Home News భద్రాచలం: హిందూ ధర్మజాగరణ సమితి ఆధ్య్వర్యంలో గోటి తలంబ్రాల ఊరేగింపు

భద్రాచలం: హిందూ ధర్మజాగరణ సమితి ఆధ్య్వర్యంలో గోటి తలంబ్రాల ఊరేగింపు

0
SHARE

హిందూ ధర్మజాగరణ సమితి తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో దక్షిణ అయోధ్యగా పేరొందిన శ్రీసీతారామ దివ్యక్షేత్రమైన భద్రాచలంలో గోటి తలంబ్రాల ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది.

మర్చి 21, 2019 నాడు హిందూ ధర్మజాగరణ ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు ఈ గోటి తలంబ్రాలను భద్రాద్రి రామాలయ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయానికి సమర్పించారు. గత 41 రోజులుగా భక్తి శ్రద్ధలతో వడ్లను చేతితో ఒలిచి ఈ తలంబ్రాలు బియ్యం తయారుచేసారు. ఈ గోటి తలంబ్రాలను ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన జరుగబోయే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో వినియోగించడం జరుగుతుంది.

ఈ తలంబ్రాల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని తోగ్గూడెం గ్రామంలో హిందూ ధర్మరక్షా సమితికి చెందిన ఒక కార్యకర్త రామనామస్మరణతో తన పొలాన్ని దున్ని, విత్తనాలు చల్లి వరి పంట పండించడం జరిగింది. ఈ పంట ద్వారా సమకూరిన వడ్లను కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, బూర్గంపాడు, హన్మకొండ, జానంపేట, ఏడూళ్ళబయ్యారం మొదలైన 25 గ్రామాల్లో 40 పైగా దేవాలయాలకు సరఫరా చేయగా, ఆయా దేవాలయాలు కేంద్రంగా అక్కడి భక్తులు ఈ వడ్ల ద్వారా చేతి గోటితో తలంబ్రాలు తయారు చేశారు. అనంతరం ఆయా గ్రామాల భక్తులు తమ ప్రదేశాల నుండి మార్చి 20 తేదీ సాయంత్రం పాదయాత్ర ద్వారా భద్రాచలం చేరుకున్నారు. ఈవిధంగా దాదాపుగా 600 మంది పైగా భక్తులు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు.

గత 4 సంవత్సరాలుగా శ్రీ వల్లభనేని నాగేశ్వరరావు గారి సారథ్యంలో భద్రాచలం జిల్లా ధర్మజాగరణ సమితి ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. దీని వలన గ్రామాల్లో దేవాలయాలకు ఆదరణ పెరగడంతో పాటు మతమార్పిడి సమస్య చాలా వరకు తగ్గింది. దీనితోపాటు వైశాఖమాసంలో వరంగల్ జిల్లాలోని మల్లూరు గ్రామంలో గల హేమాచల లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణానికి కూడా గోటి తలంబ్రాలు తయారు చేసి పాదయాత్రగా వెళ్లి స్వామివారి కళ్యాణం కొరకు సమర్పించడం జరుగుతుంది.