Home News కరోనా యుద్ధంలో మనమే గెలుస్తాం :  డా. మోహన్ భాగవత్ జీ

కరోనా యుద్ధంలో మనమే గెలుస్తాం :  డా. మోహన్ భాగవత్ జీ

0
SHARE

“పాజిటివిటీ అన్-లిమిటెడ్” కార్యక్రమంలో (15.5.2021) పరమ పూజనీయ సర్ సంఘచాలక్ ఉపన్యాసం

కోవిడ్ రెస్పాన్స్ టిం (CRT) కార్యకర్తలందరికీ, ఆన్ లైన్ ద్వారా ఈ ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలు. నా హృదయ పూర్వక సకారాత్మక ఆలోచనల గురించి మాట్లాడమని నాకు చెప్పారు. ఇది చాలా కష్టం. ఎందుకంటే మనం కూడా కఠినమైన సమయంలో ఉన్నాము. ఎన్నో చోట్ల, ఎన్నో కుటుంబాల్లో వారి ఆప్తులు వారిని వదిలి వెళ్లిపోయారు. ఎన్నో కుటుంబాల్లో అయితే కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆకస్మాత్తుగా వారిని వదిలి మృత్యువు పాలయ్యారు. ప‌ది రోజుల క్రితం మ‌న‌తో మాట్లాడిన వ్య‌క్తి నేడు శాశ్వతంగా కనబడకుండా పోయాడు. మన వారిని కోల్పోయిన దుఃఖం, భవిష్యత్తులో రాబోయే సమస్యల గురించి బాధ వీటి మధ్య కొట్టు మిట్టాడుతున్న వారిని పరామర్శించడం కంటే వారికి సాంత్వన కలిగించడం ముఖ్యం. కానీ ఈ దుఃఖాన్ని కేవలం సాంత్వన ద్వారా శాంతింపచేయడం కష్టం. ఈ సమయంలో మనల్ని మనం తమాయించుకోవాలి. మనం మన సానుభూతిని మాత్రమే పంచగలం. పంచుతున్నాం కూడా. కానీ మన సంఘ కార్యకర్తలు ఈ సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వారి వారి సామర్థ్యాలను బట్టి కార్య నిమగ్నులై ఉన్నారు. కానీ ఇది చాలా కఠినమైన సమయం. మన వారు ఎందరో పోయారు. ఇలా వెళ్లవలసింది కాదు. కానీ వారు ముక్తులయ్యారు. వారికి ఇలాంటి సమయం, సందర్భం ఎదుర్కోవాల్సిన అవసరం ఇక రాదు.  దీనిని ఎదుర్కోవాల్సింది ఇక్కడ ఉన్న మనం. మన వారందరినీ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనం నకార్మాత్మక ఆలోచనలు చేయరాదు. పరిస్థితి కఠినంగా ఉంది. దుఃఖంతో నిండి ఉంది. ఈ పరిస్థితి మనిషిని నిరాశలో నెట్టేలా ఉంది. కానీ ఈ పరిస్థితిని మనం స్వీకరించి నకారాత్మక ధోరణిని విడిచి పెట్టాలి. సకారాత్మకంగా ఆలోచించాలి. మన శరీరాన్ని కోవిడ్ నెగటివ్ గా ఉంచాలి. మనస్సుని పాజిటివ్ గా ఉంచాలి.

ఈ వ్యాఖ్యాన కార్యక్రమంలో ఇంతకు ముందు మాట్లాడిన వక్తలు ఎంతో నిక్కచ్చిగా, స్పష్టంగా ఎన్నో మాటలు చెప్పారు. వారి అనుభూతులు చెప్పారు. మనస్సుని ఎలా దృఢంగా ఉంచాలో చెప్పారు. కరోనాను ఎదుర్కోవడానికి వారి ప్రయత్నాల వేగాన్ని పెంచాలని, ఆ ప్రయత్నాలను శాస్త్రీయపద్ధతిలో ఎదుర్కోవడాన్ని, ఐకమత్యంగా పనిచేయడాన్ని అదే విధంగా నిజాన్ని తెలుసుకొని దానిని స్వీకరించాలి. దాని ఆధారంగా పని చేయాలని వక్తలు చెప్పారు. మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, సమాజ సేవ చేయాలని, సమాజం గురించి ఆలోచించాలని వక్తలు చెప్పారు. అవే మాటలు నేను కూడా చెప్పాలనుకున్నాను. నేను నాదైన శైలిలో చెప్తాను. ఇందులో ముఖ్యమైనది మనస్సు. ఒకవేళ మన మనసు అలసిపోతే, ఒక పాము ముందు అలసిసొలసి పోయిన ఎలుక ఏ విధంగా పడి ఉంటుందో, మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. మనం మన పరిస్థితిని అలా కానివ్వకూడదు. మన పరిస్థితి అలా లేదు కూడా. మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం. పరిస్థితులను గమనిస్తే ఎంత భమానకంగా ఉన్నాయో, అంతే ఆశాజనకంగా కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో సమాజంలోని వికృత రూపాలు కూడా బయటపడుతూ ఉంటాయి. కానీ ఈ మరణవార్తల కంటే సమాజంలో మంచి పనులు ఎక్కువగా బయట వస్తున్నాయి. సమాజం విపత్కర పరిస్థితులలో ఉన్నా కూడా, చాలా మంది  తమ గురించి ఆలోచిస్తూ సమాజం గురించి కూడా ఆలోచిస్తున్నారు. కొంతమంది తమ గురించి ఆలోచించకుండా కేవలం సమాజం గురించే ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. నిరాశ పడాల్సిన అవసరంలేదు. పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ పరిస్థితులు మన మనస్సు మీద ఆధాఃపడి ఉంటాయి. నిరాశ చెందడం, రోజూ కొంతమంది గురించి దుర్వార్తలు వినడం, మీడియాలో ప్రతికూల కథనాలు మొదలైనవి మన మనస్సుకు బాధ, నిరాశ కలిగిస్తాయి. ఇలా ఉండకూడదు. ఇలా జరిగితే వినాశనమే.. మానవ చరిత్రలో ఇప్పటివరకు అలా జరగలేదు. ఇటువంటి ఎన్నో బాధలను, ఆటంకాలను దాటుకొని మానవ సమాజం ముందుకు సాగింది. ఇప్పుడు కూడా ముందుకు సాగుతుంది.

సంఘ సంస్థాపకులు, డా|| హెడ్గేవార్ గారి తల్లిదండ్రులు, ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు, నాగపూర్ లో తమ గురించి ఆలోచించకుండా సమాజ సేవ చేసారు. అప్పుడు హెడ్గేవార్ గారు యువకునిగా ఉన్నారు. అప్పటికి ప్లేగు వ్యాధికి చికిత్స కూడా అందుబాటులో లేదు. ఒకవేళ సమాజం గురించి వెళితే మనం బలిఅవ్వాల్సిందేనని ఆలోచించే సమయం అది. కానీ ఆ పుణ్య దంపతులు అలా ఆలోచించకుండా ప్లేగు రోగుల సేవ చేస్తూ ఒకేరోజు వారిరువురూ ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. అప్పటికి హెడ్గేవార్ గారు యువకులు. డాక్టర్ కూడా కాలేదు. అప్పటికి ఆయన్ను అందరూ “కేశవ్” అనే పిలిచేవారు. అలాంటి సంవేదనాత్మక వయసులో ఈ పరిస్థితుల ప్రభావం ఆయనపై ఎలా ఉండేది? ఆయన జీవితం దుఃఖంతో నిండిపోయిందా? నిరాశ చెందక ఆయన ఈ వియోగపు విషాన్ని దిగమింగి సమాజపు కష్టాన్ని పంచుకున్నారు. ఆలోచనాధోరణులు భిన్నమైనా కూడా, ఎవరెవరైతే ఆయనతో పరిచయం కలిగి ఉన్నారో, వారందరూ హెడ్గేవార్ గారు స్నేహశీలి అని ముక్తకంఠంతో చెప్పేవారు. అది ఆయన స్వభావం.

విపత్తులు వచ్చినపుడు మన ప్రవృత్తి ఎలా ఉండాలి? మనం భారతీయులం. ఈ జీవితం జనన మరణాల చక్రం అని మనకు తెలుసు. మనం పాత వస్త్రాలు వదిలి నూతన వస్త్రాలు ఎలా ధరిస్తాయో, అలాగే ఈ జర్జరమైన శరీరాన్ని వదిలి ఆత్మ ముందుకు సాగుతుంది. ఇంకో శరీరంలో చేరుతుంది. ఇది మనకు తెలుసు కాబట్టి. జనన మరణాలు మనల్ని నిరాశ, నిష్క్రియాపరం చేయలేవు. బ్రిటన్ ప్రధానిగా విన్ స్టన్ చర్చిల్  నియమింపబడినపుడు ఆయన కార్యాలయంలో, ఆయన టేబుల్ పై ఒక వాక్యం వ్రాసి ఉండేది. అదేమిటంటే- Please understand there is no pessimism in this office. We are not interested in the possibilities of defeat. They do not exist.” మనం ఓటమి గూర్చి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఓటమి చెందము.’’ విపత్కర పరిస్థితులు నుండి మనం గెలవాలి. దేశం మొత్తాన్ని తన వ్యక్తిత్వంతో, తన చేతలతో దేశంలోని ప్రతి ఒక్కరిలో మనం గెలుస్తాం అనే ఆత్మవిశ్వాసాన్ని, తన వక్తృత్వంతో , తన చేతలతో, చర్చిల్ పెంపొందించారు. వారు గెలిచారు. ప్రతికూల పరిస్థితులలో కూడా గెలిచి చూపించారు. ఆనాటి పరిస్థితి చూస్తే ఇంగ్లాండ్ నాశనం అయ్యేది. కానీ నెలపాటు బాంబుదాడులను భరిస్తూ బ్రిటన్ ప్రజలు దేశాన్ని నిలబెట్టడమేకాదు, శత్రువుపై విజయం కూడా సాధించారు. ఇది ఎలా సాధ్యం అయింది? ఇది కేవలం వారి ఆలోచనా ధోరణి వల్లనే సాధ్యం అయింది. ముందున్నవిపత్తును, చీకటిని, దుఃఖాన్ని చూసి వారు భయపడలేదు. స్వీకరించారు. దానిని ఒక సవాలుగా మనం కూడా ఇలాగే ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాలి. సంపూర్ణ విజయం సాధించేవరకు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మన సంకల్పం దృఢంగా ఉండాలి. అలాగే మన ప్రయత్నాలు కూడా ఆగకుండా కొనసాగుతూనే ఉండాలి. కోవిడ్ మొదటి తాకిడిలో మనం కూడా గాభరా పడ్డాం. ప్రజలు, ప్రభుత్వం, పాలనాయంత్రాంగం అందరూ గాభరాపడ్డారు. డాక్టర్లు ముందుగానే హెచ్చరికలు చేసారు. అందరూ ఆందోళన చెందారు. మునుముందు మూడవ తాకిడి కూడా రావచ్చును. అయినా మనం ఆందోళన చెందరాదు. ఏ విధంగానైతే తీరంలోని బండరాళ్లను తాకి సముద్రపు అలలు చెల్లా చెదురౌతాయో అలాగే మన దృఢ సంకల్పం ముందు ఈ సంకటం కూడా చెల్లాచెదురవ్వాలి. అలాంటి ఏర్పాట్లు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఆలోచనా ధోరణీ ఇప్పుడు మనకు అవసరం.

ఇలాంటి దృఢ సంకల్పంతో మనం మన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. సముద్ర మధనం చేస్తున్నపుడు ఎన్నో విలువైన వజ్రాలు, రత్నాలు బయటకు వచ్చాయి. కానీ వాటిపై ఆశతో మధనం ఆపలేదు. హాలాహలం కూడా వచ్చింది. అటువంటి విపత్కర పరిస్థితిలో కూడా ప్రయత్నం ఆపలేదు. అమృతం లభించేవరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.  ఇదే విషయం సుభాషితాలలో కూడా చెప్పారు. విజయం సాధించేవరకు ధీరులు ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రపంచ మానవాళి మొత్తం కష్టంలో ఉంది. భారతదేశం ప్రపంచానికంతటికీ ఒక ఉదాహరణలా నిలవాలి. మనం కూడా మన ప్రయత్నం చేద్దాం. పరస్పర విమర్శలకు దిగకుండా ఒక జట్టులాగా మనం పనిచేయాలి. పనులల్లో వేగం పెంచాలని శ్రీ అజీంప్రేమజీ గారు చెప్పారు. వేగం ఎలా పెరుగుతుంది? ఎప్పుడైతే మనం ఒక జట్టు లాగా కలిసి పని చేస్తామో అప్పుడు వేగం పెరుగుతుంది. దీనికి పెద్ద ఉదాహరణ పుణే పట్టణం. పుణెలోని పెద్ద వ్యక్తులు, వ్యాపారులు, డాక్టర్లు, పరిపాలకులు, ఆసుపత్రి నిర్వాహకులు, ప్రజాసంఘాలు కలిసి PPCR అని ఒక సముదాయాన్ని ఏర్పరచారు. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ వారు ఈ ఆపదనుండి బయటపడ్డారు. అన్నిచోట్ల ఇలాంటి సామూహిక ప్రయత్నాలు ఆలస్యమైనా ఫర్వాలేదు, కలసికట్టుగా ఉండి, వేగాన్ని పెంచి అంతరాన్ని తగ్గించి మనం ముందంజ వేయొచ్చు. ఎలా చేయాలి? ముందుగా ఇది మన నుంచి మొదలు కావాలి. మన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ప్రయత్నం మొదలు పెట్టగానే ఫలితాలు రావు. కొంత సమయం పట్టవచ్చు. అప్పటి వరకు ఓపిక, సహనం ఉండాలి. కార్యనిమగ్నులై ఉండాలి.

మరో ముఖ్య విషయం చైతన్యం. మనం చైతన్యవంతంగా ఉంటే మనల్ని మనం రక్షించుకున్నట్టే. అలాగే క్రియాశీలంగా ఉండాలి. చైతన్యంగా ఉండడంలో ముఖ్యమైనవి- 1) స్వయంగా చైతన్యంగా ఉండడం, 2) ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఉదా॥ ప్రాణాయణమం, ఓంకారం, దీర్ఘశ్వాసలు, సూర్య నమస్కారాలు, వీటిని ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోగలము. వీటిని చెప్పేవారు. నేర్పించేవారు చాలా మంది ఉన్నారు. ఇవి కఠినమైనవికావు. చాలా సులభమైనవి. వీటిని మనం రోజూ చేయాలి. 3) మన ఆహారం – శుద్ధ, సాత్వక భోజనం చేయడం, శరీర శక్తిని పెంపొందించే భోజనం చేయడం. దీని గురించి కూడా అంతర్జాలంలో సమాచారం కోకొల్లలుగా లభిస్తుంది. శాస్త్ర సమ్మతమైన మాటలనే నమ్మండి. చెప్పుడు మాటలను నమ్మకండి. ఈ ఉత్తమ విషయాన్నైనా పరిశీలించి స్వీకరించండి. మన ఆప్తులు, స్వీయ అనుభవం, శాస్త్ర సాంకేతిక అంశాలు వీటిని పరిశీలించాలి. మన తరపు నుండి ఎలాంటి ఆధారాలు లేని మాటలు సమాజంలో వెళ్లరాదు. సమాజంలోని నిరాధార మాటలకు మనం బలి కాకూడదు. ఇది మనం ఆలోచించాలి. మన ఆయుర్వేదం ఒక శాస్త్రం. వాటిలో ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అనుభవాలు ఉన్నాయి. పరంపరాగతంగా ఇవి మనకు లభిస్తూనే ఉన్నాయి. శాస్త్రం ఆధారంగా ఇవి సమ్మతంగా ఉంటే వీటిని తీసుకోవడంలో తప్పు లేదు. శరీరాన్ని, మనస్సును అస్థిరపరిచే వాటిని వదిలేయాలి.

ఖాళీగా ఉండకండి. ఏదో ఒకటి కొత్తది నేర్చుకోండి. మీ కుటుంబంతో గడపండి. మీ పిల్లలతో గడపండి. వారి గురించి తెలుసుకోండి. వారు మీ గురించి తెలుసుకుంటారు. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఏ కొంచెం అనుమానం వచ్చినా.. పరీక్షకు వెనుకాడకండి. కొంతమంది కొవిడ్ బారిన పడడం అవమానంగా భావిస్తారు. దాచిపెడతారు. త్వరగా మందులు తీసుకోరు. ఆసుపత్రిలోని వాతావరణానికి భయపడి, ఆసుపత్రిలో చేరడానికి తటపటాయిస్తారు. కొందరు అతిభయంతో లేనిపోని చికిత్సలు చేసుకొంటారు. అనవసరంగా ఆసుపత్రిలో చేరుతారు. దీనివలన ఎవరికైతే అత్యవసర చికిత్స అవసరమో వారికి ఆసుపత్రిలో చోటు దొరకకుండా పోతుంది. దీంతో వారికి సరియైన చికిత్స లభించదు. కనుక మీకు అనుమానం వస్తే వైద్యుడి సలహా తీసుకొని వారెలా చేయమంటే ఆలా చేయాలి. కోవిడ్-19 కి సరియైన సమయంలో సరియైన చికిత్స లభిస్తే తక్కువ మందులతో, సరళమైన జాగ్రత్తలతో మనం ఈ మహమ్మారి నుండి బయట పడవచ్చు. అందుకోసమే మనం అత్యవసర చికత్స ఎవరికి అవసరమోవారికి అవకాశం ఇద్దాం. మీ కుటుంబంతో గడపడానికి ఇది ఒక సువర్ణావకాశం. మీ కుటుంబాన్ని ఏకత్రం చేయండి. మాస్క్ ధరించడం అనివార్యం. తగినంత భౌతిక దూరాన్ని పాటించండి. వీటితో పాటు శుభ్రంగా ఉండడం కూడా అనివార్యం. సానిటైజేషన్ చేస్తూ ఉండడం. ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా తగిన మాల్యం చెల్లించక తప్పదు.. మన పరిసరాలలో, మనకు తెలిసిన వారికి కోవిడ్-19 గురించి అవగాహన కల్పించాలి. జన ప్రబోధన, జన ప్రశిక్షణ చాలా ముఖ్యమైనవి. ఎవరైతే ఇవి చేస్తున్నారో వారి కార్యక్రమాలతో మనం పాల్గొనవచ్చు. ప్రత్యక్ష సేవ చేయాలనుకొంటే, కోవిడ్ రోగులకు సేవ చేయాలని, వారికి ఆసుపత్రిలో బెడ్ కోసం, ఆక్సిజన్ కోసం, అవసరమైన సేవలు అందించడం కోసం, ఇలా ఎన్నో రకాలగా మనం సేవలు అందించగలం. మొదటి దశలోమనం సేవలు అందించాము. రెండవ దశలో మనం ఇంకొంచెం ఎక్కువ సేవలు అందించే అవసరం ఉంది. ఎందరో మంది చేస్తున్నారు. మనం దానిలో పాలుపంచుకోవాలి . పిల్లల చదువులు రెండేళ్లు వెనుకబడ్డాయి.  ఈ రెండు సంవత్సరాలలో వారు పొందాల్సిన జ్ఞానాన్ని మనం వారికి నేర్చిద్దాం.. వారు ఉత్తీర్ణులవుతారో, ప్రమోట్ అవుతారో తరువాత సంగతి.

అలాగే ఎందరో వారి జీవనోపాధిని కోల్పోయారు. రోజువారి కూలీల పరిస్థితి ఘోరంగా ఉంది. వారు, వారి కుటుంబ సభ్యులు ఆకలితో ఆలమటించకుండా చూడాల్సి ఉంది. మన పరిసరాలలో ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారి అవసరాలను మనం తీర్చగలం. ఇది కూడా సేవే. ఇలా సేవ చేసే ఎన్నో సంఘాలు పని చేస్తున్నాయి. వారికి మనం చేయందించాలి. రేపు కోవీడ్-19 వలన ఉపాధి, సంపాదన మందగించి ఆర్థిక వ్యవస్థ డీలాపడటం లాంటివి మొదలవుతాయి. ఎన్నో రకాలుగా మనం వీటిని ఎదుర్కోవడానికి ఇప్పటినుండే సిద్ధంగా ఉండాలి. స్కిల్ ట్రైనింగ్ లాంటి కార్యక్రమాలలో సమాజపరంగా, వ్యక్తిగతంగా మనం ఎంత సహాయపడగలమో అంత సహాయ పడాలి. ఎవరైతే స్వయంఉపాధి మీద ఆధారపడి జీవిస్తున్నారో వారి నుండి వస్తువులు కొనుగోలు చేసి వారికి సహాయపడాలి. ఇది వేసవికాలం. ఫ్రిజ్ మీద ఆధారపడకుండా ఉపాధి కోల్పోయిన కుమ్మరి  దగ్గర ఒక కుండ కొనండి. ఇలాంటి ఆలోచనలు. చేయండి.  ఇలా ఆలోచించే వారితో కలిసి పని చేయాలి.. ప్రస్తుత పరిస్థితుల గురించి రాబోవు పరిస్థితుల గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇది మనల్ని భయపెట్టడానికి కాదు. మనల్ని జాగ్రత్తగా ఉండమని, రాబోయే పరిస్థితులను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండమని చెపుతున్నారు. నియమాలు, క్రమశిక్షణను పాటిస్తూ, నడుస్తూ, సమాజాన్ని నడిపిస్తూ, సేవ చేస్తూ, సేవ చేస్తున్న వారికి సహాయాన్ని అందిస్తూ మనం ముందుకు వెళ్లాలి. ఇది మన సంకల్పం. మనం గెలవాలి. ఎన్నో తరాలుగా, ఎన్నో కష్టాలను ఎదురొడ్డి నిల్చిన దేశం- మన భారతదేశం. ఇది మహమ్మారి కావచ్చు, ప్రపంచాన్నంతా వణికిస్తుండొచ్చు, రహస్య శత్రువు కావచ్చు, రూపం మార్చుకొని రావచ్చు, ఈ యుద్ధం కఠినమైనదే. కానీ మనం యుద్ధం చేయాల్సిందే. గెలవాల్సిందే. మనం గెలుస్తాం. ఇది మన దృఢ సంకల్పం. ఆ పరిస్థితి మన గుణ దోషాలను తెలియచేస్తుంది. మన తప్పులను సరిదిద్దుకుంటూ, సద్గుణాలను పెంచుకుంటూ ఉండమని ఈ పరిస్థితి మనకు శిక్షణ ఇస్తున్నది. ఇది మన ఓపికకు పరీక్షా సమయం … Success in not final. Failure is not fatal. The courage to continue is the only thing that matters. గెలుపోటములు వస్తూనే ఉంటాయి.

यूनान मिश्र रोमा, सब मिट गये जहाँ से, कुछ बात है कि इस्ती मिटती नहीं हमारी 11

ఇలా మన పెద్దలు చెప్పారు. ఎన్నో నాగరికతలు మట్టిలో కలిసిపోయాయి. కానీ మన భారత దేశంలో ఏదో శక్తి ఉంది. అందుకే అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మన పూర్వీకులు సత్యాన్ని సాక్షాత్కరించి దానిని మనకు అందించారు. ఈ తరతరాలుగా మనం ఆ సత్యాన్ని ఆచరిస్తూ ఉండే సంస్కృతి మనది. ఆ సంస్కృతి, గెలుపోటములను స్వీకరిస్తూ, ధైర్యంగా ముందుకు వెళ్తూ సత్యాన్ని సాధించేవరకు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని చెప్తుంది. ఇది మన సంస్కృతి. దీని ఆధారంగా ముందుకు వెళ్లాలని పరిస్థితులు మనకు చెబుతున్నాయి. ఇంతకు ముందు పెద్దలు చెప్పిన విషయాలను హృదయాంతరాళలో నిలుపుకొని, వాటిని అర్థం చేసుకొని మన ప్రయత్నాలను వేగవంతం చేద్దాం. నిరాశ చెందకండి. మనం గెలుస్తాం అన్నది తథ్యం… జాగ్రత్తగా ఉండండి – క్రియాశీలంగా ఉండండని మరొక్క సారి తెలియజేస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ధన్యవాదాలు.

విజ్ఞ‌ప్తి : మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ కింది లింక్ ద్వారా మీ విరాళాలను అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది, DONATE HERE