Home Telugu Articles `పూర్ణ స్వరాజ్యం’ ప్రకటన- 26 జనవరి

`పూర్ణ స్వరాజ్యం’ ప్రకటన- 26 జనవరి

0
SHARE

ప్రదక్షిణ

మనలో చాలామందికి 26జనవరి అన‌గానే గణతంత్ర దినోత్సవంగానే తెలుసు. అస‌లు ఆ రోజే భారత్ గణతంత్రంగా ఎందుకు నిర్ణయించబడింది? అందుకు గ‌ల కార‌ణాలేమిటి… 26 జనవరి ప్రాముఖ్యత ఏమిటి..?

1930 జనవరి 26తేదిన, బ్రిటిష్ ప్రభుత్వం భారత్ నుంచి వైదొలగాలని, భారత్ `పూర్ణస్వరాజ్య‌మే’ ఏకైక లక్ష్యంగా, అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్‌లాల్‌ నెహ్రు లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. చారిత్రాత్మకమైన ఆ రోజుని `భారత స్వాతంత్ర్య దినోత్సవం’గా జరుపుకోవాలని కాంగ్రెస్ ప్రజలకు పిలుపునిచ్చింది. త్రివర్ణ పతాకం మధ్య తెలుపు వర్ణంలో అప్పుడు రాట్నం చిహ్నం ఉండేది. ఈ పతాకాన్ని తెలుగువారైన శ్రీ పింగళి వెంకయ్య రూపొందించారు. అంతకు ముందు 1929 డిసెంబర్ 31తేదిన, నెహ్రు ఈ పతాకాన్ని లాహోర్ నగరంలో ఎగరవేసారు. అప్పటి నుంచి ప్రజలు ప్రతి సంవత్సరo, జనవరి 26ని రాబోయే భారత స్వాతంత్ర్య దినోత్సవానికి చిహ్నంగా జెండా వందనం చేస్తూ జరుపుకుంటూనే ఉన్నారు.

1930 జనవరి 26 తేదిని చాలా నిర్ణయాత్మకంగా, భారత రాజకీయాలను మలుపు తిప్పిన దశగా పరిగణిస్తారు. `ఆల్ ఇండియా హోంరూల్ లీగ్’, భారతదేశానికి `డొమినియన్ స్టేటస్’ కావాలని మాత్రమే కోరుకుంది. జిన్నా పార్టీ అయిన `ముస్లిం లీగ్’ కూడా ఇదే అడిగింది. అంటే బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ, ఆస్ట్రేలియా, కెనడా మొదలైన దేశాలవలె కొంత స్వయంప్రతిపత్తి కలిగి ఉండడం. అయితే జాతీయ నాయకులు లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ మొదలైన వారు పూర్ణస్వరాజ్యం తప్ప ఇంకదేనికీ తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. 1919లో అమృత్‌స‌ర్ జలియన్ ‌వాలాబాగ్ ఉదంతంలో భారతీయుల ఊచకోత తరువాత, భారతజాతి అంతా బ్రిటిష్ పాలకుల మీద ఆగ్రహంతో ఉన్నారు. స్వాతంత్ర ఉద్యమ స్వరూపం కూడా మారిపోయింది.

కాంగ్రెస్ లో మోతిలాల్ నెహ్రు, చిత్తరంజన్ దాస్ మొదలైన వారున్న `స్వరాజ్’ వర్గం, బ్రిటిష్ సార్వభౌమాధికారంలోనే, భారతీయులకి స్వ-పరిపాలన లేదా డొమినియన్ హోదా కావాలని కోరారు. ముసాయిదా రాజ్యాంగాన్ని కూడా తయారు చేసారు. అయితే కాంగ్రెస్‌లోని యువనాయక బృందం, ముఖ్యంగా జవహర్‌లాల్ నెహ్రు, సుభాష్‌చంద్ర బోస్ దీనికి అంగీకరించలేదు.  ప్రజాభిప్రాయం కూడా పూర్ణస్వరాజ్యం వైపే మొగ్గుతోంది. గాంధీ కూడా స్వాతంత్ర్యం భారత ప్రజల కనీస హక్కు అని ప్రకటించారు. దేశమంతా సహాయనిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, అగ్నిలో ఆజ్యం పోసినట్లు, భారత్‌లో రూపొందించాల్సిన రాజ్యాంగ, రాజకీయ మార్పులపై సంప్రదింపులు జరపడానికి, భారతీయులు లేకుండా పూర్తిగా బ్రిటిష్ సభ్యులతో 1928లో బ్రిటిష్ ప్రభుత్వం `సైమన్ కమిషన్’ నియమించింది. ఈ ఏడుగురు సభ్యుల సైమ‌న్ కమిషన్, దేశంలో ఎక్కడ పర్యటించినా, `సైమన్ గో-బ్యాక్’ నిరసనలతో, నినాదాలతో దేశం మారుమ్రోగిపోయింది. ఎన్నో ప్రదేశాలలో పోలీసులు నిరసనకారుల‌ను విపరీతంగా కొట్టి, మూకుమ్మడిగా జైళ్ళలో పెట్టారు. తూటాలు పేలుస్తున్న పోలీసులకి మద్రాసు నగరంలో ఎదురువెళ్ళి `కాల్చండి’ అని రొమ్ము చూపించి, జాతీయోద్యమ నాయకుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు `ఆంధ్రకేసరి’ అని గౌరవించబడ్డారు.  లాహోర్‌లో పోలీసుల హింసకు, మహానాయకుడు పంజాబ్ కేసరి శ్రీ లాలా లజపత్ రాయ్ దారుణంగా గాయపడి, తరువాత కొద్ది రోజుల్లో ఆ గాయాలవల్ల మరణించారు. ఈ విషాద వార్త ప్రజలను విపరీతమైన అగ్ర‌హావేశాలకు గురిచేసింది.

`డొమినియన్ లేక పూర్తి స్వాతంత్ర్యం’ వర్గాల మధ్య కాంగ్రెస్‌లో వాదోపవాదాలు జరిగాయి. గాంధీ ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం సాధించడం కోసం, ఒక సూత్రం ప్రతిపాదించారు. డిసెంబర్ 1928 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో, `ఒక సంవత్సరం లోపు బ్రిటిష్ వారు `డొమినియన్’ హోదా ఇస్తే ఇచ్చినట్లు, లేకపోతే `పూర్ణస్వరాజ్య’ సాధన మార్గంలో’ వెళ్ళేటట్లు ప్రతిపాదించారు. దీనిని కాంగ్రెస్ ఆమోదించి తీర్మానించింది.  అక్టోబర్ 1929 లండన్ మొదటి `రౌండ్-టేబుల్ సమావేశం’ ఈ విషయం చర్చించలేదు.

బ్రిటిష్ ప్రభుత్వం విముఖత, భారతదేశంలో ఏ రకమైన రాజకీయ రాజ్యాంగ మార్పులను గురించి వారి నిర్లక్ష్యం నేపథ్యంలో, 26 జనవరి 1930 లాహోర్, శీతాకాలం చలిలో, సభ్యుల కరతాళధ్వనుల మధ్య, ఉద్వేగభరితంగా `పూర్ణస్వరాజ్యం’ తీర్మానం, త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగింది. తొలిసారిగా భారతదేశ స్వాతంత్ర్యం తీర్మానం అధికారికంగా జరిగింది. (ఇదే లాహోర్ మహానగరం దేశవిభజన జరిగి, పాకిస్తాన్ పాలవడం అత్యంత విషాదం). దీనికి అనుగుణంగా, కాంగ్రెస్ శాసనసభ్యులు అన్ని రాష్ట్ర కేంద్ర చట్టసభల సభ్యత్వం నుంచి రాజీనామా చేసారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆ తరువాత కొద్దికాలానికి గాంధీ ఉప్పు సత్యాగ్రహం, దేశవ్యాప్తంగా సహాయనిరాకరణ ముమ్మరంగా సాగాయి.

అప్పటినుంచి ప్రతి సంవత్సరం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో `జనవరి 26’ న భారత స్వాతంత్ర్య దినోత్సవం జరిపేవారు. 1947 ఆగస్ట్15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, పాత `26 జనవరి’ తేదీని మరవకుండా, 1950లో ఆ రోజునే కొత్త `రాజ్యాంగం’ అమలులోకి తెస్తూ, భారతదేశం `గణతంత్రం’గా ప్రభుత్వం ప్రకటించింది.