Home News పాకిస్తాన్ తప్పుడు మ్యాప్ ప్రదర్శించినందుకు ఎస్‌సీఓ  సదస్సు నుంచి అజిత్ దోవల్ వాకౌట్

పాకిస్తాన్ తప్పుడు మ్యాప్ ప్రదర్శించినందుకు ఎస్‌సీఓ  సదస్సు నుంచి అజిత్ దోవల్ వాకౌట్

0
SHARE
రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా మంగళవారం సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)ల సమావేశం జరిగాయి. ఈ నేపథ్యంలో  పాకిస్తాన్ కల్పిత మ్యాప్‌ను చూపడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మన భూభాగాలైన కాశ్మీర్, జునాఘడ్ ప్రాంతాలను తనవిగా చెప్పుకుంటూ పాక్ కల్పిత మ్యాపును ప్రదర్శించడంపై అజిత్ దోవల్ తీవ్రంగా మండిపడ్డారు. అందుకు నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
పాకిస్తాన్ తీరుపై ఆతిథ్యదేశం రష్యా అసహనం వ్యక్తం చేసింది. పాక్ తీరు భారత్ ను రెచ్చగొట్టేలా ఉందని, దీనికి తాము మద్దతు ఇవ్వబోమని, రష్యా ఎన్ఎస్ఏ సెక్రటరీ నికోలయ్ పత్రుషేవ్ అన్నారు. ఈ వివాదం ప్రభావం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తదుపరి సమావేశాలపై పడబోదని, మిగతా భేటీల్లో భారత్ పాల్గొంటుందనే ఆశిస్తున్నామని నికోలయ్ అన్నారు.
ఆర్టికల్ 370 ను  రద్దు చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్, లధక్, రాజస్థాన్ లోని జూనాగడ్ ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చూపించే ఒక మ్యాప్ ను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఆగస్టు 4న విడుదల చేశారు. ఈ చర్యను భారత్ ఖండించింది. మంగళవారం ఎన్ఎస్ఏల భేటీలో మళ్లీ అదే మ్యాపును ప్రదర్శించి పాక్ తన దుర్బుద్ధి ని చూపింది. అందుకు నిరసనగానే భారత్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది.
ఆతిథ్య దేశం రష్యా సూచనల్ని  కూడా లెక్క చేయకుండా ఎన్ఎస్ఏల భేటీలో పాకిస్తాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తప్పుడు మ్యాప్ లు ప్రదర్శించి సమావేశ నిబంధనలను ఉల్లంఘించిందని, పాక్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూనే.. రష్యాతో సంప్రదించిన తర్వాతే భారత్ నిరసనగా వాకౌట్ చేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.