Home News గోల్కొండ సాహితీ మ‌హోత్సవం న‌వంబ‌ర్ 20,21 – 2021

గోల్కొండ సాహితీ మ‌హోత్సవం న‌వంబ‌ర్ 20,21 – 2021

0
SHARE

స‌మాచార భార‌తి నిర్వ‌హించిన “గోల్కొండ సాహితీ మ‌హోత్స‌వ” కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లోని నారాయ‌ణ‌గూడ కేశ‌వ స్మార‌క విద్యాసంస్థ‌ల ప్రాంగ‌ణంలో న‌వంబ‌ర్ 20, 21 తేదీల్లో ఘ‌నంగా జ‌రిగాయి. “అజాదీ కా అమృతోత్స‌వాల‌లో భాగంగా జాతీయ సాహిత్య పరిష‌త్‌, ఇతిహాస సంక‌ల‌న స‌మితి, సంస్కార భార‌తి, ప్ర‌జ్ఞా భార‌తి, త‌దిత‌ర సంస్థ‌లు సంయుక్తంగా గోల్కొండ సాహితీ ఉత్స‌వాన్ని నిర్వ‌హించాయి. హ‌ర్యాన గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ ముఖ్య అథితిగా, కేంద్ర సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రి జి.కిష‌న్ రెడ్డి గారు, కోవెల సుప్ర‌స‌న్నాచార్య గారు విశిష్ట అతిథులుగా, ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త కార్య‌కారిణీ స‌ద‌స్యులు వి. భాగయ్య గారు ప్ర‌ధాన వ‌క్త‌గా హాజ‌రై కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ సాహితీ వేత్త, భార‌తీయ సాహిత్య ప‌రిష‌త్ మార్గ‌ద‌ర్శ‌కులు ఆచార్య క‌సిరెడ్డి వెంక‌ట రెడ్డి, ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘ‌చాల‌కులు బూర్ల ద‌క్షిణామూర్తి, స‌మాచార భార‌తి అధ్య‌క్షులు ఆచార్య గోపాల్ రెడ్డి, ఉపాధ్య‌క్షులు జి.వ‌ల్లీశ్వ‌ర్‌, ప్ర‌ముఖ ర‌చ‌యిత ర‌త‌న్ శార్దా త‌దితరులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో “స్వ‌రాజ్య సాధ‌నలో ఆర్‌.ఎస్‌.ఎస్”, “ఆంగ్లేయుల ఏలుబ‌డి: అంతులేని దోపిడి”, “Nizam’s Rule Unmasked” అనే గ్రంథాల‌ను ఆవిష్క‌రించారు. ప్ర‌ముఖ సాహితీవేత్త, కాకతీయ విశ్వ‌విద్యాల‌య పూర్వ ఆచార్యులు కోవెల సుప్ర‌స‌న్న‌చార్య గారిని స‌న్మానించారు. అనువాద‌కులు కె. కేశ‌వ‌నాథ్‌, శైల‌జ‌, ర‌చ‌యిత సారంగ‌పాణి ల‌ను స‌త్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ భార‌త స్వాతంత్య్ర‌ పోరాటంలో విస్మ‌రించ‌బ‌డ్డ వీరుల‌ను స్మ‌రించుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వ నేతృత్వంలో స్వాతంత్య్ర అమృత మ‌హోత్స‌వాలు నిర్వ‌హించుకుంటున్నామ‌ని తెలిపారు. నేటి క‌వులు, ర‌చ‌యితలు కూడా దేశ సంస్కృతిని, ఐక‌మ‌త్యాన్ని ప్రేరెపించే ర‌చ‌న‌లు చేసి జాతీయవాదాన్ని భావిత‌రాల‌కు అందించాల‌ని పిలుపునిచ్చారు.

ప్ర‌ధాన వ‌క్త శ్రీ వి.భాగ‌య్య మాట్లాడుతూ దేశీయ ఆలోచ‌న‌లు ప్ర‌తిబింబించే సాహిత్యం రావాలి అని అన్నారు. స్వాతంత్య్రం వ‌చ్చి 75సంవ‌త్సరాలు పూర్త‌యిన సంద‌ర్భంగా మ‌నం అమృతోత్స‌వాలు జ‌రుపుకుంటున్నాం కానీ దేశానికి స్వ‌రాజ్యం మాత్ర‌మే వ‌చ్చింది స్వాతంత్య్రం ఇంకా రాలేదు అని అన్నారు. భార‌తీయ సాహిత్యంలో ఆధ్యాత్మిక‌త, ఆధునిక‌త స‌మ‌పాళ్ళలో ఉన్నాయ‌ని అన్నారు. ఇప్పుడు మ‌న‌కు స్వాతంత్య్రం అన్ని రంగాల్లో సిద్ధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. న‌గ‌రాల పెరుగుద‌ల దేశానికి ఒక శాపం వంటిద‌ని గ్రామాల్లో విద్య‌, వైద్యం, ఆర్థిక ప‌రిపుష్టి వ‌చ్చిన‌ప్పుడే దేశానికి నిజ‌మైన స్వాతంత్య్రం వ‌స్తుందని ఆ దిశ‌గా మ‌న ప్ర‌య‌త్నాలు కొన‌సాగాల‌ని పిలుపునిచ్చారు. నిన్న‌టి ఉద‌యం మ‌ళ్లీ వ‌చ్చిన‌ట్టే మ‌న దేశం అఖండ‌మ‌వుతుంద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా భార‌త స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో మ‌నం మ‌రిచిన స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల జీవిత చ‌రిత్ర‌ల‌తో ఏర్పాటు చేసిన చిత్ర ప్ర‌దర్శ‌న‌ అందరిని ఆకట్టుకుంది. వివిధ సంస్థ‌లు ప్ర‌చురించిన జాతీయవాద సాహిత్యాన్ని విక్ర‌యించారు. కార్య‌క్ర‌మ చివ‌ర్లో ఆచార్య గోపాల్ రెడ్డి వంద‌న స‌మ‌ర్ప‌ణ చేశారు.

మ‌ధ్యాహ్న కాలాంశంలో “స్వ‌ధ‌ర్మం, స్వాభిమానం, స్వ‌రాజ్యం మూలంగా ప్ర‌చురిత‌మైన సాహిత్యం” అనే అంశంపై ర‌చ‌యిత‌లు, ప్ర‌చుర‌ణ క‌ర్త‌ల‌తో స‌మావేశం జ‌రిగింది. ఆర్‌.ఎస్‌.ఎస్ తెలంగాణ ప్రాంత స‌హ కార్య‌వాహ‌ ప్రొఫెస‌ర్ అన్న‌దానం సుబ్ర‌మ‌ణ్యం గారు, ప్ర‌ముఖ ర‌చ‌యిత ర‌త‌న్ శార్దా గారు ఈ స‌మావేశంలో పాల్గొని ప‌లు సూచ‌న‌లు చేశారు.

అనంత‌రం “స్వాతంత్య్ర స‌మ‌రంలో సాహిత్యం, జాన‌ప‌ద క‌ళల పాత్ర”పై సంగోష్టి కార్య‌క్ర‌మంలో సాహితీ వేత్త భాస్క‌ర యోగి, ప్రొఫెసర్ అర‌వింద‌రావు, అవ‌దాని అవుసుల భానుప్ర‌కాష్ పాల్గొని ప్ర‌సంగించారు.

అదే స‌మ‌యంలో మాద‌పూర్ లో ఏర్పాటు చేసిన పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు రాకా సుధాక‌ర్‌, ప్ర‌ముఖ‌ ర‌చ‌యిత ర‌త‌న్ శార్దా గారు పాల్గొని మార్గ‌ద‌ర్శ‌నం చేశారు.

మొద‌టి రోజు చివ‌ర్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో భాగంగా న‌గ‌రంలోని 6 పాఠ‌శాల‌లకు చెందిన విద్యార్థులు క‌లిసి “హైద‌రాబాద్ విమోచ‌నం” అంశంపై అద్భుత‌మైన నాట‌కం ప్ర‌ద‌ర్శించారు. సంస్కార భార‌తి ఆధ్వ‌ర్యంలో “మాతృస్త‌వం” అనే అంశంపై ఒక నృత్య‌రూప‌కం ప్ర‌ద‌ర్శించారు.

రెండో రోజు న‌వంబ‌ర్ 21న “స్వ‌రాజ్య ఉద్య‌మాలు” అనే అంశంపై జ‌రిగిన సంగోష్టి కార్య‌క్ర‌మంలో విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ప్రాంత ప్ర‌చార ప్ర‌ముఖ్ హెబ్బార్ నాగేశ్వ‌ర్ రావు గారు “స్వాతంత్య్ర సంగ్రామంలో గో ఉద్య‌మం” పై, ఆర్య‌స‌మాజ కార్య‌ద‌ర్శి వెంక‌ట‌ర‌ఘురాం గారు “స్వాతంత్య్ర‌ స‌మ‌రంలో ఆర్య‌స‌మాజం పాత్ర‌”పై, ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు రాకా సుధాక‌ర్ గారు “స్వాతంత్రోద్య‌మంలో విద్యాసంస్థ‌ల కృషి, గ్రంథాలయోద్య‌మాల‌”పై, జాగృతి సంపాద‌కులు గోప‌రాజు నారాయ‌ణ రావు స్వాతంత్ర సాధ‌న‌లో “గిరిజ‌నోద్య‌మాల కృషి” ని వివ‌రించారు.

ఆ త‌ర్వాత “మ‌నం మ‌రిచిన స్వాతంత్య్ర యోధులు” అనే అంశంపై సంగోష్టి కార్య‌క్ర‌మం జ‌రిగింది. ప్రొ. సుదేశ్న‌, ప్రొ.ర‌ఘురాం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

అనంత‌రం యువ ర‌చ‌యిత‌ల‌తో సంగోష్టి కార్య‌క్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.ఎస్‌.ఎస్ క్షేత్ర ప్ర‌చార ప్ర‌ముఖ్‌ శ్రీ ఆయుష్‌, ప్ర‌ముఖ ర‌చ‌యిత సంజీవ్ కుమార్ శ‌ర్మ, సాయిప్ర‌సాద్ గారు పాల్గొని యువ ర‌చ‌యిత‌ల‌కు సూచ‌న‌లు చేశారు.

గోల్కొండ సాహితీ మ‌హోత్స‌వ‌ ముగింపు కార్య‌క్ర‌మం పేరిణీ శివ‌తాండ‌వ నృత్యంతో ప్రారంభ‌మైంది.
జ‌స్టిస్ ఎల్‌. న‌ర్సింహారెడ్డి గారు ముఖ్య అతిథిగా , డా. శ్రీ టి. హ‌నుమాన్ చౌద‌రి, డా. సంజీవ కుమార్ శ‌ర్మ విశిష్ట అతిథిలుగా, ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌చార ప్ర‌ముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ ప్ర‌ధాన వ‌క్త‌గా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా “చ‌రిత్ర ప‌రిశోధ‌న వ్యాసాలు”, “తెలంగాణ విముక్తి పోరాటంలో అజ్ఞాత వీరులు” అనే పుస్త‌కాల‌ను అతిథులు ఆవిష్క‌రించారు. అనంత‌రం ర‌చ‌యిత కంద‌కుర్తి యాద‌వ‌రావు దంప‌తుల‌ను స‌న్మానించారు.

శ్రీ సునీల్ అంబేక‌ర్ మాట్లాడుతూ ఎన్నో ఆక్ర‌మ‌ణ‌లు, ఎంతో సుదీర్ఘ ప‌రిపాల‌న త‌ర్వాత కూడా తెలుగు సాహిత్యం ఉన్న‌తంగా నిల‌బ‌డిందని అన్నారు. మ‌న దేశంలోని అన్ని భాష‌లు అదేవిధంగా నిల‌బ‌డ్డాయ‌న్నారు. స్వ – లో స్వ‌భాష కూడా ఉంద‌న్నారు. ఆంగ్లేయుల‌ను దేశం నుంచి త‌ర‌మ‌డానికి మాత్ర‌మే మ‌నం సంఘ‌ర్ష‌ణ చేయ‌లేద‌ని, మ‌న స్వ‌ధ‌ర్మాన్ని, సంస్కృతిని కాపాడ‌టానికి కూడా సంఘ‌ర్ష‌ణ చేశామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ దేశాన్ని ఏ విధంగా మార్చుకోవాలో రాజ్యాంగ నిర్మాత‌లు మ‌న‌కు రాముని చిత్రంతో మ‌న‌కు సూచించార‌ని, దాని కోసం మ‌న భావితరం, యువ‌త‌రం కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. సాహిత్య రంగంలో మార్పు వ‌స్తున్న‌ద‌ని, దానికి మ‌నం ప్రోత్సాహం ఇవ్వాల‌ని, మ‌న సాహిత్య ప్ర‌వాహంలో కుహ‌నా చ‌రిత్ర కొట్టుకు పోవాల‌ని అన్నారు. యువ‌కుల ఆలోచ‌న‌ల‌లో విప్ల‌వం వ‌చ్చింద‌ని మ‌నం గ‌తంలో అందించిన త‌ప్పుడు చ‌రిత్ర‌ను మార్చాల‌ని వారు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వారిని ప్రోత్స‌హించాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని ఆయ‌న గుర్తు చేశారు. డా.అమర్ నాథ్ వందన సమర్పణతో ఉత్సవాలు ముగిశాయి.