Home Uncategorized నైజాము రక్కసిని ధైర్యంగా ఎదిరించిన ధీరులకు వందనం

నైజాము రక్కసిని ధైర్యంగా ఎదిరించిన ధీరులకు వందనం

0
SHARE

–రాంనరేష్ కుమార్

1947 ఆగస్టు 15 న పరాయి పాలన అంతమై దేశమంతా స్వతంత్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే తెలంగాణ తో కూడుకున్న హైదరాబాద్ సంస్థానం మాత్రం నైజాము రక్కసి పద ఘట్టనల క్రింద నలిగి విలవిల లాడింది. ఒకవైపు నియంత నిజాం దురంతాలు మరోవైపు రజాకార్ల రాక్షసకేళి తో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉంది. తరతరాలు గా సామాన్య ప్రజానీకం భయం కోరలలో చిక్కుకు పోతే అనేకమంది వీరులు , గండరగండడు కొమురం భీం, హనుమయ్య వస్తాదు, రాధాకృష్ణమోదాని, షోయబుల్లాఖాన్ చాకలి ఐలమ్మ వంటి ఎందరెందరో ధీరులు నిజాం రాక్షస పాలనకు . రజాకార్ల దురంతాలను ఎదురొడ్డి నిలిచి ప్రజానీకంలో ధైర్యం నింపి తిరుగుబాటు జెండా ఎగరేసి అసువులు బాశారు. చివరికి మన మొదటి హోంమంత్రి సర్దార్ పటేల్ చొరవతో సైన్యం చేపట్టిన ‘ ఆపరేషన్ పోలో ’ విజయవంతమై నిజాం పాలన అంతమై 1948 సెప్టెంబర్ 17న ఈనేల స్వేచ్ఛావాయువులు పీల్చింది. ఇలా మనం స్వేచ్ఛావాయువులు పీల్చడానికి కారకులైన నాటి వీరులను ఒకసారి స్మరించుకుందాం.

కొమురం భీం:
మనం జయ జయహే తెలంగాణ గీతం లో పాడుకుంటున్న “ గండరగండడు ” కొమురం భీముడే ఇతడు. ఈ వీరుడు ఆసిఫాబాద్ జిల్లా సుంకేపల్లి లో జన్మించాడు గిరిజనులపై నిజాం రజాకార్లు చేస్తున్న అకృత్యాలను చిన్ననాడే పసిగట్టాడు తిరగబడి గొడ్డలితో ఒకడిని చంపేశాడు కూడా అటు తర్వాత అస్సాం వెళ్లి ఆయుధ శిక్షణ పొంది వచ్చి జల్ జంగల్ జమీన్ అన్న నినాదంతో మళ్లీ పోరాటం మొదలు పెడతాడు. జోడేఘాట్ కొండల్లో 13 రోజులపాటు నైజాము సేనలపై అప్రతిహతంగా గెరిల్లా పోరు సాగించాడు వెన్నెల్లో ఆదమరచి నిద్రిస్తున్న ఈ కొదమసింహంను ఎదిరించే ధైర్యం చేయలేని రజాకార్ల రక్కసి మూకలు దొంగచాటుగా వచ్చి కాల్పులు జరపగా కొమరం భీమ్ అమరుడైనాడు ఆ మహాత్ముడు మరణించిన ఆశ్వయుజ పౌర్ణమి రోజు జోడేఘాట్ లో ఇప్పటికీ గిరిజనులు మైళ్లు నడిచి ప్రతీఏటా వర్ధంతి నిర్వహిస్తారు.

బైరాన్ పల్లి గ్రామస్తులు
నైజాము వీరోచితంగా ఎదురించిన ధీరులు వీరు వీరి తిరుగుబాటును సహించని నైజాం రజాకార్ సేనలు గ్రామం పై దాడి చేయగా గ్రామ శివారులో ఫిరంగి నుంచి ఐదుగురు రజాకార్లను తుదముట్టిస్తారు. 1948 ఆగస్టు 27న పెద్ద ఎత్తున రాత్రి మూడు గంటలకు నిద్రిస్తున్న గ్రామంపై పన్నెండు వందల మంది పోలీసులు రజాకార్లు ఒక్కుమ్మడిగా దాడి చేస్తారు అయినా మేల్కొన్న ప్రజానీకం వీరోచితంగా ప్రతిఘటించింది ఎందరెందరో గ్రామస్తులు ఈ పోరులో నేలకొరిగారు గ్రామంలోకి ప్రవేశించిన దళం గ్రామాన్ని తగలబెట్టి మహిళలపై వికృత చేష్టలకు పాల్పడింది.

దమ్మయ్య గారి నారాయణ రెడ్డి :
వీరు రాత్రి పాఠశాలల మాధ్యమంగా జనాలను హరిజనులను అక్షరాస్యులను చేయడమే కాకుండా చైతన్యవంతులను చేసేవారు. కేవలం ఉపన్యాసాలు ఇచ్చి వదలకుండా తాను కూడా రజాకార్లతో ప్రత్యక్ష పోరాటంలో ఎన్నోమార్లు పాల్గొన్నారు ఒకసారి రజాకార్లతో పోరాటం లో వీరి చేతి వేళ్ళు తెగిపోయినా జీవితమంతా వెళ్ళు లేకుండానే ఉన్నారు కానీ పోరుబాట వీడలేదు వీరిని 1947 ఏప్రిల్ 10న నైజాం ప్రభుత్వం అరెస్టు చేయగా సుమారు సంవత్సరంన్నర తర్వాత తెలంగాణ విమోచనం జరిగినాక జైలునుండి విడుదల చేశారు.

హనుమయ్య వస్తాదు : 
వీరు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పూణే జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత ఇందూరు యువకులకు కర్ర సాము కత్తి సామునేర్పి రజాకార్లపై పొరుకు చిన్నపాటి సైనిక పటాలం ఏర్పాటు చేశారు దీనితో అనేక మంది హిందువులకు రక్షణ లభించింది.

నల్ల రుక్మారెడ్డి : 
వీరు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న కారణంగా వీరి తమ్ముడు నల్ల నరసింహారెడ్డిని రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు అయినా ధైర్యం వీడక ఇంకా ఉధృత పోరును కొనసాగించి నైజాం సేనలను ఉక్కిరిబిక్కిరి చేశారు మీరు కూడా ఆగస్టు 1 1947 లో జైలు పాలై సుమారు 13 నెలలు నిర్బంధంలో గడిపారు.

కే వి గంగాధర్ : 
ఆర్య సమాజం లో చేరి రజాకార్లను ఏదిరించడం కోసం యువ దళం కావాలని కలలుగని నాందేడ్ నుంచి ఆయుధాలు తెప్పించి యువకులకు ఆయుధ శిక్షణ ఇప్పించారు.

త్రయంబక్ రావు పాటిల్ : 
తన భార్య చేతికి గాజులు అమ్మి ఇందూరు నుండి హైదరాబాదుకు బయలుదేరి దత్తోపంత్ సైన్యంలో చేరాడు బాంబులు తయారు చేసి నైజాంకు వ్యతిరేకంగా విప్లవోద్యమాన్ని ఉసిగొల్పాడు డిసెంబర్ 14 1947 లో జైలుపాలయ్యారు. వీరు జైల్లో ఉండగా తల్లిదండ్రులను రజాకార్లు వేధించిన తీరు వర్ణనాతీతం అయినా పోరుబాట వీడలేదు.

రాధాకృష్ణ మోదాని : 
మీరు ఇందులో ఆర్య సమాజాన్ని స్థాపించి యువకులకు జాతీయతా భావాన్ని తెలియజెప్పారు 1938లో సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లారు. గోరక్షణ ప్రాధాన్యతను ఇంటింటా ప్రచారం చేశారు ఇది గిట్టని అరబ్బులు నాటి నిజాం తొత్తులు 1939 సెప్టెంబర్ 2న కత్తులతో పొడిచి చంపారు. ఏతావాతా మనకు స్పష్టం అవుతున్న విషయం ఏమిటీ అంటే , కేవలం ఏడవ నిజమే కాదు నాడు రాష్ట్రాన్ని పాలించిన నిజాముల అంతా మతోన్మాదులు అని వీరి హత్యకు నిరసనగా మూడు రోజులు నిజాంబాద్ బంద్ జరిగింది.

కామారెడ్డి : 
కామారెడ్డి ప్రాంతంలోని రైతుల నుంచి రజాకార్లు బలవంతంగా లాక్కుని భిక్నూర్ లో సంపద దాచిన ప్రదేశం పై కరృబాల్లింగం,వెంకటబాలయ్య తదితర యోధులు దాడి చేసి జైలుపాలయ్యారు. ఈ ప్రాంతంకే చెందిన చిత్రకారుడు ఫనిహారం రంగాచారి నిజాం దురాగతాలపై చిత్రాలు గీసి జనంలో చైతన్యం రగిలించాడు.

లక్క కిష్టయ్య : 
బాన్సువాడకు చెందిన లక్క కిష్టయ్య 100మంది యువకులతో ఆయుధాలు చేతబట్టి నిజాం దాష్టీకాలకూ వ్యతిరేకంగా సాయుధప్రదర్శన నిర్వహించాడు.

వీరే కాకుండా .. ఇమ్రోజు పత్రిక స్థాపకుడు షోయబుల్లా ఖాన్, చాకలి ఐలమ్మ నైజాం వ్యతిరేక పోరులో ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతంలో మూడు చోట్ల నైజాం పై బాంబు దాడికి పాల్పడ్డ నారాయణ రావు పవార్, శ్రీ ఆర్య,కొండా లక్ష్మణ బాపూజీ,నిర్మల్ ప్రాంతంలో వేయి మంది అనుచరులతో 1857ప్రాంతంలోనే నాటి నైజాము సేనలను ఎదిరించి అమరులైన రాంజీగోండు సహా ఎందరెందరో త్యాగాల ఫలితంగానే తెలంగాణ విమోచనం జరిగింది. ఇలా మనం స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి కారకులైన వీరులను స్మరిస్తూ తెలంగాణ విమోచన దినం ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.