Home News పాత్రికేయులు ప్రశ్నించే గొంతుక కావాలి – కెయు జర్నలిజం శాఖ అధిపతి మల్లేశ్వర్

పాత్రికేయులు ప్రశ్నించే గొంతుక కావాలి – కెయు జర్నలిజం శాఖ అధిపతి మల్లేశ్వర్

0
SHARE

ప్రస్తుత పరిస్థితుల్లో పాత్రికేయులు సమాజం పక్షాన ప్రశ్నించే గొంతుకలు కావాలని కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతి డా. శ్రీ సంగని మల్లేశ్వర కోరారు. సమాచార భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో దేవర్షి నారద జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం హన్మకొండ బాల సముద్రంలోని సామ జగన్మోహన్ రెడ్డి స్మారక భవనంలో పాత్రికేయ సన్మాన సభ నిర్వహించారు. సీకేఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా. పానుగంటి విశ్వనాథ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పురాణాలలో ముల్లోకాలకు సమాచారాన్ని చేరవేసిన నారద మహర్షిని తొలి పాత్రికేయునిగా పేర్కొంటూ సమాచార భారతి ప్రతి ఏటా ఆయన జయంతిని పాత్రికేయుల దినోత్సవంగా నిర్వహిస్తూ, సీనియర్ జర్నలిస్టులను సన్మానించడం అనేది వినూత్న ప్రయోగం అన్నారు. ప్రభుత్వాలేవీ కూడా పాత్రికేయ దినోత్సవాలు నిర్వహించడం లేదన్నారు. ప్రభుత్వాలకు, ప్రజలకు పాత్రికేయులు సంధానకర్తలుగా వ్యవహరించాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న భారతీయ ప్రజ్ఞ మాస పత్రిక సంపాదకులు మామిడి గిరిధర్ మాట్లాడుతూ, నారద మహర్షి అన్ని విషయాల్లో అపారమైన జ్ఞానాన్ని సముపార్జించిన దేవర్షి అని అన్నారు. పాత్రికేయులకు ఇలాంటి లక్షణాలు ఉండాలని అన్నారు. ప్రస్తుత కాలంలో జర్నలిజం వ్యాపారంగా మారిపోయిందన్నారు. అబద్దాన్ని నిజంగా మార్చే బాధ్యతను జర్నలిజం పోషిస్తోందన్నారు. ప్రపంచ దేశాల్లో భారత పరువును ఫణంగా పెట్టి కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయని అన్నారు.

కార్యక్రమంలో పాత్రికేయ రంగానికి విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్టులు దాసరి కృష్ణారెడ్డి, పిన్నా శివకుమార్ లను ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో సమాచార భారతి ప్రతినిధులు ఆర్. లక్ష్మణ్ సుధాకర్, దాస్యం రామానుజం, గొంతులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.