కొమురం భీమ్
జలము కొరకు మరియు జంగలు కొరకును
జోడె ఘాటు నందు జోరు పోరె
కొదమ సింహ మోలె కొమురము భీముడు
వినుర భారతీయ వీర చరిత
భావము
నిజాం రజాకారు సేనలు గిరిజనుల భూమిని ఆక్రమించుకొని అడవులను దౌర్జన్యంగా నరికి వేస్తున్న కాలమది. అమాయక వనవాసీలపై పన్నులు విధిస్తున్నారు. నిజాం రజాకారు సేనల అక్రమాలను ఎదిరించడానికి కొదమ సింహం కొమురం భీమ్ పూనుకున్నారు. ఇక్కడ ఉన్న జెల్ జంగల్ జమీన్ అన్నీ మనవే అంటూ నినదించారు. వీటిని ఎవరు ఆక్రమించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అక్రమాలు, ఆక్రమణలతో కూడిన అరాచకత్వాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందామని గిరిజనులలో స్ఫూర్తి నింపారు. జోడేఘాటు కొండల్లో నైజాం రాక్షస సేనలపై విరుచుకుపడి, అమరుడైన వీర సింహం కొమురం భీమ్ చరిత విను ఓ భారతీయుడా!
రాంనరేష్