Home Views విశ్వేశ్వరయ్య రోజులు మళ్ళీ రావాలి

విశ్వేశ్వరయ్య రోజులు మళ్ళీ రావాలి

0
SHARE

దేశంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల  పాత్ర చాలా కీలకం. ఇంజనీర్లుగా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రాణించడం చూస్తున్నాం. అదే విధంగా విలాసాల కోసం దొంగతనాలు, అత్యాచారాలు, టెక్నాలజీని ఉపయోగిస్తూ హైటెక్ మోసాలు చేయడంలో చాలామంది మీ బాగోతాలను రోజు మీడియాలో సైతం చూస్తున్నాం. ఇంజనీరింగ్ విద్యపై విద్యార్థులు అవగాహన రాహిత్యంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదనడానికి అనేక కారణాలు ఉన్నాయి, నిజాయితీ, పట్టుదల, అంకితభావంతో ఇంజనీర్లు సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న విషయం గర్వించదగ్గది. దురదృష్టవశాత్తు సమాజంలో అవినీతిపరమైన సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్టు, అభివృద్ధి కార్యక్రమంలో నాసిరకమైన, నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ ఇంజనీరింగ్ అధికారులు ఎసీబికి పట్టుబడుతున్న విషయం కలవరపాటుకు గురిచేస్తుంది. ఈ కలవరపాటు ఇంజనీరింగ్ విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలపై దుష్ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఈ దుష్ప్రభావాల నుండి ఈ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటితరం ముఖ్యంగా నేటి ఇంజనీరింగ్ విద్యార్థులపై ఉంది. అందుకు మనం రంగంలో సేవలందించి సమాజంలో విశిష్ట స్థానాన్ని పొందిన మహానీయులను మననం చేసుకోవాల్సిన సమయం ఇదే. ఆ మహానీయుల్లో ఇంజనీరింగ్ పితామహుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు.

ఓసారి అమెరికాలో ఒక 75 అడుగుల ఎత్తులో ఒక యంత్రం పనితనాన్ని పరిశీలించాల్సిన అవసరమొచ్చింది. అక్కడున్న వారు ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు భారతదేశం బృందానికి నాయకత్వం వహిస్తున్న 85 ఏళ్ళ విశ్వేశ్వరయ్య స్వయంగా 75 అడుగుల పైకి నిచ్చెన ద్వారా ఎక్కి ఆ యంత్రం పరిశీలన చేసి క్రిందకు దిగాడు. ఈ సంఘటన ఆయనలోని కర్తవ్యనిష్టకు, నిరాడంబరతకు నిదర్శనం. ఇది మన ప్రస్తుత ఇంజనీర్లకు, విద్యార్థులకు ఆదర్శప్రాయం.

ఇంజనీరింగ్ రంగంలోనే కాకుండా విద్యా పారిశ్రామిక సామాజిక, తదితర రంగాల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పిన మేధావి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దనహల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో పూర్తి చేసిన ఎం.వి. ఉన్నత విద్యను బెంగళూరులో పూర్తి చేశారు. 1883లో పూనా సైన్స్ కాలేజీ నుండి సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు. వ్యక్తి పరిధి దాటి సామాజిక రంగంలో ఉండాలనేది ఇంజనీరింగ్ రంగం. దీనిని విశ్వేశ్వరయ్య నిజం చేశాడు. తను వివిధ హోదాల్లో పని చేస్తూ, ఇంజనీరింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. కర్ణాటకలో కృష్ణసాగర్ డ్యాం, దేశంలో విలువైన ఆస్తిగా పిలువబడే భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారం, మైసూర్ సాండల్ సబ్బు కర్మాగారం వీరి ఆధ్వర్యంలోనే నిర్మించారు. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్లో ప్రావీణ్యత కారణంగా దేశంలో అనేక పథకాలను శ్రీ ఎం.వి.రూపొందించారు. సుక్కురు పట్టణానికి సింధునది నుండి నీటిని సరఫరా చేసేందుకు అతి క్లిష్టమైన పథకాన్ని రూపొందించారు. నీటి వృధాను అరికట్టడానికి ‘బ్లాక్ సిస్టమ్’ అనే సరికొత్త పద్దతిని రూపొందించారు. హైదరాబాద్ లో మూసీనదీకి వరదలొచ్చాయి. తరచుగా నగరాన్ని అతలాకుతలం చేస్తున్న మూసీనదిపై వరద నియంత్రణ పథకాలని సూచించమని అప్పటి నిజాం ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను ఆహ్వానించగా ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లను రూపకల్పన చేశాడు.

విశ్వేశ్వరయ్య మైసూరు రాజ్యంలో దివాన్ గా పనిచేస్తున్న సందర్భంలో ఎం. వి. కుటుంబ సభ్యులు ఒకరు తన ఉద్యోగ ప్రమోషన్ కోసం ఒక సంతకం చేయమని ఎం.వి.ని అడుగుతారు. కానీ ఎం.వి. దానిని సున్నితంగా తిరస్కరించడం చూస్తే ఒక ఇంజనీర్ ఏ విధంగా నీతిపరమైన పాలనను అందించొచ్చో నిరూపించాడు. దివాన్ ప్రభుత్వం ఇచ్చిన కారును ప్రభుత్వ పనులకే ఉపయోగించి, తన పనిని, బాధ్యతలు ప్రజాసేవ కోసమే తప్ప స్వలాభం కోసం కాదన్న సూత్రాన్ని అనునిత్యం పాటించేవారు. ఒక ఇంజనీర్గా సాంకేతిక పరమయిన విషయాలపట్లనే కాకుండా ‘దేశం ఏమిచ్చిందని దూసించుట దోషం, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం’ అన్న దానికి కట్టుబడి, దేశంలోని పేదరిక నిర్మూలన కోసం, పేదల అభివృద్ధి కోసం వృత్తి విద్య ప్రాధాన్యతను పెంచే విషయంలో అనేక కార్యక్రమాలను రూపొందించారు. ప్రతి వ్యక్తి జీవితాంతం విద్యార్థిగా ఉండాలని కాంక్షించేవారు విశ్వేశ్వరయ్య. ఉ ద్యోగ విరమణ చేశాక కూడా పలుదేశాల్లో పర్యటించి, అక్కడ ఏ ఒక్క కొత్త సమాచారం తెలిపినా నోట్ చేసుకునేవారు. దేశ స్వాతంత్య్రం రాకముందే దేశం సక్రమంగా ప్రణాళిక బద్దంగా ఉండడానికి దూరదృష్టితో 1920లో ‘భారత పునర్నిర్మాణం’, 1934లో ‘భారతదేశంలో ప్రణాళిక బద్దమైన ఆర్థిక విధానం’ అనే గ్రంథాలను దేశ ప్రజలకు పరిచయం చేశారు.

మౌళిక వసతుల కల్పనకు ఇంజనీరింగ్ రంగం ఏ రకంగా ప్రాథమికమైనదో జీవితాంతం కార్యశీలురుగా నిరూపించిన మహా మనిషి మోక్షగుండం. తన వృత్తి రంగాన్ని ప్రత్యక్షంగా నైతికత ఆధారంగా పని చేసి ఇంజనీరింగ్ రంగానికి విశిష్టమైన గుర్తింపును, ఇంజనీరింగ్ రంగంపై అపారమైన గౌరవాన్ని తెచ్చింది. ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1955లో ‘భారత రత్న’ అవార్డు ఇచ్చి గౌరవించింది. అందుకే ఆ మహనీయుని జన్మదినాన్ని ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకునే అవకాశం దక్కింది. అది దశాబ్దాల కాలంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటూనే ఉన్నాం. ఆ ఆదర్శాలతో నేటివరకు ఎంతో ఉన్నత లక్ష్యాలను చేరుకునే దిశగా పరిశోధనలు, ఉత్పత్తులను విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాం. ప్రభుత్వ ప్రయివేటు ఇంజనీరింగ్ రంగంలో ప్రాధాన్యత అంశంగా ఉ ది. ఇంత పెద్ద దేశంలో ప్రజలకు అనేక సౌకర్యాలను కల్పించడంలో ఇంజనీరింగ్ రంగం సైతం విశేషమైన కృషి చేస్తుంది. విప్లవాత్మకమైన మార్పులు, ప్రయోగాలు వస్తున్నాయి. ఆహ్మదాబాద్కు చెందిన ప్రణవిస్త్రీ అనే ఇంజనీర్, సిక్స్త్ సెన్స్ టెక్నాలజీని వివరించిన ప్రయోగం నేటి రోజుల్లో కూడా ఇంజనీరింగ్ విశిష్టతను కాపాడుతూ కొనసాగుతుంది.

దురదృష్టవశాత్తు ‘ఇంజనీర్స్’ మొక్కుబడి కార్యక్రమంగా మారడంతో ఇంజనీరింగ్ రంగంలో ఉండాల్సిన నైతిక విలువల పతనం ప్రారంభమవుతూ వచ్చింది. ఆ మహానీయుని ఆశయాలు, ఆదర్శాలు మార్గదర్శకత్వం గాలిలో కొట్టుకుపోయాయి. నిన్న బీహార్లో ప్రారంభానికి ముందే కూలిన వంతెన, 5 సం॥ క్రితం హైదరాబాద్ నడిబొడ్డున కూలిన ఫ్లై ఓవర్, ఏసీబి, సీబిఐలకు చిక్కుతున్న అవినీతి బాగోతాలు ఇంజనీరింగ్ రంగం అప్రతిష్టపాలు కావడానికి తార్కాణంగా మారుతుంది. నాటి నైతిక విలువలు ఇంజనీరింగ్ రంగానికి నేటి అప్రతిష్ట పాలవుతున్న ఇంజనీరింగ్ రంగానికి పోలికలు విశ్లేషించాల్సిన తరుణం అసన్నమైంది, నాటి రోజుల్లో ఇంజనీరింగ్ రంగంలో ఉ న్న వ్యక్తుల పట్టుదల, కార్యదీక్ష, నిజాయితీ, తపన నేటి రోజుల్లో ఏమి అయ్యాయన్నది, అందుకు కారణం ఎవరన్నది, విరుగుడు ఏమిటో పునరాలోచించాలి. ఇంజనీర్లు నేడు నైతికత, నిబద్దత కల్గిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితాన్ని మార్గదర్శిగా స్వీకరించి వారి విలువలను వ్యక్తిగతంగా, సామాజికంగా నిర్బందంగా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనితోనే భవిష్యత్తు భారతం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది.

– పి.మోహన్ చారి, M.Tech (Instrumentation Engineer).