Home News ప్రార్ధనల ద్వారా వైద్యం అంటూ యువకుడి మృతికి కారణమైన పాస్టర్ మీద కేసు నమోదు

ప్రార్ధనల ద్వారా వైద్యం అంటూ యువకుడి మృతికి కారణమైన పాస్టర్ మీద కేసు నమోదు

0
SHARE

ప్రార్ధనల ద్వారా వైద్యం చేసి రోగాలు  నయం చేస్తామంటూ మోసానికి పాల్పడి యువకుడి మృతికి కారణమైన క్రైస్తవ బోధకుడిపై కేసు నమోదైంది.

తెలంగాణలోని మంచిర్యాల పట్టణానికి చెందిన క్రైస్తవ సంస్థ కల్వరి మినిస్ట్రీస్ అధినేతతో పాటు అతడి భార్య షారోన్ మరియు ఇద్దరు సహాయకులపై కేసు నమోదైంది. 

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రాజేష్ అనే యువకుడికి ప్రార్ధనల ద్వారా నయం చేస్తానంటూ నమ్మించిన పాస్టర్, అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా అడ్డుకున్నట్టు రాజేష్ తల్లి మంగమ్మ తన ఫిర్యాదులో తెలియజేసింది. రోగాలను నయం చేస్తామంటూ కల్వరి మినిస్ట్రీస్ చేస్తున్న ప్రకటనలకు ఆకర్షితురాలైన సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామస్తురాలు మంగమ్మ నాలుగు రోజుల క్రితం తన కొడుకుని సోమగూడెంలోని కల్వరి చర్చిలో ప్రార్ధనలకు  తీసుకువచ్చింది. రోజురోజుకూ అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో అనుమానం వచ్చిన మంగమ్మ, తన కొడుకుని ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకువెళ్తానని కోరడంతో చర్చి పాస్టర్ మరియు ఇతర సిబ్బంది అందుకు నిరాకరించారు. ప్రార్ధనల ద్వారా నయం చేస్తానని నమ్మించారు. ఈ క్రమంలో రాజేష్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అతడిని ఒక వాహనంలో ఎక్కించి, ఆస్పత్రికి అని చెప్పి అనేక చోట్లకు తిప్పుతుండగా అనుమానం వచ్చిన అతడి తల్లి గట్టిగ కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై వాహనాన్ని ఆపారు. అనంతరం అక్కడి నుండి ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే రాజేష్ మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. 

ఘటనపై దర్యాప్తు జరిపిన  కాశీపేట్ సబ్-ఇన్స్పెక్టర్ కె. భాస్కర్ రాజు, పాస్టర్ ప్రవీణ్, అతడి భార్య షారోన్ మరియు ఇద్దరు సహాయకులపై ఐపీసీ సెక్షన్ 304(2), 420 మరియు 34 కింద కేసు నమోదు చేసారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం.