాచారాలు నిజమేనని క్రైస్తవ మతాధిపతి పోప్ అంగీకరించారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణంలో జర్నలిస్టులు వేసిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన పోప్.. తమ చర్చికి చెందిన మతాధికారులు, బిషప్ లు చర్చిల్లోని నన్ లపై అత్యాచారాలు జరిపినట్టు ఒప్పుకున్నారు.

గత వారం కేథలిక్ క్రైస్తవ అధికార కేంద్రం వాటికన్ అనుబంధ మహిళా విభాగానికి చెందిన మాసపత్రిక “విమెన్ చర్చి వరల్డ్” ఈ విషయమై ప్రత్యేక కధనం ప్రచురితమైంది. అందులో చర్చి ఫాదర్లు తమ కింద పనిచేస్తున్న క్రైస్తవ మహిళలు, నన్లపై సాగించే లైంగిక దురాగతాలు, అనంతరం బలవంతపు గర్భస్రావాలు, వారికి పుట్టిన పిల్లలకు తండ్రి వివరాలు తెలియకుండా పెంచడం వంటి దారుణమైన విషయాలు వెల్లడించింది. ఇదే సమయంలో పోప్ తాజాగా చేసిన అంగీకార ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

“విమెన్ చర్చి వరల్డ్” ఫిబ్రవరి సంచికలో ప్రచురించిన కధనంలో.. ప్రపంచ వ్యాప్తంగా చర్చిల్లోని అనేకమంది నన్లు తమపై జరుగుతున్న లైంగిక వేధిపులపై మౌనం వహిస్తున్నారని, అధికారులు చేపట్టే ప్రతీకార చర్యల తాలూకు భయమే దీనికి కారణం అని పేర్కొంది.

దశాబ్దాలుగా జరుగుతున్న ఈ దారుణాలకు సంబంధించి 1990వ సంవత్సరం నుండి ఆఫ్రికాలో జరుగుతున్న ఇదే తారగా ఘటనల తాలూకు రిపోర్ట్ వాటికన్ వద్ద ఉందని ఆ పత్రిక తన కధనంలో ప్రకటించింది.

ఈ ఘటనలను చూసీచూడకుండా చర్చి అధికారులు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే కలిగే అనర్ధాలు తీవ్రంగా ఉంటాయని పత్రిక సంపాదకురాలు లూసెట్టా స్క్రాఫియా ఆ కధనంలో పేర్కొన్నారు.

కేరళ క్యాథలిక్ చర్చిలో జరిగిన లైంగిక అత్యాచార ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఘటనలో కాథలిక్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ తనను సంవత్సరాలుగా లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని అక్కడి నన్ బహిర్గతం చేసి న్యాయం చేయాల్సిందిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంది. 2018 జూన్ నెలలోనే ఆమె తనకు జరుగుతున్న దారుణాన్ని బయటికి చెప్పినప్పటికీ, అనేక ఒత్తిడుల కారణంగా పోలీసులు సెప్టెంబర్ వరకు కూడా బిషప్ ని ప్రశ్నించలేదు. అనంతరం బిషప్ అరెస్టుకి ఒకరోజు ముందుగా అతనిపై చర్యగా పోప్ ఫ్రాన్సిస్ అతడిని బిషప్ పదవి నుండి తప్పించారు.

ఈ ఘటనలో మరో ఐదుగురు నన్లు బాధితురాలికి బహిరంగంగా మద్దతు ప్రకటించడం కారణంగా వారు మరోసారి చర్చి ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాల్లో రోమన్ క్యాథలిక్ చర్చిల్లో నన్లపై జరుగుతున్న అత్యాచారాల పరంపర అగ్రభాగాన ఉంటుంది.

ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా తమ చర్చిల్లో జరుగుతునే ఉన్నాయని, ఐతే ఈ ఘటనలను నివారించేందుకు తాము ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు అనే మాట సరియైనది కాదు, వీటిని ఆపటానికి మా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని, ఇందులో భాగంగానే కొందరు క్రైస్తవ అధిపతులపై చర్యలు తీసుకున్నాం అని పోప్ ఈ సందర్భంగా అన్నారు. మహిళలను రెండవ తరగతి స్త్రీలుగా చూడటం అనే సంస్కృతి కారణంగానే చర్చిల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పోప్ తెలిపారు.

Source: NDTV News