Home Telugu Articles వలస వెళ్ళిన బుల్బుల్ పక్షులు

వలస వెళ్ళిన బుల్బుల్ పక్షులు

0
SHARE

–డా.  శ్రీరంగ గోడ్బోలే  

మనసు అంతరాంతరాల్లో ఉన్న భావోద్వేగం సహజ అభివ్యక్తి కవిత్వం అని అన్నారు. అయితే ప్రజల సమిష్టి స్పృహలోకి ఇంకిపోయే కవిత్వం వారి మనస్థితిని ప్రతిఫలించి వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. బంకిమ్ చంద్ర రచించిన వందేమాతరం తన దేశాన్ని కేవలం ఒక ఆవాస ప్రదేశంగా, ఒక భూభాగంగానే కాక ఒక తల్లిగా, తన పిల్లలు పూజించి ఆరాధించే దైవశక్తి గా అభివర్ణిస్తుంది. ఒకసారి ఈ దేవతా స్వరూపం ప్రజలకు సాక్షాత్కారం కావడంతోనే శ్రీ అరబిందో అన్నట్లుగా “ఇక విశ్రాంతి లేదు, శాంతి లేదు, ఆలయం సిద్ధం చేసేంత వరకు, మూర్తిని ప్రతిష్టించే వరకు, బలిదానం చేసేంత వరకు నిద్ర లేదు..” (Rishi Bankim Chandra : Collected Works of Sri Aurobindo, April 16, 1907)

తాము నివసించే దేశం గురించి ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ దృక్పథం ఉండటం సాధ్యమే. వారికి ఒక భూభాగాన్ని తమ తల్లిగా అభివర్ణించడం అపరాధం కావచ్చు. అంతేకాకుండా ఆ భూభాగానికి దైవత్వాన్ని ఆపాదించి ప్రార్థించడం అనేది మత దూషణ కింద రావచ్చు. సారే జహాసే అచ్చా.. అని ప్రముఖంగా తెలిసిన తరానా – ఏ – హిందీ (హిందూస్తాన్ ప్రజల గీతం) కవితలో కవి ఇక్బాల్ తాను నివసించే దేశం పట్ల తన దృక్పథాన్ని వెల్లడిస్తాడు. హమ్ బుల్బులే హై ఇస్కీ…ఏ గుల్ సితా హమారా…ఇది మా ఉద్యానవనం మేము ఇందులో బుల్ బుల్ పక్షులం అని వర్ణిస్తాడు. చెట్టుకి కాసిన ఫలాలను ఆస్వాదించేందుకు పక్షులు తోటకు తరలి వెడతాయి. తోట ఖాళీ అయిపోయిన పక్షంలో అక్కడే ఉండవలసిన బాధ్యత పక్షులది కాదు. అవి అక్కడ నుంచి వలసపోతాయి.

READ మొదటి భాగం: ఖిలాఫత్ ఉద్యమం: ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏమిటి?

1920 వేసవి కాలంలో ఖిలాఫత్ ఉద్యమం తన తుది కార్యాచరణ ఏమిటి అనే విషయంలో ఇంకా అనిశ్చితంగా ఉంది. 1920 మే, నవంబర్ మాసాల మధ్య దాదాపు అరవై వేల `బుల్బుల్ పక్షులు’ వలస పోయాయి. లేదా తమ నివాసం అవిశ్వాసంతో కూడిన శక్తుల కారణంగా అపవిత్రం అయిపోయిందని హిజ్రత్  చేపట్టాయి. మత ప్రాతిపదిక లేనిదే ఆ స్థాయిలో వలస జరగడం అసంభవం.

హిజ్రత్  పై ఇస్లాం ఆదేశాలు:

 అవిశ్వాసంలో తమ జీవితాలు కొనసాగిస్తూ అపరాధ స్థితిలో ఉండే కంటే తమ విశ్వాసాన్ని పొందగలిగే భూమికి వలస పోవాలని ఖురాన్ స్పష్టంగా తెలియచేస్తుంది. తాము ఉన్న భూమిలో తమని అణచివేశారని అంటూ వలస పోని వారి పట్ల దైవ దూతలు స్పష్టంగా ఇలా అంటారు ‘అల్లా సృష్టించిన ఈ భూమి వలసపోవడానికి సరిపడేలా విశాలంగా లేదా? అటువంటి ఆవాసాలు ఒక దుష్ట ప్రయాణానికి అంతంగా పరిణమిస్తాయి.’ (ఖురాన్ 4.97) ఒక ప్రణాళిక వేసుకునే శక్తి లేని బలహీనులు, మార్గం చూపేవారు లేని వారికి మాత్రమే మినహాయింపు లభిస్తుంది. వలస పోయేవారికి ఖురాన్ ఈ విధంగా హామీ ఇస్తుంది – “అల్లా కోసం ఎవరైతే వలసపోయి భూమిలో ఉన్న పుష్కలమైన ప్రదేశంలో శరణు పొందుతారో, ఎవరైతే తమ ఇంటిని విడిచిపెడతారో, ఎవరైతే అల్లా కోసం ఆయన దూత కోసం పరారీలో ఉన్నప్పుడు మరణిస్తారో వారికి ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాపై ఉంది…” (ఖురాన్ 4.100).

READ రెండవ భాగం: ఖిలాఫత్ ఉద్యమం : మతగ్రంధం, చారిత్రక సంఘటనలు

మహమ్మద్ ప్రవక్త హిజ్రత్ ని ప్రోత్సహించడమే కాదు, ఆయన స్వయంగా కూడా హిజ్రత్ జరిపారు. తన ప్రయాణం అయిదవ సంవత్సరంలో ఆయన తన సహ ప్రయాణీకుల బాధలను గమనించినప్పుడు మహమ్మద్ ప్రవక్త ఇలా అన్నారు: ‘మీరు అబిసీనియా వెడితే మీకు మంచిది. ఎందుకంటే ఆ చక్రవర్తి అన్యాయాన్ని సహించడు, అది స్నేహపూర్వకమైన దేశం. అల్లా మిమ్మల్ని వ్యధ నుంచి విముక్తి చేసేంత వరకు …’ (The Life of Muhammad, A Translation of Ishaq’s Sirat Rasul Allah with Introduction and Notes by A. Guillaume, Oxford University Press, 1965, p. 146). ఇక్కడ వ్యధ, బాధ అంటే మక్కాలో అప్పటికి ముస్లిమేతరుల ఖురాయిష్ గిరిజనుల చేతుల్లో పడిన ‘హింస అత్యాచారం ‘ అని.  622 సంవత్సరం సెప్టెంబర్ లో తన మామ అబూ తాలిబ్ మరణం అనంతరం తన కుటుంబం నుంచి మద్దతు కోల్పోయిన మహ్మద్ ప్రవక్త స్వయంగా మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ జరిపారు. హిజ్రత్ అంటే పిరికిపందగా పారిపోవడం కాదు అన్న విషయాన్ని గుర్తించాలి. అది కేవలం ఇస్లామిక్ భూముల్లో ఒకచోట గుమిగూడి అవిశ్వాసుల ఆధీనంలో ఉన్న భూమిని ఇస్లాం కోసం తిరిగి సాధించే యుద్ధానికి ఒక వ్యూహం మాత్రమే. హిజ్రత్ జిహాద్ వేరు వేరు కాదు. అత్యంత కక్షతో జిహాద్ జరిపేందుకు సన్నద్ధతని హిజ్రత్  అంటారు!

తమ జన్మభూమిని మాతృదేవతగా చూసేవారికి, తమ విశ్వాసం ఆధారంగా మాత్రమే తమ భూమి పట్ల మమకారాన్ని చూపేవారికి మధ్య ఎంతగానో వ్యత్యాసం ఉన్నదన్న విషయం స్పష్టమవుతోంది. ఈ వ్యత్యాసం అనే నిజాన్ని అర్థం చేసుకోలేని వారు అర్థం చేసుకోని వారు 1920 హిజ్రత్ వెనుక అర్థమేమిటో కూడా తెలుసుకోలేరు.

READ మూడవ భాగం: ఖిలాఫత్ ఉద్యమం: ముందు వందేళ్లు

దారుల్ హర్బ్ గా భారత్  

1803 తర్వాత కొంతకాలానికి షా వలీఉల్లా కుమారుడైన షా అబ్దుల్ అజీజ్ (1746-1824)   దేశాన్ని ఇమామ్ ఉల్ ముస్లిమీన్ ఆదేశాల ప్రకారం కాక క్రైస్తవ పాలకుల ఆధారంగా పాలిస్తున్నారని ఒక ఫత్వా (సత్తువా ఈ అజీజీ) జారీ చేశాడు. బ్రిటీష్ పాలనలో ఉన్న భారత్ కు సంబంధించి ఆయన శిష్యుడు అల్లుడు అయిన అబ్దుల్ హై (మరణం 1828) ఇంకా చాలా స్పష్టమైన ప్రస్తావన చేస్తూ ఇది ‘శత్రువు దేశమ’ని ‘మన పవిత్ర చట్టాలకు ఇక్కడ అమలు లేదని’ పేర్కొన్నాడు. ఇంతకీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అబ్దుల్ హై ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగాన్ని చేపట్టడం (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, p.118;  Shah Abdul Aziz: His Life and Time, Mushirul Haque, Institute of Islamic Culture, 1995, pp. 24-26).

సాధారణంగా, ప్రార్థన విషయంలోనూ, విశ్వాసం కలవారి రక్షణ, తమ రక్షణ కోసం పన్ను చెల్లించే ముస్లిమేతరులు ధిమ్మీల  రక్షణ కోసం ముస్లిం చట్టాలు అమలులో లేని  దేశాలు దర్ అల్ హర్బ్ లోకి వస్తాయి. ఒక ముస్లిం దేశం  దర్ అల్ హర్బ్  గా మారినప్పుడు ముస్లింలందరూ కూడా దర్ అల్లా ఇస్లాం కు వెళ్లి, ముందు ముస్లిం దేశంగా ఉండి ఆ తర్వాత దర్ అల్ హర్బ్ గా మారిన దేశం పైన మరొక సారి అధీనం సాధించడం అనేది ముస్లింలు అందరిపైనా ఉన్న బాధ్యత. మహ్మద్ ప్రవక్త 622 CE లో మదీనాకు హిజ్రత్ పై వెళ్లిన అనంతరం ఎనిమిది సంవత్సరాల తరువాత మక్కాపై విజయవంతంగా అధీనం సాధిస్తూ తిరిగి వచ్చారు.   1920 హిజ్రత్ కు మద్దతిచ్చేవారు ఆఫ్ఘనిస్తాన్ కు వలస వెళ్లాలని సూచన చేయడంలో ఇటువంటి లక్ష్యమే వారి దృష్టిలో ఉంది.

బ్రిటీషు పాలకులు ఖిలాఫత్ కు ముప్పు తెచ్చిపెడుతున్న కారణంగా ఖిలాఫత్ దృక్పథంలో భారత్ అపవిత్రంగా మారింది. ఈ దృక్పథాన్ని ప్రధానంగా పెంపొందించిన వారు అలీ సోదరులు. 1919 ఏప్రిల్ 24 నాడు వైస్రాయ్ లార్డ్ ఛల్మ్స్ ఫోర్డ్ కి రాసిన ఒక లేఖలో వారు ‘ముస్లిం అయిన వాడు ఇంకేదన్నా మరింత స్వేచ్ఛ కల ప్రదేశానికి వలస వెళ్లి ఇస్లాంకు సురక్షితమైన తరువాత ఈ భూమికి తిరిగి రావాలి. మా బలహీన పరిస్థితి కారణంగా మాకు వలస అనేది ఏకైక ప్రత్యామ్నాయం…’ అని రాశారు. …” (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, p. 119, 120).

READ నాల్గవ భాగం: ఖిలాఫత్ ఉద్యమం: పునాదులు వేసినది ఎవరు?

ఆఫ్ఘన్ ప్రతిపాదన  

టర్కీ అరేబియా పర్షియా ఐరోపా క్రైస్తవ పాలనలో ఉన్న కారణంగా అఫ్ఘానిస్తాన్ మాత్రమే ఏకైక దర్ అల్ ఇస్లామ్ గా కనిపించింది. ఆటోమాన్ సామ్రాజ్యం రద్దు తరువాత ఏర్పడిన అధికార శూన్యతను తాను నింపాలని ఆఫ్ఘనిస్తాన్ కలలు కన్నది. 1920 ఫిబ్రవరి 9 వ తేదీన అఫ్ఘానిస్తాన్ కి చెందిన అమీర్ అమానుల్లా (1892-1960) తాను ఖిలాఫత్ కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమనీ, హిజ్రత్ జరిపే ముహాజరీన్ ని తాను భారత్ నుంచి అఫ్ఘానిస్తాన్ కి స్వాగతిస్తున్నాననీ ఒక ఉపన్యాసం చేశాడు. ఈ ఉపన్యాసానికి భారత్ లో విస్తృతంగా ప్రచారం లభించి చాలా సంచలనం సృష్టించింది. (The Hijrat of 1920 and Afghanistan, Abdul Ali, Proceedings of the Indian History Congress, Vol. 43, 1982, pp. 726, 727).

ముహజరీన్ సౌకర్యం కోసం అమీర్ అమానుల్లా ఈ నిజాం నామా ఆర్డినెన్స్ జారీ చేశాడు. (Source Material for a History of the Freedom Movement in India: Khilafat Movement  Vol. X, Government of Maharashtra, 1982, pp. 398,399) :

1)  ఆఫ్గనిస్తాన్ కి వలస రావాలని అనుకునే ఏ వ్యక్తికైనా పెషావర్ లేదా ఢక్కా లో పాస్పోర్ట్ లభిస్తుంది. ఆఫ్ఘన్ గడ్డ మీద పాదం మోపిన వారు ఎవరైనా ఆఫ్ఘన్ పౌరుడిగా పూర్తి హక్కులు కలిగి ఉంటారు. ఆ వ్యక్తి  మొహమ్మదీయ చట్టాలు, ఆ దేశం అంతర్గత చట్టాలకు లోబడి ఉండవలసి వస్తుంది.

2) ఆఫ్గనిస్తాన్ గడ్డపై అడుగు మోపి, ఆ దేశ ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటించేవారెవరికైనా ఈ ప్రకారంగా సాగు భూమి ఇవ్వడం జరుగుతుంది. అవివాహిత వ్యక్తికీ ఆరు జరబ్ లు. (1 జరబ్ = 0. 49 ఎకరాలు లేదా 2000 చదరపు మీటర్లు). వివాహితుడికి 8 జరబ్ ల భూమి లభిస్తారు. అవివాహితురాలైన యువతికి, మైనర్ కి ఎటువంటి భూమి లభించదు.

3) ముహాజరీన్ కి ఇచ్చిన భూమిలో పంట చేతికొచ్చే వరకు వారికి ఈ విధంగా ఆహరం సరఫరా అవుతుంది. పెద్దలు ఒకరికి నెలకు 5 సీర్ల గోధుమ పిండి. (కాబుల్ తూనికల ప్రకారం ఒక సీర్ = 7.066 కిలోలు; ఆరేళ్ళ వయసు నుంచి మైనర్ కు నెలకు 3 సీర్లు గోధుమ పిండి.

4) భూములు కేటాయించిన వారికి మొదటి ఏడాదిలో నాగలి మొదలైనవి కొనుక్కోవడానికి వీలుగా తకావి అడ్వాన్స్ కింద ఆరు సేర్ల గోధుమలు జరబ్  కు ఐదు రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది మూడేళ్ల తర్వాత మూడు వాయిదాలుగా ఈ డబ్బును తిరిగి ఇవ్వవలసి ఉంటుంది.

5) భారతీయ మూహాజీర్లు భూమికి రెవెన్యూ చెల్లింపు నుంచి మూడేళ్లు మినహాయింపు పొందవచ్చు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగో ఏడాది నుంచి దీనిని తిరిగి వసూలు చేస్తారు.

6) ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేదు

7) విద్యావంతులైన వారు లేదా శాస్త్ర విజ్ఞానం కళల్లో పరిచయం ఉన్నవారు ప్రభుత్వం కనుక వారి సేవలు వినియోగించుకోవాలనుకుంటే ఆ ప్రకారం వారు సేవలు అందించవచ్చు. వారి అర్హతలను బట్టి చెల్లింపు ఉంటుంది. మిగిలిన వారందరూ కూడా సేవల్లో చేరడమో లేదా ఎటువంటి వ్యాపారమైనా వృత్తి అయినా చేపట్టేందుకు స్వేచ్ఛ కలిగి వుంటారు.

8)  భారతీయ ముహాజిర్లు ఆఫ్గనిస్తాన్ గడ్డపైనే అడుగుపెట్టగానే ప్రభుత్వం భూములు కేటాయించి, ఉచిత ఆవాసం లేని పక్షంలో నివాసం నిర్మించి ఏర్పాటు చేసేవరకు ఒకటి రెండు నెలలు జబల్ ఉస్ సిరాజ్ లో బస చేయవలసి ఉంటుంది.

ఆఫ్గనిస్తాన్ చేసిన ప్రతిపాదన పట్ల 1920 ఏప్రిల్ 25న జరిగిన ఖిలాఫత్ కార్మిక సదస్సు హర్షం ప్రకటించింది. హిజ్రత్ జరపాలా వద్దా అనే అంశంపైనా ఉలేమా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. హిజ్రత్ జరపాలని వాదించిన ఒక ప్రముఖ ఖిలాఫత్ వాది  మరెవరో కాదు. మౌలానా ఆజాద్. కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ‘జాతీయతావాది’.

READ ఐదవ భాగం: మొదటి ప్రపంచ యుద్ధం – భారతీయ ముస్లింల తీరు

మౌలానా ఆజాద్: హిజ్రత్ మద్దతుదారు

ఖిలాఫత్ ఉద్యమంలో మౌలానా ఆజాద్ పాత్ర చాలావరకు భావనాత్మకమే. 1920 ఫిబ్రవరి 28-29 లలో ఆయన ఖిలాఫత్ కోల్కతా సదస్సులో చేసిన ఉపన్యాసం ఖిలాఫత్ ఉద్యమాన్ని మతపరంగా ఎలా భాష్యం చెప్పుకోవాలో వివరించింది. ఆయన రచించిన ఉద్గ్రంథం Masala-e-Khilafat waJazirat al-Arab (The Khilafat issue and the Holy Places of Islam) ఖిలాఫత్ పట్ల భారతీయ ముస్లింల దృక్పధం సారాంశాన్ని క్రోడీకరించిన ఇస్లామిక్ పత్రం.

మార్చ్ 25, 1920, నాడు మౌలానా ఆజాద్ ముస్లింలకు వెళ్ళడానికి చోటు లేదు కనుక హిజ్రత్ సాధ్యం కాదని వాదించారు. కానీ ఆ తర్వాత 1920 జులై 30 వ తేదీన అమృత్ సర్ నుంచి ప్రచురితమయ్యే  అల్ – ఏ – హదిత్ (Ahl-e-Hadith) ఉర్దూ దినపత్రికలో వ్రాసిన హిజ్రత్ కా ఫత్వా (Hijrat ka fatwa) లో సరిగ్గా విరుద్ధంగా వాదించారు. ‘ధర్మవర్తన కోరుకుంటున్నవారు’ తనని సంప్రదించాలని, లేదా హిజ్రత్ కి అనుకూలంగా ఉండే ఉలేమాని సంప్రదించాలని ఆయన ఆ వ్యాసంలో సూచించారు.

  తన ఫత్వాలో ఆజాద్ ఈ విధంగా పేర్కొన్నాడు. “షరియత్ లో అన్ని నిబంధనలు సమకాలీన సంఘటనలు ముస్లింల ప్రయోజనాలు రాజకీయ అంశాల్లో అనుకూల ప్రతికూల అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరువాత  భారత్లో ముస్లింలకు భారత్ నించి వలస పోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని నాకు నమ్మకం కలిగింది. వెంటనే వలస పోలేని వారు వలస వారికి సహాయపడాలి.”

భారత్ లో మిగిలిపోయిన వారు ఇస్లాం శత్రువుగా పరిగణించే వ్యవస్థతో ఎటువంటి సంబంధం గాని సహకారం గాని కలిగి ఉండడానికి వీల్లేదు. పవిత్ర ఖురాన్కు అనుగుణంగా ఇది పాటించని వారిని కూడా ఇస్లాంకు శత్రువుగా పరిగణించాలని అన్నారు. తన అభిప్రాయానికి రాజకీయపరమైన ఎటువంటి ప్రాతిపదిక లేదని ఆజాద్ స్పష్టం చేశాడు.

 ఆజాద్ లక్ష్యం కాన్ స్టాంటినోపుల్ ను కాపాడడం కాదు ఇస్లాం మతాన్ని కాపాడడం. హిజ్రత్ విషయంలో ఆయన సంకోచం కేవలం అది నిర్వహించే పద్ధతిపైనే. ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాలని అస్తవ్యస్తంగా కాదని ఆయన అన్నాడు. వలస పోయే ముందు వలసకు సంబంధించిన వాగ్దానం చేయడం కూడా అత్యవసరమని మరొక అర్హతను ఆ సూచించాడు అయినప్పటికీ ఈ ఉద్యమం తర్వాతి దశలో దానిలో ఉన్న పరిమితులు ప్రమాదాలు ఆయనకు కనిపించినప్పటికీ ఆయన మొండి వైఖరి అవలంబించి తన సూత్రాలకు కట్టుబడ్డాడు. కేవలం క్షేత్రస్థాయిలో చిన్న చిన్న అర్హతలను మాత్రమే మార్చాడు.

 (Hijrat: The Flight of the Faithful A British File on the Exodus of Muslim Peasants from North lndia to Afghanistan in 1920, Dietrich Reetz, Verl. Das Arabische Buch, Berlin, 1995, pp. 35,36).

READ ఆరవ భాగం: బ్రిటిష్ అండతో పెరిగిన ముస్లిం వేర్పాటు వాదం (1857-1919)

హిజ్రత్ కు సన్నద్ధం కావడం  

హిజ్రత్ ఉద్యమానికి ప్రధాన సంస్థాగతమైన వేదిక ఖిలాఫత్ కమిటీయే. దేశవ్యాప్తంగా శాఖలతో ఒక కేంద్రీయ హజరత్ కార్యాలయాన్ని తెరిచారు. స్థూల ప్రాతిపదికన ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా స్థానిక హిజ్రత్ కమిటీలు తామర తంపరగా పొడుచుకొచ్చాయి ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రంలో ఇవి వెలిశాయి. హిజ్రత్ తయారీకి సంబంధించిన ప్రధాన బాధ్యత పెషావర్ కమిటీ పైన ఉండగా అంజుమన్ ఈ మహా జరీన్ ఈ ఇస్లాం సుభా సర్ హదీ (Anjuman-iMuhajirin-i Islam Subah Sarhadi ) (Organisation of Islamic Emigrants of the Frontier Province) అని దానికి పేరు పెట్టారు.  (Dietrich Reetz, Hijrat: The Flight of the Faithful A British File on the Exodus of Muslim Peasants from North lndia to Afghanistan in 1920, p. 44, 45).

హిజ్రత్ ను ప్రోత్సహించేందుకు మసీదులను తరచూ వినియోగిస్తూ ఉండేవారు వేదికపై నుంచి ముల్లాలు వలస వెళ్లని ముస్లింలు నాస్తికులు అవుతారని ప్రవచిస్తూ వుండేవారు. రచయితలు గద్యం పద్యం ద్వారా భావోద్వేగాలను రేకెత్తించే వారు మాండలిక పత్రికలు ఆఫ్ఘనిస్తాన్లో జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో కథనాలు ప్రచురించేవి. ఆఫ్ఘనిస్తాన్లో మూహాజీర్లకు మహా ఘనమైన స్వాగతం వేచి ఉందని ప్రజలకు కథలు కథలుగా చెప్పేవారు. (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, p. 125,126)

READ: ఏడవ భాగం: విన్నపాలు, విజ్ఞప్తులు (1918 డిసెంబర్ – 1920 జులై)

బారులు తీరిన విశ్వాసులు

ఈ ఉద్యమం ప్రారంభం కావడానికి ఒక సంకేతపూర్వకమైన చర్య అవసరం అనుకున్నారు. ముస్లిం హిజ్రా శక సంవత్సరానికి అనుగుణంగా 1338 మంది ఆఫ్గనిస్తాన్ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారని ఉర్దూ పత్రిక జమీందార్ 1920 మే 7 వ తేదీన ప్రకటించింది. కొంతమంది ఔత్సాహికులు రహస్యంగా సరిహద్దు దాటడం ప్రారంభించినప్పటికీ, ఒక క్రమ పద్ధతిలో హిజ్రత్ వలస మాత్రం 1920 మే 15న ప్రారంభమైంది. టర్కీతో శాంతి ఒప్పందం గురించి భారత్ లో ప్రచురించిన నాడే ఆ రోజే అత్యుత్సాహంతో ఉన్న మొదటి బృందం ముహాజిర్లు ‘ఎంతో సంతోషంగా’ సరిహద్దు దాటి కాబుల్ వైపు ప్రయాణించారు.

ప్రారంభంలో హిజ్రత్ మందకొడిగా ఉంది. దానికి ఒక కారణం CKC జామియత్  ఉల్ ఉలామా సహాయ నిరాకరణ కార్యక్రమం తయారీలో నిమగ్నమై ఉండడం. అంతే కాకుండా, ప్రముఖ ఖిలాఫత్ వాదులైన అజ్మల్ ఖాన్, కిచ్లూ, జిన్నా, ఇక్బల్ మొదలైన వారి నుంచి హిజ్రత్ కి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతోంది. హిజ్రత్ ముస్లింలకు మంచిది కాదని వారు గట్టిగా విశ్వసించారు. (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, p.126) 53 మంది వలస ముస్లింల మొదటి బృందం 1920 మే 15తో ముగిసిన వారంలో ఖైబర్ కనుమల గుండా ప్రయాణించి సరిహద్దుకు చేరుకుంది. 1920 జులై లో అత్యధికంగా ఉన్న సమయంలో కూడా ఈ ఉద్యమం కేవలం వాయువ్య సరిహద్దు రాష్ట్రానికే పరిమితమైంది. వలస వచ్చినవారిలో 85 శాతం మంది అక్కడివారు కాగా 10 శాతం మంది పంజాబ్ నుంచి, మరో 5 శాతం మంది సింధ్ నుంచి వచ్చారు. అత్యధికంగా దాదాపు 50 వేల  మంది ఆఫ్గనిస్తాన్ చేరుకున్నారని ఒక అంచనా. (Dietrich Reetz, Hijrat: The Flight of the Faithful A British File on the Exodus of Muslim Peasants from North lndia to Afghanistan in 1920, p. 52). ఆఫ్ఘన్ లు అంచనా వేసిన 40 వేల మందికి అదనంగా అమీర్ హిజ్రత్ నిలుపు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఏడు వేలమందికి పైగా 7000 వలస వెళ్లారు. అంతే కాకుండా, 1920 సెప్టెంబర్ లో కూడా చిన్న చిన్న బృందాలు ఖోస్త్ కి వలస వెడుతూనే ఉన్నాయి. ఖైబర్ కనుమ ద్వారా కాకుండా వేరే మార్గాల ద్వారా కూడా పెద్ద సంఖ్యలో ముహాజిర్లు ఆఫ్గనిస్తాన్ కి వెళ్లారు. మొత్తం 50 నుంచి 60 వేల మంది వలస వెళ్లారని భావించవచ్చు. (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, p.148)

రెండు అంశాలు బ్రిటిష్ వారికి ఆందోళన కలిగించాయి. గ్రామాలకి గ్రామాలు ఖాళీ అయిపోతుంటే వలస వెడుతున్నవారు అమ్మేస్తున్న భూమి, ఆస్తుల విలువ పడిపోవడం ప్రారంభించింది. రెండోది, హిజ్రత్ పోలీస్ అధికారులు, సైన్యానికి పెరుగుతున్న ప్రాబల్యం. ఆగస్టు ప్రారంభంకల్లా, హిజ్రత్ కి వెళ్లిన ముస్లిం సైనికుల సంఖ్య భారతీయ అధికారుల ఒక కంపెనీకి సరిసమానంగా ఉంది. (Dietrich Reetz, Hijrat: The Flight of the Faithful A British File on the Exodus of Muslim Peasants from North lndia to Afghanistan in 1920,  pp. 53, 54)  (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, p.132)

పరివ్యాప్త ముస్లిం వాదం (Pan Islamism)

తీవ్రమైన వేసవి సమయంలో ముహాజిర్లు దుర్భేద్యమైన, ఒక్క అంగుళం నీడ లేని ప్రాంతం నుంచి వెళ్ళవలసి వచ్చేది. ఆహరం, నీరు లభించేవి కావు. భారతీయ భూభాగం దాటిన తర్వాత వారి ప్రయాణం దుర్భరంగా మారేది. అమీర్ చేసిన వాగ్దానాల మాట ఎలా ఉన్నా, వారికి సహాయం ఏ మాత్రం లభించేది కాదు. ముహాజిర్లను అణచివేసిన అమీర్ అధికారులు, వారిని తన్నేవారు, కోటేవారు, నానా హింసలూ పెట్టేవారు. ఆఫ్ఘన్ ప్రజలు కూడా వారి పట్ల దౌర్జన్యంగా వ్యవహరించేవారు. వారి మహిళల మానం కొల్లగొట్టడం కూడా జరిగేది. ఆఫ్గనిస్తాన్ కి వెళ్లిన ముహాజిర్లకి ఎంత ఆక్రోశం ఉండేది అంటే, తమను హిజ్రత్ పై పంపిన మూలాలను ఇంటికి వెళ్ళగానే కాల్చి చంపుతామని ఆగ్రహం వ్యక్తం చేసేవారు. సరిహద్దు నుంచి కాబుల్ కి రహదారిపైన ముహాజిర్ల సమాధులు కోకొల్లలుగా ఉండేవి. ఖైబర్ కనుమలో అసంఖ్యాకంగా శవాలు పడి ఉండేవని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. (Dietrich Reetz, ibid, p. 69).

1920 ఆగస్టు మాసంలో కాబుల్ కి వెళ్లే రోడ్లు కిక్కిరిసి, ఇరుకుగా ఉండేవి. శీతాకాలం కూడా ఆవరిస్తూ ఉండేది. శీతాకాలంలో ఆఫ్గనిస్తాన్ లో 40,000 వరకు మాత్రమే ముహాజిర్లకి చోటు ఉండేది. ఆగస్టు 12, 1920 న అమీర్ హిజ్రత్ వాయిదా వేశాడు. ఆ సమయంలో తమ దేశానికి హిజ్రత్ కోసం వలస వచ్చిన వారిని తుపాకీతో బెదిరించి మరీ తిప్పిపంపేవారని చెప్పడానికి సమాచారం ఉంది. (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, p.141)

మనస్తాపం చెందిన ముహాజిర్లు భారత్ కి తిరిగి రావాలని అనుకునేవారు. కానీ అంతకు ముందే ఖోస్టు ప్రాంతానికి చెందిన కొంతమంది, రోజురోజుకీ పెరిగిపోతున్న భారతీయ హిజ్రత్ వలసవాదుల తాకిడి తప్పించుకునేందుకు ప్రతి హిజ్రత్ వంటి వలసలో భారత్ వైపు వచ్చేందుకు ప్రయత్నించారు. తమ దేశానికి వస్తున్న ముహాజిర్ల కోసం స్థానికుల భూములను ప్రభుత్వం తీసేసుకునేది. ఖోస్త్ ప్రాంతంలో వలస వస్తున్నవారికీ, స్థానిక ప్రజలకూ మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. (Dietrich Reetz, Hijrat: The Flight of the Faithful A British File on the Exodus of Muslim Peasants from North lndia to Afghanistan in 1920, p. 70). భారత్ నుంచి వలస వెళ్లిన ముహాజిర్లలో 75 శాతం మందిని స్వదేశానికి తిరిగి పంపారు.  (The Khilafat Movement in India, 1919-1924, Muhammad Naeem Qureshi, dissertation submitted to University of London, 1973, p.146)

READ: ఎనిమిదవ భాగం: ఖిలాఫత్ ఉద్యమం: బెదిరింపులు.. మారణకాండ

పరివ్యాప్త ఇస్లాం కింద ఊహాజనితంగా భావించిన హిజ్రత్ ఉద్యమం విఫలం కావడంలో ఆశ్చర్యం లేదు. హిజ్రత్ వాళ్ళ వచ్చే ఇబ్బందులను ఆఫ్గనిస్తాన్ కి అర్థం కావడంతో వారు ఆ ఉద్యమానికి తిలోదకాలు వదిలి తమ ముస్లిం ‘సోదరులని’ వారి మహిళలను అగౌరవపరచి, వెనక్కి తిప్పి పంపారు. తమ తోట విడిచి వెళ్లిన బుల్బుల్ పక్షులకు, సరిహద్దు అవతల తోటలో పువ్వులు కాదు, ముళ్ళే ఉన్నాయని అవగతం అయింది.

(రచయిత ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధ – ఇస్లాం సంబంధాలు, శుద్ధి ఉద్యమం, మత జనాభా మొదలైన అనేక అంశాలపై పుస్తకాలు వ్రాసారు)

NOTE: “ఖిలాఫత్ ఉద్యమ అసలు చరిత్ర”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:

నాల్గవ భాగం: ఖిలాఫత్ ఉద్యమం: పునాదులు వేసినది ఎవరు?

ఐదవ భాగం: మొదటి ప్రపంచ యుద్ధం – భారతీయ ముస్లింల తీరు

ఆరవ భాగం: బ్రిటిష్ అండతో పెరిగిన ముస్లిం వేర్పాటు వాదం (1857-1919)

ఏడవ భాగం: విన్నపాలు, విజ్ఞప్తులు (1918 డిసెంబర్ – 1920 జులై)

ఎనిమిదవ భాగం: ఖిలాఫత్ ఉద్యమం: బెదిరింపులు.. మారణకాండ