ఏడాది కాలం పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయంగా హైదారాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్, పూణే ఎన్ఐవీ సహాకారంతో కోవాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అయితే ఈ కోవాక్సిన్ టీకాకు ఔషద నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ టీకా భద్రమైనదని ఇప్పటికే నిరూపితమైందని డీ.సీ.జీ.ఐ వెల్లడించింది. అలాగే ఆక్స్‌ఫర్డ్ ఆస్టావెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్ట్సిట్యూట్ అభివృద్ధి చేసిన విషీల్డ్ టీకాను కూడా అత్యవసర వినియోగానికి డీ.సీ.జీ.ఐ ఆమోదం తెలిపింది. టీకా ఉత్పత్తి, పంపిణీ అంశాలపై ఇప్పటికే దృష్టి సారించినట్టు భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. కరోనా మరో సారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ టీకాలకు డీ.సీ.జీ.ఐ అనుమతినివ్వడం ఊరట కల్పించే విషయం. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ తొలి, రెండో దశల్లో సుమారు 800 మందిపై ప్రయోగిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో మూడో దశ ప్రయోగాలు ప్రారంభించినట్టు సంస్థ వెల్లడించింది. కరోనా మొదటి కేసు నమోదయిన తర్వాత సరిగ్గా 342 రోజులకు టీకా అందుబాటులోకి రావడం దేశం గర్వించదగ్గ విషయం. ఈ టీకాను మొదట కరోనా వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు ఇవ్వనున్నారు.
ఆత్మనిర్భర్ భారత్ కల సాకరం దిశగా టీకా తయారు : ప్రదాని మోడీ
ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేందుకు భారత శాస్ర్తవేత్తలు కృషి చేస్తున్నారనడానికి దేశంలో రెండు టీకాలకు డీ.సీ.జీ.ఐ అనుమతి ఇవ్వడమే నిదర్శమని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. డీ.సీ.జీ.ఐ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ ఆరోగ్యవంతమైన కోవిడ్ రహిత దేశంగా మార్చేందుకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి నిరంతరం కృషి చేసిన వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, ఇతర కరోనా వారియర్స్‌కు ఈ సందర్భంగా మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా కట్టడికి భారత్ నిర్ణయం దోహదం : డబ్య్లూహెచ్‌వో
భారత్‌లో తయారు చేసిన టీకాలకు అనుమతినిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని డబ్య్లూహెచ్‌వో స్వాగతించింది. కరోనాపై చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు కరోనా కట్టడికి ఈ నిర్ణయం దోహదపడుతుందని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా వ్యవహారాల ప్రతినిధి పునమ్ కేత్రపాల్ సింగ్ అన్నారు