– హో.వె.శేషాద్రి
మన ఉత్తర భారతంలో రాఖీ బహు సుందరమైన సంకేతానికి ప్రతీకం. ఏ స్త్రీ అయినా ఒక పురుషుడు, అపరిచితుడైనా కూడా అతని వద్దకు వెళ్లి అతడికి “రాఖీ” కడితే ఆ క్షణం నుంచి అతడు ఆ స్త్రీకి సోదరుడు, రక్షకుడవుతాడు. అంతేగాక ఏ స్త్రీకైనా ఆపద వాటిల్లినపుడు ఆ స్త్రీ పరక్రమవంతుడైన పురుషునికి ‘రాఖీ’ కడుతుంది. ఆ పురుషుడు ఆమెను ఆపద నుంచి కాపాడడానికి ప్రాణాన్నైనా ధారపోయడానికి సిద్దమవుతాడు. అందుకోసం అతడు పరుగెడతాడు. మన చరిత్రతలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
మన భారతదేశంలో స్త్రీత్వం అతి పవిత్ర మాన బిందువుగా భావించబడుతోంది. ఈ భూమిపై పరఢవిల్లిన మన ఉదాత్త సంస్కృతికి ఇది ఒక దివ్వ సంకేతం. దీనిని రక్షించడానికి అసంఖ్యాకులైన పురుషులు అనేక మహత్తర త్యాగాలు, బలిదానాలు చేశారు. ఈ గాధలు మన ఇతిహాసంలో స్వర్ణపుటలైనాయి. తమ స్త్రీత్వాన్ని రక్షించుకొనడానికై అనేక వేల మంది స్త్రీలు అగ్విజ్వాలలో దూకి జోహార్ చేసుకున్నారు. ఇది కేవలం రాజస్థాన్‌కి పరిమితమైన గాధలు కావు. దేశ విభజన సమయంలో పంజాబ్‌లో కూడా అనేక స్థలాలలో ఈ విధమైన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. అనేక మంది తల్లులు, సోదరులు ఈ విధంగా, ఆత్మార్పణం చేసుకున్నారు. కొందరు విషాన్ని స్వీకరించారు. కొందరు బావులలో దూకారు. అంతేకాదు వారి సోదరులు, భర్తలు, తండ్రుల చేత స్వయంగా శిరచ్ఛేదనం చేయించుకొన్నారు. సాధారణ ప్రజలు కూడా తమ స్త్రీత్వం – మాతృత్వాలను పరిరక్షించుకొనడానికి అత్యంత సాహసాలు, త్యాగాలు చేయడానికి కారణం సమాజంలో స్త్రీత్వం పట్ల గల అత్యంత పవిత్ర , గౌరవభావాలే.
మన సంస్కృతి ప్రకారం ఏ భాషలోనైనా “మా” శబ్దం స్త్రీని సంబోధించడానికి మాత్రమే ప్రయోగించబడుతుంది. బిచ్చగాడు కూడా ఏ స్త్రీ వద్దనైనా బిచ్చం అడిగేటప్పుడు “మా” అంటూ సంబోధిస్తాడు. రెండు మూడు తరాల ముందు వరకు కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలలో సీతమ్మ, కమలమ్మ – అంటూ స్త్రీల పేర్లతో అమ్మా అనే శబ్దం భాగంగా ఉండేది. పూర్వకాలంలో అపరిచిత స్త్రీని సంబోధించడానికి “మా” అనే శబ్దాన్ని ప్రయోగించడమే చాలా వాడుకలో ఉండేది. అనేకమంది నా వృద్ధ మిత్రులు – వారి వివాహం అయిన తరువాత వయస్సుపై బడిన కొద్ది వారి భార్యలను తాము తల్లులుగా ఏ విధంగా చూసిందీ చెబుతుంటారు. స్త్రీ తన పిల్లల అలనా పాలనా చూస్తూ ఏవిధంగా సేవ చేస్తుందో అదేవిధంగా తమ భర్తలకు కూడా అదేవిధంగా సేవ చేస్తుంటారు. వృద్దాప్యం మరో బాల్యం – అనే సామెత కూడా ఉంది. ఇది మన దేశంలో అయితే వాస్తవమైన విషయమే.
ఈ భావన కేవలం హిందూ స్త్రీకే పరిమితమైనది కాదు. ఏ స్త్రీ అయినా సరే ఆమె పట్ల మన దృష్టి ఆదే విధంగా ఉంటుంది. అతి సౌందర్యవతి అయిన కళ్యాణ్ ముస్లీం సుబేదార్ కుమార్తెను బందీగా శివాజీ ముందు పెట్టినప్పుడు శివాజీ ఆమెను అతి గౌరవంగా సన్మానించి ఆమెను ఆమె అత్తవారింటికి సురక్షితంగా తిప్పి పంపించాడు. దండయాత్రలపుడు కూడా శ్వేత జాతీ స్త్రీల పట్ల ఈ విధంగానే వ్యవహరించడం జరిగింది. అసమానత వీరుడు చిమణ్ణాజీ అతి సాహసంతో ఫోండాఖిల్లాను పట్టుకొన్నాడు. అందులో ఉన్న పోర్చుగీసు సైనికులు, ఇతర పౌరులంతా తమ స్త్రీలను అందులోనే వదలిపెట్టి పారిపోయారు ( దేశవిభజన కాలంలో – ఇలాగే జునాగడ్ నవాడ్ అతడి బేగంలను వదలిపెట్టి అతడి పెంపుడు కుక్కలను వెంటపెట్టుకొని కరాచీకి పారిపోయాడు). అప్పుడు విజయవంతులైన మరాఠీ సైనికులు కోటలోకి ప్రవేశించగానే అందులోని పోర్చుగీసు స్త్రీలు భయంతో కంపించిపోయారు. వారి భర్తలు, సోదరులు, తండ్రులు తాము ఓడించిన దేశాలలో అక్కడి మహిళలపై ఎటువంటి ఘోరమైన అకృత్యాలు చేస్తారో అట్లాగే మరాఠీ సైనికులు కూడా తమ పట్ల వ్యవహరిస్తారని అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా చిమణ్ణాజీ ఆ శ్వేత స్త్రీలందరినీ సురక్షితంగా వారి మగవారి వద్దకు వదిలిపెట్టి రావలసిందిగా తన సైనికులను ఆజ్క్షాపించాడు. 1957లో కాన్పూర్ విముక్తి సమయంలో కూడా ఇదేవిధంగా జరిగింది. అక్కడ ఆంగ్లేయ పురుషులు స్త్రీలను వదిలిపెట్టి పారిపోయారు. అప్పుడు నానాసాహెబ్ ఆ స్త్రీలను సురక్షితంగా వారి పురుషుల వద్దకు పంపించాడు.
స్త్రీత్వాన్ని, మాతృత్వా మహిమా, గౌరవాలను దర్శింపజేయడానికే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ రాఖీ ఉత్సవాన్ని సమాజ వ్యాప్తి చేయడానికి కృషి చేస్తోంది. కుటుంబంలో ఎవరైనా అతి బలహీనుడుంటే ఆ కుటుంబంలోని తల్లి అతడిపైనే ఎక్కువగా ప్రేమను చూపిస్తుంది. ఇది కుటుంబాలలో సాధారణంగా కనిపించే అనుభవం. అదేవిధంగా ఏదైనా కుటుంబంలో ఎవరైనా మంద బుద్దిగల వ్యక్తి ఉంటే అతడిపై కుటుంబంలోని వారికే కాదు, ఇతర కుటుంబ సభ్యులందరికీ సానుభూతి, మాతృప్రేమభావం ఉంటుంది. ఇదే భావనను సమాజ మానసికతపై ప్రభావం ఉండేటట్లు చూడడానికి ఈ ఉత్సవాన్ని ఒక సాధనంగా సంఘం స్వీకరించింది. రక్షాబంధన్ సమయంలో స్వయం సేవకులు సమాజంలోని బలహీనులు, వంచితులు అయిన సోదర సోదరీమణుల వద్దకు వెడతారు. వేలాడి స్వయంసేవకులు వారి సమీపంలోని సేవాబస్తీ లకు వెడతారు. అక్కడి పురుషుల చేతులకు రాఖీలను కడతారు. అక్కడే అక్కడి పరిస్థితుల బట్టి సామాజిక సమానతా, సమరసత గురించి వివరిస్తారు.
అనేక సంవత్సరాల కిందటి హృదయాన్ని కదిలించే ఒక సంఘటన ఇది – మైసూరు సమీపంలోని ఒక సేవాబస్తీలో స్వయంసేవకులు వెళ్లి అక్కడి పురుషుల చేతులకు రాఖీలు కట్టడం ప్రారంభించారు. వారు ఆ పని ముగించుకొని ముందుకు పోతూ మధ్యలో ఒక మురికివాడను వదలిపెట్టి సాగిపోతున్నారు. ఇంతలో ఒక మహిళ వారిని పిలిచి మా మురికి వాడను వదలిపెట్టి పోతున్నారెందుకంటూ వారిని ప్రశ్నించింది. దానికి స్వయంసేవకులు ఈ వాడలో “నీవు ఒక్కదానివే ఉన్నావు. పురుషులెవరూ కనిపించలేదు. అందుకని ముందుకుపోతున్నామని” చెప్పారు. “నేను ఒంటరిగా ఉన్నాను. అయితే నేను మీ సోదరిని కదా” అని ఆమె అడగమే గాక వారినందరినీ తన మురికివాడకు పిలుచుకొని పోయింది.. స్వయంసేవకులు ఆ వాడకు వెళ్లి అక్కడి వారికి నమస్కరించి రాఖీ కట్టబోయారు. వారిని ఆమె వారించి ఇది ఇక్కడి పద్ది కాదంటూ ఆమె లోపలికి వెళ్లింది. ఆమె తన కాళ్లు చేతులను కడుక్కొని ఒక మూల ఉన్న దేవతా ప్రతిమకు ఆరతినిచ్చింది. స్వయంసేవకులకు ఆ ఆరతిని అందిస్తూ అందరి నొసటన కుంకుమను పెట్టింది. ఆ తరువాత తన వద్దనున్న రాఖీలను తీసి స్వయంసేవకుల చేతులకు కట్టింది. ఆ తరువాత మిఠాయిలను తీసుకొని వచ్చి స్వయంసేవకుల నోట్లో పెట్టడానికి ఆమె ముందుకు వచ్చింది. కొద్దిగా సంకోచించిన స్వయంసేవకులు వద్దు వద్దంటూ “మా చేతిలో పెట్టమని” అడిగారు. అయితే ఆ మహిళా నవ్వుతూ “ఏం సోదరి చేతి నుంచి తినడానికి సంకోచం ఎందుకు”? అంటూ అడిగి అందిరిచేతా మిఠాయిలు తినిపించింది. స్వయంసేవకుల నుంచి శలవు తీసుకోనేముందు ఆమె సంఘం గురించి, రక్షాబంధన్ ఉద్ధేశ్వం గురించి తెలుసుకొంది. ఆమె చాలా సంతోషపడింది. “నేను సంవత్సరాల నుంచి ముంబాయిలో జీవిస్తున్నాను. ఇప్పుడు మీ మూలంగా రక్షాబంధన్ అతి సుందరమైన అర్థాన్ని తెలుసుకోగలిగాను” అని అన్నది.
ఈ రక్షాబంధన్ సందర్భంగానే పెజావర్ మఠాదీశులు పూజనీయ విశ్వేశ్వర తీర్థులు మహాభారతం నుంచి ఒక సంఘటన గురించి వినిపించారు. యుదిష్టిరుడు, యక్షుడు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తరువాత ఆ యక్షుడు సరోవరం ఒడ్డున మృతతుల్యుగా పడి ఉన్న వారిలో ఒకరిని మాత్రం నేను సజీవులుగా చేయగలను – అయితే ఎవరిని బ్రతికించాలి.? అని అడిగాడు. దానికి నకులుని బతికించవలసిందిగా యుధిష్ఠిరుడు కోరాడు. దీనికి ఆశ్చర్యపడ్డ యక్షుడు “నీ సోదరులలో అతి బలవంతుడు నీకు అతి ప్రియమైనవాడు, రక్షణకు వచ్చే భీముడున్నాడు. అదే విధంగా అజేయుడైన అర్జునుడున్నాడు. వారిద్ధరినీ గాక నీవు నకులిని ఎందుకు ఎంచుకున్నావు”. అని అడిగాడు. దానికి “కుంతీ పుత్రులు ముగ్గురిలో నేనే జీవించి ఉన్నాను. అయితే భీమునిగానీ, అర్జునునిగానీ బతికించమని నేనే కోరినట్టయితే మాద్రికి పుత్రులు లేకుండా చేసిన వాడవుతాను. అందుచేత నకులుని బతికించమని అడిగాను” అని యుధిష్ఠురుడు సమాధానం చెప్పాడు. దీనికి అతి సంతుష్టుడైన యక్షుడు నలుగురు సోదరులను బ్రతికించాడు. పెజావర్ మఠాధీపతులు మన సమాజానికి ఈ సందేశాన్నిస్తూ పాండవులలో నకులుడు అందరికంటే చిన్నవాడు. అతడిని యుధిష్ఠిరుడు బ్రతికించుకోవడం వల్ల మిగిలిన వారందరినీ బతికించుకోగలిగాడు. అదేవిధంగా మన సమాజంలో అట్టడుగున ఉన్న మన సమాజ బంధువులను ఉన్నత స్థితికి తీసుకోని వచ్చే ప్రయత్నం ఎప్పుడు చేస్తామో అప్పుడు మొత్తం సమాజం ఉన్నత స్థితికి చేరుకోగలుగుతుందని అంటారు.
సంఘ స్వయంసేవకులు తమ సమాజ కార్యాన్ని నిర్వహించేటప్పుడు ఈ దృష్టిలో తమ కార్యాన్ని నిర్వహిస్తారు. సమాజంలోని అన్ని జాతులు, వర్గాలు పంథాలకు చెందిన వారందరూ తమ సమాజంలోని వారే అనే భావంలో అత్యంత ఆత్మీయతతో వ్యవహరించాలి. సమీపంలో బస్తీ గ్రామాలలోని బలహీన వర్గాలకు చెందిన సోదర సోదరిల ఉన్నతికి నిత్యమూ స్వయంసేవకులు ప్రయత్నించాలి.
జాగృతి సౌజన్యంతో…
This article was first published in 2020