కరీంనగర్ కొండాసత్యలక్ష్మిగార్డెన్‌లో ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ వైభవం పేరుతో జరిగే మూడు రోజుల (సెప్టెంబర్ 21 – 22 ) రాష్ట్ర స్థాయి సదస్సు నిన్న ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఏ జాతి మనుగడైనా దాని చారిత్రక, సాంస్కృతిక పునాదులపైనే ఆధారపడి ఉంటుందనేనది కాదనలేని వాస్తవం. చరిత్ర విస్మరించిన జాతి ఉనికి కోల్పోతుందనేది అంతే నిజం. విభిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు తెలంగాణ ప్రాంతానికి విశేష ఆభరణాలు. కళలు, ప్రజాజీవన శైలి, సాంస్కృతిక రూపాలు వైవిధ్యమైన ఆచార, సంప్రదాయాలు ఈ ప్రాంతానికి పెట్టని సుగుణాలు.
వేల సంవత్సరాల భాషా సాంస్కృతిక చారిత్రక సామాజిక తెలంగాణ చరిత్రకు పూర్వ వైభవం రావాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంత జీవన విధానం, వైభవంపై జరిగిన దాడులు, కుట్రలు ఏ ప్రాంతంపై జరగలేదన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన వారి చరిత్ర కూడా ప్రజల ముందుకు తీసుకు రావాల్సిన అవసరముందన్నారు. చరిత్రను, పాలకులు, అమరుల త్యాగాలను వీరగాథలను పరిరక్షించడంలో కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
అనంతరం రాణిరుద్రమదేవి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు తెలంగాణ చరిత్ర వైభవాన్ని తెలిపే విద్యార్ధుల నృత్యాలు నాటికలు మంత్రముగ్దుల్ని చేశాయి. సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే స్టాల్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్‌కుమార్, ప్రజ్ఞాభారతి వ్యవస్ధాపకుడు హనుమాన్‌చౌదరి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎల్ రాజభాస్కర్‌రెడ్డి, ఇతిహాస సంకల సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తాత్రేయశాస్త్రి, ఎమ్మెల్సీ చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, అఖిల భారత సంయోజక్ ప్రజ్ఞప్రముఖ్ నందకుమార్, ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత సంఘ చాలక్ దక్షిణామూర్తి, గిరిధర్ మామిడి, నగర ప్రముఖులు, వివిధ పాఠశాలల విద్యార్ధులలు పాల్గొన్నారు.
నేడు సదస్సులు.. సన్మానాలు...
రెండవ రోజు శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు వివిధ విలువైన అంశాలపై ప్రముఖులు, మేధావులు, సాహితీవేత్తలు, పరిశోధకుల ప్రసంగాలుంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి విశిష్ట వ్యక్తులకు పురస్కారాల ప్రదానం ఉంటుంది.