Home News అర్చకులు, గ్రామ పెద్దల చొరవ: పారిశుద్ధ్య కార్మికులకు ఆలయ సిబ్బంది ప్రత్యేక ఆహ్వానం 

అర్చకులు, గ్రామ పెద్దల చొరవ: పారిశుద్ధ్య కార్మికులకు ఆలయ సిబ్బంది ప్రత్యేక ఆహ్వానం 

0
SHARE

దేవాలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు సంయుక్తంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామ పారిశుధ్య కార్మికులని ప్రత్యేకంగా దేవాలయంలోకి ఆహ్వానించి వారితో రుద్రాభిషేకం చేయించిన ఘటన తెలంగాణాలో చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత గంగాధర స్వామి వారి దేవాలయం స్థానికంగా ప్రసిద్ధమైనది. ప్రతియేటా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలతో ఈ దేవాలయం భక్తుల శివనామస్మరణతో పులకించిపోతుంది. ఈ ఏడాది మరో విశిష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు.
నాగుల చవితిని పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో భాగంగా దేవాలయ అర్చకులు వారణాసి కిషోర్ శర్మ, మునగాల మండల ప్రజాపరిషద్ అధ్యక్షులు ఎలక బిందు – నరేందర్ రెడ్డి దంపతులు సామాజిక సమరసతా దృక్పథంతో ఆ గ్రామ పారిశుధ్య కార్మికులని ప్రత్యేకంగా దేవాలయంలోకి ఆహ్వానించి వారితో రుద్రాభిషేకం చేయించారు.

ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు మాట్లాడుతూ, స్వామి వివేకానంద చెప్పినట్లుగా.. చేసే పనిని కాకుండా పనిచేసే విధానాన్ని బట్టి వ్యక్తులని గౌరవించాలని భక్తులకు తెలిపారు. దేవస్థాన అధ్యక్షులు వాసా శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు గ్రామానికి మరియు దేవాలయానికి చేస్తున్న సేవలని కొనియాడారు. పూజలో పాల్గన్న మునగాల దంపతులు మాట్లాడుతూ.. ఇటువంటి పూజల ఫలితంగా ప్రజలలో చైతన్యం ఏర్పడి, సమాజంలోని వివిధ వర్గాల మధ్య అంతరాలు తగ్గి అందరూ కలిసి జీవించే వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమం లో పారిశుధ్య కార్మిక సంఘ మండల అధ్యక్షురాలు బండారు గురవమ్మ, కార్మకులు నెమ్మాది దుర్గయ్య, వెంకటరత్నం,జిల్లా వెంకయ్య, ఉదీలా, కలకుంట్ల రేణుక మరియు వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు