అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ లో దేశవ్యాప్తంగా ప్రజానీకం స్వచ్ఛందంగా పాల్గొని నిధి సమర్పిస్తున్నారు. ఆర్ధికంగా బలహీన స్థితిలో ఉన్నా తమలో రామభక్తికి మాత్రం లోటు లేదని పలువురు చాటిచెపుతున్నారు. అలాగే ఉన్నత పదవులు అధిరోహించినా, సంపన్నులుగా పేరుపొందినా తాము రామునికంటే ఉన్నతులం కాదని పలువురు ప్రముఖులు ప్రకటిస్తున్నారు. వారం రోజులుగా జరిగిన అభియాన్ వివరాలు ఇలా ఉన్నాయి :
శ్రీరామ జన్మభూమి నిధి సమర్పణ జనజాగరణ వారంరోజుల తెలంగాణ ప్రాంత నివేదిక –
మొత్తం గ్రామాల సంఖ్య-12000
1.జనజాగరణ ప్రారంభించిన గ్రామాల సంఖ్య-7770
2.పూర్తిగాచేసిన గ్రామాల సంఖ్య-1223
3.ప్రాంతంలోని మొత్తం బస్తీలు-1443
4.జనజాగరణ ప్రారంభించిన బస్తీల సంఖ్య-1396
5.జనజాగరణ పూర్తి చేసిన బస్తీలు-66
6.పాల్గొంటున్న జట్లు-23497
7.పని చేస్తున్న కార్యకర్తల సంఖ్య-123560
నిధి సమర్పణ అభియాన్
విశ్వహిందూ పరిషత్ సెక్రెటరీ జనరల్ శ్రీ మిలిండ్ పరాండే భాగ్యనగర్ లోని జియాగూడా బస్తీలో జరుగుతున్న నిధి సమర్పణ జనజాగరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 17 ఇళ్లకు వెళ్ళి ఆయన నిధి సేకరించారు. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం ప్రారంభమైందని, ఆ కార్యంలో దేశ ప్రజానీకమంతా పాలుపంచుకునే అవకాశం కల్పించడం కోసమే నిధి సమర్పణ కార్యక్రమం చేపట్టమని ఆయన బస్తీ వాసులకు వివరించారు. పెద్ద సంఖ్యలో ప్రజానీకం స్వచ్ఛందంగా నిధి సమర్పించారు.
అద్భుతమైన అనుభవాలు
నిధి సమర్పణ అభియాన్ లో భాగంగా కార్యకర్తలు తమ వద్దకు వచ్చినప్పుడు లేదు, కాదనకుండా అందరూ తమ శాయశక్తులా రామమందిరం కోసం నిధి సమర్పిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి శతాధిక వృద్ధుల వరకు అంతా సంతోషంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం రామభక్తి ఎంతటిదో తెలుస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లి గ్రామంలో ఒక అనాధ వృద్ధురాలు రామమందిర నిర్మాణం కోసం 500 రూపాయల నిధి సమర్పించింది. పొట్టకూటికోసం చిన్నాచితక పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ వృద్ధురాలి గుడిసెకు వచ్చిన కార్యకర్తలు 10 రూపాయలు ఇస్తే చాలని చెప్పినా ఆమె మాత్రం 500 రూపాయలు సమర్పించి అయోధ్యకు పంపండంటూ భక్తి భావాన్ని చాటుకుంది. అలాగే భాగ్యనగరానికి చెందిన ఒక బస్తీలో 90 ఏళ్ల వృద్ధురాలు తన వంతుతోపాటు చనిపోయిన తన పెద్ద కొడుకు తరఫున కూడా నిధి సమర్పించి రామభక్తిని చాటుకుంది. సికింద్రాబాద్ లో చీపుర్లు విక్రయించే మహిళ భక్తిగా మందిరానికి నిధి సమర్పించింది.
రామభక్తికి మతాలు అడ్డుకావని నిరూపించారు అనేకమంది క్రైస్తవులు, ముస్లింలు. మన్సూరాబాద్ లోని హిమపురి కాలనీలో ముస్లింలు కూడా నిధి సమర్పించారు. భాగ్యనగరం పాతబస్తీ కి చెందిన ముస్లిం మహిళలు జై శ్రీ రామ్ – భారత్ మాతా కీ జై – వందేమాతరం నినాదాలు చేస్తూ రామ మందిర నిధి సేకరణ ర్యాలీ లో పాల్గొన్నారు.
నిధి సమర్పించిన ప్రముఖులు
గవర్నర్ డా. తమిళ సై సౌందరరాజన్ గారు అయోధ్య శ్రీ రామమందిర నిర్మాణానికి నిధి సమర్పించారు. రాజ్‌భవన్ లో చెక్కు అందించారు. అలాగే గవర్నర్ గారితో పాటు రాజ్‌భవన్ అధికారులు, ఉద్యోగులు కూడా నిధి సమర్పణ చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు బిజెపి నాయకులు డా. లక్ష్మణ్ కూడా రామమందిర నిధి సమర్పించారు.
ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ రామమందిర నిర్మాణానికి అందరూ నిధి సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.
జనవరి 20న ప్రారంభమయిన నిధి సమర్పణ అభియాన్ ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది.