Home News హిందుత్వంలోకి పునరాగమనానికి మద్రాస్ హైకోర్టు ఆమోదం

హిందుత్వంలోకి పునరాగమనానికి మద్రాస్ హైకోర్టు ఆమోదం

0
SHARE
క్రైస్తవమతానికి చెందిన షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళ తిరిగి శుద్ధి హోమం ద్వారా హిందుత్వంలోకి వచ్చే ప్రక్రియను మద్రాస్ హైకోర్టు ఆమోదించింది.
తమిళనాడుకు చెందిన మేఘాలలై అనే మహిళ పూర్వీకులు ప్రలోభాలకు గురై క్రైస్తవాన్ని స్వీకరించారు. అయితే ఇటీవల ఆమె వనవన్ అనే హిందూ షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా తమ పూర్వీకులు చేసిన పొరపాటు సరిదిద్దుకునేందుకు విశ్వహిందూ పరిషద్ సహాయంతో శుద్ధి హోమం ద్వారా హిందుత్వంలోకి పునరాగమనం చేసింది. అంతేకాకుండా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కూడా పొందింది.
అయితే హిందుత్వంలోకి మారినప్పటికీ ఆమె ఎస్సీ సామజిక వర్గానికి చెందిన అభ్యర్థుల కోసం ఉద్దేశించిన జూనియర్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ పోస్టుకు పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. క్రైస్తవం నుండి హిందూ ధర్మంలోకి పునరాగమనం చేసినప్పటికీ ఎస్సీగా పరిగణించలేమని అధికారులు చెప్పడంతో మేఘాలలై 2005లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో ఇటీవలే మద్రాస్ హైకోర్టుకు చెందిన జస్టిస్ శ్రీ సురేష్ కుమార్ తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ అత్యుత్తమమైన సంస్థగా అభివర్ణించారు. “దేశంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం వివిధ ఉత్తమమైన మార్గాల ద్వారా నిత్యం కృషి చేస్తున్న సంస్థ విశ్వహిందూ పరిషత్. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ క్రైస్తవం నుండి వెనక్కి తిరిగి వచ్చే వారికోసం 1 నవంబర్ 1998న ‘శుద్ధి’ అనే ప్రక్రియ ఏర్పాటుచేసింది. ఈ ప్రక్రియ ద్వారా ఈ కేసులో పిటిషనర్ తన పేరును డైసీ ఫ్లోరా నుండి మేఘాలలైగా మార్చుకుని హిందువుగా జీవిస్తోంది. కాబట్టి ఈమె ఇప్పుడు హిందూ ఎస్సీ ప్రయోజనాలకు అర్హురాలు” అని కోర్ట్ తేల్చిచెప్పింది.
1950 రాష్ట్రపతి ఉత్తరువుల ప్రకారం ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరించినట్లైతే అతడు/ఆమె బీసీ-సి కేటగిరీలోకి వస్తారు. ఇక ఆ వ్యక్తికి షెడ్యూల్డ్ కులాలకు వర్తించే రిజర్వేషన్లు వర్తించవు.
ఏప్రిల్ 2016లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం (మొహమ్మద్ సాధిక్ Vs దర్బారా సింగ్ గురు – సివిల్ అప్పీల్ నెంబర్: 4870/2015) ప్రకారం.. షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి ఇస్లాం లేదా క్రైస్తవంలోకి మారినప్పుడు అతడి/ఆమె షెడ్యూల్డ్ కుల హోదా గ్రహణావస్థలో ఉంటుంది. తిరిగి ఆ వ్యక్తి  హిందూ ధర్మంలోనికి తిరిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎస్సీ హోదాకు పట్టిన గ్రహణం వీడిపోతుంది అని స్పష్టంగా తెలిపారు.

 

Source : ORGANISER