అంతరిక్ష ప్రయోగాల్లో విశ్వమానవాళి ఇంతవరకు కనీవినీ ఎరుగని మహాద్భుతాన్ని భారత రోదసి పరిశోధన సంస్థ ‘ఇస్రో’ నిన్న ఘనంగా ఆవిష్కరించింది. 2013లో అమెరికా 29, దాన్ని తలదన్నుతూ మరుసటి ఏడాది రష్యా 37 ఉపగ్రహాల్ని ఏకకాలంలో ప్రయోగించడమే ఇప్పటిదాకా రికార్డు. అది సమీప భవిష్యత్తులో చెక్కుచెదరబోదన్న అంచనాల్ని ఇస్రో తలకిందులు చేసింది. రోదసి ప్రయోగాల్లో నమ్మినబంటు పీఎస్‌ఎల్‌వీ దన్నుతో ఒకేసారి 104 ఉపగ్రహాల్ని నింగికి తరలించడం ద్వారా ఇస్రో ఎన్నో ప్రశ్నలకు ఏకకాలంలో బదులిచ్చినట్లయింది!
భారత మొట్టమొదటి ఉపగ్రహం ‘ఆర్యభట’ను 1975 ఏప్రిల్ 19న ప్రయోగించడంలో అప్పటి సోవియట్ యూనియన్‌దే ప్రధాన పాత్ర. ఆపై సుమారు దశాబ్దకాలంపాటు రష్యా తోడ్పాటుతోనే రాకెట్ పరిజ్ఞానంలో ఇండియా రాటుతేలింది. నేడా రష్యా రికార్డునే ఛేదించిన భారత సాంకేతిక ప్రజ్ఞ యావత్ జాతినీ హర్షపులకాంకితం చేస్తోంది! ఒకప్పుడు నలభై కిలోల బరువున్న ఉపగ్రహాల్ని అంతరిక్ష కక్ష్యలోకి చేర్చడానికీ దేశం కిందుమీదులయ్యేది. ఇటీవలి కాలంలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ లాంటి పురోగామి దేశాలూ ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పొరేషన్ నిపుణ సేవలవైపు మొగ్గుచూపుతున్నాయి. నిన్న నింగికెగసిన 101 విదేశీ ఉపగ్రహాల్లో అమెరికావే 96. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కచ్చితంగా ఉపగ్రహ ప్రయోగాల్ని విజయవంతం చేయడంలో తిరుగు లేదనిపించుకుంటున్న ఇస్రోకు ఇక విస్తృత వాణిజ్యావకాశాలు వెల్లువెత్తడం ఖాయంగా గోచరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తిప్రతిష్ఠల్ని ఇనుమడింపజేస్తున్న మన శాస్త్రవేత్తల సృజనాత్మక ప్రావీణ్యం, జాతిజనులందరికీ గర్వకారణం!
రోదసి రంగాన అమెరికా, రష్యాల మధ్య ‘నువ్వా-నేనా’ అన్నంత తీవ్ర స్పర్ధ, అలవిమాలిన పోటీ దశాబ్దాల తరబడి కొనసాగాయి. సుదృఢ సంకల్పదీక్షతో ఉపగ్రహ నిర్మాణం, వాహక నౌక వ్యవస్థల తయారీ, వాటి విశ్వసనీయతల్లో ఇస్రో దిగ్గజశక్తిగా అవతరించిన దరిమిలా- రోదసి రేసు ఆసియాకు మారింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇండియాకన్నా రెండు దశాబ్దాలు ముందున్నట్లు చాటుకునే చైనా, గ్రహాంతరవాసుల అన్వేషణలో మైలురాయిగా అభివర్ణిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపును అయిదు నెలల క్రితం రూపొందించింది. 2022నాటికి చంద్రయానం చేపట్టి అక్కడి ఉపరితల నమూనాలు సేకరించే దాకా తాను విశ్రమించేదే లేదంటోంది. ఉపగ్రహ ప్రయోగ విపణిలో ఒడుపుగా అవకాశాలు చేజిక్కించుకుంటున్న జపాన్ రోదసి సంస్థ ‘జాక్సా’ 2018 ముగిసేలోగా చంద్రుడిపై మానవరహిత రోవర్ ప్రయోగానికి తహతహలాడుతోంది. చందమామపై అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి ప్రణాళికలూ అల్లుతోంది. జపాన్, చైనాలకు భంగపాటు ఎదురైన అంగారక యాత్రలో ‘మంగళ్‌యాన్’ ద్వారా ప్రథమ యత్నంలోనే ఘనవిజయం సాధించిన భారత్, స్వీయ ప్రభావ పరిధిని క్రమేపీ విస్తరించుకుంటున్న తీరు అనితర సాధ్యం. అమెరికా సైన్యం అజమాయిషీ లోని జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్)పై ఆధారపడనక్కర్లేకుండా ‘నావిక్’ పేరిట సొంత దిక్సూచి సేవలకు మార్గం సుగమం చేసిన ఇస్రో, సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటోంది. శుక్రగ్రహ శోధనకు, మరోమారు అంగారక యాత్రకు సంసిద్ధమవుతోంది. భారత్‌లో, భారత్ కోసం, భారతీయుల చేత రూపుదాల్చిన నావిక్- ‘మేకిన్ ఇండియా’ ఉద్యమాన్ని కాంతిమంతం చేయాలని ప్రధాని మోదీ నిరుడు అభిలషించారు. ప్రపంచ దేశాల్ని అబ్బురపరచే పనితనం కనబరుస్తున్న ఇస్రోకు ప్రభుత్వ ఆసరా ఇతోధికమైతే, ‘భారత్‌లో తయారీ’ స్ఫూర్తికి పట్టం కట్టినట్లవుతుంది; రోదసిలో త్రివర్ణ పతాక ధగధగలూ ఇంతలంతలవుతాయి!
పరాధీనతకు చెల్లుకొట్టి, మాతృభూమి సగర్వంగా శిరసెత్తుకునేలా చేయాలన్న ‘పద్మవిభూషణ్’ విక్రమ్ సారాభాయ్ పట్టుదలే ఇస్రో అవతరణకు దోహదపడింది. బుడిబుడి అడుగులతో మొదలైన నడక వేగం పుంజుకొని ఇస్రో పరుగులు తీస్తున్న విధం నేడు ఎందరినో విస్మయపరుస్తోంది. రోదసి విజ్ఞానాన్ని బహుళ ప్రయోజనకరంగా మలచుకోవడంలో భారత్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ఆమధ్య అంతర్జాతీయ ఖగోళ సదస్సు ప్రస్తుతించింది. అటు రక్షణ పరిశోధనలోనూ స్థిర పురోగతి మన గగనతలం శత్రుదుర్భేద్యం కాగలదన్న విశ్వాసం ఏర్పరుస్తోంది. ఈ ప్రయోగ సామర్థ్యం నిరంతర తేజోదీప్తులతో ప్రవర్ధమానమయ్యేలా ప్రభుత్వ ప్రణాళికలు పదును తేలాల్సి ఉంది. శుక్ర, అంగారక గ్రహ శోధనల నిమిత్తం ఈసారి రోదసి పద్దులో కేటాయింపుల్ని 23 శాతం పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. 2013 నుంచి మూడేళ్లలో యాంత్రిక్స్ విదేశీ ఉపగ్రహ ప్రయోగాల రాబడి ఖాతాలో ఎనిమిదింతల వృద్ధి నమోదైన మాట వాస్తవం. అయినా అమెరికాకు చెందిన నాసా బడ్జెట్ సింధువులో బిందువంతటి కేటాయింపులతో ఇస్రో ఇప్పటికీ నెట్టుకొస్తోంది. భారత్‌తో పోలిస్తే చైనా సుమారు రెండున్నర రెట్లు, జపాన్ 22 రెట్లు రోదసి శోధనకు కేటాయిస్తున్నాయి. స్వల్ప వ్యయంతోనే అసాధారణ ఫలితాలు రాబడుతున్న ఇస్రోకు కాసు బలం, విపణి చొరవ సంతరింపజేయడంతోపాటు మానవ వనరుల కొరత లేకుండా ప్రభుత్వమే కాచుకోవాలి. శాస్త్ర సాంకేతిక రంగాల అధ్యయనం ద్వారా విద్యార్థులకు స్వర్ణమయ భవితవ్యం చేకూరుతుందన్న దిలాసా తల్లిదండ్రుల్లో ఏర్పరచేలా సమూల సంస్కరణలకు మోదీ సర్కారు కంకణబద్ధం కావాలి. రోదసి, రక్షణ సామర్థ్యంలో మన తరవాతే మరెవరైనా అనిపించుకునే స్థాయి, దక్షతలు సమకూరినప్పుడే ‘సర్వశ్రేష్ఠ్ భారత్’ సాకారమయ్యేది!
(ఈనాడు సౌజన్యం తో)